Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 6

 

    బహుశా అంటీ న్యూస్ విని వుంటుంది."
    ....."నేను వచ్చేదాకా అమ్మను జాగ్రత్తగా చూసుకో."
    "అలాగే ఉంటాను.' రిసీవర్ క్రెడిల్ చేసి వచ్చి సుందర్రామయ్య ముఖంలోకి టీజింగ్ గా చూసింది.
    "ఎవరమ్మా మాట్లాడింది?"
    "గౌతమ్."
    సుందర్రామయ్య ఆలోచనలో పడ్డాడు.
    "మీ కింకా గౌతమ్ బ్రతికే ఉన్నాడని నమ్మకం కుదరనట్టుందే?"
    "అదేనమ్మా ఆశ్చర్యంగా ఉంది. నీకు కనిపించాడాయే. ఊజా బోర్డు మీదకు పిలవగానే వచ్చాడాయే. ఒకవేళ ఇదీ గాలి చేష్ట కాదు కదా?"
    "నాన్నా!"
    "ఫరవాలేదు. ఆయనగార్ని మాట్లాడనివ్వండి" అన్నది ఇందుమతి.
    ఇందుమతి మనసు తేలిగ్గా ఉంది. సుందర్రామయ్యకు తాటాకులు కట్టాలని ఉంది. అతడి ,మాటలకు కోపం రాలేదు- నవ్వు వచ్చింది.
    "అయితే తాతగారూ ? ఇప్పుడు నాతొ మాట్లాడింది గౌతమ్ స్పిరిట్ అనేనా మీ అనుమానం?"
    "కావచ్చామ్మా! ఈ స్పిరిట్స్ ఎప్పుడు ఏం చేస్తాయో చెప్పలేం" కళ్ళు మూసుకొని దీర్ఘంగా నిట్టూర్చాడు.
    "అవి ఫోన్లో కూడా మాట్లాడతాయా?"
    "ఎందుకు మాట్లాడవు తల్లీ? నువ్వు అతడి ఫోన్ నంబరు అడిగావుగా? ఎంతట?"
    "చెప్పలేదు. ఎక్కడ్నుంచో మాట్లాడుతున్నానన్నాడు. రేపు వస్తాగా అన్నాడు."
    సుందర్రామయ్య ముఖం మళ్ళీ వికసించింది.
    "అయితే , అదే."
    "ఏది?"
    "అదే నీతో ఫోన్ లో మాట్లాడింది.
    "అదేమిటండి తాతయ్యగారూ. అతీత శక్తుల ధోరణిలో పడి జండర్ కూడా మర్చిపోయినట్టున్నారు. గౌతమ్ అబ్బాయి - అమ్మాయి కాదు." నవ్వుతూ అన్నది ఇందుమతి.
    సుందర్రామయ్య ఆమె మాట వినిపించుకోలేదు. అంతర్ముఖుడైనట్లుగా ఉండిపోయాడు.
    "రవీ! నువ్వింత పిరికివాడి వనుకోలేదు" అన్నది ఇందుమతి.
    రవి సిగ్గుతో మాట్లాడలేకపోయాడు.
    "సిగ్గుపడకు. అందులో నీ తప్పేం లేదు. అదంతా మా నాన్న గొప్పతనం. నీలాంటి విద్యవంతున్నే కొద్ది గంటల్లో ఇంత బలహీనుడ్ని చేసిన మా నాన్నను ప్రశంసించకుండా ఉండలేక పోతున్నాను" అన్నాడు నరసింహారావు.
    "రవీ! నువ్వంత బాధపడాల్సిన పని లేదు. స్థిరమైన అభిప్రాయాలు గల నాకే ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళాలంటే భయం వేసింది."
    రవి చివ్వున తలెత్తి ఇందుమతి ముఖంలోకి చూశాడు.
    "అవును! రవీ! నాకు నిజంగానే భయం వేసింది.
    "మరి భయపడలేదన్నావు?"
    "ఆ పరిస్థితిలో అంతకన్నా ఏమనగలదు?"
    "నాన్నా! ఇక వెళదాం పద!" అంటూ లేచి నిల్చున్నాడు నరసింహారావు.
    "ఇక చాలు బాబాయ్. నీ నమ్మకాలూ, నువ్వూ! నన్ను చంపేశావు. ఎంత భయపదిపోయానో? మరో గంట నరసింహారావు రాకపోతే నా తలలో నరాలు చిట్లేవి. ఇక ఆ విషయాలు మాట్లాడకండి. మీకు పుణ్యం ఉంటుంది" అన్నాడు రవి.
    సుందర్రామయ్య లేచి యుద్దంలో ఓడిపోయిన సిపాయిలా కొడుకు వెనకే నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు.
    ఇందుమతి లేచి అన్నపూర్ణమ్మ గదిలోకి వెళ్ళింది.
    రవి కూర్చున్న సోఫాలోనే వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు.
    తన అనుమానం ఈరోజు నిజంగా మారింది.
    ఇందు చూసింది ఆ రెండో గౌతమ్ ను అన్నమాట!
    ఆ సర్టిఫికేట్ లోని డేట్ ఆఫ్ బర్త్ అతడితే అయి వుండాలి. అమ్మకు అమల అక్కయి ఉండాలి. అక్క చెల్లెళ్ళ పోలికలు ఒకటిగా ఉండటంతో ఇద్దరి కొడుకులూ ఒకే పోలికలో పుట్టారు.
    ఇది సంభవమా?
    అమ్మ అమల కాదు.
    ఆ విశ్వంగాడు ఇది మాత్రం అబద్దం చెప్పాడు.
    గౌతమ్ తన సొంత అన్న అని చెప్తే తనకు సాఫ్ట్ కార్నర్ ఉంటుందని భావించాడు. అందుకే ఇలాంటి అబద్దం చెప్పాడు.
    గౌతమ్ నిజంగా చచ్చిప్పోయాడు. అనుకొన్నప్పుడు తనకు దుఃఖం వచ్చిన  మాట నిజమే. చాలా బలవంతంగా దుఃఖాన్ని దిగమింగాడు. అన్నయ్య బ్రతికే ఉన్నాడనే న్యూస్ రావాలి - రావాలి - అని పదే పదే మనసులో అనుకొన్నాను.
    గౌతమ్ యన సొంత అన్నయ్య.
    మరి అతను?
    తన పిన్ని కొడుకు.
    "అంతే! అంతే!
    నిద్రలోకి జారిపోయాడు రవి.


                                                             2

    సుందర్రామయ్య అతీత శక్తుల గురించి చేసిన బోధల ప్రభావం రవి మనసు మీద బాగానే పడింది. అతడికి తన గదిలోకి వెళ్ళి పడుకో వాలంటే భయం వేసింది. అందుకే హల్లో ఉన్న సోఫాలో కూర్చుని వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు.
    తెల్లవారుజాము నాలుగు గంటలైంది. రవికి ఎనిమిది గంటల వరకు నిద్రపోయే అలవాటు.
    కళ్ళు మండుతున్నాయి. బుర్ర ఆలోచనలతో గజిబిజిగా ఉంది. చిక్కుపడిపోయిన దారపు కండేలా వుంది అతడి మెదడు.
    అన్నయ్య ఫోన్ చేశాడు. అంతవరకూ సుందర్రామయ్య హడలగొట్టేశాడు. ఇందుమతి పూర్తిగా నమ్మకపోయినా, ఆమె కళ్ళలో ఏదో భయం రెపరెప లాడటం తనకు స్పష్టంగానే కనిపించింది.
    ఇందుమతి చూసింది తన అన్నయ్య గౌతమ్ ను కాదు. అతడి ప్రేతాన్నీ కాదు. మరో వ్యక్తిని ఆమె చూసింది. అతడు అచ్చం తన అన్నలాగే ఉన్నాడు.
    అంటే తన అన్నయ్య గౌతమ్ ను పోలిన మరో వ్యక్తీ ఉన్నాడు అతడి పేరు కూడా గౌతమ్.
    ఎవరతను? రాత్రిపూట ఈ ఇంటికి ఎందుకోచ్చాడు? అతణ్ణి చూసి అమ్మ ఎందుకు అంత స్కేర్ అయింది?
    అతడు అమల కొడుకు గౌతమ్. విశ్వం సంపాదించిన వివరాలన్నీ ఆ గౌతమ్ కి సంబంధించినవే. మొదటి నుంచి తనకు అనుమానంగానే ఉంది. విశ్వం తెచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ గౌతమ్ వయసు ఇరవై ఏడేళ్ళుండాలి. తన అన్న వయసు ఇరవై నాలుగు. అంటే గౌతమ్ కంటే ఆ గౌతమ్ మూడేళ్ళు పెద్ద.
    అమల ఎవరు? అన్నపూర్ణమ్మే అమల. అంతే! అందుకే ఆ పోలికలు! అమ్మ తనతో చెప్పింది అబద్దం. అమల తన అక్క అని చెప్పింది. ఆ పరిస్థితిల్లో ఏ స్త్రీ అయినా అబద్దమే చెపుతుంది. చెట్టంత కొడుకుతో తనకు అవివాహితగానే ఒక కొడుకు పుట్టాడనీ , వాడు ఎక్కడో పెరుగుతున్నాడనీ ఏ తల్లీ చెపుతుంది?

 Previous Page Next Page