Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 8

 

    విశ్వం గలగల నవ్వాడు.
    "హోటల్ దక్కన్ నుంచి ఫోన్ చేసి బెంగుళూరు నుంచి అని చెప్పలేడా?"
    రవి దిమ్మెరపోయినట్టుగా కొద్ది క్షణాలు చూశాడు.
    "నొ! నో! అతడు మా అన్నయ్య కాదు."
    "అదే చెప్పు --- ఎందుకలా అనుకుంటున్నావ్?"
    "రాత్రి జరిగింది ....."
    "ఏం జరిగింది?"
    "ముందు నాకో కప్పు వేడి వేడి కాఫీ కావాలి. ఆ తర్వాతే బండి నడుస్తుంది." అని రవికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలకు వచ్చాడు.
    ఇద్దరూ లాన్ లో కుర్చీలు వేయించుకొని కూర్చున్నారు.
    పని కుర్రాడు ట్రేలో కాఫీ కప్పులు తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు.
    "తొమ్మిదన్నర దాటిందనుకుంటాను. కిందనుంచి ఎవరో కెవ్వున అరిచినట్టుగా అనిపించి హడావుడిగా కిందకు వచ్చాడు. ఎదురుగా ఇందు...." అంటూ జరిగిందంతా క్లుప్తంగా చెప్పి "ఇప్పుడు చెప్పు. నువ్వు హోటల్ దక్కన్ లో చూసింది మా అన్నయ్యనే అంటావా?" అని అడిగాడు రవి విశ్వం ముఖం లోకి చూసి.
    విశ్వం ఆలోచనలో ఉండిపోయాడు. అతడి ముఖంలో సంభ్రమాశ్చర్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
    విశ్వం లేచి నిల్చున్నాడు.
    "చెప్పవేం?"
    "ఏమిటి?"
    "రాత్రి నువ్వు చూసింది మా అన్నయ్యనే అంటావా?"
    "చెప్పలేను , హోటలుకు వెళదాం పద!" అంటూ స్కూటర్ కేసి నడిచాడు.
    హోటల్ దక్కన్ రిసెప్షన్ కౌంటర్ దగ్గర కెళ్ళి మేనేజర్ ని అడిగాడు విశ్వం. విశ్వానికి ఆ హోటల్ మేనేజర్ బాగా తెలుసు. రిసెప్షనిస్టు మేనేజర్ ఊళ్ళో లేడని చెప్పాడు.
    "మాకో చిన్న ఇన్ ఫర్మేషన్ కావాలి" అన్నాడు విశ్వం.
    విశ్వం తరచుగా ఆ హోటల్ కి వచ్చే వ్యక్తుల్లో ఒకడనీ, మేనేజర్ పరిచయస్థుడనీ రిసెప్షనిస్టుకు తెలుసు.
    "చెప్పండి......" అన్నాడు రిసెప్షనిస్టు.
    "నిన్నగానీ, మొన్న గానీ గౌతమ్ అనే పేరుగల వ్యక్తీ ఈ హోటల్లో గది తీసుకున్నాడెమో చూడండి" అన్నాడు విశ్వం.
    "మీరు కూర్చోండి. నేను ఇప్పుడే వేరిపై చేసి చెపుతాను" అని రిసెప్షనిస్టు రిజిస్టర్లు తిరగెయ్యసాగాడు.
    "అవును గౌతమ్ అనే అతను మొన్న ఒంటిగంటకు వచ్చి గది తీసుకున్నాడు."
    "ఏదేది?" కుతూహలంగా విశ్వం రిజిస్టర్ మీదకు వంగి చూశాడు.
    "గౌతమ్ , గుంటూరు, అరండల్ పేట, నాలుగోలైను , మూడో అడ్డ రోడ్డు , ఇంటి నెంబరు 43 " అని చదువుతున్న విశ్వానికి అడ్డం వస్తూ "ఏదేది ? చూడనివ్?" అంటూ రవి తల దూర్చి రిజిస్టర్ లోకి చూడసాగాడు.
    "ఒక్కడే ఉన్నాడా గదిలో?" విశ్వం ప్రశ్నించాడు.
    "అవును"
    "ఇప్పుడు ఉన్నాడా?"
    "లేడు."
    "బయటికి వెళ్ళడా?"
    "ఉదయం ఆ గదిలో మరొకరు చేరిపోయారు. అతను తెల్లవారుజామున అయిదింటికే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు."
    "థాంక్యు!"
    "వెల్ కమ్!"
    విశ్వం రవి వైపు తిరిగి "వెళ్దాం పద" అన్నాడు.
    ఇద్దరూ మౌనంగా స్కూటర్ దగ్గరకు వచ్చారు.
    స్కూటర్ స్టార్ట్ చెయ్యబోయి ఆగాడు విశ్వం.
    "బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నావా?"
    రవి లేదన్నట్టుగా తల ఊపాడు.
    "అయితే పద. ఏమైనా తిందాం. నాకూ ఆకలేస్తుంది" అంటూ రెస్టారెంటు కేసి నడిచాడు విశ్వం.
    రవి యాంత్రికంగా అతణ్ణి అనుసరించాడు.
    బేరర్ కు ఆర్డర్ ఇచ్చి "ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావ్?" అని విశ్వం నవ్వుతూ రవిని అడిగాడు.
    "నీకూ మా అన్నయ్య మీద కసి తీర్చుకునే ఛాన్సు పోయింది " అన్నాడు రవి.
    "నీకు ఇందుమతి మీద కసి తీర్చుకునే ఛాన్సు పోయిందిగా?"
    "లేదు"
    "ఏం చేస్తావ్? గౌతమ్ అదే మీ అన్న గౌతమ్ - మనం అనుకున్నట్టుగా ఇందుకు స్టెప్ బ్రదర్ కాడు."
    "ఇందు పెళ్ళి ఆమె స్టెప్ బ్రదర్ తోనే జరుగుతుంది" రవి కంఠం దృడంగా పకిలింది.
    విశ్వం నోరు తెరచి రవి ముఖంలోకి చూశాడు.
    "ఏమిటలా చూస్తావ్?"
    "నువ్వన్నదేమిటో నీకు తెలిసే అన్నావా?"
    :ఇందు పెళ్ళి ఆమె స్టెప్ బ్రదర్ తోనే జరుగుతుంది. పెళ్ళి తంతు పూర్తీ అయాక అసలు విషయం తెలుస్తుంది."
    "నీకు మతి పోయింది."
    రవి నిర్లక్ష్యంగా నవ్వాడు.
    "మనం గుంటూరు వెళ్ళాలి" రవి అన్నాడు.
    "వెళ్ళి.....?"
    "కలిసి.....?"
    "ముందు కలుద్దాం. అతడు నిన్న రాత్రి ఇంటికి వచ్చాడంటే మా అమ్మను చూడటానికే వచ్చాడు. ఇందులో సందేహం లేదు."
    "అవును, నాకూ అలాగే అనిపిస్తుంది. ఆలోచిస్తే ఈ కుర్రాడే ఆ పసివాడనిపిస్తుంది." తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు విశ్వం.
    "ఈ కుర్రాడే అ పసివాడా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రవి.
    "అవును, నీకొక పేపరు కటింగు చూపించాను గుర్తుందా?"
    "అవును"
    "ఇతనే ఆ అమల కొడుకు. ఆ అమలే ఈ అన్నపూర్ణమ్మ."
    "అవును --నాకూ అలాగే అనిపిస్తున్నది."
    "ఆమెను పిచ్చాసుపత్రికి పంపించినప్పుడు ఆమె అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలే పిల్లవాణ్ణి పెంపుకు తీసుకున్నది కూడా పేపర్లో వచ్చింది. ఆ తర్వాత ఎలాగో మీ నాన్నతో పరిచయం అయి ఉంటుంది. ఆమె పేరు మార్చుకుంది. మొదటి కొడుక్కు -- అంటే మీ నాన్నతో వివాహం అయ్యాక పుట్టిన మొదటి కొడుక్కు -- ఆ బిడ్డ పేరే పెట్టుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఇద్దరి పోలికలు ఒకటి కావడం....."
    "అయితే ఈ గౌతమ్ కు....."
    "ఏ గౌతమ్ కు?" మధ్యలో అందుకుని తమాషాగా అడిగాడు విశ్వం.
    "మా అన్నయ్య మా నాన్న ఆస్తికి వారసుడే అన్నమాట."
    "మరి అంతేగా?"
    రవి ఆలోచిస్తూ ఉండిపోయాడు.
    "గుంటూరు ఎప్పుడు వెళ్దాం!"

 Previous Page Next Page