Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 48


    
    "పాపం - హడావుడిలో పైన వేసుకునే బట్టలు మర్చిపోయి, లోదుస్తులతోనే వెళ్ళిపోతున్నట్లుంది! పిలిచి చెప్దామా?"
    
    రామ్ బల్ 'కి...స్...స్' మని నవ్వాడు.
    
    సుబ్బారాయుడు మాట్లాడకుండా ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే అటే చూస్తూ నిలబడ్డాడు.
    
    "లోపలకు రండి!" భర్తని మోచేత్తో పొడుస్తూ అంది పార్వతమ్మ.
    
    "ఈ సిటీకి, స్వర్గానికీ పెద్ద తేడా లేదే! ఎటు చూసినా అప్సరసలే!" ఆనందంగా అన్నాడు సుబ్బారాయుడు.
    
    "స్వర్గం కాదు, త్రిశంకుస్వర్గం!" కాస్త కోపంగా అంది పార్వతమ్మ.
    
    "కుడికాలు ముందు పెట్టు!" ఆమె భుజంమీద చెయ్యివేస్తూ మురిపెంగా అన్నాడు సుబ్బారాయుడు.
    
    భర్త అనుచిత ప్రవర్తనకి ఆమె సిగ్గుపడి దూరం జరిపి కళ్ళతో మందలింపుగా చూసింది.
    
    బాల్కనీ తలుపు తెరుస్తూ చెప్పాడు రామ్ బల్... "అదిగో... ఆ ఎర్రరంగు వేసినవే స్వర్ణాంద్రా ఫ్లాట్స్ అక్కడ చాలా మంది తెలుగువాళ్ళు వుంటారు. మీరు స్థిమితపడ్డాక తీసుకెళ్ళి పరిచయం చేస్తాను!"
    
    'తెలుగు' అన్నమాట వినగానే పార్వతమ్మ మొహం విప్పారింది. "అలాగా, అన్నయ్యగారూ! ఎంత మంచిమాట చెప్పారూ? మరి మమ్మల్నీ అందులోనే ఉంచక ఈ సత్రంలో ఉంచారేం?" అంది.
    
    సుబ్బారాయుడు విసుగ్గా చూస్తూ "అబ్బా! ఇక్కడా ఆ తెలుగు వాళ్ళూ... ఆ పల్లెటూరి వాసనలేనా? అక్కర్లేదు!" అన్నాడు.
    
    ఆమె అశోకవనంలో సీతాదేవిలా చిన్నబోయి చూసింది.
    
    "అమ్మా... అదిగో వంటిల్లు సమస్తం తెప్పించి పెట్టాను. పని మనిషి వచ్చి అన్ని పనులూ చేస్తుంది. ఇంకేమైనా కావాలంటే ఇదిగో ఈ నంబర్ కి ఫోన్ చేస్తే చాలు, క్షణంలో వస్తాను. ఈ కిందనే ఉండేది!" అన్నాడు.
    
    "పార్వతీ... పారూ... పా..." అంటూ సుబ్బారాయుడు పెట్టిన కేకలకి ఇద్దరూ ఉలిక్కిపడి అటు వెళ్ళారు. అతను ఆనందంగా "పారూ! ఇక్కడ నిలబడి కిందకి చూడు, మనం ఎంతపైన ఉన్నామో తెలుస్తుంది!" అన్నాడు.
    
    ఓ విమానం అది దగ్గరికి వచ్చేస్తున్నట్లుగా వచ్చేస్తోంది.
    
    "పార్వతమ్మకి.... కిందకి చూస్తే చీమల్లాంటి మనుషులూ, పైకి చూస్తే రాక్షసి బల్లిలా వచ్చేస్తున్న విమానం... కళ్ళు తిరిగిపోయాయి. భర్తని ఆసరాగా చేసుకుని తూలిపడకుండా నిలదొక్కుకుంది.
    
    "అప్పుడే పట్నం వాసనలొచ్చాయే... పట్టపగలే.... అందరిముందూ చెయ్యి పట్టుకుంటున్నావ్?" సరసంగా అన్నాడు సుబ్బారాయుడు.
    
                                                         * * *
    
    "హాయిగా గోదార్లో మునిగి స్నానం చేసేవాడికి కురచగా ట్యూబ్ నుంచి వచ్చే నీళ్ళతో స్నానం.... ఎంతసేపూ ఈ నాలుగ్గోడల మధ్యా గుడుగుడు గుంచంలా తిరగడం తప్ప ఒక వీధా, ఒక పెరడా..... మొక్కా మొటికా....!" గోరుచిక్కుడు కాయలు ఒలుస్తూ అంది పార్వతమ్మ.
    
    "పారూ! ఆ తైనాతీగాడు రాకముందే ఏదైనా బజారు పనుంటే చెప్పు! వెళ్ళి తీసుకొస్తాను ఎన్ని చుట్టలు కాల్చినా, ఈ టీవీలో ఎన్ని బొమ్మలు చూసినా రోజు గడవడంలేదే!" అన్నాడు సుబ్బారాయుడు.
    
    "రామబలన్నయ్యని తైనాతీ అంటారు గానీ, ఆయనే లేకపోతే ఈ అడవిలో మనం ఏమైపోతామో ఆలోచించండి! ఇదేం మనుషులు.... ఇదేం సంతో....! అయ్యబాబో.... నిన్న పక్కింటావిడ్ని చూసి నవ్వుతూ, "రండి!' అని పిలిచాను, ఆవిడ మొహం గంటు పెట్టుకుని రామబలన్నయ్యని పిలిచి ఏదేదో మాట్లాడింది. అన్నయ్య నాతో 'రండి' అని ఎవరినీ పిలవకూడదు, అది చాలా తప్పు మాట అని చెప్పాడు. ఆ మాట కాక, మరో మాట ఏవుంది పిలవడానికి నా మొహం!" విసుగ్గా అంది పార్వతమ్మ.
    
    సుబ్బారాయుడు హుషారుగా "ముందు నన్ను బజారుకి వెళ్ళిరానీ.... కూర్చుని కూర్చుని కాళ్ళు ఇనుపదిమ్మెల్లా తయారయ్యాయి రోజూ పొలం గట్లమ్మట మైళ్ళు మైళ్ళు నడిచే అలవాటు!" అన్నాడు.,
    
    "భూతాల స్వర్గంలో పనీ పాటా చెయ్యక్కరలేదు మరి!" అంది.
    
    "భూతాల స్వర్గం కాదే... భూతలస్వర్గం! వుండు, నే వెళ్ళి చుట్టుపక్కల ఏవున్నాయో చూసొచ్చి నిన్నూ తీసుకెళ్తాను!" అని మీద కండువా వేసుకుని బయలుదేరాడు సుబ్బారాయుడు.
    
    "తప్పిపోతారేమో, జాగ్రత్త!" బెదురుగా అంది పార్వతమ్మ.
    
    "నేను పాలు తాగే పసోడ్ని కాదు, మోతుబరి సుబ్బారాయుడ్ని!" అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు.
    
    పార్వతమ్మకి అంతా వింతగానే వుంది. కలుగుల్లోంచి ఎలుకల్లా బయటపడి పిల్లలూ, పెద్దలూ అంతా ఆ అగ్గిపెట్టె భవంతుల్లోంచి వీధిన పడతారు. అప్పట్నుంచీ అంతా నిశ్శబ్దం! వరండామీదకొచ్చి ముచ్చట్లాడకపోతే మానెయ్... కనీసం వాకిలి తలుపులు కాసేపు తెరచి కూడా ఉండనీయరెవరూ! అమ్ముకునే వాళ్ళ అరుపులు వినిపిస్తాయి కానీ, చౌకీదార్ వాళ్ళని పైకి రానివ్వదు. పనిపిల్ల సినిమా హీరోయిన్ లా తయారైవస్తుంది. దాని భాష తనకి రాదు. తను సైగలుచేసి "కాఫీ తాగుతావా" అంటే, అది 'ఛా' అంది. అంత అసహ్యించుకోవాలా? వద్దు అని చెప్పవచ్చుగా!
    
    వచ్చిన తర్వాత ఒకరోజున రామ్ బల్ బజారుకి తీసుకెళ్ళాడు ఆ విశాలమైన రోడ్లూ, జోరుగా తిరుగుతున్న బస్సుల్నీ, కార్లని, స్కూటర్లనీ చూస్తే ఆమెకి కళ్ళు తిరిగిపోయాయి. రోడ్డు అవతలినుండి ఇవతలకి దాటే లోపు ఏ బస్సో ఢీ కొట్టి చావడం ఖాయం అనిపించి ఆపకుండా రామనామజపం చేసింది. బస్సెక్కి ఆడాళ్ళ సీటులో కూర్చోగానే ఠపీమని ఎవడో వచ్చి పక్కన చతికిలపడ్డాడు. పుట్టి బుద్దెరిగాక పరపురుషుడ్ని తాకలేదు.... ఇదెక్కడి ఖర్మరా 'ఓరి నాయనోయ్.... ఓరి దేవుడో....' అని కేకలు పెడితే, రామ్ బల్ వచ్చి "ఇక్కడ పద్దతి అంతే! అలా అరవకూడదు. అందరూ మననే వింతగా చూస్తున్నారు!" అన్నాడు.
    
    "ఏం పద్దతి...! మాయదారి పద్దతి! ముదనష్టం పద్దతి!" అని తను లేచి నిలబడింది.
    
    ఒక్కపిల్లకీ జబ్బలదాకా జాకెట్టులేదు. పైటలేసుకోవడం చాలా తక్కువ. జుట్లు పొట్టి కత్తెరేసుకుని చెంపలకీ, పెదాలకీ రంగులు పూసేసుకుని తయారైపోయారు. అసలు ఇల్లు మళ్ళీ చేరతామా అని గుండెలు చేత్తో పట్టుకునే ఉంది వచ్చేదాకా.
    
    ఇద్దరు మనుషులకి వంట చేయడం అంటే ఆమెకి లక్కపిడతల ఆటలా ఉంది. పొద్దుట్నుండీ రాత్రి వరకూ వంచిన నడుం ఎత్తకుండా అందరితో గలగలా మాట్లాడుతూ చాకిరీ చేయడం అలవాటైన మనిషికి ఇలా ముడుచుకు కూర్చోవడం మహా విసుగ్గా ఉంది. అక్కడ వరదరాజపురంలో... ఈ పాటికి శాంత ఏం చేస్తుందో? రాధ అన్నం తిన్నదో లేదో? అత్తగారికి తైలం రాస్తున్నారో లేదో? గణపతి ఇంటిపట్టునుంటున్నాడో లేదో.... తిలక ఇంగ్లీషు నేర్పించడం అయిపోయి పట్నం వెళ్ళి పోయిందో ఏమో? ఉత్తరం రాయాలి అనుకుంది. ఆమెకి తన ఊరూ, ఇల్లూ, వాకిలీ, గొడ్డూ గోదా గుర్తొచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళూరాయి.

 Previous Page Next Page