Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 9

చిన్నక్కకి ఈ హడావుడిలోనే పెళ్ళిచూపులు జరిగాయి. ఈయనగారు చాలా మోడ్రన్ అని ఫీలైపోతూ ఏదో హోటల్ లో అరేంజ్ చేయమన్నాడు. నాన్న అలాగే చేశారు. దాన్ని తీసుకుని డేటింగ్ టైప్ లో ఒక రోజంతా వుంచుకుని సాయంత్రం తీసుకొచ్చి దింపి వెళ్ళిపోయాడు. రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చెయ్యలేదు.
ఓ సైకిల్ కొనాలన్నా ఇలా ఒక రోజంతా వాడుకుని 'బావుంటే కొనుక్కుంటాం' అంటే షాపువాడు తంతాడు. కానీ ఆడపిల్లతండ్రి వూరుకోవాలి.
ఓ మూడురోజుల తర్వాత వాళ్ళ తరపు మధ్యవర్తి కట్నకానుకల వివరాలతో మా ఇంటికొస్తే సంబంధం నిశ్చయం అయిందని మా నాన్న సంతోషించాడు.
ఈయనగారు పెద్దాయన కన్నా మూడాకులు ఎక్కువే చదివినట్లు మూడులక్షలు కట్నంగా అడిగాడు. ఏమీ చెయ్యలేక నాన్న ఒప్పుకున్నాడు.
వెంటనే పెద్దబావ అగ్గిమీద గుగ్గిలం అయి పెద్దక్కని చావదన్ని పుట్టింటికి తరిమేశాడు. కారణం చిన్నబావ 'క్లర్క్' మాత్రమేనట. ఆయనేమో ఆఫీసర్. అలాంటివాడికి తనకన్నా డబుల్ కట్నం ఇవ్వడం ఆయన సహించలేక పోయాడు.
ఈ ఉపద్రవం నాన్న ఊహించనిది. ఆడపిల్లల తండ్రులందరూ ఇలాంటి విషయాలపట్ల జాగరూకులై వుండాలి. ఇంకో అల్లుడు రాగానే పెద్దల్లుళ్ళకి తన పెళ్ళిలో వాడిన కాళ్ళు తుడుచుకునే పట్టానుంచి పట్టు ఉత్తరీయం వరకూ అన్ని విషయాల్లో కంపారిజన్ వచ్చేస్తుంది.
చిన్నక్క పెళ్ళిలో పెద్దబావకి బట్టలకనీ, దానికనీ వంకచెప్పి నాన్న ఇంకో పదివేలు ముట్టజెప్పి శాంతింపజేశాడు.
పెద్దక్క దృష్టిలో చిన్నక్క చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే దీనికి అత్తా, ఆడబిడ్డలు ఎవరూ లేరు. పెళ్లవుతూనే విడికాపురం పెట్టొచ్చు.
కానీ పెళ్ళిలో చిన్నబావ తిక్క చూశాక 'ఈయనొక్కడు చాలు వాళ్ళందరి పెట్టు' అనిపించింది. ఆయనతో వంగివంగి మాట్లాడి నాన్నకి గూని వచ్చింది. చిన్నక్క శోభనం పెద్దహోటల్ రూం బుక్ చేసి జరిపించారు.
మర్నాడు పెద్దక్క అడిగింది "ముందు జరిగిన ప్రేమాయణం సంగతేం అడగలేదు కదా!" అని.
చిన్నక్క నవ్వి "నీకు జరిగిన అనుభవం నేను మరిచిపోలేదు. నేను పెదవి విప్పలేదు. నేనూ చెప్తాను కావాలంటే.... అని ఆయన రెండుమూడు ప్రేమలీలలు చెప్పాడు. ఫ్రాంక్ గా వుండకపోతే నేను క్షమించను. వయసొచ్చాక ఎవరో ఒకర్ని తప్పక ప్రేమించకుండా వుంటామా..చెప్పేద్దూ...' అని బలవంతపెట్టినా నేను చెప్పలేదు" అంది.
దాని తెలివితేటలకి మేం ఇద్దరం మెచ్చుకున్నాం.
చిన్నబావ దాన్ని కాపురానికి తీసుకెళ్ళాక దాని దగ్గరనుంచి తను బావున్నట్లుగా వచ్చిన ఉత్తరం చూసి అంతా సజావుగా జరిగిపోతుందనుకొని తృప్తిపడ్డాం.
ఇంతలో మొదటి పండగొచ్చింది.
నాన్నగారు ఇద్దరళ్ళుళ్ళనీ పండక్కి పిలిచారు. ఇద్దర్నీ సమానంగా చూస్తున్నా "ఎంతైనా పెద్దల్లుడంటే పెద్దపాలేరు బతుకేగా...!" అంటూ సణుగుతూనే పెద్దబావ మర్యాదలు చేయించుకున్నాడు. చిన్నబావ పెద్దబావ ముందు పెద్ద రసికుడిలా ఫోజులు కొడుతూ చిన్నక్క తలలోకి బుట్టెడు పూలు తేవడం, తను పెర్ ఫ్యూమ్స్ స్ప్రే చేసుకోడం చేసేవాడు. తల్లి పెంపకంలో డాబుసరంటే ఏమిటో తెలీకుండా పెరిగిన పెద్దబావకి ఇవన్నీ చూస్తూ ఇన్ ఫీరియార్టీ కాంప్లెక్స్ పెరిగిపోయి పెద్దక్కని చితకతన్నే వాడు.
మొత్తానికి పండగ ఘట్టం అయిందీ అని వూపిరి పీల్చుకోబోయే తరుణంలో భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది.
'అందరం కలిసి సినిమా కెళదాం' అనే ప్రపోజల్ పెట్టాడు మా పెద్దబావ. ఆయనకి మావగారింటికొస్తే ఇలాంటి కోర్కెలు పిలకలేస్తాయి. తప్పేదేముంది? నాన్నగారు టిక్కెట్లు తెప్పించారు. చిన్నబావ "శక్తి కూడా రావాలి" అని డిమాండ్ చేశాడు. నాతో సరసాలాడడం తన రైట్ అనుకుంటాడాయన ఎన్నోసార్లు అక్కడా ఇక్కడా తగలాలని ప్రయత్నించి నా చురకలలాంటి చూపులకి జంకి వెనక్కి తగ్గుతాడు.
"నేను రాను" కరాఖండిగా చెప్పాను.
"ఎందుకు రావూ? శక్తి రాకపోతే ప్రోగ్రామ్ కాన్సిల్ చెయ్యాల్సిందే బావగార్ని అడుగుతున్నానన్న మర్యాదకూడా లేదా?" అని గొడవ చేశాడు.
అంతా సవ్యంగా జరుగుతుంటే ఎందుకీ రసాభాస అన్నట్లు నాన్నగారు "పోనీ వెళ్లిరా తల్లీ!" అని నన్ను అర్ధింపుగా చూశారు.
ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాక ఆయన చూపులలో అర్ధింపూ, మాటల్లో వినయం తప్ప మరోగుణం కనిపించడంలేదు.
తప్పక నేనూ బయల్దేరాను.
ఆడవాళ్ళందర్నీ ఒక దగ్గర కూర్చోమని ఈ మగమహారాజులు పాన్ షాప్ దగ్గర నిలబడి సిగరెట్లు వెలిగించుకొని వచ్చేపోయేవాళ్ళని చూడనారంభించారు.
మేం ముగ్గురం ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటుండగా, "హలో... సుమతీ" అన్న పలకరింపు వినిపించింది.
చూస్తే.... కుమార్!
మా గుండెల్లో బాంబు పేలినట్లయింది.
"సుమతీ...ఎంతకాలం అయిందీ నిన్ను చూసి! బావున్నావా?" అంటూ దగ్గరకొచ్చాడు.
చిన్నక్క కళ్ళు వెంటనే భయంభయంగా భర్తకోసం వెతికాయి.
ఆయన అక్కడ నిలబడి ఓ చుడీదార్ అమ్మాయిని అన్ని ఏంగిల్స్ లో చూడటంలో బిజీగా వున్నాడు.
చిన్నక్క కుమార్ వైపు చూడటంలేదు. కుమార్ మాత్రం "ఇదివరకటి కంటే బావున్నావు సుమతీ.... పెళ్ళయిందా?" అన్నాడు.
చిన్నక్క  కోపంగా "అయింది నీతో మాట్లాడటం కూడా నాకు అసహ్యం. దయచెయ్యి నీ మొహం నాకు చూపించకు" అంది.
"అలా అనకు సుమతీ, నీతో గడిపిన ప్రతిక్షణం నన్ను వెన్నాడుతోంది. నిన్నెంతగానో ప్రేమించి పొందలేకపోయిన అభాగ్యున్ని..." అంటూ దగ్గరకు రెండడుగులు వేశాడు.
చిన్నక్క ఏదో అనబోతుండగా "ఈయన ఎవరూ...?" అంటూ చిన్నబావ వచ్చాడు.
"ఈయన...ఈయన..." అని అది నీళ్ళు నమిలింది.

 Previous Page Next Page