కాంచన అక్కడే నిలబడి కారు స్టార్టయి వెళ్ళిపోవడం చూసింది. ఆ తర్వాత తనని తాను చూసుకుంది.
గంధం కలర్ కి ఎర్ర జరీవున్న గద్వాల చీరలో తలనిండా కనకాంబరాలతో కాంచన కొత్త పెళ్ళికూతుర్లానే వుంది.
రాగానే భర్త ఎప్పటిలా చిలిపి మాటలతో, గత కాలపు మధుర స్మృతులతో ముంచి ఓలలాడిస్తాడని ఆశపడింది.
కానీ అతను తల ఎత్తి పైకికూడా చూడలేదు.
తల్లి కళ్ళల్లోని నిరుత్సాహం సంధ్య దృష్టి దాటిపోలేదు.
అది చూడలేనట్లుగా ఆమె తల దించుకుంది.
కాంచన తన రూంలోకి వెళ్ళిపోయింది.
లోపలికి వస్తున్న రత్నంతో సంధ్య- "ఈరోజు జూలీ ఇలా ఎందుకు చేసింది?" అంది.
"అది.....అది మనకన్నా జ్ఞానంవున్న ప్రాణి తల్లీ" అంది దాన్ని మెచ్చుకోలుగా చూస్తూ రత్నం.
"నాకంతా అయోమయంగా వుంది. దీనిని లోపలికి తీసుకువెళ్ళు" జూలీని అందిస్తూ అంది సంధ్య.
ఫోన్ మోగింది.
"హలో" అంది సంధ్య.
"లూసీ హియర్" అన్న తీయని స్వరం వినిపించగానే-
"ఎస్ ఆంటీ!" నమ్రత దానంతటదే వచ్చేసింది సంధ్యకి.
"హౌ ఆర్ యూ బేబీ?"
"ఫైన్.....థాంక్యూ ఆంటీ! డాడీతో పనా? ఇప్పుడే బయటకెళ్ళారు"
"నథింగ్ అర్జంట్! మమ్మీని విష్ చేద్దామనుకున్నాను. బయటనుంచి వచ్చాక నేను ఫోన్ చేసానని చెప్పమ్మా" అంది లూసీ.
"మమ్మీకి మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చు. మమ్మీ ఇంట్లోనే వుంది" అంది సంధ్య.
"ఓ ఒక్కరే వెళ్ళారా?"
"నో....ఛాయతో వెళ్ళారు."
"చాయా?"
"ఓ సారీ! మీకు తెలీదుకదూ? షీ ఈజ్ మై ఫ్రెండ్! ఇప్పట్నుంచీ ఇక్కడే వుంటుంది" ఆనందంగా చెప్పింది సంధ్య.
ఆమెనుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు.
"మమ్మీకి ఇస్తాను. లైన్ లో వుండండి" చెప్పింది సంధ్య.
కాంచన ఫోన్ లిఫ్ట్ చేసి...."హలో లూసీ" అంది.
"మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం" అంది లూసీ ఆప్యాయంగా.
కాంచన నిర్లిప్తంగా నవ్వి- "థాంక్యూ" అంది.
"సర్ ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారు ఏంటి ప్రోగ్రాం?" సరదాగా అడిగిందామె.
"ఆయన ప్రోగ్రాం ఏమిటో మరి! నా ప్రోగ్రాంలో మార్పులేదు. మందులు వేసుకుని పడుకుంటాను" విరక్తిగా అంది.
"ఎలా వుంది ఇప్పుడు?" బాధగా అడిగిందామె.
"ఏమిటి ఈ హార్టా? పిచ్చిముండ అలిసిపోయానూ రెస్ట్ కావాలంటోంది. ఇంకా దానిమీద ఆ దేవుడికి జాలి కలిగినట్లులేదు."
"నో ఫర్ గాడ్స్ సేక్ ఈరోజు అలా మాట్లాడవద్దు." లూసీ కంఠం దుఃఖంవల్ల స్వల్పంగా వణికింది.
"సారీ లూసీ! మీ మూడ్ కూడా పాడుచేసినట్లున్నాను ఒకసారి ఇంటికిరండి" అంది కాంచన.
"వస్తాను. తప్పకుండా వస్తాను. రెస్ట్ తీసుకోండి.....బై" లూసీ ఫోన్ పెట్టేసింది.
కాంచన వెనక్కి వాలి పాడుకుంటూ జడలోంచి పూవులు తీసి గిరాటువేసింది.
* * *
"విష్ యూ ఏ మెమొరబుల్ ఏనివర్సరీ" లూసీ మాటలు గుర్తొచ్చాయి అతనికి.
చాయ పైట నిండుగా కప్పుకుని కూర్చున్నా చలికి వణుకుతుంది.
ఆమె అందం సూదంటురాయిలా అతన్ని గుచ్చుతోంది.
బయట అప్పుడే చీకటి అలుముకుంటోంది.
ఓ పిల్లగాలి వచ్చి పరవశంగా అతని చెంప నిమిరి వెళ్ళింది.
ఆమె ముంగురులతో ఆడుతున్న కొంటెగాలి అప్పుడప్పుడు పైటలోకి దూరి దొంగాటలాడుతోంది.
"ఇప్పుడెలా వుంది?" ఆమెను అడిగాడు జయచంద్ర.
ఆమె అతనివేపు ఓరగా చూసింది.
"మీ ఇంటిలోకి అడుగుపెట్టగానే ఘనమైన స్వాగతమే లభించింది" అంది.
అతడు చిన్నగా నవ్వాడు.
కారు టాంక్ బండ్ మీదుగా పోతోంది.
ఎక్కడ చూసినా జంటలు, నవ్వులు, కేరింతలు.
అతనికి త్వరగా ఇంటికి వెళ్ళాలనిపించలేదు.
నిదానంగా డ్రైవ్ చేయసాగాడు.
"ఒక్కసారి ఆపండి" చాయ గట్టిగా అంది.
జయచంద్ర విస్మయంగా చూస్తూ కారు ఆపేసాడు.
చాయ డోర్ తెరుచుకుని దిగుతూ- "మీరూ దిగండి" అని ఓ చూపు చూసింది.
అతను మంత్రముగ్ధుడిలా ఆమెను అనుసరించాడు.
"నాకు నీళ్ళంటే ఇష్టం" అలా అనేటప్పుడు చాయ స్వరం ప్రశాంతమయిన నదిలా ఏ భావం లేకుండా పలికింది.
"నాకు జలపాతాలంటే చాలా చాలా ఇష్టం" ఆమె కంఠంలో ఆపుకోలేని ఉద్విగ్నత ధ్వనించింది.
ఆ కళ్ళు నీళ్ళను చూసి మిలమిల మెరుస్తున్నాయి.
"చాలా అందంగా మెరుస్తున్నాయి కదూ?"
జయచంద్ర నవ్వి - "ఎంత అందమైనవో అంత ప్రమాదకరమైనవి కూడా" అన్నాడు.
"అందమయినవి అన్నీ అంటే?" మనసులో అనుకుంది.
నీళ్ళ మధ్యలో ఏదో తప్పుచేసి శిక్ష అనుభవిస్తున్న వాడిలా నిలబడ్డ తధాగతుడ్ని చూసి చిరునవ్వు నవ్వింది.
"ఎందుకా నవ్వు?" ఆశ్చర్యంగా అడిగాడతను.
"అది ప్రతిష్టించేటప్పుడు చాలామంది బలయిపోయారటకదా! భూత దయ ఎక్కువయిన బుద్దుడ్ని చూసి నవ్వు వస్తోంది" అంది.