"ఆ...!!" నేనూ, చిన్నక్కా నోళ్ళు తెరిచేశాం.
చిన్నక్కరంగంలోకి దూకుతూ "ఏం సమయం మించిపోలేదు. వెళ్ళి అతనికి ఉత్తరం యిచ్చేసిరా.... బయల్దేరు.... ఊ!" అని తొందరపెట్టింది.
పెద్దక్క కళ్ళు తుడుచుకుని నావైపు చూసి "నువ్వూ తోడు రావే" అంది.
"సరే!" అని నేనూ దానితో వెళ్ళాను.
మేం వెళ్ళేటప్పటికే సామాన్లతో రెడీగావున్నా వ్యాన్ కదుల్తోంది.
కమల్ డ్రైవర్ పక్కనే కూర్చుని వున్నాడు.
"అరుంధతీ.... వెళ్ళొస్తా" అంది వాళ్ళమ్మ.
అక్క కమల్ వైపు ఆర్తిగా చూసింది. ఆ చూపుని ఆర్తి అంటారని నాకు తర్వాత తనే చెప్పింది. కమల్ మమ్మల్ని చూసి నవ్వి చెయ్యి వూపాడు.
వ్యాన్ స్టార్ట్ అయిపోయింది.
అక్క చేతిలో ఉత్తరం అలాగే రెపరెపలాడుతూ వుండిపోయింది.
పిచ్చివాడు, అతనికి తెలియదు అక్క హృదయం ఎంతగా ఛిద్రం చేసిపోతున్నాడో, డ్రైవర్ తో కబుర్లు చెబుతూ వెళ్ళిపోయాడు.
అక్క పిచ్చిగా వాళ్ళు ఖాళీచేసిన ఇంటిమెట్లమీద కూర్చుండిపోయింది. ఆ పక్కనే వాళ్ళు పారేసిన చెత్తంతా గుట్టలా పడివుంది. అందులో అక్క స్వయంగా లేసుకుట్టిన తెల్లబట్ట! ఆరోజు కమల్ కి ఇచ్చినది కూడా మసిబారి పడి వుంది.
అది చూడలేదు దుఃఖంలో వుంది. నేను నెమ్మదిగా ఆ బట్టని పట్టుకెళ్ళి బావిలో పారేసి చేతులు దులుపుకున్నాను.
దాని దగ్గరకొచ్చి "పద... వెళ్దాం" అన్నాను.
మొదటిసారిగా దాన్ని చూస్తే చాలా జాలేసింది.
అది నా కడుపులో తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. అది పిచ్చి అనాలో... అమాయకత్వం అనాలో నాకు అర్ధంకాలేదు.
ఆ ఉత్తరాన్ని అది పదిలంగా దాచుకుంది. అదే జీవితంలో అది చేసిన పెద్ద పొరపాటు.
వరుసగా కొన్నిరాత్రులు అది నిద్రపోలేదు. అతను కాలేజీకి వెళ్ళేటైంకీ వచ్చే టైంకీ గుమ్మంలోకి వెళ్ళి నిలబడేది. ఎక్కడ సైకిల్ బెల్ మోగినా లేచెళ్ళి ఆశగా చూసేది. అతను ఒక నిముషంపాటు కూర్చున్న కుర్చీని తడుముతూ కన్నీళ్ళు పెట్టుకునేది. అది పిచ్చిదైపోతుందేమోనని నాకు భయంవేసేది. బాగా చిక్కిపోయింది కూడానూ!
ఆ సమయంలో సుందరం మావయ్య తీసుకొచ్చిన పెళ్ళికొడుకు వచ్చి దాన్ని చూసుకున్నాడు.
"ఒకరికి మనసిచ్చి వేరొకరిచేత ఎలా తాళి కట్టించుకోనూ...." అని అక్క గన్నేరుపప్పు నూరుకు తినబోయింది. సమయానికి మా చిన్నక్క చూసి దాన్ని ఆపింది. అప్పట్నుంచీ మేం అందరం దాన్ని వేయికళ్ళతో కాపాడుతూ వచ్చాం.
లక్షన్నర కట్నంతో దాని పెళ్ళి సెటిలైపోయింది. పెళ్ళికొడుకు రైల్వేలో ఆఫీసర్.
అక్క ప్రతిఘటిస్తుందనుకొన్నాను. కాని నిర్లిప్తంగా చూసి "కమల్ కాకపోయినా నాకు ఎవరైనా ఒకటే....అతన్ని తలుచుకుంటూ ఇతనితో గడిపేస్తాను" అంది.
అది కమల్ ని ప్రేమించిందో లేక ప్రేమించాననే భావనని ప్రేమించిందో నాకు ఇప్పటికీ అర్ధంకాలేదు.
వేసవి సెలవుల్లో దానిపెళ్ళి నిశ్చయం అయింది. దానికి కాబోయే భర్తపేరు శంకర్.
నేను బాగా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే అది తాంబూలాలు పుచ్చుకున్న రోజున గుడిలో శంకర్ పేరుమీద అర్చన చేయించడం!
ఈలోగా నాకు ఇంకో విషయం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను.
మా సుమతక్క కూడా మెడలోతు ప్రేమలో కూరుకుపోయి వుంది. అది రోజూ టైప్ నేర్చుకోవడానికి వెళ్ళే ఇన్ స్ట్రక్టర్ తో.
ఇది పెద్దక్కలా మూగప్రేమ కాదు. ఇంకాస్త ముందుకెళ్ళి అతనితో సినిమాహాల్లో నాన్న కంటపడింది.
ఆరోజు నాన్న చిన్నక్క ఇంటికొచ్చాక పిలిచి "అతనెవరు?" అని అడిగాడు.
అది అబద్దం చెప్పలేదు. "నేనూ, అతనూ ప్రేమించుకున్నాం నాన్నా...." అంది.
"ప్రేమించుకుని ఊరుకుంటారా? లేక పెళ్ళికూడా చేసుకుంటారా?" అని అడిగారు.
నేను ఆ ప్రశ్నకి విస్తుబోయాను. కానీ నాన్న ఎంత లోకానుభవంతో అడిగారో తర్వాత తెలిసింది.
చిన్నక్క ధైర్యంగా నాన్నముందు నిలబడి అతని మంచితనంగురించీ, చదువుసంధ్యలగురించీ చెప్పింది.
"అసలైనవి మర్చిపోయావు! అతని కులం, అంతస్తూ, తల్లిదండ్రుల గురించీ..." అన్నారు నాన్న.
అది చెప్పింది. అతను మా కులంకాదు. అతని తండ్రి చాలా ఆస్తిపరుడు. ఇతనికేం ఉద్యోగం లేదు.
నాన్న అతన్ని కలిసి తను మాట్లాడి పెద్దవాళ్ళని కలిసేవరకూ దాన్ని అతనితో తిరగవద్దని చెప్పారు. అందుకు అది అంగీకరించింది.
పెద్దక్క పెళ్ళిలో అతనితో నాన్న మాట్లాడారు. అతను బెదిరిపోయాడు. పెళ్ళివిషయం తన తండ్రితో మాట్లాడే ధైర్యం తనకి లేదన్నాడు. ఇంకా ముందుకెళ్ళి గుచ్చిగుచ్చి ప్రశ్నలేస్తే తనకి చిన్నప్పుడే కుదిరిన మేనరికం వుందన్నాడు.
"మరి మా అమ్మాయితో ఎందుకు తిరిగావు? అని నాన్న అడిగితే, "మీ అమ్మాయే నాతో తిరిగింది. పెళ్ళి చేసుకోమని అడుగుతుందని అనుకోలేదు" అన్నాడు.
నాన్న శాంతంగా "మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. నీకు మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా?" అని అడిగారు.
"మీ అమ్మాయంటే ఇష్టమే కానీ, మా నాన్న చంపేస్తాడు. చండశాసనుడు" అన్నాడు.
నాకు అప్పటికే అతని కేరక్టర్ మీద విపరీతమైన అసహ్యం కలిగింది.
"మా అక్కతో సినిమాకెళ్ళినట్లు తెలిస్తే మీనాన్న చీల్చి చెండాడడా?" అని అడిగాను. అతను నేలచూపులు చూశాడు.
"నేను ఊరెళ్ళి ఏ సంగతీ ఉత్తరం రాస్తాను" అని జారుకున్నాడు.
పెద్దక్క పెళ్ళిలో అడుగడుగడునా మగపెళ్ళివారి అలకలే! ఎంత చేసినా వారికీ తృప్తిలేదు. టీ పంపిస్తే కాఫీ కావాలనీ, కాఫీ పంపిస్తే మజ్జిగ కావాలనీ యాగీ చెయ్యడానికి ప్రత్యేకంగా ఓ మూకకి డబ్బిచ్చి తెచ్చుకున్నారేమో అనిపించింది. అలకపాన్పుమీద పెద్దబావ స్కూటర్ కోసం మరో పదివేలు గుంజాడు. దాని అత్తగారూ ఆడబిడ్డలూ వంతులవారీగా ఏడ్చి పెట్టుపోతలకని ఇంకో పాతికవేలుదాకా ఈడ్చారు.