"చాయ....చాయ ఏది?" ఆత్రంగా అడిగాడు కిరణ్.
దయామణి అతనివేపు జాలిగా చూసింది.
"చాయ ఇప్పుడు ఆశ్రమంలో వుండడంలేదు" అంది.
"మరి?" అతను కంగారుగా అడిగాడు.
"ఆమె స్నేహితురాలి ఇంటిలో వుంటోంది" అంది దయామణి.
కిరణ్ పెదవులమీద సంతృప్తితో కూడిన నవ్వు వెలిసింది.
"అదీ అలా చెప్పండి. అందుకే ఆమెకు కబురు అందలేదు. లేకపోతే నా చాయ రాకుండా ఎలా వుంటుంది?" అని గర్వంగా నర్స్ వంక చూసాడు.
నర్స్ దయామణితో- "ఆ చాయ ఎవరోగానీ పరమ అదృష్టవంతురాలు వెంటనే కబురు చేయండి. ఈయన బాధ చూడలేకుండా వున్నాం. అడుగులు చప్పుడయితే చాలు చాయేమో అని లేస్తారు. రాత్రుళ్ళు అసలు నిద్రపోరు" అంది.
'పరమ దురదృష్టవంతురాలు. అందుకే ఇంత ప్రేమకి దూరమవుతోంది' మనసులో అనుకుంది దయామణి.
"చాయ బాగుంది కదూ?" డగ్గుత్తికతో అడిగాడు కిరణ్.
"చాలా బాగుంది" అంది దయామణి.
అతను ఆనందంగా చూసాడు.
దయామణి లేచి నిలబడుతూ- "కిరణ్! ఆ రోజు నన్ను అక్క అన్నావు గుర్తుందా?" అంది.
"అవును ఇప్పుడూ అంటాను" అన్నాడు.
"అయితే ఈ అక్క దగ్గర మొహమాటపడకు. ఎటువంటి అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి" అంది.
కిరణ్ నవ్వుతూ- "చాయ కావాలి. అదే నా అవసరం" అన్నాడు.
"రేపే ఆమెకోసం ప్రయత్నిస్తాను" అంది దయామణి.
అతని మొహం చంద్రబింబంలా వెలిగిపోయింది.
దయామణి- "వస్తాను" అని బయటకు వెళుతుంటే నర్స్ కూడా వెంటవెళ్ళింది.
"దయచేసి ఆ చాయని వెంటనే పిలిపించండమ్మా! నాకూ చూడాలని వుంది" అంది వేడుకోలుగా.
"చాయ వస్తుందా?" తనలో తనే అనుకున్నట్లుగా గొణిగి ముందుకు నడిచింది దయామణి.
* * *
"తాగుబోతు సచ్చినోడా....ఇలా ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?" రత్నం గొంతు వినిపించి చాయ తలతిప్పి చూసింది.
క్రోటన్స్ చెట్ల పక్కగా నీరుకావిరంగు పంచెలో ఓ ముసలాడు కొద్దిగా తూలుతూ నిలబడి వున్నాడు.
రత్నం అటూ-ఇటూ కంగారుగా చూస్తూ వాడిచేతిలో ఏదో పెడుతోంది.
చాయ వరండాలో వచ్చి వాళ్ళకి కనిపించకుండా ఓ స్తంభం చాటున నిలబడి వారి సంభాషణ వినసాగింది.
"కన్నతండ్రిని అని చూడకుండా నోటికొచ్చినట్టు ఎందుకే అలా తిడతావు? ఈ వంద నాకు నాలుగురోజులు కూడా రావుగానీ ఇంకో వంద ఇయ్యి" ముసలాడు ముద్దుగా అంటున్నాడు.
రత్నం కోపంగా...." నా దగ్గరలేవు. తమ్ముడికి బాగోలేదని అమ్మ ఉత్తరంరాస్తే జీతం మొత్తం పంపించేసాను. ఆడు అట్లా వుంటే నీకు తాగి తందనాలడ్డానికి సిగ్గేయడంలా?" అంది.
"అందుకేగా తాగుతోంది?" ముసలాడు గొంతు పెంచాడు.
"ఆడు చచ్చేటట్టు వున్నాడు. నాకెంత దుఃఖంగా వుందో తెలుసా? ఆ దుఃఖాన్ని భరించలేక తాగుతుంట. గొప్పోళ్ళుచేసే పనికూడా ఇదే! కావాలంటే అయ్యగార్ని అడుగుదాం పద" అని ఒక అడుగు ముందుకువేసాడు.
రత్నం కంగారుగా- "చాల్చాల్లే! ఇదుగో ఈ వందకూడా తీసుకుని త్వరగా పో అయ్యగారు చూసారంటే బాగుండదు" అంది.
ముసలాడు డబ్బు తీసుకుని- "మరి కాస్త కాఫీ నీళ్ళు" అని నెత్తిగోక్కున్నాడు.
"ఊ.....పద" రత్నం విసుగ్గా అని పెరట్లోకి తీసుకెళ్ళింది.
చాయ కూడా తన రూంలోకి పోబోతుండగా-
"రత్నం.....రత్నం...." అని సంధ్య గొంతు వినిపించి అటు చూసింది.
సంధ్య మంచంమీది కూర్చుని చేతిగాజులు, గొలుసులు, చెవి జూకాలు తీసి డబ్బాలో పెడుతోంది.
జుట్టు విరబూసుకుని తలంటుకు వెళ్ళటానికి సిద్దంగా వున్నట్లు కనిపించింది.
"రత్నం.....ఎక్కడున్నావు?" అని మరోసారి పిలిచి ఆ డబ్బా దిండుకింద పెట్టి బాత్రూంలోకి వెళ్ళిపోయింది.
చాయ నెమ్మదిగా సంధ్య గదిలోకి వెళ్ళింది.
దిండు కింద వున్న డబ్బాలోంచి లాకెట్ వున్న చెయిన్ మాత్రం బైటికి తీసింది.
* * *
"ఇదెలా జరిగింది? పోతే అన్నీ పోవాలిగా ఆ గొలుసు మాత్రమే ఎలా పోయింది?" సంధ్య ఏడుస్తూనే కేకలు వేస్తోంది.
రత్నం, రామయ్య, నరసమ్మ అందరూ చేతులు కట్టుకుని దీనంగా చూస్తూ నిలబడ్డారు.
"భగవాన్! ఏంటీ ఉపద్రవాలు?" కాంచన భారంగా అని సోఫాలో వెనక్కి జారబడింది.
జయచంద్ర గొంతుచించుకుని- "ఇదెవరి పని?" అన్నాడు.
మొదటిసారి ఇంటి యజమాని తమ నిజాయితీని శంకిస్తున్నాడని గుర్తించేసరికి పనివాళ్ళ మొహాల్లో భయం, అవమానం చోటుచేసుకున్నాయి.
"బాబుగారూ.....మాకు మీరే అమ్మా, బాబూ కావాలంటే నాలుగు డబ్బులు అడిగి తీసుకుంటాంగానీ ఇలా ఉప్పుతిన్న ఇంటికి ద్రోహం తలపెడతామా బాబూ" ఆపైన రామయ్యకి దుఃఖంతో మాట పెగల్లేదు.
రత్నం అయితే కొంగు నోట్లో కుక్కుకుని అవమానాన్ని దిగమింగుకోటానికి ప్రయత్నిస్తోంది.
"ఏమయింది సంధ్యా?" అడుగుతూ వచ్చింది చాయ.
"చాయా! నా లాకెట్ మళ్ళీపోయింది" సంధ్య కన్నీటితో చెప్పింది.
"మైగాడ్! చాలా విలువయింది కూడా" చాయ నోరు పెద్దగా తెరిచి అందర్నీ ఓసారి పరీక్షగా చూసింది.
కాంచన ముఖంలో బాధ దాచినా దాగడంలేదు. బలవంతంగా అదిమి పెడుతున్నట్లుగా ఆమె కళ్ళు మూసుకుని వుంది.


