Previous Page Next Page 
నిశాగీతం పేజి 7


    "అనంతమ్మ అలా కూర్చుని వున్నప్పుడు  ఆమె పెళ్ళిచెయ్యాలి."
    ఆ వృద్దుడితొపాటు అప్పుడే బయటకు వచ్చిన అతని భార్యకూడా  తృళ్ళిపడింది.
    "పెళ్ళితంతు పూర్తిగా  జరిపించాలి. చెయ్యవలసిన విధానం నేను  చూపిస్తాను. మీరు గాభారపడకండి. ఆమెకు నిజంగా  పెళ్ళి జరుగుతున్నట్టు భ్రమ  కలిగించాలి. మీరు చాలా  జాగ్రత్తగా  వుండాలి."
    డాక్టర్  మాటలకు వృద్ధ దంపతులిద్దరూ తలలూపారు.
    "ఇదిగో ఈ టేప్ చూడండి. ఇందులో పెళ్ళి తంతంతా రికార్డు అయివుంది. బాజా బజంత్రీల హంగామా  వుంది. పెళ్ళి  మంత్రాలున్నాయి. వివాహక్రతువంతా  వుంది. ఈ టేపు  పూర్తికాగానే పెళ్ళితంతు పూర్తి  అయిందనే  భావంతో మీ అమ్మాయి లేచి  నిల్చుంటుంది. అప్పుడు మీరు  చాలా జాగ్రత్తగా నటించాలి. అంతకుముందే పెళ్ళి జరిగినట్టూ, అప్పుడే  పెళ్ళి పీటల  మీదనుంచి  లేచినట్టూ భావన  కలిగేలా నటించాలి."
    ఆ తల్లిదండ్రులు ఒకరి ముఖంలోకి ఒకరు ఓ క్షణం చూసుకున్నారు.
    "అది సరే  డాక్టర్ గారూ! నా భర్త  ఏడని అమ్మాయి  అడిగితే?" అనంతమ్మ తండ్రి సందేహాన్ని వెలిబుచ్చాడు.
    డాక్టరు ఉదయచంద్ర చేతి వాచీ  చూసుకున్నాడు. ఏడున్నర  అయింది. ఎనిమిది గంటలకు క్లబ్బులో బిలియడ్స్ మ్యాచ్ వుంది.
    "చెప్పండి బాబూ!"
    "ఏమిటి?"
    "అమ్మాయి నా భర్త ఏడీ? ఎక్కడ అని అడిగితే?"
    "అదా? పెళ్ళికి తరలివస్తున్న పెళ్ళికొడుకు రైలు ప్రమాదంలో  మరణించాడు. కాని మీ అమ్మాయి  మనసుకు సంబంధించినంత వరకు  అది జరగలేదు. తన మెడలో  మంగళసూత్రం  కట్టడానికి  ఇంకా  అతడు  తరలి వస్తున్నాడనే భావం మాత్రం వుంది. మరోవైపు తనకు పెళ్ళయి పోయిందనీ, తను భర్తతో కాపురం చేస్తున్నాననీ ఆమె అనుకుంటూ వుంది అని ఆగాడు ఓ క్షణం డాక్టర్.
    అనంతమ్మ తల్లి కొంగుతో కళ్ళు వత్తుకుంది. అనంతమ్మ తండ్రి డాక్టరు చెప్పబోయే విషయాలు వినడానికి సిద్దంగా అతడి ముఖంలోకి చూశాడు.
    "మీ అమ్మాయి మనసులో నాటుకుపోయిన ఈ రెండు భావాలూ వాస్తవ దూరం అయినవి కావు. పెళ్ళికాక ముందున్న స్థితికి, తర్వాత స్థితికీ  మధ్యవున్న  కాలమూ__ఆ కాలంలో  జరిగిన  దుర్ఘటన......అంటే  పెళ్ళికొడుకు రైలు ప్రమాదంలో చనిపోయాడనే వాస్తవాన్ని అంగీకరించడానికి అనంతమ్మ మనసు  ఎదురుతిరుగుతోంది. ఆమె  మనసు నిజాన్ని నిరాకరిస్తోంది......"
    "అవును బాబూ!"
    "మధ్యలో మాట్లాడకు " అనంతమ్మ తండ్రి భార్యను మందలించాడు.
    ఉదయచంద్ర తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు.
    "ఎవరైనా  వాస్తవం చెప్పడానికి ప్రయత్నిస్తే  ఆమెవాళ్ళు తనను మోసం చేస్తున్నట్టుగా  భావిస్తున్నది. వాళ్ళను అనుమానిస్తోంది. అనుమానం అవిశ్వాసానికి దారితీస్తుంది. ఆమెలో  నమ్మకం కలిగిస్తేగాని ట్రీట్ మెంట్  పని చెయ్యదు.ఆమెను  మనలోకి  తెచ్చుకోవాలంటే కొంతదూరం  ఆమెతో మనలోకి తెచ్చుకోవాలంటే  కొంతదూరం ఆమెతో మనం కూడా  నడవక  తప్పదు. మీ అమ్మాయి  ఆరోగ్యం  బాగుపడాలంటే మీరు  నేను  చెప్పినట్టు చెయ్యాలి."
    అనంతమ్మ తల్లి దండ్రులు తలలు  ఊపారు.
    "మీరెళ్ళి మీ అమ్మాయి  దగ్గర  కూర్చోండి. నేను ఈ  టేప్ పెడ్తాను. మాంగల్యం ధారణ. తలంబ్రాలు  కాగానే అనంతమ్మ లేచి నిల్చుంటుంది. మీరు  ఆమెకు  అప్పుడే  పెళ్ళి జరిగినట్టుగా  నటించాలి. ఆమెమనసు వాస్తవాన్ని అంగీకరించినట్టు నటించాలి."
    అనంతమ్మ తండ్రికి అంతా  అయోమయంగా  వుంది.
    "ఒకవేళ అమ్మాయి అలాగే కూర్చుంటే  మేము ఏం చెయ్యాలి?"
    "టేప్ పూర్తి  అవడానికి తొంభై నిముషాలు పడ్తుంది.ఈ లోపల  నేను తిరిగివస్తాను" ఉదయచంద్ర టేప్ ఆన్ చేసి  బయటికి వెళ్ళిపోయాడు. అతను క్లబ్సునుంచి  తిరిగి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది. అంత ఆలస్యం అవుతుందనుకోలేదు.
    వరండాలో మెట్ల ప్రక్కగా  స్టూలుమీద బాయ్ కూర్చునివున్నాడు.
    ఉదయచంద్ర మెట్లెక్కుతూ అనంతమ్మ గురించి ఆలోచిస్తున్నాడు.
    ఇంకా అనంతమ్మ అలాగే  కూర్చుని వుందా? గదిలో లైటు వెలుగుతోంది. తను అలా  రోగిని వదిలి  వెళ్ళాల్సింది కాదు. బిలియడ్స్  మ్యాచ్ కి కమిట్ అయి వుండటంవల్ల వెళ్ళాక తప్పలేదు అసలు  తను ఈ ఎక్స్  పెర్  మెంటు  ఇవ్వాళ  చేసి  వుండాల్సింది కాదు.
    తల వంచుకొని అలాగే కూర్చుని  వున్న అనంతమ్మను చూస్తాననే  ఆలోచనలో వున్న ఉదయ్ తృళ్ళిపడ్డాడు.
    అక్కడ అనంతమ్మ  లేదు.
    ఆమె స్థానంలో మానసి కన్పించింది.
    ఆమెను చూస్తున్న  ఉదయ్ కు మనసు  కలచినట్టుగా అయింది.
    "మానసీ!"
    ఆమె  విన్నది. కాని తనను  కానట్టే ఉండిపోయింది. అంతలో  మానసి  తండ్రి శివరామయ్య లోపలకు వచ్చాడు.
    "మళ్ళీ  ఎప్పట్నుంచీ?"
    "రెండు  రోజులైంది మళ్ళీ  గతంలో మాదిరిగానే....ఇంకా  ఉధృతంగా....."
    "ఎప్పుడొచ్చారూ?" శివరామయ్యను ఆగమన్నట్టు సైగ  చేస్తూ  మాట మార్చాడు.
    "ఇప్పుడే  పది నిముషాలైంది."
    "సరే! మీరెళ్ళిబయట  కూర్చోండి. నేను  మానసితో మాట్లాడాలి."
    "నేనీ లోపల ఏ రూమ్ ఖాళీగా  వుందో చూసోస్తాను." శివరామయ్య బయటికి వెళ్ళాడు.
    డాక్టరు కొద్ది క్షణాలు మనసిని చూశాడు పరిశీలనగా.
    "మానసీ!" లాలనగా పిల్చాడు.
    "ఊఁ"
    "ఏమైంది?"
    "వాడు మళ్ళీ వచ్చి...."
    "ఆగిపోయవేం? చెప్పు వచ్చి?"
    "చంపుతానని బెదిరించాడు."
    "బెదిరింపేగా?" తేలిగ్గా తీమకున్నట్టుగా అన్నాడు.
    "ఏం? వాడు నన్ను  నిజంగానే  చంపేయాలని మీకుందా?"
    ఉదయచంద్ర తృళ్ళిపడ్డాడు.
    "అదికాదుమానసీ....వాడు నిన్నేమీ  చెయ్యలేడని నాకు  తెలుసు. ఊరికే  నిన్ను బెదిరిస్తున్నాడు. భయపెడ్తున్నాడు."
    "కాదు. మీకు తెలియదు వాడు నిజంగానే  నన్ను చంపుతాడు."
    "అలా ఎందుకనుకోంటున్నావ్?"
    "అనుకోవడమేమిటి డాక్టర్?"
    "నా ప్రశ్నకు సమధానం ఇవ్వలేదు."
    "ఏం ప్రశ్న?"
    "అదే అతడు నిన్ను  చంపుతాడని ఎందుకనుకొంటున్నావ్?" రెండు నిముషాలు  మౌనంగా కూర్చుంది. ఆమె ముఖంలోనే  ఆత్రుతగా చూశాడు డాక్టరు.
    "వాడికి నామీద కోర్కె వుంది."
    ఉదయచంద్ర ఆశ్చర్యంగా  ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె  చూపులు నిలకడగా లేవు.
    "అని నీకు  చెప్పాడా?"
    "అలా చెప్పే ధైర్యం వాడికి లేదు."
    "మరి వాడంటే  భయం  ఎందుకూ?"
    "ఎదురుపడే ధైర్యం వాడికి లేదు. కాని  వెనగ్గా వచ్చి...." మానసి  ఆగి రెప్పవాల్చకుండా సీలింగ్ కేసి చూడసాగింది.
    "చంపుతాడని భయమా?"
    "ఇంత త్వరగా చంపడు. నాకు తెలుసు."
    డాక్టర్ ఉదయచంద్ర తల తిరిగిపోయింది. ఈమె మానసిక స్థితి మొదటిసారి వచ్చినప్పటికంటె  అధ్వాన్నంగా  వుంది.
    "ఎప్పుడు చంపుతాడనుకొంటున్నావ్?" మానసి కళ్ళల్లోకి  సూటిగా చూస్తూ  అడిగాడు. ఆమె ముఖం  ఉద్వేగంతో ఎర్రబడింది.
    "వాడి కోరిక తీరాకే" ఎక్కడో దూరంగా  గాజుపెంకుల  మోతవిన్నట్లుగా చూసింది.
    డాక్టరు ఆలోచనలో పడ్డాడు.
    మళ్ళీ కేసు  మొదటికొచ్చింది. ఈరోజు  లాభంలేదు. తను ఇవ్వాళ ఈమెను టాకిల్ చెయ్యలేడు. చాలా  ఉద్రేకంలో వుంది.
    "సైకియాట్రిస్టు  ఫెయిల్  కావడానికి  ప్రధాన కారణం  పేషెంటును టాకిల్ చెయ్యడంలో అతడికి  ఓపిక  నశించడమే " అన్నాడు ఫ్రాయిడ్ శిష్యుడు, ప్రఖ్యాత సైకియాట్రిస్టు  అయిన డాక్టరు రిక్. తను ఈరోజు  బాగా అలసిపోయివున్నాడు. పైగా  పొద్దుపోయింది.
    ఆమెను  టాకిల్ చెయ్యడంలో కొంచెం  చిరాకుపడ్డా లాభంలేదు. ఆమెకు  తనమీద  నమ్మకం  ఏర్పడదు. మానసి   విషయంలోనే తను ఓపిక  చూపించలేకపోతే  తనింక  వైద్యం  ఏం చెయ్యగలడు?
    "డాక్టర్ ? వాడు నన్ను ఇంకా  ఎందుకు చంపలేదు?"
    "వాడి కోరిక  తీరలేదు  కనుక" అని ఆమె ముఖంలో  చూశాడు  డాక్టర్.
    "రైట్  యూ ఆర్  కరెక్ట్! డాక్టర్!" పకపక  నవ్వి  కూర్చుంది మానసి.
    ఆమె ఆలోచనలకూ, ఛాయలకూ కొంత దగ్గరగా  వెళ్తేగాని ఆమెలోని ఉద్వేగం  కొంత  తగ్గదని  భావించాడు డాక్టర్.
     ఆమెలోని  ఉద్రేకం  ఒక్కసారిగా పాలపొంగులా  తగ్గిపోవడాన్ని గమనించాడు. ఆమె రిలాక్స్  అయింది.
    "అసలు  అతడికి నీమీద కోర్కె లేదేమో!" సజెస్టివ్ గా అని ఆ ముఖంలోకి పరిశీలనగా చూశాడు.
    "అంటే? మీ ఉద్దేశ్యం నేను కావాలనే ఇదంతా చేస్తున్నాననా?" ఆమె కంఠస్వరంలో ఉద్రేకం లేదు. చాలా  మామూలుగా అడిగింది.
    డాక్టర్ కొంచెం కలవరపడ్డాడు. మానసిక  వ్యాధిగ్రస్తులు ఒకో సారి ఎంత  రేషనల్ గా  మాట్లాడతారో అతనికి తెలుసు.
    "అదికాదు  మానసీ! మన మనసులో కొన్ని భయాలు చోటుచేసుకుంటాయి. కారణాలు ఫలానా అని స్పష్టంగా తెలియదు. కారణాల తెలియనంతమాత్రాన ఆ భయానికి కారణాలు  లేవనుకోవడం పొరపాటు" కొంచెం ఆగి మళ్ళీ  అందుకొన్నాడు.
    "ఆ భయాలకూ, అనుమానాలకూ, సందేహలకూ తప్పకుండా  ఏవేవో కారణాలు  ఉండేవుంటాయి."
    "ఇప్పుడు  నేను అలాంటి మానసికస్థితిలో వున్నాననేగా మీ అభిప్రాయం?"
    "కాదు."
    ""మరి?"
    "ఉండవచ్చునేమోనని....."సర్దుకున్నాడు.
    మానసి  తనలోతానే ముసిగా నవ్వుకుంది. మరుక్షణంలో ఆమె కళ్ళల్లో  ఏదో భయం  ముఖంలో ఉద్రేకం.
    "డాక్టర్......"
    "యస్. చెప్పు"
    "మొన్నరాత్రి ఏం జరిగిందో తెలుసా?"
    "ఏం జరిగింది మానసీ" కుర్చీలో ముందుకు జరిగి వంగి, అడిగాడు డాక్టర్.
    "బాత్ రూంలో విడిచి పడేసిన నా లంగా  తీసుకెళ్ళి దొడ్లో పారేశాడు. అంతకుముందు రోజు మానసీ" కుర్చీలో గదిలోనుంచి నా బ్రా  తీసుకెళ్ళాడు."
    డాక్టర్ కుర్చీలో వెనక్కు వాలిపోయాడు.  కథ మళ్ళీ  మొదటి  కొచ్చింది. ముందు చీర రవికా. తర్వాత  అండర్  గార్మెంట్సు, కుదిరిందనుకొన్న జబ్బు ముదిరింది. మొదటికంటే ఉధృతంగా  వుంది.
    "మీరు నమ్మడంలేదు కదూ?"  

 Previous Page Next Page