Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 7

నాకు పెద్దక్కని చూస్తే జాలేసింది.
డబ్బు అనేది అడుగున వుందని తెలిస్తే మునిసిపాలిటీ చెత్తవ్యాన్ లో కూడా పీకలదాకా కూరుకుపోయి వెతుక్కునే ఈ రకాలతో ఇది జీవితాంతం ఎలా వేగుతుందా అనిపించింది.
పోట్లాటలతో, ఏడుపులతో సాగిన ఆ తంతు పెళ్ళిలా జరగలేదు. మొత్తం పూర్తయ్యేసరికి అందరి మొఖాలూ ఉబ్బి ఇంత లావున తయారయ్యాయి. అలిసిపోయిన ఆడపెళ్ళి వాళ్ళం ఎక్కడపడితే అక్కడ వాలిపోయాం. పడుకున్నది మిరపకాయల బస్తా పక్కనో, చింతపండు మూటమీదో కూడా తెలీడంలేదు. అటువంటి సమయంలో బావ అర్జెంట్ గా శోభనం జరిపించెయ్యాలంటున్నాడని కబురొచ్చింది.
అక్క పాపం మంచినిద్రలో వుంది. దాన్ని లేపి తలంటుపోసి జడకుకుట్టాలని పెద్ద ముత్తయిదువెవరో గోలపెట్టింది. నాకైతే మేకపోతుని బలికి సిద్దం చేస్తున్నట్లు అనిపించింది. దాన్ని లేపాలని గదిలోకి వెళ్ళిన నాకు అమాయకంగా బెంగాలీ నవలల్లో హీరోలాంటి వాడికోసం కలలుకన్న దాని మనసు గుర్తొచ్చింది. ఒక నిట్టూర్పు విడిచి దాన్ని నిద్రలేపి స్నానం చేయించాం. సగం నిద్రలోనే అది అలంకారాలు చేయించుకొని గదిలోకి వెళ్ళింది.
నేను ఎందుకైనా మంచిదని దానిగదికి దగ్గరగా పడుకున్నాను. అది అర్ధరాత్రి లేచి పరిగెత్తుకొచ్చేస్తుందని నాకెందుకో గాఢంగా అనిపించింది. లంకలో సీతని వదలి కాపలావున్న రాక్షసుల్లా అందరూ గురకలు పెట్టి నిద్రపోయారు.
నాకు నిద్రపడుతూ వుండగా నా పక్కన ఎవరో వచ్చి పడుకున్నట్లుగా అనిపించి "ఎవరూ?" అంటూ లేచి కూర్చున్నాను.
మా చిన్నక్క పడుకుని "నేనేలే!" అంది అది ఎందుకో ఏడుస్తున్నట్లు నాకు అర్ధమైంది పెద్దక్కమీద బెంగేమో అనుకున్నాను. కాని అది వెక్కుతూ నా చెవిలో "కుమార్ నాకు ద్రోహం చేస్తాడంటావా?" అని అడిగింది.
"ద్రోహమంటే?" అన్నాను. ఒక మనిషి ఇంకో మనిషికి ఎలా ద్రోహం చెయ్యగలడో నా చిన్నమెదడుకి నిజంగా అర్ధంకాలేదు. "అప్పుగా డబ్బేమైనా ఇచ్చావా?' అని అడిగాను.
అది గాఢంగా నిట్టూర్చి "అంతకన్నా విలువైందే యిచ్చాను" అని అంది.    
నేను దానివైపు పైనుంచి కిందికి అనుమానంగా చూస్తూ "మెడలో గొలుసు కానీ చేతిగాజులు కానీ యిచ్చావా?" అన్నాను.
"ఛ! అదేంకాదు..... అయినా నువ్వు చిన్నపిల్లవి నీకు అర్ధంకాదులే.." అని నన్ను గట్టిగా కౌగలించుకుని ఏడ్చింది.
నేను దానిమీద చెయ్యేసి "అవేమీ ఇవ్వనప్పుడు నిన్ను నాన్నగారేం అనరు. నువ్వు ఏడవనవసరంలేదు" అన్నాను. అయినా అది కాసేపు ఏడ్చి పడుకుంది.
అది ఎందుకు ఏడ్చిందో కారణాలు వెతుకుతూ నేనూ జాగారం చేశాను.
తెల్లవారుఝామున "సుమతీ.... సుమతీ....!" అన్న పెద్దక్క పిలుపు వినిపించి దిగ్గున లేచి కూర్చున్నాను.
పెద్దక్క హడావుడిగా వచ్చి "సుమతి ఏది?" అని అడిగింది.
నేను పక్కన పడుకున్న చిన్నక్కని చూపించాను. దాన్ని లేపి "సుమతీ..." అంటూ పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది.
నాకేం అర్ధంకాలేదు. రాత్రి అది ఏడ్చింది ఇప్పుడిది ఏడుస్తోంది.
"మీరు ఏడుపులాపి, అసలేం జరిగిందో చెప్పి ఏడవండి" అన్నాను.
పెద్దక్క చెప్పింది. అది గదిలోకి వెళ్ళాక బావ దాన్ని దగ్గరకు తీసుకుని సరసాలాడాడట. తన ముచ్చటలన్నీ తీరాక కబుర్లు మొదలుపెట్టి "అరుంధతీ! నువ్వు పెళ్ళికిముందు ఎవరినైనా ప్రేమించావా?" అని అడిగాడుట.
అక్క తెల్లబోయి చూసిందట.
 "పర్లేదు నిజంచెపితే నేనెంతో సంతోషిస్తాను. కట్టుకున్నవాడి దగ్గర దాపరికాలు వుండకూడదు. సర్వస్వం సమర్పించినట్లే అన్నీ విప్పి చెప్పాలి. ఊ.... చెప్పాలి మరి...." అంటూ బలవంతం చేశాడుట.
మా అమాయకపు పక్షి నిజాయితీగా "నేను ఎదురింటి అబ్బాయిని ప్రేమించాను" అందట.
"మాట్లాడావా?" అడిగాడుట.
"ఆ... ఒక్కసారి" అందిట.
"మీ ఇంటికొచ్చాడా?" అన్నాడుట.
"ఆ.... ఒక్కసారి" అందిట.
"అన్నీ ఒక్కసారే చేశాడా?" అడిగాడుట.
అది తలూపిందిట. అంతే దాన్ని లాగి చెంపమీద ఒక్కటిచ్చాడట.
ఇది బిత్తరపోతూ చూస్తే, "ఎంత ధైర్యమే... అన్నీ అయిపోయాక ఇదే మొదటిసారి అన్నట్టు అమాయకంగా గదిలోకి పాలగ్లాసు తీసుకుని వస్తావా? కులటా... పాతకీ..." అంటూ నోటికొచ్చినట్టల్లా తిట్టాడట.
"అయ్యో....! మాట్లాడాను అంతే! ఇంకేం జరగలేదు" అని యిది ఎంత చెప్పినా వినకుండా, "నాకు ఇందాక నువ్వు ఎదురు చెప్పకుండా అలవాటుగా నాతో వున్నప్పుడే అర్ధమైంది నీకిది మొదటిసారి కాదని!" అని తనూ ఏడవడం మొదలుపెట్టాడట.
ఇలా తెల్లవార్లూ అది బతిమిలాడటం, అతను కొడుతూ తిడుతూ, హింసించడంతో గడిచిపోయిందట.
"సుమతీ! నువ్వుమాత్రం రేపు నీకు కుమార్ తో పెళ్ళికాకుండా వేరోకడితో అయితే మాత్రం.... ఆ సంగతి తను ఎంత బలవంతపెట్టినా చెప్పకు" అని చిన్నక్క చెయ్యి నెత్తిమీద పెట్టుకుని ప్రమాణం చేయించుకొంది.
శక్తిమతికి అక్కని కొట్టి బావ ఎందుకు ఏడుస్తున్నాడో చచ్చినా అర్ధం కాలేదు. ఏడ్చే మొగవాన్ని చచ్చినా నమ్మకూడదు అనిమాత్రం అనిపించింది.
"మరెలా? రేపు నిన్ను తనతో తీసుకెళ్ళి ఏలుకుంటాడటా?" బాహ్యంగా అడిగింది చిన్నక్క.
నేను ఆవలిస్తూ, "ఇంకో పదివేలు ఎక్కువిస్తే మహారాజులా ఏలుకుంటాడు. కక్కుర్తి పక్షి" అన్నాను.

 Previous Page Next Page