"అన్ని ఫోబియాలకంటే ఇది చాలా భయంకరమైంది."
"ముఖ్యంగా నువ్వు చూడాల్సిన కేసులు ఇవి. మిగతావి జయంత్ చూసుకుంటాడు."
"ఇంతకూ అసలు విషయం ఏం చెప్పలేదు. ఇంత అర్జెంటుగా ఏ ఊరు వెలుతున్నావ్? ఏం పని అని అడగకూడదనుకో....."
"స్వంత పనేంకాదు. మానసి అనే అమ్మాయి కొంత కాలం ఇక్కడ ట్రీట్ మెంటు తీసుకుంది. పోయినసారి కలిసినప్పుడు నేను ఆమెను గురించి చెప్పాననుకొంటాను."
"ఆఁ ఆఁ గుర్తుంది. బాగా నయంఅయి వెళ్ళిపోయిందన్నావుగా?"
ఆమెకు ఆ రోగం మళ్ళీ తిరగబెట్టింది. ఆమె కండిషన్ బొత్తిగా బాగాలేదు."
"ఆమె మెంటల్ కండిషన్ కూ, నువ్వు ఊరికి వెళ్ళడానికి సంబంధం ఏమిటోయ్?"
"చెపుతున్నాను విను. ఆమెతో వాళ్ళ ఊరు వెళ్తున్నాను."
రావు ఉదయ్ కేసి విస్మయంగా చూశాడు.
"అక్కడి వాతావరణ, పరిస్థితులూ స్టడీ చెయ్యాలి. ఆమె భ్రాంతులకూ , భయాలకూ, ఆధారాలేమితో క్షుణ్ణంగా పరిశీలించనిదే ఆమెకు చికిత్స చెయ్యడం సాధ్యం కాదని అనుభవంమీద తెలుసుకున్నాను. పోయినసారి ఆమె రుగ్మతకు కీలకమైన మూలకారణాలను తెలుసుకాకుండానే చికిత్స చేశాను. అందువల్లనే ఇంత త్వరగా తిరగబెట్టిందని నా నమ్మకం. సందేహంలేదు. కారణం అదే."
"అందుకని?"
"అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాను. తీరికలేక, శ్రద్డలేక,సహనం లేక మనం మానిసిక రోగులకు సరైనా చికిత్స చెయ్యలేకపోతున్నామని అనిపిస్తుంది నాకు. అందువల్ల స్వస్థత చేకూరే అవకాశాలున్న రోగులు, పూర్తిగా రోగవిముక్తులు కాకుండానే ఆసుపత్రులనుంచి వెళ్ళి పోతున్నాను. కొందరికి జీవితమంతా మానసిక ఆరోగ్య ఆసుపత్రిలలోనే గడిచిపోతోంది. ఇది చాలా దారుణమైన విషయం."
"దానికి కారణం నువ్వు, నేనూ, లేక మనలాంటివారే కారణమంటావా?"
"పూర్తిగా కాదు."
"మరి?"
"ప్రభుత్వానిది కూడా కొంత బాధ్యత వుంది."
"ఇందులో ప్రభుత్వం బాధ్యత ఏముంది?" రావు ఆశ్చర్యంగా అడిగాడు.
"మనదేశంలో మానసిక శాస్త్ర అధ్యయనానికి ఉన్న అవకాశాలు అంతంత మాత్రమే. మానసిక రోగులకు చికిత్స చెయ్యడానికి అవసరమైన పూర్తి అర్హతలున్న డాక్టర్లు చాలా తక్కువమంది వున్నారని నీకూ తెలుసు. ఆసుపత్రుల పేర్లయితే "మానసిక ఆరోగ్య కేంద్రాలు " అని అందంగా మార్చారు. కాని అక్కడి పరిస్థితులు అధ్వాన్నంగా వున్నాయి. మంచివాళ్ళకే మతులు పోగొట్టే ఆ ఆసుపత్రులలో రోగాలు ఎలా నయమవుతాయి? దానికి తగ్గట్టు మన డాక్టర్లకు ధన దాహం, కీర్తి కండూతి ఎక్కువైనాయి. ఎంతసేపూ పాప్యులారిటీ కోసం పాకులాటే. వ్యాధిగ్రస్తుల మీద సానుభూతి వుండదు. వ్యాధి నిర్ణయం చెయ్యం. శ్రద్దగా చికిత్స చెయ్యం. చెయ్యలేం. గంటకు పదిమందిని చూడాలి. రోగిని ఒకసారిచూసి మందులు రాసిస్తాం. మళ్ళీ పదిరోజులదాకా చూడం. మోర్ పేషెంట్సు- మోర్ మనీ-మోర్ పబ్లిసిటీ-మోర్ పేషెంట్సు-ఇదీ ఈ నాడు మనదేశంలో వున్న పరిస్థితి" ఉద్రేకంగా చెప్పుకుపోతున్నాడు డాక్టర్ ఉదయ్.
డాక్టర్ రావు రెప్ప వాల్చకుండా అతడ్నే చూస్తూ సిగరెట్ తాగుతున్నాడు.
"సార్ కారొచ్చింది" బాయ్ వచ్చిచెప్పాడు.
అతడి వెనకే శివరామయ్య వచ్చాడు తన వెనకే లోపలకువచ్చిన మానసితో "అమ్మాయ్! నువ్వెళ్ళి కార్లో కూర్చో. నేను డాక్టర్ గార్ని తీసుకొస్తాగా?" అన్నాడు.
ఆమె తండ్రి మాట విన్పించుకోలేదు. డాక్టర్ రావును ఎగాదిగా చూసింది. "నమస్కారం" రావును చూస్తూ చేతులు జోడించి అన్నది.
"వీరెవరో నీకు గుర్తేనా?" డాక్టర్ ఉదయ్ అడిగాడు.
"డాక్టర్ రావుగారు. మీ కొలీగ్. ఇక్కడే ఒకసారి చూశాను. అప్పుడు....ఎందుకొచ్చారంటే.....ఆఁ మిమ్మల్ని మ్యారేజ్ రిసెప్షన్ కు తీసుకెళ్ళడానికి వచ్చారు. అవునా రావుగారూ?"
"అవునవును. మీకు బాగా గుర్తుంది." ఆమెను మెచ్చుకుంటూ అన్నాడు రావ్.
డాక్టర్ ఉదయ్ చంద్ర ఆశ్చర్యంగా మానసిని చూశాడు. ఆమె జ్ఞాపక శక్తికి అమితమైన విస్మయం కలిగింది.
మామూలుగా మానసిక రోగులకు జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. కాని మానసిక ఎంత జ్ఞాపక శక్తి వుంది?
"ఇంకా కూర్చున్నారేం డాక్టర్ గారూ డాక్టర్ గారూ? ఆలస్యం చేస్తే ఊరు చేరే సరికి బాగా పొద్దుపోతుంది. లేవండి" మానసి తొందర పెట్టింది.
అంత చనువుగా మాట్లాడుతున్న ఆమెను చూశాక, డాక్టర్ ఉదయ్ చంద్రకు ఆమెపట్ల అంత శ్రద్ధ ఎందుకో అర్థం అయింది రావుకు.
"మళ్ళీ ఎప్పుడోస్తావ్?" కారు ఎక్కబోతున్న ఉదయ్ ని అడిగాడు రావు.
"రెండు రోజుల్లో వచ్చేస్తా. మరీ అవసరమైతే మరో రోజు వుంటాను. సారీ! రావ్! నీకు శ్రమ ఇస్తున్నాను."
"నో! నో! అదేం లేదు. వెళ్ళిరా!" అన్నాడు రావు చిరునవ్వుతో.
10
ఊరు చేరేసరికి రాత్రి తొమ్మిది దాటిపోయింది. ఊరి చివర వున్న తోటలో వందేళ్ళ క్రితం కట్టిన ఓ పాతకాలపు బంగళా ముందు రెండు కార్లూ ఆగాయి.
"దిగండి డాక్టర్ గారూ . చూశారుగా మా రోడ్డు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో? దూరం నూట ఏభై కిలోమీటర్లే అయినా నాలుగు గంటలు పట్టింది. ప్రయాణం బడలికతో బాగా అలసిపోయినట్టున్నారు. దిగండి" శివరామయ్య కారుదిగి, ఉదయచంద్ర కారు దగ్గిర కొచ్చిఅన్నాడు.
"కారు ఇక్కడే వదిలెయ్యమంటారా?"
"ఎందుకూ కీస్ వదిలెయ్యండి. డ్రైవర్ తీసుకెళ్ళి షెడ్ లో పెడతాడు."
"షెడ్డుందా? ఎక్కడా?"
"బంగళా వెనక. మూడుకార్లు పట్టేంత పెద్ద షెడ్ వుంది. పాత కాలంనాటిది. మా తాతగారికి ఒక షెవర్లెట్ , ఒక డాడి ఉండేవట. దిగండి డాక్టర్ గారూ" శివరామయ్య డోర్ తెరిచాడు.
డాక్టర్ ఉదయచంద్ర దిగి బట్టలమీద వున్న దులుపుకున్నాడు.
"చివరి పదిమైళ్ళూ మట్టిరోడ్డు. అలా దులుపుకుంటే పోతుందా ఆ దుమ్ము పదండి స్నానం చేద్దురు." అని శివరామయ్య బంగళాలోకి దారి తీశాడు.
ఆ విశాలమైన మెట్లమీద నిలబడి ఉదయచంద్ర చుట్టూ కలయచూశాడు.
కొబ్బరి ఆకుల చెట్లమీదనుంచి వెన్నెల విశాలమైన పాలరాతి మెట్లు మీద పరచుకొంటున్నది.
శివరామయ్య ఉదయచంద్ర పక్కగా నిలబడి చెప్పాడు.
"ఇది మొత్తం వందెకరాలతోట, కొబ్బెర్లు మామిడ్లూ కలిపి అరవై ఎకరాలకు పైగావుంది. నిమ్మ, బత్తాయ్, సపోటా, మిగతా తోటంతా కలిసి ముప్పయ్ ఎకరాలుంటుంది. అదుగో అటు చూడండి. ఆ ఎకరంన్నరా అరటితోట."
"పది లక్షలకు పైగా ఆదాయం వస్తుండాలి."
"ఎక్కడ డాక్టర్ గారూ! ఖర్చులన్నీ పోగా రెంటికిమించి మిగల్దు నీరు పుష్కలంగా వున్నా ఆయిల్ ఇంజెన్ల మీదే ఆధారపడాలి. ఊళ్ళోకి ఇంతవరకూ కరెంటు రాలేదు ఏదో శాంక్షన్ అయిందంటున్నారు. వచ్చే ఏడాదన్నా మాకీబాధ తప్పుతుందేమో చూడాలి."
"ఏమిటి డాడీ! డాక్టర్ గార్ని ఇంటిముందే నిలబెట్టి కబుర్లు మొదలుపెట్టావ్?" కార్ల లో నుంచి సామాను నౌకర్లచేత పట్టించుకొస్తూ అన్నది మానసి.
"నీ కోసమే చూస్తూ నిలబడ్డాం మానసీ?" అన్నాడు ఉదయ్.
వెన్నెల వెలుగులో ఆమె కళ్ళల్లోకి చూశాడు.
"మా ఇంట్లో మాకు మర్యాద లేమిటి డాక్టర్ గారూ? ఇప్పుడు మీరు మా గెస్టు రండి" అని మానసి మెట్లు ఎక్కసాగింది.
శివరామయ్య, డాక్టరూ ఆమెను అనుసరించారు.
కిందనుంచి పదమూడు మెట్లేక్కితే, బెస్ మెంటు మధ్యలో పెద్ద ఆర్పీ, దానికి ఇరువైపులా చిన్న చిన్న ఆర్చీలు రెండు. మొత్తం తొమ్మిది స్థంభాలతో విశాలమైన భవనపుముందు భాగం. అందులోనుంచి మధ్యస్తంగా సింహద్వారం కుడి ఎడమల రెండు ద్వారాలు.
మధ్యనున్న ద్వారం ముందు నిలబడి చూస్తున్న డాక్టర్ ఉదయ్ చంద్రకు, ఓ వందేళ్ళు వెనక్కు విసిరేయబడి , జమీందారీ యుగం వున్నాట్టుగా అన్పించింది.
"మీది జమీందారీ వంశమని నాకు తెలియదు శివరామయ్య గారూ శివరామయ్య గార్ని అప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా చూశాడు.
"మా తాత గువ్వలపాలెం జమీందారు దగ్గర దివాన్ గా చేశాడు ఆయనే ఆ బంగళా కట్టించాడు. ఇప్పుడు ఈ బంగళా, ఈ తోటా మేనేజ్ చెయ్యడమే కష్టంగా వుంది. వచ్చే ఆదాయం నౌకర్లకూ చాకర్లకూచాలడం లేదు.
"డాడీ! ఇప్పుడా సోదంతా ఎందుకూ? డాక్టర్ గారికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి" విసుగ్గా అన్నది మానసి.
"డాక్టర్ గారు ఏదో అడుగుతున్నారు చెపుతున్నాను. అంతే నమ్మా" అని "ఒరేయ్ ! వీరభద్రుడూ ఎక్కడ్రా? డాక్టర్ గార్ని గెస్టు రూంలోకి తీసుకెళ్ళు" కేక పెట్టాడు శివరామయ్య.
"హాలుకు ఉత్తరపువైపున మెట్లకు పక్కగావున్న గదిలోనుంచి వెలిగించిన పెట్రమాక్సు లైటు చేత్తో పట్టుకుని వీరభద్రుడు ప్రవేశించాడు.
పెట్రమాక్సు లైటు చేత్తో పట్టుకుని వీరభద్రుడు నడుస్తుంటే ఒకవైపు వీరభద్రుడి నీడ ఇంటి కప్పుదాకా ఆవరించింది. రెండోవైపు పెట్రమాక్సు కాంతిలో అతడిశరీరం చేవ తిరిగిన చింతమానులా మెరుస్తోంది. కనుబొమలు గుబురుగా అల్లుకుపోయి చిక్కటి తారు పులిమినట్టుగా ఉన్నాయి. జుట్టుఉంగరాలు తిరిగి నల్లగావుంది. గుండ్రటికనుగుడ్లు ముందుకుపొడుచుకొచ్చినట్టుగా ఉన్నాయి. త;ెల్లటి ఆ కనుగుడ్లమీద ఎర్రటి జీరలు పారాడుతున్నాయి.
"బాబుగారూ రండి!"
వీరభద్రుడి కంఠం విని ఉదయ్ చంద్ర తృళ్ళిపడ్డాడు.
"వీడి ఆకారానికి తగ్గట్టే వుంది వీడి గొంతు" అనుకున్నాడు.
భయంకరంగా వుండే మనుషుల కంఠస్వరాలు బొంగురుగా వుండటం తనకు తెసులు. కాని మనిషి ఆకారానికి మించి భయంరంగా వున్న వీడి కంఠం వినగానే తన ఒళ్ళు జలదరించింది.
"బాబుగారూ ! మీకూ ఏర్పాటు చేశాం పదండి." హాలుమధ్యలో ఉన్నా కొక్కీకి పెట్రమాక్సు లైటు తగిలించి మెట్లవైపు దారితీశాడు వీరభద్రుడు.
"నా సూట్ కేసూ?"
"అదెప్పుడో అడివయ్య మీ గదిలో పెట్టాడు."
"అడివయ్యా? అతడెవరూ?"
"వాడా?" కాస్త ఆగి "నౌకరు " అన్నాడు.
"మరి నువ్వో?"
"ముందు మెట్లేక్కుతున్న వీరభద్రుడు ఠక్కున ఆగి, వెనక్కు తిరిగి, ఉదయ్ ముఖంలోకి చూస్తూ అదోలా నవ్వాడు.
ఆ నవ్వు చూసిన ఉదయ్ కు చెమట్లు పట్టినంత పనైంది.
"నేనా? నేను పెద్దయ్యగారి మనిషిని."
"అంటే?"
"ఆర్నే అడగండి బాబూ!" అనేసి గబగబా మెట్లేక్కసాగాడు వీరభద్రుడు.