Previous Page Next Page 
ఖజురహో పేజి 44


    ఎంత తీయని బంధం! అనుబంధాన్ని మించిన ఆనందం ఏముంది? ఆ జ్ఞాపకలా మధురిమ తన శ్వాసని నిలబెడ్తోంది. కానీ అతనో పురుషుడు. వయసులో వున్నవాడు.
    
    ఎవరైనా సరే మనసు పారేసుకునేటంత అందగాడు. ఇలా ఏ సుఖమూ లేకుండా ఎంతకాలం?
    
    కాంచన గుండెల్లో కలుక్కుమంది.
    
    మూసిన రెప్పల క్రిందుగా కన్నీళ్ళు జలజలా రాలాయి. ఓ చెయ్యి ఆ కన్నీళ్ళని తుడిచింది.
    
    కాంచన రెప్పలు విప్పి చూసింది.
    
    జయచంద్ర వంగి ఆమె తల నిమురుతున్నాడు.
    
    "మీరు...." తడబాటుగా లేచింది.
    
    అతను మంచంమీద కూర్చుని ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. అతని చేతిలోని మల్లెపూల చెండు ఆమె తలలో తురిమి "ఐ లవ్ యూ డియర్" అని కళ్ళమీద ముద్దు పెట్టుకున్నాడు. "ఫర్ ఎవర్" అని వాక్యం పూర్తి చేశాడు.
    
    కాంచన తట్టుకోలేకపోయింది. అతని కంఠాన్ని పెనవేసుకుని మెడక్రిందుగా ముఖాన్ని దాచుకుంది. అతను తన వీపుని నిమురుతూ వుంటే ఎంతో ప్రశాంతంగా భరించలేనంత ఆనందంగా అనిపించింది. ఈ ఆనందాన్ని వదిలి ఎలా రమ్మంటావు ప్రభూ అనుకుంది బాధగా.
    
    జయచంద్ర ఆమెకి నిద్రపట్టేదాకా కూర్చుని ఆమె తల నిమురుతూ వుండిపోయాడు.
    
    ప్రతి రాత్రీ పడక అనే శిలువమీద నిద్ర మేకులుకొట్టి.....ఆమెని బలవంతంగా బంధిస్తున్నట్లు వుంటుంది అతనికి. అంత నిశ్శబ్దంలో కూడా యముని మహిషపు లోహపు గంటలు అతనికి వినబడుతూనే వున్నాయి. గదంతా నిండిన మత్తయిన మల్లెల వాసన అతనికి వూపిరి అందనీయడం లేదు.
    
    నెమ్మదిగా ఆమెని తన వడిలోంచి తప్పించి పక్కమీదకి చేర్చి లేవబోతుంటే ఆమె చేతిలో చిక్కిన తన లాల్చీ కొస అతన్ని లేవనియ్యలేదు. వంగి విడిపించుకుంటూ ఆమె కనురెప్పలమీద మృదువుగా చుంబించాడు.
    
    అతను గదిలోంచి వెళ్ళిపోతూ వుంటే కళ్ళు విప్పి అతన్ని కళ్ళారా చూసుకుంది కాంచన. తను నిద్ర నటించకపోతే అతను రాత్రంతా మేలుకుని అలాగే కూర్చుంటాడని ఆమెకు తెలుసు. కనీసం కంటినిండా నిద్రైనా పోనీ అనుకుంది.
    
                                         * * *
    
    "అమ్మాయిగారూ.....అన్నాయం జరిగిపోయిందండీ!" రత్నం గాభరాగా అరుస్తూ సంధ్య గదిలోకి వచ్చింది.
    
    "ఏమైందీ?" సంధ్య రత్నాన్ని కంగారుగా అడిగింది. రత్నం జవాబు ఇవ్వలేనట్లుగా నోట్లో కొంగు కుక్కుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
    
    సంధ్య భయవిహ్వలంగా చూస్తూ "రత్నం! ఏమయింది? అమ్మకి ఎలా వుంది?" అని అడిగింది.
    
    "అమ్మగారు బాగానే ఉన్నారమ్మా?" అంది రత్నం.
    
    సంధ్య వూపిరి పీల్చుకుని "ఏమైందో ఇప్పుడు చెప్పు" అంది.
    
    "మన జూలీ.....ఎంత పిలిచినా లేవడంలేదమ్మా" రత్నం భోరుమంది.
    
    "జూలీనా?" సంధ్య ఒక్క పరుగులో జూలీని కట్టేసిన వెనుక వసారాలోకి వెళ్ళింది.
    
    జూలీ తల పక్కకి వాల్చి పడుకుంది.
    
    "జూలీ.....జూలీ" పెద్దగా పిలుస్తూ దాన్ని కుదిపింది.
    
    "ఇంకెక్కడ జూలీ తల్లీ! చచ్చిపోయింది." డ్రైవర్ రామయ్య చెప్పాడు.
    
    "ఛ.....ఆమాట ఈ ఇంట్లో అనకు. జూలీ ఎందుకు చచ్చిపోతుంది? జూలీ.....లేమ్మా నా బుచ్చికదూ! ఓవర్ ఏక్షన్ చేయకు. నిన్ను పొద్దస్తమానం టీవీ చూడద్దన్నాననా?" సంధ్య జూలీని ఒళ్ళోకి తీసుకుంటూ అంది.
    
    "అమ్మాయిగారు! నిజంగానే మన జూలీ పోయిందమ్మా" రత్నం ఏడుస్తూ అంది.
    
    "నో.....జూలీ కళ్ళు తెరు" సంధ్య పెద్దగా ఏడుస్తూ జూలీని కుదిపింది.
    
    "ఒక రోగమూ లేదూ, రొస్టూ లేదు. ఇలా ఎందుకు జరిగిందీ?" రామయ్య బాధగా అన్నాడు.
    
    "ప్రొద్దుట నేను పాలు పోసినప్పుడు కూడా బాగానే వుందమ్మా" జూలీ పక్కన కూలబడుతూ అంది రత్నం.
    
    "ఈ విషయం అమ్మకు తెలిస్తే...." సంధ్య మాట పూర్తవకుండానే "ఏమిటీ ఏమైందీ?" అంటూ చాయ వచ్చింది.
    
    "చాయా! మన జూలీ చచ్చిపోయింది" సంధ్య ఏడుస్తూ అంది.
    
    "ఊరుకోండమ్మా! పెద్దమ్మగారు వింటే ప్రమాదం. జూలీ అంటే ఆవిడకి పంచప్రాణాలు" రత్నం ఏడుస్తూనే గొంతు తగ్గించి సంధ్యను హెచ్చరించింది.
    
    "సంధ్యా! అందరూ అలా వున్నారేమిటి? ఏమైందీ?" జయచంద్ర ఆశ్చర్యంగా అడుగుతూ అక్కడికి వచ్చాడు.
    
    "డాడీ...." సంధ్య ఏడుస్తూ జూలీని ఎత్తుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి "జూలీ చచ్చిపోయింది డాడీ" అంది.
    
    అతను షాక్ తిన్నట్లు చూసి "మైగాడ్! ఎలా? ప్రొద్దుటే ఏం తింది? ఎవరైనా చూసారా?" దాన్ని నిమురుతూ బాధగా అడిగాడు.
    
    "ప్రొద్దుట నేను మామూలుగానే పాలు పోశాను బాబూ. పాలు తీసుకెళుతుంటే చాయమ్మగారొచ్చి కాఫీ కావాలన్నారు. పాలగ్లాసు ఒక్కక్షణం టేబుల్ మీద పెట్టి వెళ్ళి కాఫీ కలిపి ఆవిడకి ఇచ్చి జూలీకి పాలు త్రాగించాను" చాయను అదోలా చూస్తూ చెప్పింది రత్నం.
    
    చాయ రత్నంవైపు చురుగ్గా చూసి "పాపం స్వీట్ జూలీ.....ఎంతలోకి మనను విడిచిపెట్టిపోయింది" అని సంధ్య చేతిలోని జూలీని నిమిరి కళ్ళు తుడుచుకుంది.
    
    "సరే ముందు జరగవలసినది చూడండి. ఈ విషయం మమ్మీకి చెప్పకండి" సంధ్య తల నిమురుతూ అన్నాడు జయచంద్ర.
    
    "డాడీ...." సంధ్య తండ్రి భుజంమీద తల వాల్చేసి ఏడ్చేసింది.
    
    ఇంటిముందు తోటలోనే రామయ్య గొయ్యి తీసి జూలీని అందులో పెట్టాడు.
    
    జయచంద్ర మట్టి పొయ్యబోతుండగా "జూలీ!" అన్న కాంచన గొంతు వినిపించింది.
    
    అందరూ ఆశ్చర్యంగా చూశారు.
    
    కాంచన కన్నీళ్ళతో ముందుకువచ్చి "ఏదీ నా పిచ్చితల్లి? ఒక్కసారి కూడా చూడనివ్వకుండానే పాతిపెట్టేస్తున్నారా?" అంది.
    
    "కాంచనా!" జయచంద్ర ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

 Previous Page Next Page