Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 7

 

    పాపం! అమ్మా అలా చెప్పడానికి ఎంత మానసిక వ్యధను అనుభవిస్తుందో? అమ్మను ఎవరో మోసం చేశారు. అందుకే ఆమె అరుణ విషయంలో అంత గట్టిగా నిలబడింది.
    ఇందుమతితండ్రీ, ఆ గౌతమ్ తండ్రీ ఒక్కడే అన్నమాట!
    అయితే అన్నయ్య వివాహం అభ్యంతరం కాదు. అన్నయ్య ఆమెకు స్టెప్ బ్రదర్ కాదు. తన ప్లానంతా తల్లక్రిందులయ్యింది.
    ఇక తను వాళ్ళను ఏమీ చెయ్యలేడు. తను ప్రేమించిన ఇందుమతి తన కళ్ళ ముందే తన అన్నతో కాపురం చేస్తుంటే చూడాలి. నో! నో! అలా జరగడానికి వీల్లేదు. జరగదు గాక జరగదు.
    జరక్కుండా తనేం చెయ్యగలడు?
    ఏదైనా చెయ్యాలి.
    రవిలో దెబ్బతిన్న ప్రేమ ద్వేషంగా మారి బుసలు కొట్టసాగింది.
    ఇందుమతి పెళ్ళి గౌతమ్ తో జరుగుతుంది. తన అన్న గౌతమ్ తో కాదు- ఆ రెండో గౌతమ్ తో.
    ఎలాగయినా అతణ్ణి కలుసుకోవాలి. రాత్రి ఇక్కడ ఉన్నాడంటే , ఈ ఊళ్ళోనే ఉంటున్నాడెమో?
    రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు? మరి ఇంత కాలం ఎందుకు రాలేదు?
    అతనికి ఈమధ్యే తన జన్మ రహస్యం తెలిసి వుండాలి. తనను కన్న తల్లి బ్రతికే ఉందని తెలిసి ఉండాలి. ఆమె ఎవరో కూడా తెలిసి ఉండాలి.
    అందుకే - అందుకే తనను కన్న తల్లిని చూడాలని వచ్చాడు.
    అతణ్ణి చూసి అమ్మ ఎందుకు భయపడిపోయింది.
    అతడి ద్వారా తన గత జీవితం అందరికీ తెలుస్తుందేమో అన్న భయమేనా?
    ఇరవై ఏడేళ్ళ తర్వాత తల్లిని చూడాలనే కుతూహలంతో వచ్చిన శాపగ్రస్తుడైన బిడ్డను చూసిన తల్లి మనసు ఆనందంతో త్రుళ్ళి పడదా? పుత్రపరిష్వంగ సుఖం కోసం ఆమె మనసు అర్రులు చాచాదా?
    ఆ అభాగ్యుడు తల్లిని గురించి ఎన్నెన్ని ఆశల్ని మనసు నిండా నింపుకొని వచ్చాడో?
    ఆలోచిస్తూనే రవి తెలతెలవారుతుండగా నిద్రలోకి జారిపోయాడు.
    అకస్మాత్తుగా ఎవరో వీపు మీద చరిచినట్టు తుళ్ళిపడి కళ్ళు తెరిచాడు రవి.
    ఫోన్ మోగుతోంది. చివ్వున లేచి ఫోన్ దగ్గర కెళ్ళాడు.
    "హలో ! ఎవరు?"
    "నేను రవీ .....విశ్వాన్ని...."
    "ఇంత పొద్దుటే ......" విసుగ్గా అన్నాడు రవి.
    చాలీ చాలని నిద్రలో ఒళ్ళంతా బిగిసిపోయినట్టుగా ఉంది. కళ్ళు ఇసుక రేణువు లున్నట్టుగా మోరమోరలాడుతున్నాయి.
    "ఓ.....సారీ! నీకు ఎనిమిదిక్కాని తెల్లవారదుగా? ఆరున్నర అయింది. ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలనే ఫోన్ చేశాను."
    "ఏమిటి?" బద్దకంగా అడిగాడు.
    "గౌతమ్ బెంగుళూరు వేళ్ళాడన్నావు గదూ!"
    "అవును, వెళ్ళాడు."
    "వెళ్ళలేదు."
    రవికి నిద్రమత్తు వదిలిపోయింది.
    "వెళ్ళాడు....." నొక్కి నొక్కి అన్నాడు.
    "రాత్రి నేను మీ అన్నయ్యను హోటల్ దక్కన్ లో చూశాను."
    రవి ఆలోచనలో పడ్డాడు.
    "అవును రవీ! మీ అన్నయ్య తాగుతాడని నాకు ఇంతవరకూ తెలియదు."
    "మా అన్నయ్య తాగడు."
    "మీ అన్నయ్యది స్పిట్ల్ పర్సనాలిటీ అయి వుండాలి."
    "అంటే?"
    "ద్వంద్వ వ్యక్తిత్వాలు....."
    "ఇంగ్లీషుకు తెలుగు అనువాదం అడగలేదు. అలా ఎందుకు భావిస్తున్నా నంటున్నాను. మా అన్నయ్య చాలా సోబర్ గా ఉంటాడు. మానసిక రోగాలేమీ లేవు."\
    "అతడు కావాలనే నటిస్తూ ఉండొచ్చును. మొత్తం మీద అతడికి మరో జీవితం ఉంది."
    "అంటే.....?"
    "మనం చూసే జీవితం కాక మరో చీకటి జీవితం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చెపుతూనే ఉన్నాను. నువ్వే నమ్మడం లేదు."
    "అసలు విషయం చెప్పు. ఎప్పుడు చుశావ్?"
    "రాత్రి ఒంటిగంట దాకా నేను ఆ హోటల్లోనే ఒక క్లయింట్ తో గడిపాను. మీ అన్నయ్య మాకు రెండు టేబుల్స్ అవతల మరో ఇద్దరితో కూర్చుని గ్లాసు తర్వాత గ్లాసు లాగించేశాడు."
    "అతడు నిన్ను చూశాడా?"
    "చూశాడు, కానీ గుర్తించనట్టే ప్రవర్తించాడు."
    "నిజంగానే గుర్తించలేదేమో!"
    "నాకూ అలాగే అనిపించింది. అందుకే స్పిట్ల్ పర్శనాలిటీ అన్నాను."
    "నీ గొడవ నీది. సైక్రియాటిస్టు ఫ్రెండు దొరికాడు. అప్పట్నుంచి మా ప్రాణాలు తోడేస్తున్నావు సైక్రియాట్రీ అంతా నీకు తెలిసిపోయినట్టు" విసుక్కున్నాడు రవి.
    "మరి నువ్వే అన్నావుగా అతడు నన్ను గుర్తించలేదని?"
    "అవును గుర్తించలేదు. నువ్వు అతడికి తెలియదు. అతను నువ్వనుకున్నట్లుగా మా అన్నయ్య కాదు. మా అన్నయ్య పోలికలతో ఉన్నవాడు మరొకడున్నాడు."
    "ఏమిటంత కచ్చితంగా చెపుతున్నావ్?"
    "అవును, మా అన్నయ్య బెంగుళూరులోనే ఉన్నాడు. అతడు నిన్న సాయంకాలం వరకు క్రికెట్ మాచ్ లో ఉన్నాడని నీకు తెలియదా?"
    "క్రికెట్ మాచ్ మూడున్నర కంతా అయిపొయింది. సాయంకాలం ఫ్లయిట్ లో వచ్చి ఉండవచ్చుగా? ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లోనే ఉంది దక్కన్ కాంటినెంటల్ .  తిన్నగా అక్కడికే వచ్చి ఉండొచ్చుగా?"
    రవికి అంతా అయోమయంగా ఉంది.
    "కాదు, అతడు మా అన్నయ్య కాదు. రాత్రి చాలా చిత్రమైన సంఘటన జరిగింది."
    "ఏమిటది?"
    "ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు వెంటనే వచ్చేయ్."
    "గంటలో వస్తాను."
    "ప్లీజ్, వీలయినంత తొందరగా వచ్చేయ్....." అని రవి ఫోన్ పెట్టేశాడు.
    రవి తయారై విశ్వం కోసం ఎదురు చూస్తూ అశాంతిగా లాన్ లో తిరుగుతున్నాడు. చేతి గడియారం చూసుకున్నాడు. ఎనిమిది అయింది.
    గేటు ముందు స్కూటర్ ఆగింది.
    మాలి పరుగెత్తి కెళ్ళి గేటు తీశాడు.
    రవి కూడా గేటు దగ్గర కొచ్చాడు.
    "వెళదామా?" అంటూ రవి గేటు బయటకి వచ్చాడు.
    "ఏమిటి, నన్ను లోపలకు కూడా రానివ్వవా?"
    "వెంటనే హోటల్ కు వెళ్ళి అతణ్ణి చూడాలి."
    "అతను మీ అన్నయ్యే. నా కళ్ళ మీద కూడా నీకు నమ్మకం లేదా?"
    "మాట్లాడావా?"
    "లేదు"
    "అతను మా అన్నయ్య కాదు. మా అన్నయ్య రాత్రి మూడు గంటలకు బెంగుళూరు నుంచి ఫోన్ చేశాడు.   

 Previous Page Next Page