Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 7


    
    ఇంకెందుకో దేనికి? అతను తనకన్నా చిన్నవాడు.....
     అసలు తను దేనిగురించి ఆలోచిస్తుంది?
    తన మనసు మీద, ఆలోచన మీద ఏం చల్లాడో, రాస్కెల్.... రానీ... చెబుతాను అనుకొంది.
    అలా అనుకుంటూనే మళ్ళీ బాల్కానీలోకి వచ్చింది రమాదేవి.
    "ఇది పద్దెనిమిదో సారమ్మా మీరు ఇటు రావడం, అయ్యగారు వచ్చేది ఎల్లుండి, ఇయాళ కాదు" అన్నాడు వంటమనిషి సాంబయ్య నవ్వుతూ.
    అమె గతుక్కుమంది సాంబయ్య మాటలకి.
    పని మనుషులకి ఏం తెలీదు అనుకుంటాంగానీ.... వాళ్ళకున్న తెలివీ, గ్రహింపు శక్తి ఇంకెవరికీ వుండవు.
    తన పనులు తను చేసుకుపోతూనే తనని గమనిస్తున్నాడన్న మాట. తొండమొహం వాడూను. విసుక్కుంది. కానీ ఏదో సమాధానం చెప్పాలి వాడికి.
    "ఏం లేదు సాంబయ్యా! చల్లగా వుంది కద... వానగానీ వస్తుందేమోనని చూస్తున్నాను" అంది రమాదేవి.
    అసలు తనెందుకు వాడికి సమాధానం చెప్పాలో అమెకి తోచలేదు. ఏదో తప్పుచేసి దానికిగాను వాడికి వివరణ యిస్తున్నట్టుగా తనకే అనిపించింది రమాదేవికి.
    "భలేదానివమ్మా! రెండురోజులు అయ్యగారు లేకపోతే ఏమిటేమిటో మాట్లాడేస్తావు . ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క లేదు. పైగా ఈరోజు నిండు పౌర్ణమి రోజమ్మా! అన్నాడు సాంబయ్య నవ్వూతూ.
    ఈరోజు పౌర్ణమి.
    బాల్కానిలో వెన్నెలలో పరుపుమీద పడుకొని చంద్రుడ్ని తదేకంగా చూడ్డం అంటే ఎంతో యిష్టం రమాదేవికి. మరోపక్క సన్నజాజుల పరిమళం.
    "అమ్మా! సాంబయ్య.
    "ఏమిటి?" అడిగింది విసుగ్గా.
    "వంట చేయడం అయిపోయింది హి...హి....!" అన్నాడు.
    "సినిమానేనా?" అంది.
    "అంతేకదమ్మా ఏదో వారానికోబొమ్మ  చూస్తేగానీ ప్రాణం నిలవదు"
    అప్పుడు చూసింది... దూరంగా రోడ్డుమీద... మసక వెల్తురులో సైతం ఆ వ్యక్తిని పోల్చుకుంది.
    అభినయ్.... అభినయ్ వస్తున్నాడు.
    అమె కళ్ళు మెరిశాయి. పెదవులు ఒంకర్లు తిరిగాయి.
    "స్వీట్ రాస్కెల్......." అని మూతిపళ్ళను బిగించి అనుకొంటూనే సాంబయ్యకేసి చూసింది.
    "వెళ్ళిరా!" అంది.
    "సంతోషమమ్మా మరి నే వెళ్ళొస్తానమ్మా!"
    "సినిమా అవగానే ఇంటికొచ్చేయ్యి... నాకసలే భయం" అంది.
    "అలాగేనమ్మా" అంటూనే తిరిగి ఏదన్నా పనిచెబుతుందోనన్న భయంతో సైకిల్ ఎక్కి  గబగబా వెళ్ళిపోయాడు సాంబయ్య.
    సరిగ్గా అప్పుడే గేటులోంచి లోపలికి వచ్చాడు అభినయ్.
    బాల్కనిలో నిలబడి వుంది రామాదేవి. చేతిలోని నోట్ బుక్ ని వూపుతూ విష్ చేశాడు అతను.
    అమె బాల్కనీ పెరాపెట్ మేడమీద రెండుచేతులని వుంచి వంగి చూస్తుంది చిరునవ్వుతో.
    అభినయ్ కాంపౌండ్ వాల్ గేటును వేసి గెడపెట్టి నడుస్తూ వస్తున్నాడు.
    అతను ఒక్కో అడుగువేసి ముందుకు వస్తుంటే అమె గుండెల్లో స్పందన ప్రారంభమైంది.
    పెరపెట్ వాల్ మీద వున్న చేతులతో గుండెల అంచులని నొక్కుకుంది రమాదేవి. అవి పైకి ఉబికి అతనికి మనోహరంగా దర్సనమిచ్చాయి.
    పోర్టికో  వరకూ అతను నడిచి వచ్చాక అమె కిందికి వచ్చింది.
    అతను రాకముందు ఎన్నెన్నో అనుకుంది. కానీ ఒకటి గుర్తు రావడంలేదు యిప్పుడు.
    "ఏమిటిలా వచ్చావ్?" అంది ఎందుకొచ్చాడో తెలీదన్నట్టుగా.
    అతను ఆశ్చర్యంగా చూశాడు అమెకేసి.
    "వస్తానని చెప్పానుగా!" అన్నాడు.
    "చెప్పావా? నాకు గుర్తులేదులే" అంది నిర్లక్ష్యాన్ని నటిస్తూ ఓ చెట్టు ఆకుని తెంపి పక్కన పడెస్తూ.
    "పాఠం కోసం వస్తానని చెప్పాను" గుర్తుచేశాడు.
    "అంత చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలంటావా?" అడిగింది.
    "మీకు చిన్న విషయమైనా... నాకు యిది చాలా పెద్ద విషయమే" చెప్పాడతను.
    "అంటే?"
    " విజయం సాధించాలి కదా పరీక్షలో" నవ్వాడు.
    " ఆందుకు నేనేం చేయాలి?"
    " మీ దగ్గర పాఠాలు శ్రద్దగా నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను".
    " నువ్వునుకుంటే సరిపోయిందేమిటి? నాకు టైం వుండద్దు" అంది. ఎటో చూస్తున్నట్టుగా నటిస్తూ నిలబడ్డ రమాదేవి.
    " మీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు మేడం. నా కోసం ఓ గంట......"
    " నాన్నెన్స్ గంటా? నువ్వేమడుగుతున్నావో తెలుసా? " కోపం నటిస్తూ అంది.
    "పోని అరగంటా!" అమె మొహంలోకి చూశాడు.
    "వీలులేదు. నాకు కుదరదు"
    "పదిహేను నిమిషాలు చాలు మేడం...." అభ్యర్ధనతో అడిగాడు.
    అమె వస్తున్న నవ్వును అపుకుంటుంది పమిటని అడ్డం పెట్టుకుని.
    "అఖరిగా అడుగుతున్నాను మూడు నిమిషాలు సరిపెట్టుకుంటాను" ఓ.కే.
    "మూడు నిమిషాలూ నువ్వు నోట్ బుక్ తేరిచేవరికే అయిపోతుంది. ఇంకేం నేర్చుకుంటావ్?" అంది రమాదేవి క్రీగంట చూస్తూ.
    "నాకు ఎంత ప్రాప్తమంటే అంతే దక్కుతుంది. ఏం చేస్తాను" అన్నాడు అభినయ్. జాలిగా.
    "మాటలకేం తక్కువలేదు. పద" అంది లోపలికి దారితీస్తూ.
    అమెని అనుసరించాడు అభినయ్.
    డ్రాయింగ్ రూంలోకి వెళ్ళగానే అమె తలుపు గెడపెట్టింది.
    "తలుపెందుకు గెడవేశారు?" అడిగాడు అతను.

 Previous Page Next Page