"పాపం! చిన్న వయసు. అందంగా వున్నాడు."
"అంతేకాదు బాగా చదువుకున్నవాడు. తండ్రి పెద్ద ఆఫీసరు."
"ఏం చేస్తాం? మన దేశంలో సైకియాట్రిస్టును కస్సల్ట్ చెయ్యాలంటే భయం. జబ్బు బాగా ముదరబెట్టుకొని వస్తారు. లాభం ఏముంది?"
"డాక్టర్! రూం నంబర్ ఐదులో వున్న సుబ్బాయమ్మ చాలా గొడవ చేస్తుంది సార్! నర్స్ హడావిడిగా వచ్చి చెప్పింది.
డాక్టర్ ఉదయచంద్ర లేచి నిలబడ్డాడు.
* * *
5
ఈవిడా సుబ్బాయమ్మ? ఆ పేరు విని తను గుండ్రం మూడు సున్నాలు చుట్టినట్టుండే ఓ ఏభయ్ ఏళ్ళ స్త్రీ రూపాన్ని ఊహించుకున్నాడు ఈమెకు పాతికేళ్ళకంటే ఎక్కువ వుండవు. సన్నగా నాజూగ్గా వుంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడంలో చాలా అన్యాయం చేస్తారు. చిన్న చిన్న గుంట కళ్ళుంటే పిల్లకు విశాలాక్షి అని నామకరణం చేస్తారు. ప్రపంచంలో మరో పేరూ దొరకనట్టు. ఆ పిల్ల పెద్దయ్యాక స్కూల్లో కాలేజీలో ఏడిపించి చంపుతారు.
"ఛ! నోర్ముయ్!"
జయంత్ ఆలోచనలు ఒక్కసారిగా పుటుక్కున తెగాయి. తృళ్ళిపడి సుబ్బాయమ్మను చూశాడు. తననేనా నోర్ముయ్యమన్నది? తను పైకి ఏమీ అనలేదే?
"ఏమంటున్నాడు?" ఉదయ్ సుబ్బాయమ్మను అడిగాడు.
"ఏదేదో వాగుతున్నాడు. మీకెలా చెప్పమంటారు డాక్టర్ గారూ? అదుగో మళ్ళీ! నోరు మూస్తావా లేదా?"
"వాడి వాగుడు పట్టించుకోకండి."
"ఎలా డాక్టర్ గారూ. ఇంతకుముందే స్నానం చేశాను. ఎటునుంచి వచ్చాడో అక్కడికీ వచ్చాడు."
"నీకు కన్పించాడా?"
"లేదు."
"మరి వచ్చాడని ఎందుకనుకున్నావ్?'
"దొంగ సచ్చినోడు.ఏ మూలో నక్కి చెంబులు లెక్కబెట్టసాగాడు."
"చెంబులు లెక్కపెట్టడం ఏవిటమ్మా?"
"అదేనండీ డాక్టర్ గారూ -మీకు అర్థంకాలా?"
"కాలేదు."
""బక్కెట్లోని నీళ్ళల్లో చెంబు ముంచగానే బుడుక్కుమంటుందా?"
"అంటుంది."
"వెంటనే వాడు ఒకటి అన్నాడు. రెండో చెంబు ముంచగానే రెండు అన్నాడు. నేనివ్వాళ ఇరవై చెంబుల పోసుకున్నాను. వాడే లెక్కపెట్టాడు. అదిగో వినండి. ఇవన్నీ మీకు చెపుతున్నానని తిడ్తున్నాడు. నన్ను చంపేస్తాడట" సుబ్బాయమ్మ నీళ్ళలో చేసిన కోడిపెట్టలా వణికిపోసాగింది.
"ఏడ్చాడు వెధవ. నా దగ్గర వున్నంతకాలం ఎందుకంత విరగచెయ్యలేడు."
"నిజంగానే డాక్టర్! నోరు ముయ్యరా గాడిదా. ఎందుకంత విరగబాటు! వెధవ నవ్వూ నవ్వూను."
"నర్స్ ఇంజక్షన్ తెచ్చింది.డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడు. కొద్ది నిముషాలకు సుబ్బాయమ్మ శాంతించింది.
"కాసేపు నిద్రపోండి" అని డాక్టర్ ఉదయచంద్ర బయటికి వచ్చాడు.
"సుబ్బాయమ్మ శ్రవణ విభ్రమాలకు గురి అయినట్టుంది" అన్నాడు జయంత్ తనకూ కొంత సైకియాట్రి తెలుసునన్నట్టుగా.
"అవును."
"ఆమె ఈ స్థితికి రావడానికి కారణం?"
"ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. భార్యా భర్తలు ఎంతో అన్యోన్యంగా వుండేవారు. ఇద్దరూ లెక్చరర్సు. సంవత్సరం తిరక్కుండానే ఆమె భర్త కారు యాక్సిడెంటులో పోయాడు. ఆమె మానసికంగా ఎంత క్రుంగిపోయిందో ఎవరయినా ఊహించగలరు."
"ఆమె మానసిక అప సామాన్యతకు కారణం అదేనంటారా?"
"కాదు. అసలే మనసు లోతుగా గాయపడింది. అత్తా మామలు బొట్టూ గాజులూ తీసేయ్యాలన్నారు. ఆమె అందుకు అంగీకరించలేదు. అయితే ఆమెలో చిన్నతనంనుంచీ ఏర్పడిన సంస్కారాలకూ వ్యావహారిక ప్రవర్తనకూ మధ్య సంఘర్షణ ప్రారంభం అయింది. ఆమె భర్తను ఎంతగానో ప్రేమించింది. భర్త చనిపోయిన స్త్రీ తెల్లబట్టలు కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు. ఆమెకు తెలియకుండానే ఆమె నరనరంలోకి ఎక్కించబడిన నమ్మకం అది. కాని ఆమె అవేవీ పాటించడంలేదు. ఆమె అచేతన మనసులో తను తప్పు చేస్తున్నాననే భావం ఏర్పడింది. ఆ భావం శిక్షించబడాలనే కోర్కెను పెంచింది. ఆమె అచేతన మనసులో ఏర్పడిన అపరాధ భావం వల్లనే విభ్రమాలకు గురిఅయింది. ఎవరో తనను తిడుతున్నట్టు విన్పించసాగింది. సాధారణంగా వారికి విన్పించే గొంతు తెలిసిన వాళ్ళ గొంతే అయివుంటుంది. ఆ మాటలు వారిలోని లోపాలను భూతద్దంలో ఎత్తిచూపిస్తున్నట్టుగా వుంటాయి. ఒకోసారి ఆ మాటలు తిడుతున్నట్టుగానే కాక అజ్ఞాపిస్తున్నట్టుగా కూడా వుంటాయి. ఇలాంటి మానసిక అపసవ్యతకు గురిఅయినవారు ఆ విన్పించే గొంతు ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్టుగా వుంటుంది. ఆ పరిస్థితుల్లో చాలామంది పై నుంచి దూకో, నిప్పంటించుకొనో ఆత్మహత్య చేసుకుంటారు."
"డాక్టర్!"
"ఏమిటి జయంత్."
"నాకు వీళ్ళందర్నీ చూస్తుంటే గుండెలు పిండేసినట్టుగా వుంది. ఈ లైనులో నేను...."\
"నీలాంటివాళ్ళే వుండాలి జయంత్. ఇలాంటి వారికి కావాల్సింది నిజమైన సానుభూతి....ఓ మైగాడ్! రెండున్నర అయింది. అమ్మ నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది భోజనం చెయ్యకుండా. ఇక వెళ్దాం." అంటూ డాక్టర్ ఉదయచంద్ర లేచి నిల్చున్నాడు.
* * *
6
ఆ రోజు డాక్టర్ ఉదయ్ చివరికేసు చూస్తున్నాడు.
"ఏమ్మా ఎలా ఉన్నావ్?" అనంతమ్మను అడిగాడు.
అనంతమ్మ మెలికలు తిరిగిపోయింది.
డాక్టర్ ఉదయ్ చంద్ర కుర్చీ వెనక్కు జరుపుకొన్నాడు.
"మళ్ళీ వచ్చాడండీ."
కళ్ళు గుండ్రంగా తిప్పింది.
"మళ్ళీ వచ్చాడా? ఎప్పుడూ?" డాక్టర్ ఆమె ముఖ కవళికలు గమనిస్తూ ప్రశ్నించాడు.
"ఏమిటో ఆ మనిషికి నా మీద వల్లమాలిన ప్రేమ ఏమిటో పాడు? ఇలాంటి మాటలు మీతో చెపుతున్నాను" అని బోలెడంత సిగ్గుతో తల వాలిపోగా నేలచూపులు చూడసాగింది.
"పర్వాలేదమ్మా నాతో చెప్పొచ్చు. ఎప్పుడోచ్చాడు?"
"రాత్రి"
"కల్లోకి వచ్చాడా?"
"మీరు బలేడాక్టరండీ. కలలోకి రావడం ఏమిటి? ఉదయం లేచి నాతోపాటు నా వెనకే వంటింట్లోకికూడా వస్తేనూ?"
డాక్టరుకు నవ్వొచ్చింది. ఇది ఇల్లుకాదనీ, నర్సింగ్ హొమ్ గది అనీ చెప్పాలనే ప్రయత్నంలో ఉండగానే "కాఫీకాద్దామని వంటింట్లోకి వెళ్ళాను. ఆయన ఏంచేశారనుకొన్నారు?"
"ఏం చేశాడు? కాఫీ తయారుచేసే వెనక్కుచూసేసరికి వెళ్ళిపోయాడు. అవునా?"
"వెళ్ళిపోలేదండి బాబూ!"
అనంతమ్మ ముఖం సీరియస్ గా పెట్టుకుంది.
"డాక్టర్ ఉదయచంద్ర తలగోక్కున్నాడు.
ఈ వ్యాధివాళ్ళతో ఇదే చాలా తెలివిగా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళను బోల్తా కొట్టిస్తారు. అందువల్లనే ఇలాంటి రోగుల్ని ఒక పట్టన స్వంత వ్యక్తులుకూడా గుర్తించలేరు.
ఆలోచననుంచి బయటపడి" ఇంతకూ ఏం జరిగిందో చెప్పలేదు"అన్నాడు.
"చడీ చప్పుడు కాకుండా పిల్లిలా వంటగదిలోకి వచ్చి....." ఆగి అనంతమ్మ ఉదయ్ కళ్ళల్లోకి రెప్పవెయ్యకుండా చూడసాగింది.
మానసిక రోగ వైద్యుడయిన ఉదయ్ చంద్రకు అనంతమ్మను ఎలా ఆ మూడ్ నుంచి బయటకు లాగాలో తోచక ఇబ్బందిపడిపోయాడు.
"కాఫీ తాగడా?"
"అయ్యో మీ పిచ్చి దొంగలు దోలా?మీరు మరీ అమాయకులండీ బాబూ? పెళ్ళికాలేదుకదూ? అవును కాలేదు. అందుకే మీరలా వెర్రి ముఖం వేశారు" అనంతమ్మ పకపక నవ్వింది.
ఉదయచంద్ర తృళ్ళిపడ్డాడు. తను వెర్రిముఖం వేశాడా? ఎవరా మాట అన్నది? ఎవర్ని వెర్రివాళ్ళ వెర్రి కుదిర్చే డాక్టరును ఒక వెర్రిది వెర్రిముఖం వేశావన్నదా?
ఉదయ్ నిజంగానే వెర్రిముఖం వేశాడు.
"ఏమండి డాక్టర్ గారూ ? ఇంకా .....ఇంకా....అర్థంకాలేదా?" విరగబడి నవ్వుతూనే అడిగింది.
డాక్టరు చూస్తూ వుండిపోయాడు.
"వెనకనుంచి వచ్చి నన్ను....చీపాడు....సిగ్గేస్తుంది చెప్పాలంటే " ముసి ముసి నవ్వులు నవ్వుతూ నవ వదువులా తల వంచు కొన్నది.
కొండపల్లి కొయ్య బొమ్మలా తలవంచుకొని కూర్చుని ఉన్న అనంతమ్మను నిశితంగా చూశాడు డాక్టర్.
కొన్ని గంటలు ఇక ఆవిడ ఆ మూడ్ నుండి బయటపడదని తెలిసిన ఉదయ్ లేచి నిల్చున్నాడు.
"సిస్టర్!"
"యస్. డాక్టర్!" నర్సు లోపలకు వచ్చింది.
"అనంతమ్మ తరపు వాళ్ళెవరైనా వుంటే లోపలకు పంపించు."
"యస్. డాక్టర్" నర్సు బయటకు వెళ్ళింది.
కొద్ది నిమిషాలలో అనంతమ్మ తల్లీ దండ్రీ లోపలకు వచ్చారు. కూతురి వాలకం చూసి తండ్రి నిట్టూర్చాడు. తల్లి తల తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నది.
"అనంతా! ఏమిటమ్మా ఆ కూర్చోవడం ? డాక్టరుగారి ముందు అలా కూర్చోవడం తప్పుకదూ? లే! సరిగా కూర్చో!" తండ్రి వంగి కూతుర్ని లేవదీసే ప్రయత్నంలో పడ్డాడు.
"కాసేపు అలా కూర్చోనివ్వండి" ఉదయ్ చంద్ర అతడి భుజం మీద చెయ్యివేసి అన్నాడు.
"అలా వదిలేస్తే రెండేసి రోజులు అలాగే కూర్చుండిపోతుంది డాక్టర్ గారూ . అన్నపానాదులుకూడా ముట్టదు. పక్కన పిడుగుల పడ్తున్న పట్టించుకోదు." ఆమె తండ్రి కంఠంలో దుఃఖం గరగరలాడింది.
"మీరిలా రండి" డాక్టర్ ఆమె తండ్రిని బయటికి పిల్చాడు.
"చూశారుగా బాబూ! అలా రోజులకొద్దీ ఈ లోకంలోనే వుండదు. ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది."
"బాధపడకండి మీ అమ్మాయికి ఈ జబ్బు త్వరగానే నయం అవుతుంది. ఆమెను ఈ లోకంలోకి తీసుకురావాలంటే మనం ఆమెలోకంలోకి పోవాలి."
ఆ వృద్దుడు డాక్టర్ ముఖంలోకి అయోమయంగా చూశాడు. అతడ్ని చూస్తుంటే ఉదయచంద్రకు అంతులేని జాలి కలిగింది. "ఏం చెయ్యమంటారు బాబూ!" అనంతమ్మ తండ్రి అడిగాడు.