Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 8

అదే నిజమైంది.
మర్నాడు నాన్నగారి ముందు బావ పంచాయితీపెట్టి అక్క శీలం గురించి నోటికొచ్చినట్టల్లా వాగాడు. నాన్న ఎంత నచ్చజెప్పినా వినలేదు. "మీ అమ్మాయి శీలవతి కాదు..... నాకొద్దు.." అన్నాడు.
నాన్న కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి ఇంకో ఇరవైవేలు ముట్టజెప్పేటట్టు ఒప్పందం చేసుకున్నాక, ఇష్టంలేనట్లుగా మొహంపెట్టి దానిని తనతో తీసుకెళ్ళాడు.
అక్కతోబాటు నేనూ వెళ్ళాను. ఆ ఇంట్లోకి అక్క గృహప్రవేశం చేస్తుంటే దానికేమోగాని నాకైతే చాలా ఏడుపొచ్చింది.
చాలా వాటాలున్న ఆ కాంపౌండులో గానీ, వెలుతురూ సరిగ్గా రాని గూభ్యంలాంటి రెండు గదుల కొంప అంది.
విశాలమైన ఇంట్లో పెరిగి వచ్చిన అక్క ఈ ఇంటిని తన ఇల్లుగా ఎలా భావించగలదూ! రేపట్నుంచి ఇక్కడ ఎలా మసలుతుందీ? అని బాధపడ్డాను. ఇంటిపేరునీ, ఇష్టాలనీ పుట్టింట్లోనే వదిలి ఆడపిల్ల కొత్త జీవితహానికి అలవాటు పడాలన్నమాట. అంటే ఆడపిల్లకి రెండు జీవితాలు వివాహపూర్వం జీవితహానికి సమాధి కట్టి ఇంకో తనదికాని జీవితం కొత్త మనుషుల మధ్య కొత్త వాతావరణంలో ప్రారంభించాలి. పెళ్ళికి ముందు అమ్మాయిని తీసుకెళ్ళి 'ఇదిగో ఇది నువ్వు నివసించబోయే ఇల్లు..... వీళ్ళు ఈ యింట్లో నీతో వుండే మనుషులు.... నీకు నచ్చారా? ఇష్టమేనా?' అని అడగడానికి ఏర్పాటు చేయాల్సిన పెళ్ళిచూపులు మగవాళ్ళు తప్పుగా ఆడపిల్ల ఇంట్లో ఏర్పాటు చేస్తున్నారు.
సంతకి తీసుకెళ్ళి పశువుని అమ్మేసి వస్తున్న ఫీలింగ్ తో నేను నాన్నతో కలిసి మరునాడు ఇంటికి వచ్చాను.
నాన్న ఇంటిని అమ్మక తప్పక పరిస్థితి వచ్చింది. అమ్మేసి వచ్చిన డబ్బుని చిన్నక్కకీ, నాకూ పెళ్ళిళ్ళు చెయ్యడానికి బ్యాంక్ లో వేశారు.
అక్కడే నాన్న పప్పులో కాలేశారు!
పెద్దక్క పెళ్ళికీ, చిన్నక్క పెళ్ళికీ మధ్యనున్న గ్యాప్ లో ధరలు రెండుసార్లు పెరిగాయి. గ్యాప్ ధరా, ఉల్లిపాయల ధరా, పెట్రోలు ధరతోపాటు పెళ్ళికొడుకుల ధరకూడా పెరిగిపోయింది. అది తెలీని పిచ్చినాన్న మా ఇద్దరికీ చెరో లక్షన్నరా కట్నాలివ్వడానికి చాలనుకున్నాడు.
కుమార్ చిన్నక్కకి ఓ ఉత్తరం రాశాడు. అందులో 'సుమతీ.... నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే వుంటాను. కానీ పెళ్ళిచేసుకోలేను. మా నాన్న మేనరికం చేసుకోకపోతే ఆస్తిలో చిల్లిగవ్వకూడా ఇవ్వనన్నాడు. ఆస్థి లేకపోతే ఎలా? నాకు ఉద్యోగంకూడా లేదు కదా....అందుకే నన్ను మరిచిపో ఎప్పటికీ మానసికంగా నీవాడు.....కుమార్' అని వుంది.
సుమతక్క ఏడుస్తుందని అనుకొన్నాను కానీ అది ఏడవలేదు.
"సినిమాల్లో హీరోలు' నాకు బ్లడ్ కాన్సర్! నన్ను మర్చిపో లతా' లాంటి నిజాలు చెప్తుంటారు. అలాగే తనకు డబ్బురోగం వుంది. అని పెళ్ళికి ముందే చెప్పిన వీడూ మంచివాడేలే!" అని నేను వూరడించాను.
మంచిరోజు చూసి చిన్నక్క ప్రేమలేఖలన్నీ శుభ్రంగా తగులబెట్టేసి తలస్నానం చేసేసింది. నాన్న కుమార్ ప్రసక్తి తీసుకొస్తే-
"పదోరోజుకూడా అయిపోయింది. ఇక అతడ్ని మర్చిపోవడమే మంచిది నాన్నా! మీ ఇష్టమొచ్చిన సంబంధం చూడండి" అంది.
పెద్దక్క తిన్న దెబ్బవల్ల చిన్నక్కకి మెచ్యూరిటీ వచ్చింది. వాళ్ళిద్దర్నీ చూశాక నాకు వైరాగ్యం వచ్చింది. మెచ్యూరిటీకి అది పరాకాష్ట అనుకుంట!
నాన్న చిన్నక్కకి సంబంధాలు చూడటానికి వేట మొదలుపెట్టాడు.
పెద్దక్క కాపురం విషయానికొస్తే ఆ ఇంటిని లంకతో పోల్చటం పాపం! లంకా పట్టణం ఎంతో సుందరంగా వుండేదట. వీళ్ళ ఇల్లుమాత్రం రాక్షసులలాంటి మనుషులతో నిండిన నరకకూపంలా వుంటుంది. అత్తగారొక బ్రహ్మరాక్షసి ఊళ్లోనే వున్న నలుగురు ఆడబిడ్డలూ మార్చి మార్చి వచ్చి దీనిచేత చాకిరీ చేయించుకొని ఆనందిస్తుంటారట. మా అక్కా బావా పడుకొనే గదికీ, అత్తగారు పడుకునే గదికీ మధ్యనున్న కర్టెన్ కిందికి వేయగానే వాళ్ళ అత్తగారికి బీపీ పెరిగిపోయి "నే చచ్చిపోతున్నాన్రోయ్" అంటూ అరిచి గోల చేస్తుందట. ఆ కర్టెన్ ఎప్పుడూ పైకి ఎత్తిపెట్టే వుండాలట.
ఇంక బావగారి విషయానికొస్తే ఆయన మాటకిముందు "నేను ఆఫీసర్ ని" అని చెప్పి ఆ తర్వాత ఇంకోమాట చెప్తాడు. కాఫీ బాలేక పోయినా, అక్కలేటుగా మంచినీళ్ళు అందించినా "నా గురించి ఏమనుకుంటున్నావే? పైగా ఆఫీసర్ని అయినా నువ్వు లెక్క చెయ్యడంలేదు. ఎంత పొగరూ?" అంటూ దాన్ని చేతిలో ఏది వుంటే అధిపెట్టి కొట్టేవాడట.
పెద్దక్క పరిస్థితి ఆలోచిస్తే గుండె బరువెక్కిపోతుంది. వయసులో వున్న ఆడబిడ్డ కొడుకులు ఎప్పుడూ ఇక్కడే వుంటారు. వాళ్ళకి అండర్ వేర్ ల దగ్గర్నుంచీ అన్నీ అక్కే ఉతకాలి. బావ వాళ్ళముందే అక్కతో సరసాలాడేవాడు. అక్క ఏమైనా అంటే "పెద్ద పతివ్రతలా సిగ్గు నటించకు" అనేవాడు.
ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే జైళ్ళలో ఆడఖైదీలు ఇంతకన్నా హాయిగా వుంటారేమో అనిపించేది.
ఇంటినిండా ఫ్లాట్ ఫార్మ్ లా వచ్చే జనం.... పోయే జనం..... తెర అడ్డంకూడా లేని కాపురం.... పేవ్ మెంట్ మీద ముష్టివాళ్ళ టైప్ లో! వాళ్ళ అత్తగారికి కాణీ ఖర్చులేని వినోదం.
అక్కని అప్పుడప్పుడూ పుట్టింటికి తీసుకొచ్చి మోపెడన్ని అభియోగాలు మోపేవాడు. నాన్న ముందే ఒక్కోసారి చెయ్యి చేసుకునేవాడు.
నాన్నని చూస్తే ఆడపిల్లల్ని కనేవాడికి భూదేవంత సహనం అవసరం అనిపించేది.
ఉన్న ముచ్చట్లు సరిపోవు అన్నట్లు దానికి నెల తప్పింది. మళ్ళీ నాన్నకి బోలెడు ఖర్చు.
నేనుమాత్రం సంతోషించాను. అది ఈ వంకతో పుట్టింట్లో కొన్నాళ్ళు స్వేచ్చావాయువులు పీల్చుకోవచ్చని కానీ వారంలోమూడురోజులు బావగారొచ్చి ఇక్కడకూడా దాన్ని సతాయించుకుని తినే ఛాన్స్ వుందని అప్పుడు ఆలోచించలేదు.
పెద్దక్కకి బాబు పుట్టాడు.
'అమ్మయ్య' అనుకొన్నాం మా అమ్మపోలికొచ్చి అందర్నీ ఆడపిల్లల్నే కంటుందేమోనన్న అనుమానంతో వాళ్ళ అత్తగారు శాపనార్ధాలు పెట్టే అవకాశం తప్పిపోయినందుకు.

 Previous Page Next Page