"నాకేం ఫర్వాలేదండీ! అంత తేలికగా పోదీ మొండిప్రాణం. నా జూలీని ఒక్కసారి చూడనివ్వండి" ఏడుస్తూ అంది కాంచన.
"అమ్మగారికి ఎవరు చెప్పారు?" చయవైపు అనుమానంగా చూస్తూ అంది రత్నం.
చాయ నిర్లక్ష్యంగా చూసింది.
"అమ్మా.....ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్" సంధ్య భయంగా అంది.
కాంచన దుఃఖం పెరిగిపోయింది.
"అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు ప్రాణి. ఎందుకిలా అర్దాంతరంగా పోయిందో, ఏ మాయదారి కళ్ళు పడ్డాయో" రత్నం శోకాలు పెడుతూ అంది.
చాయ కనుబొమ్మలు చిట్లించి "ఏం రోగమో మనకెలా తెలుస్తుంది? నిన్న సాయంత్రంనుండీ అదోలా వుంది పాపం" అంది.
జయచంద్ర కాంచనను లేవదీస్తూ "రామయ్యా! త్వరగా కానియ్యి" అన్నాడు.
"కుక్కపిల్ల పోతే ఇంతలా ఏడవాలా? వెయ్యి రూపాయలు పారేస్తే ఇంకోటి దొరుకుతుందిగా? సెంటిమెంటల్ బ్రూట్స్" అనుకుంది చాయ.
"ఈ ఇంటికి ఏదో శనిపట్టింది రామయ్యా! శాంతి జరిపించాలి. మంచి అయ్యవారిని చూడు" కళ్ళు తుడుచుకుంటూ అంది రత్నం.
"శాంతి!!" నవ్వుకుంది చాయ.
* * *
"మీ కోసం ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది" చెప్పింది నర్స్ కిరణ్ తో.
అతను పొత్తికడుపుకి బేండేజ్ తో బెడ్ మీద వున్నాడు.
కిరణ్ కళ్ళల్లో మెరుపు చోటుచేసుకుంది.
"ఎవరు చాయేనా?" ఆశగా అడిగాడు.
నర్స్ అతనివైపు విచిత్రంగా చూసింది. అతను హాస్పిటల్ లో వున్న ఆ వారం రోజుల్లో ఆ ప్రశ్న అడగడం వందోసారి.
"కాదు.....దయామణిట. మీరు నిద్రపోతున్నారని చెప్పాను. మళ్ళీ చేస్తానంది." అతని కళ్ళల్లో నిరాశను గమనించి "చాయ ఎవరు సార్?" అనడిగింది.
కిరణ్ తడికళ్ళతో ఆమెవైపు చూసాడు.
"ఎవరా? ఆమె నా దేవత. ఆమెకోసమే నేను యముడితో యుద్ధంచేసి తిరిగొచ్చాను" అన్నాడు.
"లవరా?" కుతూహలంగా అడిగింది నర్స్.
కిరణ్ తలవూపి "నా ప్రాణం" అన్నాడు.
"మరి ఒక్కసారి కూడా రాలేదేం? కబురు అందలేదా?" అడిగింది నర్స్.
"అంది వుండదు" చెప్పాడు కిరణ్.
"అడ్రెస్ గానీ, ఫోన్ నెంబర్ గానీ ఇవ్వండి. నేను ప్రయత్నిస్తాను" జాలిగా అంది.
"నాకు తెలిసిన అడ్రస్ లో ఆమె లేదేమో?" భారంగా అన్నాడు కిరణ్.
"మీ బాధ చూస్తుంటే ఆమె మీద కోపంగా వుంది" అంది రవ్వంత కోపంగా నర్స్.
"నా చాయమీద ఎవరు కోపం తెచ్చుకున్నా నేను భరించలేను" గట్టిగా అన్నాడు.
నర్స్ నవ్వింది. "మూడు రోజులు మృత్యువుతో పోరాడి తిరిగి వచ్చారు. ఇంతలోనే ఇంత శక్తి వచ్చిందా? అరుస్తున్నారు" అంది.
"ఎలా తిరిగివచ్చానో తెలుసా? నా ప్రేమవల్ల నా ప్రేమముందు మృత్యువు కూడా ఓడిపోయింది" చిరునవ్వుతో అన్నాడు.
"ప్రేమలో అంత శక్తి వుందా?" బుగ్గన చెయ్యి చేర్చుకుని ప్రక్కనే వున్న స్టూల్ మీద కూర్చుంటూ అడిగింది.
పామరుడి వైపు చూసే జ్ఞానిలా అతను ఆమెవైపు చూసాడు.
"ప్రేమ అంటే ఇంకా తెలిసినట్లు లేదు" అన్నాడు.
"ఉహూ" ఆమె తల అడ్డంగా వూపింది.
ప్రేమంటే...." కిరణ్ కిటికీలోంచి బయటకు చూసాడు. తుమ్మచెట్టు ముళ్ళమీద కూర్చుని కూడా ఓ కోయిల కుహు కుహు అని తీపిరాగాలు తీస్తోంది.
ఆత్మస్థైర్యంతో పచ్చని ఆకులు ఒళ్ళు విరుచుకుంటూ తలలు పైకెత్తుతున్నాయి.
"నిలకడగా వుండనివ్వనిది ప్రేమ మూర్ఖంగా ప్రవర్తించమని ప్రేరేపించేది ప్రేమ. సహనం వహించమని ఆదేశించేది ప్రేమ. బాధలకీ, దుఃఖాలకీ ప్రవేశద్వారం ప్రేమ. ఓంటరితనం లేని ఆలోచనలను తోడుగా ఇచ్చేది ప్రేమ. కళ్ళల్లో దిగులునీ, అర్ధంలేని నవ్వునీ ఆభరణాలుగా చేసేది ప్రేమ. మరణానికీ, బ్రతుకుకీ మధ్యన అనుభవించే వేదన ప్రేమ, సృష్టిలోని అనందాన్నంతా ప్రోదిచేస్తే లభించే వరం ప్రేమ, అందనంతసేపూ అందలేదన్న దిగులు, అందాక చెయ్యిజారిపోతుందేమోన్న వ్యధా కలిగించేది ప్రేమ. బ్రతుకులోని మధురిమను తెలియజెప్పేది ప్రేమ. దూరమై విషాదాన్ని రుచి చూపించేది ప్రేమ. తనతోపాటు సంతోషాన్ని తెచ్చి తనతోబాటు దూరంగా తీసుకుపోయి దోబూచులాడేది ప్రేమ. నవనీతంకన్నా సున్నితమైనది ప్రేమ. వజ్రంకన్నా కఠినమైనది ప్రేమ. ప్రాణాలు పోసేది, ప్రాణాలు కోసేది ప్రేమ. నాలుగు రోజుల్లో నూరేళ్ళ అనుభవాన్ని ఇవ్వగలిగేది ప్రేమ. శృంగారాన్ని చిలికించేదీ, వైరాగ్యాన్నీ రగిలించేదీ ప్రేమ. వేదనకీ వేదన ప్రేమ. అనందానికి మరోపేరు ప్రేమ.
ఒక్కసారి మనసారా ప్రేమను అనుభవించేసాక నరకానికి వెళ్ళినా ఫర్వాలేదు. ప్రేమలేని ప్రదేశం స్వర్గమైనా ఇక్కడ వుండడం దుర్భరం.
రెండు అక్షరాల్లో విశ్వాన్ని మొత్తంగా చూపేది ప్రేమ. లోకాన్ని ముందుకు నడిపేది ప్రేమ. భగవంతుడ్ని ఆరాధించమనేది ప్రేమ. పక్కవారికి సయం చేయమనేది ప్రేమ. పసిపాప రోదన విని అక్కున చేర్చుకుని ఆకలి తీర్చమనేది ప్రేమ. ఆకాశంలో సూర్యున్ని, చంద్రున్నీ తారల్నీ ప్రకాశింపజేసేది ప్రేమ. మనుషులకీ మిగతా ప్రాణులకీ భేదం తెలిపేది ప్రేమ, ప్రేమ రాహిత్యం అత్యంత భయంకరమైన శాపం. అన్నింటినీ మించిన మానసిక అవసరం. ప్రేమించడాన్ని మించిన పూజలేదు. తపస్సులేదు మంత్రంలేదు పరమార్ధంలేదు. అసలు ప్రేమలేని జీవితం శూన్యం. ప్రేమించనీ, ప్రేమింపబడనీ జీవితం వ్యర్ధం" కళ్ళు అరమోడ్చి ఏదో ట్రాన్స్ లో వున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు కిరణ్.
"ప్రేమని ఎంత బాగా నిర్వచించావయ్యా" అన్న స్వరం వినబడి గుమ్మంవేపు చూసాడు.
గుమ్మంలో దయామణి నిలబడి వుంది. ఆమె కళ్ళనుంచి కన్నీరు కారిపోతోంది.
"మీరా సిస్టర్!" కిరణ్ ఆశగా ఆమె వెనకకి చూసాడు.
దయామణి ఒక్కతే లోపలికి వచ్చింది.
"నాకు నిన్న తెలిసింది నీ ఏక్సి డెంట్ వార్త. నీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చాయకి చెప్పమన్నారు" అంది.