జయచంద్ర కూడా నవ్వి-
"విగ్రహారాధన వద్దన్న యోగివేమనకి కూడా విగ్రహాలు తయారుచేసి గుళ్ళు కట్టారు మనవాళ్ళు. పోదాం ఆలస్యం అవుతోంది" అంటూ ముందుకు నడిచాడు.
అతను కదులుతూ వుంటే ఆమె ఠక్కున అతని చెయ్యి అందుకుంది.
నియాన్ లైట్ల వెలుతురులో బ్లాక్ అండ్ వైట్ సినిమా హీరోయిన్ లా కనిపించింది.
"జర్మనీలో చెప్పినా, ఇంగ్లీష్ లో చెప్పినా అచ్చ తెలుగులో చెప్పినా భావం అదే. అది నిజం కూడా" సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది చాయ.
ఆమె భావం అర్ధమై అతను తడబడ్డాడు.
పోతపోసిన బంగారుబొమ్మలా మెరుస్తున్న ఆమె అందాన్ని చూస్తూ వుండిపోయాడు.
అతనే కాదు.....కొన్ని జతల కళ్ళు ఆమెనే చూస్తున్నాయి.
పల్లీ లమ్మే ముసలాడు, ఐస్ క్రీమ్ కుర్రాడు, కొత్తగా పెళ్ళయిన జంటలోని భర్త, కూతురితో ఏదో సీరియస్ గా చర్చిస్తున్న ఓ నడివయసు తండ్రీ, వృద్దాప్యంలో భార్యతో కలిసీ ఈవినింగ్ వాక్ కి వచ్చిన ఓ తాతగారు అందరూ....అందరూ వాళ్ళవాళ్ళ పనులను మరచి ఆ అద్భుత సౌందర్యాన్ని కళ్ళు విప్పార్చుకుని చూస్తూండిపోయారు.
ఇది గమనించిన జయచంద్ర చెయ్యి అతనికి తెలియకుండానే ఆమె చేతి చుట్టూ బిగుసుకుంది.
చుట్టూ వున్న వారి చూపుల్లో ఈర్ష్య గమనిస్తున్నకొద్దీ అప్రయత్నంగా ఆ చెయ్యి పట్టు బిగుసుకుంది.
సౌందర్యమే స్వయంగా ఎదురొచ్చి దారి చూపెడుతున్నా కనుగొనలేని బాటసారిలా వున్నాడతను.
ప్రేమ నిన్ను రమ్మని సైగ చేసినప్పుడు మార్గం కంటకప్రాయమైనా నిశ్శబ్దంగా దానివెంట సాగిపో....ఎక్కడో చదివిన ఆ అద్భుతమైన వాక్యం గుర్తొచ్చింది అతనికి.
"గొడ్డలితో నరకబడితేనే కొయ్య రాగాలుపలికే వీణగా మారుతుంది. కొలిమిలో కాలితేనే మధుపాత్ర మలచబడుతుంది. ఆవేదనలూ, ఆరాటాలూ జీవన హర్మ్యం రమ్యంగా మారుతుంది. ప్రేమ.....అవకాశం కాదు సార్. అందమైన వరం" అతనికి దగ్గరగా జరుగుతూ హస్కీగా అంది చాయ.
జయచంద్రకి దాదాపుగా చెవులవరకూ వచ్చింది ఆమె. ఎర్రని పగడపు పెదవులు అరవిచ్చి అతన్ని ఆహ్వానిస్తున్నట్లుగా వున్నాయి.
అతని హృదయ స్పందన వేగం పుంజుకుంది. అవి భావోద్వేగపు పరవళ్ళో లేక ఆలోచనల అలజడులో అతనికే అర్ధంకావడంలేదు. ఎన్నో ఏళ్లుగా తనచుట్టూ నిర్మించుకున్న కోటగోడ శత్రువు తన కొనగోటితో చిద్రం చేస్తున్నట్లుంది.
బందీగా పట్టుబడిన తనని జాలి తలచి వదిలిపెడుతున్నట్లుగా వున్నాయి ఆమె చూపులు.
ఎదురుగా వున్నది ఏలికో, బాలికో తెలియడంలేదు.
రాత్రుళ్ళు మర్రిచెట్టు ఆకులన్నీ అరుస్తూ స్వర్గంలో మాట్లాడ్తాయని నమ్మేటంత బాల్యపు అమాయకత్వంలోకి జారిపోతున్నట్లుగా అనిపిస్తోంది.
ఎన్నో ఏళ్ళుగా పరిరక్షించుకుంటూ వచ్చిన అపురూపమైన నిధిని ఎవరో అలవోకగా కొల్లగొడుతూ వుంటే ఏమీ అనకుండా నివేదన చేస్తున్నంతనిస్తేజంగా చూస్తున్న అనుభూతి!
ఆ స్పందనకీ, భావానికీ భాష్యం పేరు.....ఏమో!
"ప్చ్"
జయచంద్ర చెంపలమీద పడిన ముద్రలకి ఇహలోకంలోకి వచ్చాడు.
విరబూసిన పూబాలలా లేలేత రెక్కల వనబాలలా ఆమె నవ్వుతోంది.
అతను వెంటనే ఆమెకి దూరంగా జరిగాడు.
"పద" అన్నాడు సీరియస్ గా ముఖంపెట్టి, చూస్తున్న అందరూ తేలిగ్గా నిట్టూర్చారు.
చాయ పైటకొంగు నిండుగా కప్పుకుని అతనివెంట నడిచింది.
ఆమె ఎక్కినకారు కదిలాక అప్పుడు స్పృహలోకి వచ్చారు చుట్టూవున్న జనం.
కారు స్లోగా పోతోంది. జయచంద్ర సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ అన్నాడు "నువ్వు అనుసరిస్తున్న మార్గం సరైనది కాదు. తప్పు. ఇంకెప్పుడూ అలా చేయకు" చెప్పేసాక గుండెలనిండా గాలిపీల్చుకున్నాడు. ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాడు.
చాయ కళ్ళల్లో రోషం మెరిసింది. పెదవిని మునిపంటితో కొరుక్కుంది. ఉప్పుగా రక్తం నాలికకి తగిలింది.
కారు దిగి జయచంద్ర మేడమేదకి వెళ్ళిపోయాడు.
చాయ నెమ్మదిగా గుమ్మం దగ్గరికి వచ్చి జూలీకోసం భయంగా చుట్టూ చూసింది.
"చాయా! భయపడ్డావా? ఇప్పుడెలా వుంది? నీరసం తగ్గిందా?" సంధ్య ఎదురొచ్చి ఆమెమీద చెయ్యివేస్తూ ఆత్రంతా అడిగింది.
చాయ మాట్లాడలేదు. ఆమె కళ్ళు ఇంకా జూలీకోసం వెతుకుతున్నాయి కసిగా.
"పదే రెస్ట్ తీసుకుందువుగానీ" అంది సంధ్య.
చాయ కాంచన గదివైపు చూసింది. వేసిన తెర వేసినట్లే వుంది. పక్కకి తొలగలేదు. అంటే జయచంద్ర ఆమె గదిలోకి వెళ్ళలేదన్నమాట అనుకుంది.
* * *
ఇతరులకై తను జారే కన్నీటి ఆనందం, ఎంత భారమైన ఆనందం ఆడదాని గుండె నిండుగా కన్నీళ్ళని పెట్టాడేమో ఆ భగవంతుడు. అవి కంటినుంచి బయట పడగానే గుండెలు తేలికవుతాయి.
తలగడకి ముఖాన్ని జేర్చి అనుకుంది కాంచన.
చాలా పొద్దుపోయింది. జీవితం మలిపొద్దులో వుంది. మరో పొద్దుకోసం ఏ ఆశతో ఎదురుచూడడం? ఆమెకి పక్కగదిలో నిస్తేజంగా వున్న భర్త కళ్ళల్లో మెదిలాడు.
ఆ కళ్ళలో వెలుగు ఇంత త్వరగా అంతరించిపోవడానికి కారణం తను కాదూ!
ఆ పెదవిని ఎల్లప్పుడూ అనతిపెట్టుకుని మెరిసే చిరునవ్వు ఆరిపోవడానికి కారణం తను కాదూ! ఏవుంది అతని బ్రతుకులో వెలుగు? అదే తన స్థానంలో మరో స్త్రీ వుండివుంటే ఈరోజు ఎంత మధుఅరంగా గడిపేదో?
పెళ్ళయిన కొత్తలో తను రెండురోజులు పుట్టింటికి వెళితేనే భరించలేక పరిగెత్తుకొచ్చేసి "ఒక్క రాత్రికూడా నువ్వు లేకుండా వుండలేను కాంచీ. నన్ను వదిలిపెట్టకు" అనేవాడు.