"ఇంకా ఏమిటి?" అడిగాడు గణపతి.
"నేనేం ముగ్గు వెయ్యను గణపతీ?" అల్లరిగా అడిగింది.
గణపతికి అర్ధం అవడానికి ఒక నిమిషం పట్టింది! అర్ధం అవగానే అతని మొహం వెలిగిపోయింది.
"ఇంకేం వేస్తావు? ఎప్పుడో దించావుగా ముగ్గులోకి!" అన్నాడు.
తిలక కూడా అందంగా సిగ్గుపడగలదని అతనికి ఆరోజే తెలిసింది.
* * *
పసుపు రాసుకుని తలంటోసుకున్నట్లు కళకళలాడుతున్నాయి ఆవచేలు!
"చలిమిడీ, చిమ్మిరీ, పానకం, వడపప్పూ... అన్నీ సర్దాలా?" బండి కదులుతుండగా అడిగాడు ప్రకాశం శాంతని.
"ఆఁ, అన్నీ సర్దాను తిరునాళ్ళలో చేతులనిండా పచ్చగాజులు వేయించుకోవే, రాధా!" అంది శాంత.
"మరి నాకో"? బుంగమూతి పెట్టి అడిగింది తిలక.
"మగరాయుడివి నీకు గాజులెందుకూ?" ఆటపట్టిస్తూ అంది శాంత.
"చీర కట్టుకున్నానుగా పిన్నీ... ఇంకా మగరాయుడంటావేం?" అడిగింది తిలక.
"పైటేసుకోవడం, గోరింటాకు పెట్టుకోడం, అట్లతద్దె నోము నోచడం సరే...రాధకి ఇంగ్లీషు నేర్పడం ఎందాకా వచ్చిందసలూ?" అడిగాడు చుట్ట వెలిగిస్తూ ప్రకాశం.
"ఓఁ.....! బోలెడు ఇంగ్లీషు... గడగడా మాట్లాడేస్తుంది. ఏదైనా సరే జవాబిస్తుంది. అడిగి చూడండి!" ధీమాగా అంది తిలక.
రాధ తడుముకోకుండా చెప్పింది "ద వర్త్ ఈజ్ రౌండ్ ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డు! సైలెన్స్ ఈజ్ గోల్డు! బ్రౌన్ గర్ల్ ఇన్ ద రైన్... జింగిల్ బెల్స్... జింగిల్ బెల్స్ ఆల్ ద వే! ఐ లవ్ ఇండియా!"
రాధ అంత ఇంగ్లీషు మాట్లాడుతూ వుంటే శాంతా, ప్రకాశం కళ్ళు వెడల్పు చేసుకుని అబ్బురంగా చూశారు. ప్రకాశం గట్టిగా చప్పట్లుకొట్టి, "అదరగొట్టేశావమ్మా! అమెరికా దొరసానులు కూడా నీధాటికి నోళ్ళు తెరుచుకు చూడాల్సిందే!" అన్నాడు.
"య్యా... య్యా... చూడకేం చేస్తారు పాపం!...." అంది తిలక.
"నాకూ నేర్పించకూడదూ..." కాస్త సిగ్గుపడుతూ అడిగాడు ప్రకాశం.
"ఆఁ... ఆఁ.... అలాగే! మీ ఇంటిల్లిపాదికి నేర్పించి కానీ వెళ్ళను!"... అంటూ రాధని మోచేత్తో పొడిచి అభినందనగా చూసింది.
రాధ వెంటనే "ఆస్ట్రిచ్, పారట్, క్రో, స్పారో ఆర్ సమ్ ఆఫ్ ది బర్డ్స్.... పెసిఫిక్ ఓషన్ ఈజ్ వెరీ లార్జ్... వాస్కోడిగామా వెంట్ టు డ్రామా వితౌట్ పైజామా." అని ఇంకా ఏదో చెప్పబోతుంటే తిలక ఆమె నోరు తన చేత్తో మూసి, "ఇట్స్ ఓకే!.... ఇట్స్.... ఓకే....ఫర్ టుడే రీస్ మన్ ఈజ్ ఇనఫ్!" అంది భయంగా.
రాధ కిసుక్కున నవ్వింది!
"ఈసారి ఆ మాధవ్ కనిపించినప్పుడు అదరగొట్టెయ్యవే రాధా!" పొంగిపోతూ అంది శాంత.
తిలక ఆ దృశ్యాన్ని వూహించుకుని పకపకా నవ్వింది.
"పిచ్చయ్యశాస్త్రిగారి పర్వతం కూడా వచ్చి ముగ్గుపెడితే ఈ ఏడైనా పెళ్ళవుతుందేమో పాపం..... పేరు సార్ధకం అయ్యేట్లు లావయిపోవడం దాని తప్పా? దాన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది" నిజాయితీగా బాధపడింది శాంత.
"ఆ ఘడియొస్తే ఈ పర్వతాన్ని వెతుక్కుంటూ ఇంకో శిఖరం ఎవడో రాకపోడులే! మధ్య నీకెందుకు దిగులు?" నవ్వుతూ అన్నాడు ప్రకాశం.
పందిళ్ళు వేశారు. పొంగళ్ళు పెట్టారు! అందాలభామలు అరుగులు కడిగితే, ముసలి ముత్తయిదువలు మంగళారతులు పాడారు. కడుపు పండించమని నాగమ్మకి పడుచు ఇల్లాళ్ళు పాలుపోశారు. కలలు పండించమని కన్నెపిల్లలు రంగుల రంగవల్లులు దిద్దారు.
ఎక్కడ చూసినా సందడి. అందెల సవ్వడి..... ఎటుకదిలినా కన్నెల దడి....కదలకపోతే కుర్రకారుకి అలజడి.
అంతమందిలోనూ మాధవ్ కోసం రాధ కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి.
కొమ్ముబూర కీ.....చుమంటూ చెవిలో మోగేసరికి ఉలిక్కిపడి చూసింది.
తిలక నవ్వుతూ, "అటు చూడు" అంది.
చూసిన రాధ గుండె జల్లుమంది.
మాధవ్ చెట్టుచాటునుండి నవ్వుతూ చూశాడు. అతని వెనకాల పట్టుచీరల్లో యిద్దరు ఆడవాళ్ళూ... పాంటూ షర్టుల్లో ఇద్దరు మగవాళ్ళూనూ!"
తిలక ఆమెను తట్టి "ఇటు చూడు" అంది.
చూడగానే రాధకి గుండె గుభిల్లుమంది.
పర్వతం ఒంగి పల్లకీ ముగ్గు వేస్తోంది.
మాధవ్ వాళ్ళూ ఇటే వస్తున్నారు.
ముందుగా విశాలాక్షి చూసింది. పక్కనున్న పురంధరిని తట్టి ముగ్గుపెడుతున్న పర్వతాన్ని చూపించింది.
"పల్లకీ ముగ్గు... ఆ అమ్మాయే!" అంది పురంధరతో.
పురంధర తెల్లబోయి చూస్తూ నిలబడింది.
మాధవ్ కాదని సైగ చేయబోతూండగా ప్రకాశం కనిపించాడు. వెంటనే చెట్టుచాటుకి తప్పుకున్నాడు.
నారాయణమూర్తి విశాలాక్షి పక్కకువచ్చి "పిల్ల కాస్త ముదురుగా ఉంది కదూ!" అన్నాడు.
"కాస్త ముదురా!!" ఆమె భర్తవేపు చురచురా చూసింది. పర్వతం భారంగా కదులుతోంది.
గోవిందరావు కూడా అయోమయంగా పురంధరవేపు చూసి "మోడల్ లా లేకపోతే మానెయ్.... రీమోడలింగ్ చేయాల్సినంత పాత సరుకులా ఉందేమిటీ?" అంటూ ఉండగానే పురంధర మాట్లాడకుండా అటుచూడమని సైగచేసింది.
పల్లకీ ముగ్గు మధ్యలో చిన్న మాధవుడి బొమ్మ వేస్తోంది రాధ ఒక కాలు మడిచి ఆమె కూర్చుని ముగ్గువేస్తుంటే ఆమె చెవిజూకా నాజూగ్గా బాలగోపాలుడ్ని ఊపే ఊయలలా ఊగుతోంది.
భుజంమీదుగా ముందుకు పడి.....చెయ్యి కిందుగా ప్రదక్షిణం చేసి వచ్చిన జడచివర కుప్పెలు... ఆస్వామికి కుచ్చులతురాయిలా వున్నాయి. బుట్టలూ కింద పరచుకున్న పట్టుపావడా బృందావన స్వామికై అమర్చిన పూలశయ్యలా ఉంది.
ఆ వేణుమాధవుడే స్వయంగావచ్చి ఆ పాలుగారే చెంపమీద చిటికేశాడా అన్నట్లు సొట్ట పడుతోంది.
"భలే వేశావే రాధా!" అంది పర్వతం.