Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 47


    విశాలాక్షి ఆనందంగా పురంధరవైపు చూసింది.
    
    పురంధర తృప్తిగా చూసుకుని భర్తవైపు తిరిగి గర్వంగా కళ్ళెగరేసింది.
    
    నారాయణమూర్తి అప్పటికే మాధవ్ దగ్గరికి వెళ్ళి వీపు తట్టి 'సెభాష్' అన్నట్లు నవ్వాడు.
    
    విశాలాక్షి రాధని కన్నార్పకుండా చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ వుంటే పురంధర బెదురుగా ఆమె జబ్బ పట్టుకుని ఆపేసింది.
    
    రాధ లేచి కళ్ళెత్తి చూసింది.
    
    "రాధా....! రామ్మా, వేళ మించిపోతోందీ....!" అని శాంత కేకేసింది.
    
    ప్రకాశం దగ్గరకొస్తూ "పద.... పద" అన్నాడు.
    
    రాధ రెండు అడుగులు ముందుకువేసి చేతిలోని పూలసజ్జని వదిలేసింది.
    
    "అయ్యయ్యో.... పూలన్నీ నేలపాలయ్యాయి! ఏరు" అన్నాడు ప్రకాశం.
    
    రాధ కిందకి వంగి పూలని ఏరే నెపంమీద విశాలాక్షీ, పురంధరా, గోవిందరావుల కాళ్ళని తాకి నెమ్మదిగా పూవులను గుప్పెటలో బిగించి వాటిని కళ్ళకి అద్దుకుంది.
    
    ఆ చర్యకి వాళ్ళ కళ్ళల్లో ఆనందాశ్రువులు నిండాయి. ఎంత నేర్పుగా పాదాలాంటి నమస్కరించింది!
    
    కిందపడ్డ పూవులను కళ్ళకి అద్దుకున్నట్లే గోచరించింది ప్రకాశానికి. "చాల్లే... ఇంకా, పద" అన్నాడు.
    
    విశాలాక్షి, పురంధరా కళ్ళతోనే దీవించారు.
    
    గోవిందరావూ చిరునవ్వుతో చూశాడు.
    
    ఇదంతా దూరంనుండి మాధవ్ అపురూపంగా చూసుకున్నాడు.
    
    రాధ వాళ్ళముందు నుండే ఏమీ తెలియని ముగ్ధలా తల వంచుకుని వెళ్ళిపోయింది.
    
    మాధవ్ చెట్టుచాటునుండి వచ్చి "ఎలా ఉంది అత్తయ్యా?" అన్నాడు.
    
    విశాలాక్షి మాట్లాడలేదు. మాధవ్ తలను వంచి ముద్దు పెట్టుకుంది. ఆమె రెండు కళ్ళూ నీటి ఊటలయ్యాయి.
    
    సౌందర్యం, వివేకం, వినయం ఒకచోటనే కుప్పపోసినట్లుగా ఉందిరా, మాధవ్!" అన్నాడు నారాయణమూర్తి.
    
    గోవిందరావు పురంధరని ఉడికిస్తూ.
    
    "ఇప్పటిదాకా మన వంశంలో తనంత అందమైన కోడలు లేదనుకుని గర్వపడేదిరా మీ పిన్ని! ఇప్పుడిక ఆ ఛాన్స్ లేదు!" అన్నాడు.
    
    పురంధర మాధవ్ ని ప్రేమగా చూసుకుంటూ, మాధవ్ కి తగ్గ ఆ పిల్లని ఆ బ్రహ్మదేవుడు సృష్టించాడో లేదోనని తెగ బెంగపడ్డాను. ఇప్పుడిక ఆ బెంగలేదు!" అంది.
    
    "వచ్చిన పని అయిందిరా... ఇక బయలుదేరుదామా!" అడిగాడు నారాయణమూర్తి.
    
    వెనక్కి తిరిగి కుడిచేతిని పెదవులకు చేర్చి ముద్దు పెట్టుకుని గాల్లోకి విసిరేశాడు మాధవ్.
    
    ఎన్నో పదుల తలలమీదుగా వస్తున్న దాన్నలా ఘనంగా పట్టి స్వంతం చేసుకోవడానికి రాధ ప్రయాసపడింది! ఎట్టకేలకి అది వచ్చి సూటిగా ఆమె గుండెల్ని తాకి... నుగ్గునుగ్గు అయి ఆమె తనువునిండా రాలి పడింది.
    
    తిలక రాధ భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకి తీసుకుని ఆమె ఆ భారానికి పడిపోకుండా నిలదొక్కుకునేలా సాయపడింది.
    
                                                               * * *
    
    "నిలబడగానే పైకి పోతామా? నాకు భయం... నేను రాను, మెట్లెక్కడున్నాయో చెప్పు బాబూ!" పార్వతమ్మ బతిమాలింది రామ్ బల్ ని.
    
    రామ్ బల్ 'కి.....స్...స్...' అని శబ్దం వచ్చేట్లు నవ్వాడు. అతను మాధవ్ కుదిర్చిన మేనేజర్. శుద్దమైన ఆంధ్రుడైనా చాలా ఏళ్లకిందటే బొంబాయిలో స్థిరపడిపోవటంవల్ల బలరామయ్య అనే పేరుని రామ్ బల్ గా మార్చుకున్నాడు. అతను నవ్వితే సోడా సీసాలోంచి గాస్ వస్తున్న శబ్దం వస్తుంది.
    
    "అమ్మా! ఓ లిఫ్ట్ హై... అది లిఫ్ట్ ఆప్ చిడీ చడ్నేకి జరూరత్ నై! - మీరు మెట్లెక్కాల్సిన అవసరం లేదు, డర్నేకీ కొయీ బాత్ నై! భయపడాల్సిన అవసరం లేదు....!"
    
    అతనికి అడ్డొస్తూ సుబ్బారాయుడు "ఏదో ఒక భాషలో మాట్లాడవయ్యా చాలు!" అని పార్వతమ్మతో, "పదవే... పదహారు అంతస్తులు మెట్లెక్కితే చచ్చి ఊరుకుంటావు!" అన్నాడు.
    
    ఆమె భయంగా "ఒకసారి మెట్లెక్కి పైకి వెళ్తే... మళ్ళీ కిందికి రావడం ఎలా?" అంది.
    
    "ఇందులోనే!" ఆనందంగా అన్నాడు సుబ్బారాయుడు.
    
    "ఇది మధ్యలో ఆగిపోతే...!" అనుమానంగా అడిగింది.
    
    "హఠీయే... హఠీయే భాయ్!" అంటూ కూరగాయలవాళ్ళూ, పాలవాళ్ళూ వీళ్ళని అటూ ఇటూ తోస్తూ హడావుడిగా లిఫ్ట్ లో ఎక్కేస్తున్నారు.
    
    "మీరింత పెద్దమనిషి... ఇక్కడ నిలబడితే మర్యాదా మన్ననా లేకుండా "హడీ... హడీ...!" అంటూ తోసిపారేస్తారేవిటండీ?" చిరాగ్గా అంది పార్వతమ్మ.
    
    రామ్ బల్ వెంటనే "ఆలస్యం చేయకండమ్మా! ఇక్కడ జనానికి అన్నీ వుంటాయి టైమ్ తప్ప! మనం దారి ఇవ్వకపోతే తిన్నగా పోలీస్ కి ఫోన్ చేసి న్యూసెన్స్ కేసు పెడతారు!" అన్నాడు.
    
    "పోలీసులా?" ఆవిడ ఇంకా భయంగా అడిగింది.
    
    సుబ్బారాయుడు తన చెయ్యి అందిస్తూ, "పార్వతీ! నా చెయ్యి పట్టుకుని నిలబడు. ఎంతా.... రెండు నిమిషాల్లో అయిపోతుంది!" అంటూ ధైర్యం చెప్పాడు.
    
    ఆమె కళ్ళు మూసుకుని "శ్రీరామచంద్రా.... నారాయణా....! ఎన్ని కష్టాలు వచ్చాయిరా, నాయనా!" అంటూ కళ్ళు మూసుకునే లిఫ్ట్ లో అడుగుపెట్టింది.
    
    "కళ్ళు తెరు.... వచ్చేశాం!" అన్నాడు సుబ్బారాయుడు. అతనికి మాత్రం గొప్ప థ్రిల్ గా వుంది.
    
    "మనిల్లు ఎక్కడా?" అడిగాడు రామ్ బల్ ని.
    
    "ఇల్లు కాదండీ, ఫ్లాట్!" సవరించాడు రామ్ బల్. "మూడు వందల ఇరవై నంబర్!"
    
    ఎదురుగా ఓ సర్దార్జీ పిల్లలని తీసుకుని వస్తూ, రామ్ బల్ ని పలకరించాడు "సత్ శ్రీ కాల్, రామ్ బల్జీ!"
    
    "సత్ శ్రీకాల్, అజిత్ సింగ్ జీ! రామ్ బల్ కూడా ప్రతిగా అన్నాడు.
    
    అతను వెళ్ళిపోయాక ఫ్లాట్ తాళం తీస్తూ చెప్పాడు "అతను అజిత్ సింగ్! మీ పక్కింటి అతను!"
    
    ఒక అమ్మాయి భుజాలు కనిపించే షర్టు వేసుకుని, మోకాళ్ళు కనిపించేలాంటి నిక్కరు వేసుకుని అవతలి ఫ్లాట్ లోంచి బయటకు రావడం చూసి అడిగింది పార్వతమ్మ.

 Previous Page Next Page