Previous Page Next Page 
నిశాగీతం పేజి 8


    డాక్టరు ఆలోచనలనుంచి బయటపడి ఏదో అనబోయాడు.
    "అంత నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వచ్చి చూడండి" ఎంతో ఆత్మవిశ్వాసంతో అంటున్న  మానసి కళ్ళల్లోకి చూశాడు.
    "తప్పకుండా వస్తాను."
    "నామీద మీకు  నమ్మకంలేదని తేలిపోయింది. నేను చెప్పేవన్నీ  అబద్ధాలు  అనుకుంటున్నారు."
    "మానసీ! నేను వస్తానన్నది నీ మీద నమ్మకంలేక కాదు. నా అనుమానాన్ని నివృత్తి చేసుకుందామని  కూడా కాదు. అతడు నిన్ను  చిత్రహింసలు పెట్టె ఆ దుర్మర్గుడ్ని పట్టుకొని శిక్షించాలనే, మీ ఊరు  వస్తానన్నాను.
    మానసి కళ్ళు మిలమిలలాడాయి. పట్టలేని సంతోషంతో ఉదయచంద్ర భుజం పట్టుకొని  ఊపుతూ "నిజంగానా డాక్టర్!" అన్నది.
    "నిజంగానే"
    "ష్యూర్!"
    "ష్యూర్"
    "ఎప్పుడు వెళ్దాం?" ఆమె  కంఠంలో ఉత్సాహం ఉరకలు  వేస్తున్నది.
    "అంత  తొందరేముంది? వారం  రోజుల్లో వెళ్దాం."
    "కాదు. రేపే  వెళ్దాం."
    "మీ నాన్నగారితో మాట్లాడి నిర్ణయిద్దాం."
    "థాంక్యూ డాక్టర్. థాంక్యూ."
    "సిస్టర్ చేత  రెండు  టాబ్ లెట్స్ పంపిస్తాను. అవి వేసుకొని  నిద్రపో. రేపు ఉదయం  వస్తాను" ఉదయచంద్ర  లేచి నిలబడ్డాడు.
    మానసికూడా లేచి నిలబడింది ఆలోచిస్తూ. రెండు నిముషాల్లో నర్సు వచ్చి ఆమెను మరో గదిలోకి  తీసుకెళ్ళింది.
                                           *    *    *
                                              7   

    డాక్టర్ ఉదయ్ చంద్ర నర్సింగ్ హొమ్ రౌండ్సు  బయలుదేరాడు. డాక్టర్ జయంత్ , సిస్టర్  మేరీకూడా  డాక్టర్ వెనుక నడుస్తున్నారు. డాక్టర్ వెళ్తూ రెండో నంబరు గది దగ్గిర  ఆగాడు.
    "నమాస్కారం డాక్టర్ గారూ  ఇవ్వాళ  వెళ్ళిపోతున్నాం" అన్నాడు ఓ ముప్పై  సంవత్సరాల యువకుడు. అతని పక్కనే ఓ ఇరవై ఏళ్ళ  యువతీ నిలబడివుంది. ఆమె చాలా  అందంగా, నాజూకాగా  వుంది. డాక్టర్  జయంత్ ఆమెకేసి  జాలిగా చూశాడు. అది గమనించిన ఆ యువతీ నేల చూపులు చూడసాగింది.
    "వెళ్ళిరండి"
    "వెళ్తాం. మళ్ళీ రాం" నవ్వుతూ అన్నాడు ఆ యువకుడు.
    అయా మాటకు డాక్టర్  ఉదయచంద్ర  పక్కున నవ్వాడు. నవ్వొచ్చినా, ఆ నవ్వును పెదవుల మధ్యనే  బంధించారు డాక్టర్ జయంత్ , సిస్టర్ మేరీ.
    "సారీ! నా ఉద్దేశం."
    "పర్వాలేదు డాక్టర్ గారూ. నేను సరదాకు అన్నాను" అన్నాడు ఆ యువకుడు.
    డాక్టర్  ఉదయచంద్ర  అతడితో  కరచాలనం చేసి  ముందుకు కదిలాడు.
    "డాక్టర్!"
    "ఏం జయంత్ ?"
    "పాపం ఆ అమ్మాయికి....."
    "జబ్బు ఆమెకు కాదు. అతడికి."
    "అంత తెలివిగా  మాట్లాడుతున్న........"
    "మానసిక అపవ్యస్తలకు  గురిఅయిన వాళ్ళు  తెలివైనవాళ్ళు కారనా నీ ఉద్దేశ్యం?"
    "అబ్బే అదికాదు. అతనికి ఏం జబ్బు?"
    "డెమెనోఫోబియా"
    "దయ్యాల భయమా?"
    "అవును. చిత్రమైన కేసు. అతని పేరు  రమేష్. అడ్వకేట్. మంచి  ప్రాక్టీసుంది. ఆమె అతని  భార్య. అతనికి దేవుడిమీదా  ఆత్మళమీద నమ్మకం లేదు."
    "చిత్రంగా  వుందే. అలాంటివాడికి దెయ్యలంటే భయం ఏమిటి?"
    "పూర్తిగా విను" నడుస్తూనే  చెపుతున్నాడు డాక్టర్   ఉదయ్ చంద్ర . చెప్తూచెప్తూ  ఆరో నంబరు  గదిలోకి వచ్చాడు.
    సామాను  సర్దుకుంటున్న యువతి లేచినిలబడి  చేతులు జోడించింది.
    "ఇవ్వాళ  వెళుతున్నారుగా?"
    "అవునండీ" ఆమెతో వున్న వయసుమళ్ళిన ఆమె జవాబిచ్చింది.చేసినందుకు  సిగ్గుపడనక్కర్లేదు. మానసిక రుగ్మతలు  కూడా శరీరక రుగ్మతల  వంటివే. మళ్ళీ  రెస్ట్ లెస్ గా  అన్పిస్తే రండి. సందేహించకండి.
    ఆ యవతి  తల ఊపింది.
    "ఎందుకామె  అంత  సిగ్గుపడిపోతుంది?"ఆశ్చర్యంగా  అడిగాడు జయంత్ నడుస్తూనే ఉదయచంద్రను.
    "తర్వత చెప్తాను. రౌండ్సు పూర్తికానివ్వు" అంటూ  ముందుకు  సాగాడు ఉదయచంద్ర.
    అర్థగంటలో రౌండ్సు పూర్తిచేసుకుని కన్సల్టింగ్  రూంలోకి  వచ్చి కూర్చున్నాడు.
    "ఆఁ ఇప్పుడు  అడుగు.....నీ  సందేహాలు ఏమిటి!"
     "ఆమె సిగ్గుపడుతూ మీతో ఒక్కమాట  మాట్లాడలేదు. ఆమెజబ్బు ఏమిటి?"
    "చౌర్యన్మాదం"
    "క్లెప్టోమానియా?"
    "అవును. ఆమె పేరు  వసుంధర. స్త్రీ ళ కళాశాలలో లెక్చరర్ గా  చేరింది. చిన్నప్పట్నుంచీ  ఇరుగుపొరుగువాళ్ళు, దొంగగా ముద్రవేశారు. స్కూల్లోనూ , కాలేజీలోనూ దొంగగా  అనేక అవమానాలకు  గురిఅయింది. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు  లెక్చరర్ గా వచ్చింది. ఆమె స్టాఫ్ రూంకి వస్తేచాలు అందరూ  తమ తమ వస్తువుల్ని  జాగ్రత్తగా  పెట్టుకుంటారు. పొరపాటున  కూడా పర్సు  పదినిముషాలు  టేబుల్ మీద  పెట్టడానికి  భయపడ్తారు. ఒకరోజు  ఒక లెక్చరర్  పార్కర్ పెన్ పోయింది. చివరకు  వసుంధర పర్సులో దొరికింది. ప్రిన్స్ పాల ముఖం  వాచేట్లు చివాట్లు  పెట్టాడు. అది విద్యార్థినులకు కూడా తెలిసింది. అందరూ  ఈమెను  ఓ వింత పురుగును చూసినట్టుగా  చూడసాగారు. ఆమెకు  కాలేజీలో  ఉండటం  దుస్తరం  అయిపోయింది. సెలవుపెట్టి  ఇంట్లో వుండిపోయింది. మనసు సంఘర్షణకు గురి అయింది."
    "అవును డాక్టర్. వాళ్ళు చేస్తున్నపని తప్పు అని వాళ్ళకు  తెలియదా? అవమానాలకు గురి అవుతూకూడా  ఎందుకలా  చేస్తారు? తమ  మనసును అదుపులో  పెట్టుకోవచ్చుగా? మిగతా మానసిక జబ్బులవంటిది కాదుగా ఇది?"
    "తాము చేస్తున్నది  తప్పు పని అని వారికి తెలుసు. తెలిసీ వస్తువును దొంగిలించాలనే కోర్కెను అదుపులో  పెట్టుకోలేరు. ఎంత ప్రయత్నించినా , నిర్భంధక చర్యల(కంపల్షన్స్)కు  లొంగకుండా  ఉండటం ఈ రోగులకు దుస్సాధ్యం. చేస్తున్నది తప్పు  అని తెలుసు. చెయ్యకుండా  వుండలేరు.అందువల్ల  ఈ చర్యలు  వారికి బాధనూ, ఆందోళననూ కలిగిస్తాయి. ఈ  ఉన్మాదం వున్నవారు దొంగిలించే వస్తువుల్ని వాడటంగానీ, అమ్ము కోవడంగానీ చెయ్యారు. ఎన్ని  అవమానాలకు గురి  అయినా   లోపల  నుంచి తన్ను కొచ్చే  కోర్కెను ఆపుకోలేరు.
    "ఇలాంటి జబ్బులునయం అవుతాయా?"
    "చాలావరకు ఇలాంటి జబ్బు ఉన్నవారి సబ్ కాన్ష్ న్ మైండులో చిన్నతనంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనల తాలూకు అనుభవ ప్రభావం  దాగివుంటుంది. అసలు కారణం రోగికి తెలియజెప్పగలిగితే ఇలాంటి  జబ్బులు చాలా వరకూ  నయం అయే అవకాశం వుంది."
    "ఇప్పుడు వసుంధరకు ఆ జబ్బు తగ్గినట్టేనా?" 
    "ఆఁ ఇప్పటికి తగ్గింది."
    "అదేమిటి డాక్టర్?"
    "జబ్బు బాగా  ముదిరిపోయాకగాని  సైకియాట్రిస్టు దగ్గిరకు  రారు. చిన్నతనంలోనే  ఒక మంచి  మానసిక  వైద్యునికి చూపిస్తే  ఇంతదూరం వచ్చేదికాదు."
    "ఆ డెమనోఫోబియా కేసు గురించి....."
    "అదొక  చిత్రమైన  కేసు. రమేశ్  తెలివైనవాడు. పూర్తిగా  మతిపోకముందే  కన్సల్టేషన్ కు  వచ్చాడు. భార్యా భర్తలు  దగ్గిరగా  వస్తేచాలు అతడి మొదటిభార్య మధ్యలోకి వచ్చినిల్చుంటుందట."
    "ఒక భార్య  ఉండగా  రెండోపెళ్ళి ఎలా చేసుకున్నాడు?"
    "భార్యవుండగా  చేసుకోలేదు. ఆమె  చనిపోయింది" అని నవ్వు జయంత్ ముఖంలోకి  చూశాడు.
 తెల్లముఖంవేసి  చూస్తున్నాడు.
    "ఏమిటి  అలా  చూస్తున్నావ్?"
    "ఆమె అంటే  అతడి  మొదటిభార్య దయ్యం  అయి వాళ్ళిద్దరి మధ్యా......"
    డాక్టర్  ఉదయచంద్ర పకపకా  నవ్వాడు. "నీకు దయ్యాలమీద నమ్మకం  వుందా?"
    "లేదు."
    "మరి?"
    "మీరు  మొదటి భార్య  మధ్యలోకి వచ్చి నిల్చుంటుందంటే  ఆశ్చర్యంగా వుంది"
    "నిల్చుంటుంది అనలేదు. అట అన్నాను. అతని భార్య  చనిపోయింది. ఆమెను  ప్రేమించి  పెళ్ళిచేసుకున్నాడు.ఆమె సరదాకు  ఎప్పుడైనా నేను చచ్చిపోతే  వెంటనే  పెళ్ళిచేసుకుంటారా అనేదట. వెంటనే  అతను నువ్వు చచ్చిపోతే  నీతోపాటే చచ్చిపోతాను. నువ్వులేని ఈ జీవితం నాకు అక్కర్లేదు అనేవాడట. అనుకోకుండా  కారు యాక్సిడెంటులో ఆమె చనిపోయింది. చాలా  బాధపడ్డాడు. అయితే ఈ అమ్మాయి  వాళ్ళ బంధువుల అమ్మాయాట. చుట్టం చూపుగా  తల్లిదండ్రులతో హైదరాబాదు వచ్చి వాళ్ళింట్లో దిగారు. ఆమె  సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. అప్పటికి అతని  భార్య  చనిపోయి సంవత్సరం  దాటింది. అతని తల్లి  మళ్ళీ  పెళ్ళి చేసుకోమని  పోరాడేది. ఆ మాట తన  దగ్గిర  ఎత్తవద్దనేవాడు ప్రతి  సారి. ఈ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటానని  తనే స్వయంగా  చెప్పాడు. ఆమె సంతోషానికి  అంతులేదు. వెంటనే పెళ్ళి  జరిగిపోయింది. అసలు ఆ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు  వారింటికి తీసుకురావడానికి ప్రోద్భలం చేసింది అతడి  తల్లేనని అతడికి  తర్వాత  తెలిసింది. కాని అతడి అంతరాంతరాల్లో ఏదో తప్పు  చేశాననే  భావం  గూడుకట్టుకుంది. నువ్వులేని జీవితం నాకొద్దు అన్నవాడు సంవత్సరం  అయిందో  లేదో  పెళ్ళిచేసుకున్నాడు. మొదటి  భార్య  తాలూకు  స్మృతి బలవంతంగా మనసు  నుంచి తోసేశాడు. కాని అది  మనసు  అట్టడుగు  పొరలో  నిద్రాణమై  వుండి పోయింది. ఈ పెళ్ళి  చేసుకొనికూడా దాదాపు  సంవత్సరం అయింది. మొదటి ఆరు నెలలూ  ఏమీ  జరగలేదు. అంటే  కొత్తభార్య మోజులో  కొంతకాలం మొదటి భార్య తాలూకు అనుభవాలు, అనుభూతులను కొంత  కాలం మనసులో అణిచిపెట్టగలిగాడు. ఆరు నెలలగా  భార్య  దగ్గరకు వెళ్తే  చాలు  మొదటి  భార్య  వారిద్దరి మధ్యకూ  వచ్చి  నిల్చుంటుంది. అంటే అతడికి  దృష్టి విభ్రమం  కలగసాగింది. కొద్దికాలంగా ఆమె మధ్యలో నిల్చి తిట్టడం  కూడా ప్రారంభించింది. అంటే  శ్రవణ విభ్రమాలుకూడా ప్రారంభం అయ్యాయి. ఒక సుగుణం.....అతడు మరొకదశకు తీసుకొచ్చే స్థితి  రాకముందే  నా దగ్గిరకు వచ్చాడు. పదిరోజులు నర్సింగ్  హొమ్ లో వుంచాను. ఈ పది రోజులూ  అతని భార్యను రావద్దన్నాను......"
    "మరి ఇప్పుడు అతని  పక్కనే  వుందిగా?"
    "అతడి జబ్బు తగ్గిపోయింది. నేనే  రమ్మని  ఫోన్ చేశాను. ఆమెకు  చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పాను."
    "మళ్ళీ  తిరగపెట్టదా?"
    "లేదు. అతనిలోని అపరాధభావం పోయింది. తను చేసింది తప్పు కాదనే నమ్మకం ఏర్పడింది."
    " ఈ కేసులు డీల్ చెయ్యడానికి చాలా ఓపిక కావాలి."
    "అంతేకాదు రోగులమీద సానుభూతి వుండాలి. వారి సమస్యల్ని అర్థంచేసుకోవాలి ఎంత సమయం పట్టినా సరే."
    "రండి. తిరిగివెళ్తారేం?" లోపలకు తొంగిచూసి, తిరిగి వెళ్ళబోతున్న శివరామయ్యను డాక్టర్ లోపలకు ఆహ్వానించాడు.
    "మీరేదో మాట్లాడుకుంటుంటేనూ?"
    "ఫర్వాలేదు రండి."
    "డాక్టర్ గారూ  మొన్న వెళ్ళేప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళాం. ఇంతలోనే మళ్ళీ ఇలా అవుతుందని ఊహించలేదు." దిగులుగా అన్నాడు  శివరామయ్య.
    "అదే నాకూ ఆశ్చర్యంగా వుంది" సాలోచనగా అన్నాడు డాక్టర్.
    "అంతా మా ఖర్మ."
    "బాధపడకండి మీ అమ్మాయి మామూలు మనిషి  అవుతుందనే నమ్మకం నాకుంది. నాకున్నా బాధల్లా  ఇంత త్వరగా ఎందుకు రిలాప్స్ అయిందనేదే. ఆమె మనోఫలకంమీద  ముద్రితమైన రకరకాల భ్రమలూ, భయాలూ తొలగిపోతాయనే భావించాను. భావించడం కాదు. నిజంగానే తొలగించగలిగాను. కాని  ఆ భయాలూ, భ్రమలూ  ఇంత  త్వరలో  మళ్ళీ  ఆమె మనసులోకి ఎలా  ప్రవేశించాయో అర్థంకావడంలేదు" ఏదో ఆలోచిస్తూ ఓ క్షణం ఉండిపోయాడు.
    "ఆమె భ్రమలకూ, భయాలకూ దోహదంచేసే  పరిస్థితులు ఇంకా అక్కడ  కొనసాగుతూనే  వుండివుండాలి. ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనే  మానసిక బలంలేక  మళ్ళీ మొదటి  స్థితికి  వచ్చింది. అందుకు  కారణం  మీరేనేమో?" అని శివరామయ్య ముఖంలోకి చూశాడు.
    "డాక్టర్ గారూ!మీరంటున్నది నాకు అర్థం కావడంలేదు" అతడి చూపులు తీక్షణంగా వున్నాయి.

    "అర్థం కావలసిన అవసరంలేదు." డాక్టరు అసహనంగా అన్నాడు.
    "డాక్టర్!" శివరామయ్య కలవరపడ్డాడు.
    "క్షమించండి......శివరామయ్యగారూ.....ఏదో ఆలోచిస్తూ ఏదో అనేశాను. మీకుతెలియదేమో ఈ వృత్తిలో వున్న మేము సగం పిచ్చివాళ్ళ కింద లెక్క. రోజూ ఎంతోమందిని చూస్తుంటాము. వాళ్ళ  హావభావాలను జాగ్రత్తగా పరిశీలిస్తాము. వాళ్ళకు నచ్చే  పద్దతిలో రకరకాలుగా ముఖం పెట్టి, ఎన్నో రకాల భావాలను ప్రకటించి, మాట్లాడి, మాట్లాడించి, వారికి ముందుగా మా మీద గురి కుదిరేలా చూస్తాము. ఇలా  ఏళ్ళకొలదీ  చూస్తూండటం వల్ల మా సహజ ప్రకటనా రీతులు మరుగున పడ్తాయి" అన్నాడు డాక్టర్ ఉదయచంద్ర శివరామయ్య ముఖంలోకి పరిశీలనగా  చూస్తూ.
    శివరామయ్య మౌనంగా వింటున్నాడు ఇబ్బందిగా  ముఖంపెట్టి.
    "అందువల్లనే ఎదుటి వాళ్ళకు మేము దాదాపు పిచ్చివాళ్ళగా కన్పిస్తాం. బహుశా అందువల్లనేనేమో రోగులకు మామీద   నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళచేత  మనసు విప్పి మాట్లాడించగలిగితే సగం జబ్బు తగ్గినట్టే. యుద్దరంగానికి ముందు సైనికుడు  ధరించే కవచం గురించి మీరువినే వుంటారు."
    "అది వెనకటి రోజుల్లో కర్ణుడు కవచ కుండలాలతో పుట్టాడనేగా  భారతంలో ఉన్నది?"
    "బాగా  గుర్తుచేశారు శివరామయ్యగారు! శరీరానికి అవసరం అయిన కవచం సంగతి ఎలా వున్నా మనిషి  తన మనసుచుట్టూ కవచాన్ని ఏర్పరచుకుంటాడు."
    "ఆ ధోరణి పుట్టుకతో వస్తుందంటారా?" నొసలు  ముడిచి అడిగాడు శివరామయ్య.
    "పుట్టుకతో రాదు. వయసు పెరుగుతున్న మనిషి మనసు చుట్టూ ఎన్నో  వలయాలను ఏర్పరచుకుంటాడు. అవే రాను రాను కొన్ని పరిస్థితుల ప్రభావాలవల్ల ఇనుప  కవచాల లాగ కఠినంగా  తయారౌతాయి. అంతేకాదు దుర్భేద్యమైన  కోటగోడల్లా  మనసును చుట్టివేస్తాయి.
    "ఆ గోడల  మధ్య ఎన్నో దుస్పంఘటనల, అనుభావాల తాలూకు ఘనీభావించిన అనుభూతులూ, తెగిపోయిన భావపరంపరల శకలాలూ  బంధించబడి వుంటాయి. అవచేతనంలో అణచబడి వున్న ఆ అనుభవాలూ, భయాలూ, భ్రమలూ, ద్వేషాలూ, చేతనంలోకి తీసుకురావడమే, సైకోఎనాలిసిస్ ముఖ్య ఉద్దేశ్యం. మనసుచుట్టూ బిగిసివున్న కవచాలనూ, కోట గోడల్నూ బద్దలుకొట్టడం అంత తేలికైన పనికాదు" అని ఓ క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించాడు.

 Previous Page Next Page