"నేను అనడం ఏమిటమ్మా? స్పష్టంగా ఊజా బోర్డు మీదకు వచ్చి తానేనని ఆ స్పిరిటే చెప్తేనూ...."
ఒక్కొక్క పదం నొక్కుతూ అన్నాడు సుందర్రామయ్య. ఇలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళకు వాటికి వ్యతిరేకంగా చిన్న మాటను కూడా సహించలేరు.
"ఏమిటి నాన్నా చెప్పింది? నీ మనసులో ఆ ఆలోచన ఉంది. ఆలోచన ప్రకారం మెదడు నాడీ మండలానికి సందేశం పంపింది. అంతే! నువ్వు గ్లాసు తోయడం ప్రారంభించావు.
"నోరుముయ్యరా! గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట."
"నాన్నా! మీలాంటి వాళ్ళకు ఉన్న జబ్బే ఇది. ఇతరులు చెప్పేది వినరు. ఆలోచించరు. అంతవరకేండుకూ? మొన్న నేను అతీత శక్తుల మీద పెట్టిన ఒక మీటింగులో మాట్లాడాను."
"మరి నాకేం చెప్పలేదేంరా?"
"ఇప్పటికే నీ చాదస్తంతో ఇంట్లో అందరం చస్తున్నాం. అమ్మనైతే పూర్తిగా ప్రేత లోకానికి పంపించావు. అదుగో స్పిరిట్ కనిపించింది ఇదుగో ఇక్కడ కనిపించిందంటూ ఉంటుంది."
"అంటే మీ అమ్మ అబద్దం ఆడుతున్నదంటావా?"
"నేను అలా అనలేదు."
"మరి నీ మాటలకు అర్ధం ఏమిట్రా?" కోపం వస్తుంది సుందర్రామయ్యకు.
ఇందుమతి వాచీ చూసుకున్నది. రెండున్నర దాటింది. వాళ్ళు కనీసం అయిదు గంటల వరకూ ఉంటే బాగుణ్ణు అనుకుంది. అందుకే మాటల్ని పొడిగించే ప్రయత్నంలో ఉంది. తండ్రి కొడుకుల వాగ్వివాదం ఆమెకు వినడానికి సరదాగా ఉంది. అంతేకాదు నరసింహారావు చెప్తున్న విషయాలు విజ్ఞానదాయకంగా ఉన్నట్టుగా అనిపించింది. తన అభిప్రాయాలను బలపర్చే మరికొన్ని బలమైన ఆర్గ్యుమెంట్సు దొరకడం సంతోషంగా ఉంది. అందుకే శ్రద్దగా వినసాగింది.
"పాత గోడల మీద సున్నం పోతుంది. లేక రంగు మాసిపోతుంది. అనేక మరకలు పడ్తాయి. సిరా కాగితం మీద ఒలికిపోతుంది వివిధ రకాల డిజైన్లతో మరకలు ఏర్పడతాయి తెల్లటి కాగితాల మీద. మనం ఆ గోడల మీది మరకల్ని కానీ, కాగితం మీద ఏర్పడిన సిరా మరకల్ని కానీ పరీక్షగా చూస్తే, అవి రకరకాల ఆకారాలలో కనిపిస్తాయి.
ఆ ఆకారాలు అందరికీ ఒకేలా కనిపించవు. క్షణానికి ఓ ఆకారం కనిపిస్తుంది.
అందులో మనిషి, ఏనుగు, కుక్క హనుమంతుడు. రావణాసురుడు . విరిగిపోయిన శిల్పాలు కనిపిస్తాయి. ఇవి నాకు చిన్నప్పుడు మబ్బుల్ని చూస్తుంటే కనిపించేవి. నా స్నేహితులు నాతొ ఏకీభవించే వారు కాదు. నాకు ఏనుగు కనిపిస్తే వాళ్ళకు రధం కనిపించేది. ఎందుకని? అలా కనిపిస్తున్నాయి కనక ఆ మబుల్లో ఆ రూపాలు ఉన్నయ్యని అంగీకరిస్తామా?"
"అవునండీ - చాలా చక్కగా చెప్పారు. బహుశా ఆదిమానవులు దేవుళ్ళు ఆకారంలో ఉంటారని భావించడానికి ఈ మబ్బుల్లో వాళ్ళకు కనిపించిన వివిధ రూపాలే కారణాలు అయి ఉండవచ్చును."
"సరిగ్గా నేనూ అలాగే అనుకుంటూ ఉంటాను."
రవి శ్రద్దగా వింటున్నాడు. మధ్య మధ్య ఆలోచిస్తున్నాడు.
సుందర్రామయ్య వాళ్ళ సంభాషణ వింటున్నాడు. కాని, తను వింటున్నట్టుగా వాళ్ళు తెలుసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే చెవులు సంభాషణ మీదనే ఎక్కు పెట్టినా, చేత్తో ఊజా బోర్డు మీదున్న గ్లాసును కదిలిస్తూ కూర్చున్నాడు.
"ఎన్నెన్నో రూపాలు మన మెదడులో కదులుతూ ఉంటై. మనసులో మెదిలిన రూపమే మబ్బుల్లోనూ , పైన చెప్పిన మరకల్లోనూ కనిపిస్తుంది. దీన్నే సబ్జెక్టివిటీ అంటారు. అక్కడ రూపాలు లేవు కనుక అవి ఎక్కువ సేపు నిలవవు. గుర్రం ఆకాశంలో కనిపించిన మబ్బే ఆ తరవాత అజంతా శిల్పం రూపంలో కనిపించ వచ్చును.
ఏ రాత్రి పూటో మనం నిర్జన ప్రదేశంలో ఒంటరిగా వెళ్తూన్నమను కోండి . దెయ్యాలను నమ్మని వ్యక్తికీ కూడా ఒకోసారి ఎవరో తన వెనుక వస్తున్నట్టుగా అనిపించవచ్చు. ఆ భావం రాగానే సన్నగా అడుగుల చప్పుడు కూడా వినిపించవచ్చు. అనుకోకుండా వెనుదిరిగి చూస్తాడు. కాని, ఏమీ కనిపించదు. దయ్యాల్ని భూతాల్ని నమ్మే వ్యక్తికీ అదే అనుభవం అవుతుందనుకొండి అతడు ఏదో అతీత శక్తి తనను వెంటాడుతుందని భయపడ్తాడు. అ భయం నాడీ మండలం మీద పని చేస్తుంది. ఏ చెట్ట, పుట్టో దయ్యంలా కనిపిస్తుంది. మరీ బిగిసిపోతాడు. ఆ దెబ్బతో అతడికి దెయ్యం మాటలు కూడా వినిపించవచ్చు. విజ్యుల్ హేల్యుషనేషన్, ఆడిటరీ హేల్యుషనేషన్ కూడా దారి తీస్తుంది."
"ఇక అపరా నీ గోల! అసలు విషయం చెప్పవేం? సుందర్రామయ్య గ్లాసు కదిలించడం ఆపి అన్నాడు.
"ఏ విషయం?"
"అదే - ఇందుమతి చూసింది కేవలం భ్రమే నంటావా?"
"కాదు - నేను మనిషిని స్పష్టంగా చూశాను. గేటు వేసిన చప్పుడై కదా తిరిగి చూశాను.
"అవును నాన్నా! ఇందుమతిగారు చూసింది ఒక మనిషినే. అయితే అతడు గౌతమ్ కాడు.
రవి తుళ్ళి పడ్డాడు.
అతడి మెదడు చురుగ్గా పని చెయ్యసాగింది.
అంటే? అంటే? అన్నయ్య లాంటి వాడు మరొకడు ఉన్నాడన్న మాట? కొందరు అన్నయ్యను చూసి భ్రమ పడ్డారు. కొందరు ఆ రెండో వాణ్ణి చూసి అన్నయ్యగా భ్రమపడ్డారు. ఆ రెండో వాడి పేరు కూడా గౌతమే అయి వుండాలి.
"ఎవర్నో చూసి అన్నయ్య అనుకోవడం ఏమిటి?" అన్నాడు రవి.
"మీ అన్నయ్యంత ఒడ్డూ పొడవూ ఉన్న వ్యక్తిని మసక చీకట్లో పది గజాల దూరంలో చూశారు ఇందుమతిగారు మీ అన్నయ్యగా భావించారు. పైగా అ సమయంలో ఆమె మెదడంతా గౌతమ్ ఆలోచనలతో నిండి పోయి ఉంది. పైగా యాక్సిడెంట్ జరిగిందని అకస్మాత్తుగా విన్నందువల్ల కలిగిన భయాందోళనలు ఆమె మనసును కల్లోలపరుస్తున్నాయి. అందువల్లనే ఆమెకు ఆ వ్యక్తీ గౌతమ్ లా కనిపించాడు.
"అవును, అంతే!" ఇందుమతి తనకు తనే చెప్పుకొన్నట్టుగా అన్నది.
కాని, ఆమె మనసు మాత్రం మరో వ్యక్తిని తను చూసినట్టు అంగీకరించడం లేదు.
ఆ నడక, ఆ ముఖం అంతా గౌతమ్ లాగే ఉన్నాడు. తను ఎవర్నో చూసి ఉండడం నిజమే. కాని గౌతమ్ లాగే అచ్చం అతడి పోలికలతో మరో వ్యక్తీ ఉండటం సంభవమా? ఉంటే ఎవరై ఉండొచ్చు? ఎందుకు ఈ ఇంటికి వచ్చి ఉంటాడు? అతణ్ణి చూసి అన్నపూర్ణమ్మ ఎందుకు భయపడి పోయింది? అతడూ అన్నపూర్ణమ్మ కొడుకే అయి ఉండాలి. ఆమె అంత స్కేర్ కావడానికి కారణం?
"ఏరా! ఈ అతీత శక్తుల్ని నమ్మే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళనీ, నీ మాత్రం ఆలోచించలేరనీ నీ అభిప్రాయమా?"
"కాదు, నాకంటే తెలివైన వాళ్ళు. మానవుని ఆలోచనా స్రవంతిలో భాగంగా బయలుదేరిన దైవభావం చివరకు ఇంతింత అయి, అతన్నే బానిసగా చేసుకుంది. చావు పుట్టుకలు గురించిన జిజ్ఞాస - ప్రకృతి శక్తులంటే ఏర్పడిన అభయం - దైవానికి మూల ఆధారం. సామాన్య మానవుడి అజ్ఞానాన్ని, భయాన్నీ తెలివైన వారు కాష్ చేసుకొన్నారు. మోసగాళ్ళూ, విజ్ఞాన సంపన్నులూ, సోమరులూ, పరాన్న భక్కులూ దేవుని చుట్టూ కొన్ని నియమాలు అల్లి , అవే పరమ సత్యాలుగా నమ్మించి, ఈ దోపిడీ వ్యవస్థను సృష్టించారు."