Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 5

 

    "అవును, దేవుడు చివరకు మానవరూపంలోకి ప్రవేశించాడు. అతడికీ పెళ్ళి కావాలి, భార్య కావాలి. పిల్లలు పుడతారు. ఒకటేమిటి - మానవుడి జీవితంలో వికారలన్నింటినీ దేవుడికే అంటగట్టారు" అన్నది ఇందుమతి.
    "ఒక్కరికి ఇద్దరు నాస్తికులు తయారయ్యారు" విసుకున్నాడు సుందర్రామయ్య.
    రవి మనసు ఈ సంభాషణ మీద లేదు.
    ఇందుమతి చూశానని చెప్తున్న వ్యక్తీ చుట్టూనే తిరుగుతూన్నాయి అతడి ఆలోచనలు.
    "అదేదో మీటింగన్నావూ? అందరూ నీ లాంటి వాళ్ళే మాట్లాడారా?" సుందర్రామయ్య కొడుకుని అడిగాడు.
    "కాదు, అందరూ నీలాంటివాళ్ళే, అందులో నేను ఒక్కడ్నే నా లాంటి వాణ్ణి ." నవ్వుతూ అన్నాడు నరసింహారావు.
    సుందర్రామయ్య  కళ్ళు మెరిశాయి.
    "అయ్యొ౧ నాకు చెప్తే నేనూ వచ్చేవాణ్ణి . అది సరే. నువ్వు ఇలా మాట్లాడితే వాళ్ళంతా ఊరుకున్నారా?"
    "ఊరుకోక ఏం చేస్తారు?? వాళ్ళందరూ మాట్లాడినా కనే నేను మాట్లాడాను. కావాలనే చివరికి నా పేరు వేయించుకున్నాను."
    "జనం అల్లరి చెయ్యలేదూ?"
    "ఏ విషయంలో?"
    "నువ్వలా అర్ధం పర్ధం లేని వాగుడు వాగుతుంటే?"
    నరసింహారావు పకపక నవ్వాడు.
    సుందర్రామయ్య ముఖంలో ఉడుకుబోతు తనం కనిపించింది.
    "ఆ జనం అల్లరి చేశారు. కాని, నేను మాట్లాడుతున్నప్పుడు కాదు. ఆ ప్రెసిడెంటు గారు నేను చెప్పింది ఖండించడానికి ప్రయత్నించినప్పుడు ఒకటే గోల, ఈలలు, చప్పట్లు , ఆయనకు కోపం వచ్చింది. అతడొక రిటైర్డ్ ఐ.ఎస్. ఆఫీసర్. పాపం! అయన సర్వీస్ లో ఉండగా ఎంతమంది ప్రాణాలు తీశాడో?"
    "అదేమిటి?' ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇందుమతి.
    "అయన బాస్ - పైగా ఐ.ఎస్. బాస్ . సబార్డినేట్ ను కూర్చోబెట్టి ఇలాంటివన్నీ చెప్పాడే అనుకోండి. పాపం! వాళ్ళెం చేస్తారు? నమ్మకం లేకపోయినా నమ్మకం ఉన్నట్లు నటించి తీరాలి. మరి అంతకంటే బాధాకరమైంది ఇంకే ముంటుంది? పైగా ఆ మహానుభావుడు తను కలెక్టరుగా ఉన్నప్పుడు ఊజా బోర్డు ద్వారా ఎన్నో చిశాయాలు తెలుసుకున్నారట. నేను ఒకసారి వాళ్ళింటికి వస్తే నన్నూ నా భావాలనూ మార్చేస్తాడట."
    "నిజంగా అలా అన్నాడా?" సుందర్రామయ్య గబుక్కున అందుకొని ఉషారుగా అడిగాడు.
    "అన్నాడు, అంతేకాదు, నాకు వాళ్ళింటికి వెళ్ళడానికి అభ్యంతరమైతే నా ఇంటికి రావడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు. చూశారా ఇందుమతి గారూ! ఈ నమ్మకాల ఊబిలో ఇరుక్కున్నవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో?"
    "అయన పేరేమిటి?"
    "నీ పేరే!"
    "ఒహు ఆయనా? పరమ భక్తుడనీ చాలా మహిమలు కలవాడనీ విన్నాను. నన్ను ఒకసారి అయన దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చెయ్యి" అన్నాడు సుందరరామయ్య.
    "అలాగే మాకు కాస్త విశ్రాంతిగా నైనా ఉంటుంది. తప్పక తీసుకెళ్తాను" అని ఇందుమతి వైపుకు తిరిగి "అసలు ఇన్నింటికీ ఆ ఆక్సిడెంటు వివరాలు తెలిశాయా?" అని అడిగాడు.
    "తెలియలేదండి."
    "పాపం ! గౌతమ్ పోయాడురా!"
    "నాన్నా!" అరిచాడు మందలింపుగా నరసింహారావు.
    ఇందుమతి కోపం తారాస్థాయికి అందుకున్నది. ఏదో అనాలనుకుంది. కాని, పెదవులు వణికి ఆగిపోయాయి.
    "ఏమిటి నాన్నా నీకు ఎంత వయసు వచ్చినా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా?"
    "నేనేం తప్పుగా అన్నానురా! అమ్మాయి గౌతమ్ ను చూశానని స్పష్టంగా చెప్తుంది. గ్లాసులోకి వచ్చిన హోలీ స్పిరిట్ తన పేరు గౌతమ్ అని అంతకంటే కచ్చితంగా చెప్పింది. అంతేకాదు, తను ఎక్కడ పోయిందీ ఎలా పోయిందీ కూడా చెప్పింది. అమ్మాయికి తనే కనిపించానని కూడా చెప్పింది."
    తండ్రి మీద ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమనాలో తోచక నుదురు మీద కుడి చేతి వేళ్ళతో కొట్టుకున్నాడు.
    "ఇందుమతిగారూ! ఈ నమ్మకాలలో పడి ఆయనకు మనస్తిమితమే పోయింది. మీరేమీ బాధపడకండి" అన్నాడు.
    "ఔరా! ఏం కూశావురా ? నాకు పిచ్చా? మీ అమ్మకు పిచ్చా?"
    "మరి లేకపోతే ఏమిటి నాన్నా! ఈ సమయంలో నువ్వు చిన్నవాళ్ళకు ధైర్యం చెప్పడం పోయి, అలాగేనా మాట్లాడాల్సింది?"
    సుందర్రామయ్య పలకలేదు. కొడుకు మీద కోపంగా ఉంది. మధ్యలో వీడు తగలబడ్డాడు ఏదో కొంప మునిగిపోయినట్టు. అసలు దానికి బుద్ది లేదు. తను ఇక్కడకు వచ్చింది తెలుసు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఒక ఫర్లాంగు దూరం కూడా లేదు. తను కాసేపు రావడం ఆలస్యం అయితే, ఏం మునిగిపోయింది? కొడుకుని తరమాల్సిన అవసరం ఏమొచ్చింది?
    సుందర్రామయ్యకు కొడుకు మీద వచ్చిన కోపం భార్య్జ మీదకు మళ్ళింది.
    అంతలో ఫోన్ మోగింది.
    రవి చివ్వున లేచి వెళ్ళి ఫోన్ అందుకున్నాడు.
    "హల్లో!" అన్నాడు.
    మరుక్షణంలో అతడి చేతిలోని రిసీవర్ కిందపడి పెద్ద శబ్దం అయింది.
    "ఏమిటి ? ఏమైంది? ఎవరి ఫోను?" అంటూ నరసింహారావు ఫోన్ దగ్గరకు పరుగు తీశాడు.
    ముసలాయన రవి ముఖంలోకి సాలోచనగా చూశాడు.
    ఇందుమతి రాతిబొమ్మలా అయిపొయింది. రవి చేతిలోని రిసీవర్ కింద పడగానే ఇందుమతి మాడు మీద సుత్తి దెబ్బ తగిలింది. ఏదో వినరాని వార్తే వచ్చిందని భావించింది.
    "హల్లో! ఆ - నేను నరసింహారావును. ఎవరూ? గౌతమా? ఆదా.....మీ తమ్ముడు భయపడిపోయినట్టున్నాడు. ఎందుకంటారా.....మా నాన్న ప్రతాపం అదంతా....." ఇందుమతి చివ్వున లేచి పరుగు తీసింది. నరసింహారావు చేతిలోని రిసీవర్ ను లాక్కుంది.
    "గౌతమ్! గౌతమ్! నువ్వేనా?" పిచ్చిగా ఉద్రేకంతో అడిగిన మాటే అడుగుతుంది.
    "ఏమిటాగాబరా?"
    "అవును, గాబరాగాక ఏమిటి? అమ్మయ్య - ఫోన్ చేసి రక్షించావు. ఇక్కడైతే అందరూ నువ్వు వచ్చి స్పిరిట్ గా అయి పోయావనే నిర్ణయానికే వచ్చేరు."
    .......పకపక నవ్వు వినిపించింది.
    "అలా నవ్వకు. నేను తమాషాగా చెప్పడం లేదు. మరి రవి అలా రిసీవర్ ఎందుకు పడేశాడనుకున్నావు?"
    "....."వస్తున్నాను."
    "ఆంటీకి ఏమైందో తెలియదు. న్యూస్ వినగానే అంటీ కోసం పరుగెత్తుకొచ్చాను. అప్పటికే ఆమె మూర్చబోయి ఉంది."
    ...."అదేమిటి" ఆతృతగా అడిగాడు.
    "భయం ఏమీ లేదు. డాక్టర్ చూశాడు. ఏదో షాక్ లో ఉందన్నాడు.

 Previous Page Next Page