Previous Page Next Page 
ఒప్పందం పేజి 7

 

    "వద్దు, మూడ్ బాగాలేదు. ప్లాట్ కెళ్ళి పోదాం."
    నురేష్ వెళ్ళి స్కూటర్ తీసుకొచ్చాడు. పది నిముషాల్లో ప్లాట్ కెళ్ళి పోయారిద్దరూ.
    "మీ తమ్ముడు ఎందుకలా ప్రవర్తించాడో! అయినా ఇవన్నీ ఊహించినవేగా అంత బాధపడతావెం?" అన్నాడు సురేష్.
    "బాధ కాదు సురేష్! నా కళ్ళ ముందు పెద్దవాడైన ప్రమోద్ కి కూడా నేను చులకనై పోయానా? ఆమాత్రం నాన్నర్ధం చేసుకోలేదా? ఆఖరికి శ్రీధర్ కూడా అలా వెళ్ళిపోవడం ....ఛ"
    "అందరూ మనల్ని అర్ధం చేసుకోవాలను కుంటే ఎలా రమ్యా! అందరికీ నచ్చద్దూ మన అభిప్రాయాలు. అందుకే చెప్పాను నీకు ఎవరికీ చెప్పకుండా నీకు నచ్చినట్టు నువ్వు బతుకు అని. అందరికీ టాంటాం వేశావు. పైగా వాళ్ళు అర్ధం చేసుకోలేదని బాధ."
    "సురేష్! నేను ఒక నెల రోజులో, ఏడాదో కాదు నీతో బతకాలనుకున్నది జీవితాంతం. అలాంటప్పుడు అది రహస్యంగా ఎందుకుండాలి? నేను ఎలాంటి జీవితం గడపాలను కున్నా అందరికీ తెలిసేలా బతుకుతాను. నేను చేస్తున్నది తప్పేం కాదని నా అంతరాత్మకి తెలుసు. నేనిలా బతకడం వలన అటు నీ భార్యకీ, పిల్లలకీ, నీ కుటుంబానికీ కానీ, ఇటు ఈ సమాజానికి కానీ ద్రోహం జరగడం లేదు. ఏదన్నా ద్రోహం అంటూ జరిగితే అది నాకే. అలాంటప్పుడు నేనెందుకు అందరికీ భయపడాలి?' ఆవేశంగా అంది రమ్య.
    "అందరికీ చెప్పినప్పుడు వాళ్ళ ఆమోదం పొందాల్సిన అవసరం లేదా?"
    "లేదు. వాళ్ళు ఆమోదించి ఏం చేస్తారు సురేష్? ఓ తాగుబోతు భర్తతోనో, శాసిస్టు తోనో వాడి తిట్లూ , దెబ్బలు భరిస్తూ బతికే భార్యని ఈ సమాజం ఆమోదిస్తుందా? అలా ఆమోదించేట్లయితే అలాంటి సమాజాన్ని నేను బహిష్కరిస్తాను సురేష్! ప్లాట్ లో వాళ్ళు నన్ను పార్టీలకు , ఫంక్షన్ల కు పిలవకపోయినా పెద్దగా బాధపడలేదు. అది వాళ్ళ సంస్కారం అనుకున్నాను. మా ఆఫీసు లో కొలీగ్స్ నా గురించి చెవులు కోరుక్కుంటే ఇగ్నోర్ చేశాను. అమ్మా నాన్నా నువ్వు ఉంపుడుగత్తె గా బతుకుతున్నాను అంటే నవ్వుకున్నాను. ఇప్పుడు ప్రమోద్, అలా ప్రవర్తించినా ఓ రోజు, లేదా ఓ వారం బాధపడతాను. కానీ కానీ నేను ప్రేమించిన నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నేను భరించలేను. మొన్న మీ ఇంట్లో ప్రవర్తించిన విధంగా ఇంకోసారి ప్రవర్తిస్తే మాత్రం నేను నిన్ను ఎన్నటికీ క్షమించను. నీకేమన్నా ఇబ్బంది ఉంటె నాకు చెప్పు. నాకు చేతనైనంత వరకూ మన బంధం కలకాలం నిలబడటానికి నేను కోపరేట్ చేస్తాను."
    "నిన్ను నిర్లక్ష్యం చేయగలనా రమ్య? కాకపొతే కొన్ని సమయాల్లో తప్పదు. నువ్వంటే నాకు ఎంత ప్రేమ లేకపోతె నీ బర్త్ డే గుర్తుంచుకుంటాను."
    "కబుర్లు చెప్పకు. అసలు ఇన్నాళ్ళూ మీ ఆవిడకి మన సంగతి చెప్పకుండా ఎందుకు దాచావు?" సీరియస్ గా అడిగింది.
    "ఎలా చెప్తాను చెప్పు? చెబితే ఏడుపులు, పెడ బొబ్బలు."
    "ఆ మాత్రం మీ ఇద్దరి మధ్యా అవగాహన లేదా? అది లేకుండా ఇన్నేళ్ళ నుంచీ కాపురం ఎలా చేస్తున్నారు?"
    "అబ్బా రమ్యా! ఊరికే అన్నిటికీ ఆర్గ్యూ చేయకు. అసలు నువ్విదివరకులా లేవు. ఇదివరకు నా మనసెక్కడున్నా రమ్యా రమ్యా అంటూ పలవరించేది. ఇప్పుడు నిన్ను తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏదో ఒక ప్రాబ్లం చెప్పి నస పెడ్తున్నావు."
    రమ్య చర్రున లేచింది.
    "నసా! అవును మనిద్దరి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీనా ఒక్క దానివే. నేను మాత్రమే ఇందుకు బాధ్యిరాల్ని. నీకేం సంబంధం లేదు. ఎందుకంటె నీకంటూ సెపరేట్ గా ఓ జీవితం ఉంది. నేను నువ్వు వచ్చినప్పుడల్లా నీ కౌగిట్లో వాలిపోయి తీయటి కబుర్లు చెప్తే మంచిదాన్ని. నా బాధ వేదన నీకు చెప్పి కొంత ఓదార్పు పొందాలని ఆశించడం తప్పు అంతేగా! థాంక్యూ సురేష్ థాంక్యూ! చాలా బాగా అర్ధం చేసుకున్నావు."
    రమ్య స్వరం లో వినిపించిన గుండెకు తగిలిన గాయం తాలుకూ బాధ సురేష్ గుండెల్ని తాకింది. దగ్గరగా జరిగి ఆమె చుబుకం పట్టి కళ్ళ ల్లోకి చూస్తూ అన్నాడు.
    "సారీ రమ్యా! ఏదో చికాకు లో అన్నాను. అయినా నువ్వే ఆలోచించు. నేను అడకత్తెరలో పోకచెక్క లా నలిగిపోతున్నాను. నిన్ను బాధ పెట్టలేను. తనని కన్వీన్స్ చేయలేను. వేరీసారీ నవ్వు రమ్యా ప్లీజ్! ఈ దేబ్బలాటలూ, చికాకులు ఇవే సరిపోతున్నాయి ఈమధ్య ఎన్ని రోజులైంది మనం సరదాగా గడిపి."
    సురేష్ లాలనతో కూడిన మాటలు రమ్య కోపాన్ని కొద్దికొద్దిగా కరిగి పోయేలా చేస్తున్నాయి. దెబ్బలాటలు అన్నపదం ఆమెని గాభరా పెట్టింది. "మా మధ్యగిల్లి కజ్జాలే తప్ప దెబ్బలాటలుండవు" తండ్రితో తను చాలెంజ్ చేసింది. అవును ఈ గిల్లికజ్జాలు చిలికి చిలికి గాలివాన కాకుండా కాపాడాల్సి ఉంది. నెమ్మది నెమ్మదిగా రమ్య స్త్రీత్వం లొంగి పోయింది.   

                                 ***

    "రమ్యా" రమ్య ఫైల్స్ లోంచి తలెత్తింది. ఎదురుగా శ్రీధర్ చిరునవ్వుతో.
    "నువ్వా!" సంభ్రమంగా చూసింది.
    "నేనే....ఎలా వున్నావు?' ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
    "ఫైన్!నువ్వెలా ఉన్నావు?' అడిగింది రమ్య బజర్ నొక్కుతూ.
    "నేను బాగున్నాను. సారీ రమ్యా మొన్న...."
    రమ్య కళ్ళు కిందికి వాలిపోయాయి. ఫ్యూన్ వచ్చాడు రమ్య కాఫీ చెప్పబోతోంటే అన్నాడు. "బిజీగా వున్నావా బైటికి రాలేవా?"
    "ఏం లేదు. వెళ్దాం పద" అంది పైల్స్ మూసేస్తూ.
    ఇద్దరూ బైటికి నడిచారు.  కారు డోర్ తీసిన శ్రీధర్ ని ఆశ్చర్యంగా చూస్తూ, "కారు ఎప్పుడు కొన్నావు?" సీటులో కూర్చుంటూ అడిగింది.
    "చాలా కాలమైంది " స్టార్ట్ చేస్తూ అన్నాడు.
    'అంటే నువ్వు ఇక్కడే ఉంటున్నావా?"
    "లేదు, విజయవాడ లో"
    "అక్కడి నుంచి కారులో వచ్చావా?"
    "ఊ" దాదాపు పది రోజుల కోసారి వస్తాను. ఎరువుల కోసం , సీడ్స్ కోసం. లగేజీ ఉంటుంది కదా ఎందుకీ బాధ అని కారు కొనేశాను. ప్రమోద్ కి ఇక్కడే రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం తెలుసా! ఈ మధ్యే జాయిన్ అయ్యాడు."
    రమ్య కొంచెం సంతోషంగా ఇంకొంచెం కోపంగా "వెధవ!" ఆ విషయం నాకు చెప్పచ్చుగా! నేనెవరో తెలీనట్టు వెళ్ళిపోతాడా?" స్టుపిడ్" అంది.
    "వాడి తప్పు కాదు. మీ అమ్మా నాన్నా స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి పంపారు నిన్ను కలవద్దని"కారు తాజ్ రెసిడెన్సీ ముందు ఆపాడు.
    బటర్ మసాలా దోశ తింటూ "నేనేం తప్పు చేశాను చెప్పు" అమ్మా నాన్నా అంతగా నన్ను అసహ్యించుకోడానికి" అంది రమ్య.
    శ్రీధర్ ఆప్యాయంగా...."రమ్యా! నీకేం తక్కువైందని రెండో పెళ్ళి వాణ్ణి ప్రేమించావు?" అన్నాడు.
    "తక్కువ ఎక్కువ ప్రసక్తెం ఉంది. ప్రేమించాక తెల్సింది. అతనికి పళ్ళి అయిందని."
    "అప్పుడైనా నీ అభిప్రాయం మార్చుకోవచ్చుగా"
    "మార్చుకోలేక పోయాను. నా మనస్తత్వానికి ఇలాంటి జీవితమే బాగుంటుందనిపించింది. అతనూ ఒప్పుకున్నాడు.
    "ఎందుకు ఒప్పుకోడు! బాధ్యతలు మోయ్యక్కర్లేదంటే ఇద్దర్నేం ఖర్మ ఇరవై మందిని కూడా భరిస్తాడు మగవాడు. కానీ నువ్వు ఆడదానివి. నీకు జీవితాంతం ఓ తోడూ నీడగా ఉంటూ నీ కష్టసుఖాలు పంచుకునే వ్యక్తీ భర్త గా ఉండడం ఎంతో అవసరం! సురేష్ లాంటి పెళ్ళైన వాడికి భార్య కాని భార్యగా ఉండటం చేత నీలో ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లేదా?"
    "నేను సురేష్ తో బతికేది సెక్యూరిటీ కోసం కాదు"
    "మరి దేనికోసం?'
    రమ్య మాట్లాడలేదు. ఈ ప్రశ్న ఇంతవరకు తనకు ఎదురవలేదు. దేనికోసం తను సురేష్ తో కలిసి బతుకుతోంది? తోడూ కోసమా? అలాగైతే అతని తోడు తనకి అనుక్షణం కావాలె. పోనీ రక్షణ కోసమా? తనకి తనే రక్షణ. మరి శారీరక సుఖం కోసమా? కేవలం దానికోసమే అయితే సమాజంతో సవాల్ చేస్తూ బతకడం దేనికి? చాటు మాటు శృంగారం జరిపితే ఎవరికీ తెలీదుగా! ఇదేదీ కాదు బతకడం కోసం అంతే....
    "రమ్యా! అతని భార్యకి మీ విషయం తెలుసా?" నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగాడు.
    "తెలీదు"
    "మరెలా మానేజ్ చేస్తున్నారు? పండుగలూ, పబ్బాలూ వస్తే నీతో ఉంటాడా? పెళ్ళిళ్ళ కి, ఫంక్షన్స్ కి నీతో వస్తాడా?"
    సౌజన్య పెళ్ళి కార్డు ఇచ్చినప్పుడు తనతో పెళ్ళికి రమ్మంది. రానన్నాడు. కారణం అడిగితె ఆఫీసులో పని ఉందని చెప్పాడు. సౌజన్య అడిగింది కూడా. "సురేష్ రాలేదేం!' అని తను దెబ్బలాడినా సురేష్ కి వేరే కార్డ్ కూడా ఇచ్చింది.

 Previous Page Next Page