"అయ్యయ్యో!" అంది పక్కింటావిడ ఆందోళనగా.
"నలుగురు తిరుగుతున్న చోట నగలు అంత అజాగ్రత్తగా ఎందుకు పెట్టావమ్మా? మధ్యాహ్నం పనిమనిషి వచ్చిందా? ఎంత ఖరీదు చేస్తాయేం?"
"వెధవ ఖరీదెవడికి కావాలి!" అంది జానకి వెక్కుతూ, "నా సృజన నాకు దక్కితేనిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుని తీసి ఉంచిననగలు అవి! అవి పోయాయంటేదేముడికి నా మీద దయలేదన్నమాట! ఆయనకీ నానగలుకూడా అక్కర్లేదన్నమాట; ఎవరండీ! ఆయన మనచిట్టి తల్లిని రక్షింపదలచుకోలేదండీ! ఇంక మనకు దిక్కెవ్వరండీ! ఆయన మన చిట్టితల్లిని రక్షింపదలచుకోలేదండీ! ఇంక మనకు దిక్కెవ్వరండీ!" అంది భర్త భుజం మీద వాలిపోతూ.
గేటుముందు ఒక పోలీసు జీపు ఆగింది. అందులోంచి దిగాడు ఒక యంగ్ సబ్ ఇన్ స్పెక్టర్.
జీపుదిగుతున్న ఎస్సైని చూడగానే అందరూ పరుగులాంటి నడకతో గేటు దగ్గరకు వెళ్ళిపోయారు.
"ఇన్స్ పెక్టర్ గారూ! జానకి ముడుపుకట్టిఉంచిన నగలమూట కూడాపోయింది." అన్నాడు పక్కింటిప్రసాదరావు త్వరత్వరగా.
"పోతేపోయాయి వెధవనగలు!" అంది జానకి బిగ్గరగా, "ఇన్స్ పెక్టర్ గారూ! నా కూతురు నాకు దక్కితేచాలు. నగలసంగతి మీరు పట్టించుకోకండి. నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వండి!" సాలోచనగా ఆమెవైపు చూస్తూ అన్నాడు ఎస్సై "మీకొక గుడ్ న్యూస్! మీ అమ్మాయిని గురించిన మొదటి క్లూ దొరికింది మాకు"
"ఏమిటీ?" అన్నాడు రమణమూర్తి అద్విగ్నంగా, "క్లూ దొరికిందా? ఏం క్లూ?"
"మీ అమ్మాయి జైహింద్ స్టోర్స్ పక్క సందులోకి మళ్ళగానే ఇద్దరు మనుషులు కలసి ఆమెని ఒక ఆటోలో ఎక్కించుకుని ఎత్తుకుపోయారు. ఆ ఆటో నంబరు ట్రేస్ చెయ్యగలిగాం"
ఎస్సై ఆటోనెంబరు చెప్పగానే విలవిల్లాడిపోయింది రమణమూర్తి మనసు.
ఆ ఆటోనే తను డాష్ కొట్టబోయింది నిన్న! డాష్ కొట్టి ఉంటే తమ సృజన అప్పుడే తమకు దొరికి ఉండేది! తనకాళ్ళూ చేతులూ విరిగినా సృజన మాత్రం స్వల్పమైన గాయాలతో బయటపడి ఉండేదేమో!
ఎంతకొద్దిలో అదృష్టం తప్పిపోయింది!
ఆసంగతే ఎస్సైతో చెప్పాడు రమణమూర్తి. విని తల పంకించాడు ఎస్సై. "డోంట్ వర్రీ! జరిగిందేదో జరిగిపోయింది! ఆ ఆటోడ్రైవర్ పేరు నవాబ్. ఇంకా మనకేసు సింపుల్ అయిపోయినట్లే! తెల్లారేసరికి మీ అమ్మాయిని మీ ఇంట్లో దింపేస్తాం చూడండి." అన్నాడు చాలా కాన్ఫిడెన్స్ తో. తేలిక పడింది రమణమూర్తి మనసు. "మీ సాయం ఈ జన్మలో మర్చిపోను" అన్నాడు ఎస్సై చేతులు పట్టుకుని గట్టిగా ఊపేస్తూ, తర్వాత తటపటాయిస్తూనే మెల్లిగా అన్నాడు. "దయచేసి మీరొకసారి ఇటు వస్తారా?"
"ఎందుకు?" అంటూనే అతనితో బాటు నడిచాడు సబ్ ఇన్స్ పెక్టర్!
మొహమాటంగా అన్నాడు రమణమూర్తి. "అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి....... మీకు ఐమీన్....నేను.....చెయ్యవలసిన ఫార్మాలిటీస్ ఏమన్నాఉన్నాయా? చెప్పండి! సంతోషంగా పూర్తి చేస్తాను"
"మీరు లంచం తీసుకుంటారా?" అని ఇన్ డైరెక్ట్ గా అడుగుతున్న రమణమూర్తి వైపు నవ్వుతూ చూశాడు ఎస్సై "నోనో అలాంటి దేమీలేదు బైదిబై. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కెలా తెలుసు"
"మా ప్రక్కింటి ప్రసాదరావుగారికి ఆయన దూరపు బంధువు."
"ఐసీ! ప్లీజ్ టేకిట్ ఈజీ! రేపొద్దున్నే మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గర దింపేస్తాను. బదులుగా మంచి కాఫీ ఇస్తే చాలు!" అన్నాడు ఎస్సై నవ్వుతూ.
"కాఫీదేముంది! గ్రాండ్ డిన్నర్ ఇస్తాను" అన్నాడు రమణమూర్తి కృతజ్ఞతతో.
నవ్వి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు ఎస్సై.
క్షణాల్లో ఆ ఇంట్లో ఆనందం వరదలాపొంగింది. అందరూ ఒక్కసారిగా గలగల మాట్లాడడం మొదలెట్టారు.
ఎత్తుతక్కువగా ఉన్న కాంపౌండ్ వాల్ ని రెండు చేతులతో పట్టుకుని ఎగిరి దానిమీద కులాసాగా కూర్చున్నాడు రమణమూర్తి.
"మన పోలీసులు చాలా ఎఫిషియెంటు లెండి తలచుకుంటేవాళ్ళు సాధించలేనిది ఉండదు. అయితే వచ్చినచిక్కల్లా ఏమిటంటే వాళ్ళు తలచుకోరు. ఇప్పుడు కూడా మనం ప్రసాదరావుగారిచేత ఇన్ ఫ్లుయన్స్ చేయించకపోతే పని జరిగి ఉండేది కాదు. జరిగేదంటారా?" అన్నాడు రమణమూర్తి.
గోడమీద కూర్చున్న రమణమూర్తిని చిత్రంగా చూస్తూ తను కూడా సంభాషణ లోకి దొరబడ్డాడు పక్కింటి ప్రసాదరావు. "ఆ నాదేవుంది!" అన్నాడు మోడెస్ట్ గా.
ఉన్నట్లుండి గభాల్న గోడ దూకాడు రమణమూర్తి. గబగబ మైనా పిట్ట ఉన్న పంజరం దగ్గరకు వెళ్ళాడు.
ఒక మనిషి తనని సమీపిస్తూ ఉండడం చూసి కంగారుగా అరవడం మొదలెట్టింది మైనా,
"ఏమే తెగ అరుస్తున్నావ్?" అన్నాడు వేళాకోళంగా.
"ఇప్పుడు చెవికోసిన మేకలాగా అరవడం కాదు. తెల్లారి మీ ఫ్రెండ్ సృజన ఇంటికి రాగానే కోయిల్లా మాంచిపాటపాడి స్వాగతం చెప్పాలి నువ్వు! లేకపోతేనా తోకపీకేస్తాను సరేనా?" అన్నాడు తర్జనితో పిట్టని బెదిరిస్తూ.
అతనిమాటల్లో పెద్ద జోకేమీలేకపోయినా అక్కడున్న వాళ్ళందరూ విరగబడి నవ్వారు.
"సంజయ్! ఈ మైనాకి తినడానికేమన్నా పెట్టారా అసలు? ఏదన్నా తిండి దొరుకుతుందేమోచూడు! జానీ మా అందరికీ కాఫీ! హాట్ అండ్ స్ట్రాంగ్!" అన్నాడు రమణమూర్తి.
నవ్వుతూ తల ఊపి త్వరత్వరగా వంటింట్లోకి వెళ్ళింది జానకి.
సృజన తాలూకు క్లూ తెలిసిపోయిందన్న శుభవార్త కలిగించిన ఆనందం అలా కొద్దిసేపు పాలపొంగులా పొంగింది. ఆ ప్రథమోత్సాహంకొద్దిగా చల్లారాక అందరూ ఒకచోట చేరికొంచెం లెంల్ హెడెడ్ గా సృజనని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు.
వ్వవ్వవ్వ
అమ్మ గనక తోడురాకపోతే రాత్రిపూట బాత్ రూం కి కూడా వెళ్ళలేని సృజన రక్తసిక్తమై పోతున్న తన బట్టలని చూచుకుని చిగురాకులా వణికిపోతుంది.
రాఘవులూ, జాన్ కలసి తనని ఆటోలో పడేసి ఎత్తుకొచ్చినప్పుడు కూడా ఇంత టెర్రర్ కలగలేదు తనకి!
తనకేం జరుగుతుందో తనకే తెలియని దురవస్థ అది! ఫలానా అని చెప్పలేని భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి.
అప్పుడు లీలగా ఒక విషయం గుర్తువచ్చింది.
తమ క్లాసులో అందరికన్నా పెద్దఅమ్మాయి రమ్య. ఒక్క రోజు కూడా స్కూలు మానడానికి ఇష్టపడదు తను.
అలాంటి రమ్య వరుసగా ఒక వరం పాటు స్కూలుకి రాలేదు. రమ్య సృజనకి బెస్టు ఫ్రెండు.
వచ్చాక, జ్వరంవల్ల తను కొన్నాళ్ళపాటు స్కూలుకు రాలేదని అందరికీ చెప్పింది రమ్య.
కానీ బెస్ట్ ఫ్రెండ్ సృజనకి మాత్రం నిజం చెప్పేసింది ఇబ్బంది పడుతూ!" నాట్ ఫీవర్ రే! ఐ బికేమ్ ఏ పెద్దమనిషి!" అంది మాటలు మింగేస్తూ.
"అంటే?" అంది సృజన అర్ధంగాక. వివరంగా చెప్పేటంతగా రమ్యకీ తెలియదు. ఆమెకి తెలిసింది చెప్పినా సృజనకి పూర్తిగా అర్ధంకానూలేదు.