'నేను పార్ధసారధిని......విజయప్రసాద్ పంపారు'
'ఓహో! బావున్నాడా నాయనా మావాడు. వాడిని చూచిచాలా రోజులైంది.....మా అమ్మాయి సుభద్రబావుందా!'
'బావున్నారండి మిమ్మల్నందర్నీ అడిగామని చెప్పమన్నారు.'
'మంచిదినాయనా......ఆ.....ఏమైనా పిల్లలా బాబూ!'
'మొన్ననే ఓ కుమారుడు కలిగి పోయాడండీ!' విచారంగా అన్నాడు సారధి.
'శివ! శివా!! భగవంతుడు పిల్లలపైన అనురాగంచూపేవారికి సంతానం ఇవ్వడు నాయనా! ఒక్కో తల్లి సంతానంకోసమై ఎంతో అలమటిస్తూ వుంటుంది. పరాయి పిల్లల్ని చూసి కలలు కంటూ వుంటుంది. అలాంటి పుణ్యవతికి సంతానం ఇవ్వడు భగవంతుడు.......పోనీలేబాబూ.....ఆమె అయినా బాగావుందా? ఆరోగ్యం ఎలావుంది'
'ఆరోగ్యంగానే వున్నారండి'
తర్వాత ఏమీ ప్రశ్నించ లేదు.
ఏమీ మాట్లాడుకోకుండా కొద్దికాలం గడిచిపోయింది.
ఆయనే అడిగారు చివరికి.
'ఇంకా విశేషాలు ఏమిటి బాబూ'
'ఏమీ లేవండి.....'
ఒక్క క్షణం ఆగి అన్నాడు సారధి.
'మీకూతురు సుశీలని పిలుచుకురమ్మని పంపారు.
ఆమె ఏదో చదువుతున్నారటకదా? ఇక్కడ అయితే చదువుసాగదనే ఉద్దేశ్యంతో పిలుచుకుని రమ్మన్నారు విజయప్రసాద్ గారికి రావటానికి అవకాశంలేక నన్ను పంపారు' తన భాద్యత అయిపోయిందన్నట్లు చెప్పవలసింది చెప్పి ముగించి మౌనంగా కూర్చున్నాడు సారధి.
రామారావు గారు ఏమీ మాట్లాడలేకపోయాడు. గుండెల్లో కదలిన బాధకన్నీరు రూపంలో రాబోయింది.
దానిని అలాగే లోలోపలే అణిచివేశారు.
కొద్దిసేపు ఆగి అన్నారు.
'చూడు బాబూ......ఇంట్లో లక్షలు మూలుగుతూ వుంటాయ్ కొందరికి......కానీ సామాన్యమానవుడు అనుభవించే ఆనందమూ అనురాగమూ తద్వారా లభించేసుఖమూ శాంతీ ఆ మానవుడికి లభ్యం కావు-ఒక్క రైతుపాతిక ఎకరాల మాగాణిచేస్తాడు. చివరికి అన్నీ తీరాక అతను తినటానికి గింజలు మిగలవు-అలాంటి దౌర్భాగ్యుడినే నేను టీచరుగా ఉద్యోగం చేస్తూ కన్నకూతురుకు చదువు చెప్పించలేని దద్దమ్మ నయ్యాను.....మనసు చెప్పేది ఒకటి.....మాట చెప్పేది మరొకటి.
ఆదర్శానికీ ఆచరణకీ లంగరందక కొట్టుమిట్టాడుతున్న అసమర్దుడిని నాయనా నేను. భగవంతుని చల్లని నీడలో ఓ ప్రసాదం నిర్మించుకోవాలని పునాదులు వేసుకున్నవాడికి వరదల్లో అంతా పోయి పూరి గుడిసెకు తాటాకులు కూడా దొరకకుండా పోయే దుస్థితి వచ్చినట్టుగా జీవితం అంతా అస్తవ్యస్తంగా తయారైంది......'
ఒక్కక్షణం ఆగాడు. ఆ క్షణంలో మనసుని సంబాళించుకుని అన్నాడు.
'అలాగే బాబూ.....సుశీలని తీసికెళ్ళుదువుగానీలే.....ఏదోదైవకృపతో అల్లాగైనా ఆ అమాయకురాలి కోరిక నెరవేరితే అంతే చాలు.....ఈ పూట ఇక్కడే భోం చేసి మధ్యాహ్నం వెడుదురు గాని.
మౌనం అంగీకారంగా తెలిపాడు ఆయనవసారాలోంచి లేచి ఇంట్లోకి వెళ్లారు. అయిదు నిమిషాలు కాకముందే ఇంట్లోంచి మెల్లిమెల్లిగా వాగ్యుద్ధం మొదలైంది. వినకూడదని సభ్యత ఎంత చెపుతున్నా తప్పని సరి అయి సారధి చెవులు ఆ యుద్దాన్ని లీలగా ఆలకిస్తున్నాయ్. పదినిమిషాలు గడిచాక ఓ ముప్పయ్యేళ్ళు మీరిన ఆవిడ బయటికితొంగి చూసి తల మీద చెరుగు సవరించుకుని అంది.
'చూడు బాబూ.....మా సుభద్రకి ఈ నాటికైనా మేం కళ్ళపడుతున్నందుకు సంతోషమే- మంచి వేళ్ళలో మనిషికి భగవంతుడే గుర్తురాడు.....ఆపదల్లో అందరూ భక్తులే.....పోనీలే బాబూ....మేం లేనివాళ్ళం.....కలవాళ్ళువాళ్ళు... వాళ్ళు పిలిస్తే మేం రాకపోతే-ఏనాటికైనా కష్టం మాకే.....మళ్ళీ ఎప్పుడు పిలుచుకుని వస్తావు నాయనా?'
సారధికి మాట్లాడేది ఏమి అర్ధంకాలేదు-కాని వదినగారిని నిందిస్తూ వుంటే అతని వళ్ళు భగభగ మండిపోయింది. కానీ పని సాధించుకోవాలనే ఉద్దేశ్యంతో వుందేకోపాన్ని అణుచుకున్నాడు. ఆమెకు సమాధానం చెప్పాలని తలెత్తాడు. ఆమె వెనుకగా మేష్టరుగారు నిలబడి సైగ చేస్తున్నారు 'ఏమిటి?' ఒక వేలు చూపుతున్నారు.
ఒక్కక్షణం ఆలోచించాక అర్ధం అయింది.
'యేదోనెలరోజులుండినతర్వాత నేనే పిలుచుకువస్తాన్లేండి'
అసంతృప్తిగా అంది ఆవిడ.
'ఒక్కనెలా నాయనా? ఈ సంసారంతో నేనొక్కదాన్ని సతమతమైచస్తాను.
నేను ఈదలేను బాబూ ఈ సంసారాన్ని- ఈ పిల్లలతోనే చేసుకోలేను....పైగా నాకు ఆయాసం..... గుండెదడ.....అయినా పెద్దవాళ్ళే అడిగితే మేం కాదనలేంకదా? చూడు బాబూ సరిగ్గా నెల అంటేనెలే? నేను చాలాఖరారు అయిన మనిషి.....ఆదినిష్టూరం అంత్య నిష్టూరంకంటే చాలా మేలు-మళ్ళీ నీవే పిలుచుకుని రావాలి.....మేం రాలేం- మాకుతీరదు-ఆ....స్నానానికి లేస్తావా నాయనా?'
సారధికి అసహ్యం వేసింది ఆ మాటల ధోరణిచూసి
'అన్నీ ముగించుకునే వచ్చానండి'
'అట్లా చెప్పు బాబూ- మీ పట్నంవాళ్ళు ఎలాగైనా అన్నీ అలా ముందుగానే జాగ్రత్త పడతారు. మా ఇంట్లో పదిగంటలైనా ఇంకా స్నానాలే చేస్తూవుంటారు.....సరేబాబూనే వస్తా-వంటలోకి వెళ్ళాలి'
ఆమెవెళ్ళిపోయాక అనుకున్నాడు.
'భగవాన్! అమృతమూ, విషమూ రెండూ ఒకదాని నుంచేపుడతాయి అంటే నాకు నమ్మకంకలుగలేదు.....చీకటివెలుగు....ఎక్కడ మావదిన? ఎక్కడ ఈవిడ! రంగూన్ కథల్లో ఇంటావిడ-ల్యాండ్ లేడీ- అంటే ఇల్లాగేవుంటుంది కాబోలు'
పదిపదహారేళ్ళు మధ్య వయస్సులో వున్న ఓ పక్క పలచని ఎర్రటి అమ్మాయి వెళుతూఅడిగింది.
'మా అక్కగారు బావున్నారా?'
ఆ మాటల్లోని వినమ్రతకి, వినయాని ముగ్ధుడై అనుకున్నాడు సారధి.
'రాయీరత్నం ఒకే గనిలో వుంటాయ'ని
దగ్గరగా పిలిచి సుభద్రరాయించిన ఉత్తరం ఇస్తూ 'ఏమీ భయపడవద్దు' అని చెప్పమన్నారు అన్నాడు.
భయంభయంగా అటూ ఇటూ చూసి ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళింది. ఆమె వెళ్ళినవైపునుంచే ఎదురుగా వస్తూ అన్నాడు రామారావుగారు.
'నాకూతురు నాయనా.....ఈమేసుశీల.......'
దగ్గరగావచ్చి కూర్చుని అన్నాడు.
'అదికాదు సారధీ.....ఇలా చదువుకునేందుకు అని చెప్పితే అసలుపంపరు.....అందుకని సుభద్రకి కాన్పు అయిందిదని తోడు ఎవరూ లేరని ఏదో మూడోనెల వచ్చేవరకు కాస్త తోడుగా వుంటుందని పంపమన్నారని అబద్దంచెప్పాను. అంతేనాయనా? ఏమీ అనుకోకు' ఆయన అశక్తత జాలిపడుతూ మనో నైర్మల్యానికి ముగ్ధుడవుతూ అన్నాడు.
'అబ్బే! అలాంటిదేమీ లేదులెండి! ఏదో శుక్రనీతి' చిన్నగానవ్వి సారధి భుజంతట్టిలోపలికి వెళ్ళిపోయాడాయన.
వసారాలోనే వున్న గోడకి ఆని వున్నమట్టిదిండుకి తల ఆన్చి అలాగే చాప మీద పడుకుని ఆలోచించసాగాడు సారధి.
'బావా!'
'......'
'ఓయ్.....బావా!!'
'......'
'ఓయ్.....బావా!!!'
కాలువగట్టువెంటే యేదో ఆలోచనలో వెడుతున్నట్టు సారధి తిరిగి చూచాడు.
పరికిణీకుచ్చెళ్లు ఎగబట్టుకొని పరిగెడుతూ వస్తోంది సరోజ.
సారధీ ఆగాడు. దగ్గరగా వచ్చేసి రొప్పుతూ ఆగింది. పరిగెత్తుతూ రావటంలో శుభ్రంగా దువ్వుకున్న తల అంతా రేగింది. ముఖంనిండా చెమటలు కమ్మాయి. ఆయాసం వల్ల రొప్పుతూ వుంది.
అలాచక్కని చిత్రకారుడి చక్కని బొమ్మలా వుంది ఆమె.
కొద్దిసేపు ఆగి మెల్లగా నడకసాగించాడు.
'బావా!'