"నమస్కారం డాక్టరుగారూ!" అంటూ శివరామయ్య రెండు చేతుల్తో ప్యాకెట్సు పట్టుకొని పవేశించాడు.
అతడి వెనకే వచ్చి డ్రైవర్ పళ్ళబుట్టలూ, మరికొన్ని ప్యాకెట్లూ తెచ్చి బల్లమీద పేట్టి బయటికి వెళ్ళిపోయాడు.
"నూరేళ్ళు మీకు.....మీ గురించే అనుకుంటున్నాం వచ్చేశారు."
"నాకెందుకు డాక్టరుగారూ నూరేళ్ళు? మీ ఆశీస్సులు మా మానసికి ఇవ్వండి నా బిడ్డను నాకప్పగించారు. ఇంత త్వరలో తగ్గిపోతుందని అనుకోలేదు. మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడంలేదు."
"శివరామయ్యగారూ! మీరోసారి ఇలా వస్తారా ?" డాక్టరు గది బయటకు వస్తూ అన్నాడు.
డాక్టరుగారి ఉద్దేశం గ్రహించిన శివరామయ్య అతడ్ని అనుసరించాడు.
వరండాలో వున్న డ్రైవర్ని పిల్చి "ఆ పళ్ళ బుట్టలు డాక్టరుగారి కారులో పెట్టు" అన్నాడు శివరామయ్య.
"అబ్బే ఎందుకండి? మా ఇంట్లో తినేవాళ్ళెవరూ లేరు. నేనూ మా అమ్మగారే ఇంట్లో వుండేది" మొహమాటపడిపోతూ అన్నాడు ఉదయచంద్ర.
"డాక్టరుగారూ మీకింకా......?"
ఇద్దరూ చివ్వున వెనుతిరిగి చూశారు.
మనసి నిల్చుని వుంది. ఆ ప్రశ్న వేసినందుకు సిగ్గుపడి తలదించుకుంది.
"కాలేదు"
మానసి చివ్వున తలెత్తి డాక్టరు ముఖంలోకి చూసింది.
డాక్టర్ ఉదయచంద్ర అర్ధయుక్తంగా చిరునవ్వు నవ్వాడు.
"వస్తా మనసీ!"
"ఎప్పుడూ."
"నీ పెళ్ళికి" ఉదయ్ నవ్వుతూ అన్నాడు.
"తప్పకుండా రావాలి డాక్టరుగారు. మా అమ్మాయి పెళ్ళికి మీరు రాకుండా ఎలా?" శివరామయ్య అందుకున్నాడు.
ఉదయ్ శివరామయ్య ముఖంలోకి విస్మయంగా చూశాడు.
"సూరిబాబు రెండు నెలల్లో మనసి ముఖంలోకి చూశాడు ఉదయ్.
"అవును డాక్టర్ సూరిబాబు నా బావమరిది కొడుకు. స్టేట్స్ లో ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా వున్నాడు. ఇది నా భార్య కోరిక కూడా. తన మేనల్లుడికి మనసి నిచ్చి పెళ్ళిచెయ్యమని కోరింది." శివరామయ్య చెప్తూపోతున్నాడు.
డాక్టరు మనసిముఖంలో మారుతున్న భావాలను చదువుతున్నాడు. ఆ సంభాషణ అంతటితో ఆపడం మంచిదనిపించి డాక్టరు గది బయటికి వచ్చాడు.
శివరామయ్య డాక్టరుతోపాటు వరండాలో వచ్చాడు.
"నువ్వుండు మానసీ" శివరామయ్య వెనక వస్తున్న మనసిని వారించాడు డాక్టర్ ఉదయ్.
ఆమె ఓ స్మృతిపథంలో మానసి ఆసుపత్రిలో చేరినప్పటి రూపం కదిలింది
చెదిరిపోతున్న చూపులూ, అర్థరహితంగా అయోమయంగా వున్న ఆమె మాటలూ, అనుక్షణం భయ సందేహలను ప్రతిఫలించే ఆమె ఆలోచనలూ......ఓ....ఎంత మార్పు ఆ రూపంవేరు. ఈ రూపం వేరు డాక్టరుకు సంతృప్తిగా అనిపించింది.
ఎంత మార్పు!
ఆమె ముఖంలో ఎంత ప్రశాంతత?
ఆ కళ్ళల్లో ఎంత ఆత్మవిశ్వాసం?
ఉదయ్ చంద్రకు మనసు ఉప్పొంగింది.
తన ఇంత త్వరగా ఆమెలో ఇంతమార్పు వస్తుందని ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు అనుకోలేదు.
ఎంతోమంది రోగుల్ని చూశాడు. చికిత్స చేశాడు. ఎక్కువగా యుక్త వయసులో వున్నవాళ్ళే మానసిక వ్యాధులకు గురి అయి వస్తుంటారు. తను ఎందరికో నయంచేసి పంపించాడు. కాని మానసిక ఆరోగ్యం ఇవ్వగలిగినందుకు తనకు ఏనాడూ కలగనంత ఆనందంగా వుంది. ఎందుకని?
ఎందుకీ సంరంభం తనలో?
ఎందుకీ కలవరం?
పరధ్యాన్నంగా నడుస్తున్న డాక్టర్ ఉదయ్ కు వరండాలో ఓరగా నిలబడి వున్న డాక్టర్ జయంత్ కన్సించి__
"ఓ! సారీ! జయంత్ అక్కడ నిలబడి పోయావేం?"
"ఆఁ ఏం లేదు . మీరు కేసు చూస్తున్నారు గదా...."
"అదేమిటి ? నాకు అసిస్టెంటు కాబోయేవాడివి. నీకు ఈ కేసులన్నీ చూపించాలనేగా ?" తన పొరపాటును సర్దుకొనే ప్రయత్నంలో అన్నాడు.
అంతలో నర్సు వచ్చి "డాక్టర్ రూం పదిలో వున్న సుభద్రమ్మ వెళ్ళిపోతానని గోల చేస్తోంది " అన్నది. ఆమె కంఠంలో వున్న ఆదుర్ధను గ్రహించే మూడ్ లేడు డాక్టర్.
"పోనియ్" అన్నాడు పరధ్యాన్నంగా.
"ఆమె చాలా బ్యాడ్ కండిషన్ లో వుంది డాక్టర్."
"ఓ నువ్వు చెప్పేది సుభద్రమ్మ సంగతా?"
"అవును డాక్టర్."
"ఈ రోజు ఆమెకు ఇ.సి.టి. ఇద్దమనుకొన్నాం గదూ! యూ గెట్ దెమ్ రెడి. నేను వీరితో మాట్లాడి ఇప్పుడే వస్తాను."
డాక్టర్ ఉదయచంద్ర శివరామయ్యను వెంటబెట్టుకొని తన గదిలోకి వెళ్ళాడు. డాక్టరు జయంత్ నర్స్ తో ఇ.సి.టి.కి ఏర్పాట్లు చూడటానికి వెళ్ళాడు.
ప్రిస్క్రిప్షన్ మీద నాలుగు రకాల మందులు వ్రాసి, వాటిని ఎలా వాడాలో శివరామయ్యకు వివరించి చెప్పాడు ఉదయ్.
"చూడండి శివరామయ్యగారూ, ఈ మందులు నాలుగు నెలలదాకా వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మానెయ్యకూడదు."
"అలాగే డాక్టరుగారూ."
చీటీ అందుకొని భద్రంగా జేబులో పెట్టుకొన్నాడు శివరామయ్య.
"ఇహ మానసికి పర్వలేదంటారా? పెళ్ళి చెయ్యొచ్చునంటారా?"
"ఆమె కష్టమైతే."
"సూరిబాబంటే ఆమెకు ఇష్టమేననుకొంటాను డాక్టరుగారూ?"
"మీరు అనుకోవడం కాదు కావాల్సింది. ఆమె అనుకోవాలి."
"అతడంటే చాలా....."
"ఆగిపోయారేం? చెప్పండి ఏమిటి చాలా?"
"చాలా ఇదిగా వుంటుంది."
డాక్టరుకు నవ్వొచ్చింది.
"ఇదిగా వుంటుందా? ఏదిగా వుంటుంది?"
"అదేనండీ. చాలా అభిమానంగా వుంటుంది.
"అభిమానం వుండొచ్చు. అంతమాత్రంచేత ఆమెకు అతడ్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం అని ఎలా అనుకొంటారు? ఆమె అభిప్రాయం తెలుసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మానసిక వత్తిడికి గురికా కూడదు."
"అలాగే డాక్టరుగారూ. వస్తా" అంటూ శివరామయ్య లేచి నిలబడ్డాడు.
డాక్టరు ఉదయచంద్ర కూడా లేచి బయటికి వచ్చాడు.
* * *
4
"రా! జయంత్ చాలా చిత్రమైన కేసు చూపిస్తాను" అంటూ రూం నంబరు పదహారు దగ్గరకు దారితీశాడు. ఆ గది అన్ని గదులకూ చివరగా వుంది. డాక్టర్ జయంత్ అతడిని అనుసరించాడు.
గదికి బయట తాళంవేసి వుంది. డాక్టరు జయంత్ ఆ గది దగ్గరకు రాగానే ఇద్దరు వస్తాదుల్లాంటి వాళ్ళు నిలబడ్డారు. అందులో ఒకడు "తాళం తియ్యమంటారా?" అని అడిగాడు.
"ఊఁ!"
తాళం తెరిచాడు ఒక వస్తాదు.
ఒక పాతికేళ్ళ యువకుడు గోడకు చేరబడి కూర్చుని వున్నాడు. కళ్ళు అగ్ని గోళాల్లా వున్నాయి. "ఫిట్ వచ్చేలా వుంది. జాగ్రత్త!" అన్నాడు వస్తాదులకేసి చూస్తూ వాళ్ళిద్దరూ ఆ కుర్రాడికి చెరోవైపు నిలబడ్డారు.జయంత్ కు ఇదేమీ అర్థంకాలేదు. ఎగ్రసివ్ కేసు లయివుందాలని భావించాడు.
"అనిల్!" డాక్టర్ ఉదయ్ పిల్చాడు.
ఆ యువకుడు పలకలేదు.
"అనిల్! ఎలా వున్నావ్?"
ఆ యువకుడి శరీరంలో ఏవో కదలికలు. ముఖంబిగిసిపోతున్నది. చేతులు కొంకర్లు పోతున్నట్లున్నాయ్.
"ఇది కలా? డాక్టర్ మీరు నిజంగానే వచ్చారా?'
"కల కాదు. నేను నిజంగానే వచ్చాను."
"కాదు కల. నువ్వు కలలోకి వచ్చావ్. కల కాకపోతే నేను ఇలా ఎలా మారిపోతున్నాను?"
"నువ్వేమీ మారడంలేదు."
"మారిపోతున్నాను. నా రూపం మారిపోతున్నది. నాచేతిగోళ్ళు పెరుగుతున్నాయి. చూడండి ఎలా పెరుగుతున్నాయో? ఇవి మనిషి గోళ్ళులా లేపు. నా కళ్ళకు కూడా గోళ్ళు వస్తున్నాయి. ఇవి ఎంతపెద్దగా వచ్చేశాయో చూడండి. ఇవి మనిషిగోళ్ళు కాదు. జంతువు గోళ్ళు."
"నువ్వు జంతువుగా మారడం లేదు. మనిషిని మనిషిగానే వున్నావ్ ? కొంచెం ఆలోచించు" డాక్టరు ఉదయచంద్ర అన్నాడు. అతడి కంఠం ఆర్థ్రతతో నిండిపోయింది.
"అవును. డాక్టర్. నేను ఆలోచించగలుగుతున్నాను. మనిషిలా ఆలోచిస్తున్నాను" అని 'అబ్బా!' బాణం గుచ్చుకున్న జంతువులా అరిచి తలను రెండు చేతులతో పట్టుకున్నాడు అనిల్.
"డాక్టర్ , నా నరాల చిట్లిపోతున్నాయి. కరెంటు వైర్లలా బిగిసి పోతున్నాయ్. నా తల్లో నరాలు ఎవరో పట్టి లాగేస్తున్నారు" అనిల్ లేచి నిల్చునే ప్రయత్నంలో చేతుల్నికూడా నేలమీద ఆనించి జంతువులా నిల్చున్నాడు.
"నేను మారిపోయాను జంతువులా మారిపోయాను."
"ఏం జంతువు? నక్కా?"
"కాదు."
"కుక్కా?"
"కాదు....కాదు"అతడి గొంతు పూర్తిగా మారిపోయింది.
"మరి, ఏ జంతువు? కమాన్ చెప్పు." డాక్టర్ ఉదయచంద్ర రెండడుగులు ముందుకు వేశాడు.
"ఉల్ఫ్ , ఉల్ఫ్ గా మారిపోయాను. తోడేలుగా మారిపోయాను. నేను ఉల్ఫ్ ను. నేను తోడేలును." అరుస్తూ మెలికలు తిరిగిపోయి నేల మీద ఉండచుట్టుకున్నట్టుగా పడిపోయాడు.
వికృతంగా జంతువులా అరుస్తున్నాడు.
డాక్టర్ జయంత్ కు వళ్ళు జలదరించినట్టు అయింది.
అరుపు ఆగింది. మళ్ళీ మాట్లాడసాగాడు.
"నా మెదడు..... వైర్లులాగుతున్నారు. లాగి ముడేస్తున్నారు.ఎవరు? ఎవరు వాళ్ళు? అబ్బా! చచ్చిపోతున్నాను. అవును చచ్చిపోయాను. హాయిగా వుంది" ఊపిరి బిగపట్టి వుండి పోయాడు.
డాక్టర్ ఉదయ్ జయంత్ చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా బయటికి వచ్చాడు. ఆ వెనకే ఒక వస్తాదు వచ్చాడు. రెండోవాడు గడపదాటుతూ వుండగా అనిల్ పట్టుకోబోయాడు. క్షణంలో మెరుపులా అతడ్ని తోసేసి రెండోవాడు బయటికి వచ్చి ఒకసారిగా తలుపులు మూశాడు. రెండోవాడు తాళం వేస్తుండగా లోపలనుంచి తలుపులు బాదుతున్న శబ్దం.
"తలుపులు తెరవండి. ప్లీజ్ డాక్టర్ నేనేమీ చెయ్యను. తలుపులు తెరవండి" ఆగొంతులో క్రూరత్వం లేదు. అర్దింపు వుంది.
"అనిల్ కాసేపు విశ్రాంతి తీసుకో. తరువాత తెరుస్తాం" అన్నాడు డాక్టర్ ఉదయచంద్ర.
"ప్లీజ్ డాక్టర్. నేనిప్పుడు బాగున్నాను. తలుపులు తెరవండీ దబదబ బాదుతున్నాడు.
"అనిల్, లాభంలేదు. నువ్వు విశ్రాంతి తీసుకో. ఓ గంట తర్వాత తలుపులు తెరుస్తాను."
"నో! నో! ఇప్పుడే తెరవండి."
"వీల్లేదు. ఇక అరవకు. మేము వెళ్ళిపోతున్నాం."
"ప్లీజ్ ! డాక్టర్!" తలుపులు కొడుతూనే ఉన్నాడు. ఉదయచంద్ర తన గదికేసి బయలుదేరాడు. జయంత్ మతిపోయిన వాడిలా డాక్టరువెనకే గదిలోకి వచ్చాడు.
"డాక్టర్ ఒక సందేహం " జయంత్ అన్నాడు.
"ఏమిటి?"
"పాపం! అతడు నార్మల్ గా అయి అంత బతిమాలుతుంటే లోపల పెట్టి బంధించారేం?"
"అతను నార్మల్ కాలేదు. ఆ జబ్బుకు వున్న లక్షణమే అది. తలుపు తెరిచిందాకా అతిదీనంగా ప్రాధేయపడ్తారు. తీరా తెరిస్తే ఎదుటి మనిషిని అమాంతంగా పట్టుకొని కొరికేస్తాడు. ఒకోసారి ప్రాణం కూడా తీస్తాడు. పాపం! భార్యను చంపబోయాడు. కొద్దిలో తప్పించుకొంది అయినా వారం రోజులి ఆసుపత్రిలో వుంది. మళ్ళీ తండ్రిని అలాగే చేశాడు. ఆ దెబ్బతో ఇక్కడకు తీసుకొచ్చారు. పది రోజులనుంచి చూస్తున్నాను. ఇలాంటి కేసు నర్సింగ్ హొమ్స్ లో వుండ తగిందికాదు. ఎర్రగడ్డ ఆసుప్రతికి పంపించాల్సిందే బోనులాంటి గదిలో పెట్టాల్సిందే " అని నిట్టూర్చాడు ఉదయ్.
"చాలా చిత్రమైన కేసులా వుంది. ఈ జబ్బుకు ఏమంటారు?"
"లై కాంత్రపి!"
"లై కాంత్రపీ ? ఆ మాట అసలు వినలేదు!" ఆశ్చర్యంగా అన్నాడు జయంత్.
డాక్టర్ ఉదయచంద్ర చిరునవ్వు నవ్వాడు.
"తమాషాకు అంటున్నారనుకొంటా. బహుశా ఈ జబ్బుపేరు..."
"నాకు తెలియదంటావ్....."
"ఆఁ హా అలా అని కాదు."
"అదుగో ఆ బల్లమీదున్న డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అందుకొని చూడు." అన్నాడు ఉదయచంద్ర.
జయంత్ డిక్ష నరీ తీసి చూడసాగాడు. ఒక పేజీలో అతడిచూపులు ఆగిపోయాయి.
"కన్పించిందా?"
"ఆఁ"
"ఏదీ చదువు?"
"Lycanthropy-a symptom of mental disorder, where the individual thinks he is a wolf or other wild animal."
చదివి ఉదయ్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"అర్థం అయిందా? ఈ జబ్బు గుణమే అంత. తాను తోడేలుగానో లేక ఏదో క్రూర మృగంగానో మారిపోయినట్లుగా భావిస్తారు. క్రూరంగా జంతువులాగే ప్రవర్తిస్తారు. కాని ఈ జబ్బు సాధారణంగా రాదు. ఏ కోటి మంది లోనో ఒకరికి వస్తుంది.
"ఈ జబ్బు నయం అవుతుందా?"
"ఇంత సీరియస్ గా ఒక్కసారిగా రాదు. ప్రాసెస్ లో వస్తుంది.ముందు ముందు తాము జంతువుగా మారిపోయినట్టు ఊహించుకుంటారు. ఆ ఊహ కొద్దిక్షణాలు మాత్రమె వుంటుంది. అదిఒక జబ్బుగా భావించరు. తమకు తమాషాకు ఊహ వచ్చిందని మాత్రం భావిస్తారు. అలాంటి ఆలోచనలు రావడంఆరోగ్యకరంకాదనిముందుగానే సైకియాట్రీస్టును చూస్తే ఆ జబ్బు ముద్రకుండా చెయ్యొచ్చు. ఇంతవరకు వచ్చాక చెయ్య గలిగందేమీ లేదు. పదిరోజులుగా అతడ్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తున్నాను. ఓ రెండు గంటల తర్వాత చాలా మామూలుగా వుంటాడు. ఎవర్నీ ఏమీ చెయ్యడు. చాలా బాధపడ్తాడు. కానీ, బాగున్నాడు గదా అని అతడ్ని వదిలెయ్యలేం. ఏ క్షణంలో మళ్ళీ మారిపోతాడో చెప్పలేం."