Previous Page Next Page 
చిలకలు పేజి 42


    గోడ గడియారం నాలుగు కొట్టింది,
    పోలీసు స్టేషన్ ముందు కారాగింది.
    నరేంద్ర కారుదిగి  ఠీవిగా స్టేషన్ లోకి ప్రవేశించాడు. అతడి వెనకే విజయ్ గర్వంతో లోపలకు వచ్చాడు.
    "కమలాంబ రాలేదా?"
    "ఫోన్ చేశాను. అర్థగంటలో వస్తానన్నది. వస్తూనే ఉండాలి. మళ్లీ ఆవిడ త్వరగా వెళ్ళిపోవాలట. ముందుగా అడిగే ప్రశ్నలేవో తననే అడగమన్నది."
    అదోలా నవ్వాడు నరేంద్ర.
    నరేంద్ర, విజయ్ కూర్చున్నారు.
    "ఊ! ప్రారంభించు" అన్నాడు  అద్వయితం ఉత్కంఠతో నరేంద్రను చూసి.
    "మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా రానియ్. ఒకసారి చెప్తాను."
    అంతలో ఆకుపచ్చ అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి వైట్ కాశ్మీర్ శాల కప్పుకొని కమలాంబ దిగింది.  ఠీవిగా లోపలకు వస్తున్నా కమలాంబను చూసి ఇన్స్ స్పెక్టర్ లేచినిల్చుని "నమస్కారం రండమ్మా ఇలా కూర్చోండి." అని టేబుల్ కు కొద్ది  దూరంలో గోడపక్కగా ఉన్న ఖాలీ కుర్చీ చూపించాడు.
    కుర్చీలో కూర్చుని కమలాంబ అందర్నీ  కలయజూసింది. ముఖం చిరాగ్గా  పెట్టింది. తనేదో కానిచోటుకు వచ్చినట్టుగా ముఖం పెట్టి నరేంద్రగారూ! నన్ను స్టేషన్ కు రమ్మన్నారటగా?" తనకు జరగరాని అవమానం జరిగినట్టుగా అన్నది.
    "అవునండీ! మా డిటెక్టివ్ గారు మీతో కొన్ని విషయాలు చర్చిచాలను కొంటున్నారు.
    "ఎన్నిసార్లు చర్చిస్తారు? ఏమైనా ఇన్ ఫర్ మేషన్ కావాల్సివస్తే మా ఇంటికి  వచ్చి తెలుసుకోవచ్చుగా? సమాజంలో ఓ అంతస్థూ, గౌరవం ఉన్న స్త్రీని ఇలా పోలీసు స్టేషన్ కు  పిలిపించడం ఏంమర్యాద?" ఇన్స్ స్పెక్టర్ ను దవాయిస్తున్నట్టుగా అన్నది.
    నరేంద్ర సిగరెట్ తాగుతూ కమలాంబ ఓరగా చూశాడు. అంతలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవేశించాడు. నరేంద్ర  లేచి షేక్ హాండ్ ఇచ్చాడు,
    "హల్లో యంగ్ మాన్ చాలా క్లిష్టమైన కేసుల్ని ప్రూవ్ చేసి హంతకుల్ని పట్టివ్వబోతున్నారని ఇన్స్ స్పెక్టర్ చెప్పారు. నాక్కూడా ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గా..."
    "కూర్చొండి సార్!" మధ్యలో అడ్డంవచ్చి అన్నాడు ఇన్స్ స్పెక్టర్ .
    అందరూ కూర్చున్నారు.
    కమలాంబ కుర్చీలో ఇబ్బందిగా కదలడం చూసి విజయ్ నవ్వాడు. విజయ్ నవ్వడం చూసిన కమలాంబకు వళ్ళు మండిపోయింది.
    "అద్వయితం నువ్వు అరెస్టు చేసినవాళ్ళను కూడా రప్పించు" అన్నాడు నరేంద్ర.
    "ఏడుకొండలూ!"
    "సార్" అంటూ లాకప్ కేసి నడిచాడు . అతడ్ని మరో ఇద్దరు కాని స్టేబుల్స్ అనుసరించారు.
    రమణారావునూ, శంకర్రావూనూ, పోచయ్యను పోలీసు కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు.
    నిలబడి ఉన్నవాళ్ళను చూసి "ఆ బల్లమీద కూర్చొండి" అన్నాడు నరేంద్ర.
    కమలాంబను శంకర్రావు గుర్రుగా  చూశాడు. కమలాంబ శంకర్రావును నమిలి మింగేస్తానన్నట్టుగా చూసింది.
    రమణారావు తలవంచుకొని కూర్చున్నాడు.
    పోచయ్య గజగజ వణికిపోతున్నాడు.
    "ఇన్స్ స్పెక్టర్ గారూ! మా క్లబ్బులో ఈరోజు ఫంక్షన్ ఉంది. నన్ను పిలిపించింది ఎందుకో చెప్పండి. నేను త్వరగా వెళ్ళిపోవాలి." అన్నది అసహనంగా కమలాంబ.
    ఇన్స్ స్పెక్టర్ నరేంద్ర ముఖంలోకి చూశాడు.
    "మిమ్మల్ని పిలిపించింది నేను" అన్నాడు నరేంద్ర.
    "ఎవరో ఒకరు లెండి. ఎందుకు పిలిపించారో చెప్పండి" అన్నది నిర్లక్ష్యంగా.
    "చెప్తాను కాని మీరు కొంచెం ఓపిగ్గా కూర్చోవాలి. హంతకుల్ని పట్టుకోవడానికి మాకు మీ సహకారం కావాలి" అన్నాడు తాపీగా డిటెక్టివ్ నరేంద్ర.
    "అంతేగదా?" కుర్చీలో రిలాక్స్ అయి గుండెలనిండా గాలి పీల్చుకుంది కమలాంబ.
    "ఏమిటి అలా అన్నారు? విజయ్ ప్రశ్నించాడు.
    "ఏమన్నాను? మీ బాస్ ధోరణి చూస్తుంటే నేనే ఆ హత్యలు చేశానన్నట్టుగా ఉంది. అందుకే అలాఅన్నాను. నరేంద్రగారూ! నన్ను అడిగే ప్రశ్నలేవో త్వరగా అడగండి నేను వెళ్ళిపోవాలి."
    "మీరు చివర వరకూ ఉండాలి."
    "అవతల మా క్లబ్బు.....?"
    "మీ క్లబ్బు ఎక్కడికీ పోదులెండి. కూర్చొండి" అన్నాడు నరేంద్ర.
    "ముందు అందరికీ కాఫీలు తెప్పించవయ్యా?" అన్నాడు నరేంద్ర.
    "అలాగే" అని హెడ్డు కేసి చూశాడు. హెడ్డు కుర్రవాడ్ని పిలిచి కాఫీలు  తెమ్మని  పురమాయించాడు.
    అందరూ మౌనంగా కూర్చున్నారు.
    పబ్లిక్ ప్రాసిక్యూటర్  అందర్నీ మార్చి మార్చి చూస్తూ కూర్చున్నారు.
    కాఫీలు వచ్చాయి.
    "ఇన్స్ స్పెక్టర్ ఇవ్వాళ షూటింగ్ ఉంది. నేను త్వరగావెళ్ళాలి" అన్నాడు "వయ్యారిభామా" మేకప్ మాన్. "వీల్లేదు. మీతో పని అయి పోగానే కార్లో  పంపిస్తాం తొందరపడకండి" అన్నాడు నరేంద్ర.
    అందరూ కాఫీలు తాగారు. రమణారావు తాగలేదు. పోచయ్య తాగుతూ సగం బట్టలమీద  పోసుకున్నాడు. అతడి చేతులు వణుకుతున్నాయి. అతడి చేతిలో  కప్పు సాసర్ లో కదుల్తూ శబ్దం వేస్తోంది.
    "ఇక ప్రారంభించవచ్చు" అన్నాడు అద్వయితం నరేంద్రతో .
    "ఎస్. కాని ఒక్క షరతు"
    "ఏమిటి?"
    "మధ్యలో ఎవరూ మాట్లాడకూడదు. నువ్వుకూడా  విజయ్ నేను ఎవర్ని ప్రశ్నిస్తానో వాళ్ళే మాట్లాడాలి" అన్నాడు.
    "అలాగే ఇక ప్రారంభించు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "ఎక్కడ్నుంచి ప్రారంభించమంటావ్?" సిగరెట్ పొగ విలాసంగా ఊది అడిగాడు నరేంద్ర.
    "ముందు రాధారాణి హత్యా, ఆ తర్వాత రామకృష్ణ హత్యా...."
    "ఆ తర్వాత భారతి హత్యా....ఓ.కె." అన్నాడు నరేంద్ర.
                                                                        25
`    నరేంద్ర లేచి సోమసుందరం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సోమసుందరం రమణారావు కేసి చూశాడు భయం భయంగా.
    "అటేం చూస్తారు? ఇటు చూడండి. నన్ను చూడండి" అన్నాడు నరేంద్ర.
    సోమసుందరం ముఖానికి పట్టిన చమట్లు- తుడుచుకొన్నాడు.
    సోమసుందరం రాధారాణిని హత్య  చేసినట్టుగా నరేంద్ర ప్రూప్ చెయ్యబోతున్నాడా? తను ఆ మాట ఆ రోజే అన్నాడు. ముసలి నక్కను కటకటాల్లోకి తోస్తానని కూడా అన్నాడు. కాని నరేంద్ర వద్దన్నాడు. చివరకు తను అనుమానించిన వాడినే హంతకుడిగా ప్రూవ్ చేసి ఆ క్రెడిట్ కాస్తా తను కొట్టెయ్యబోతున్నాడు. అమ్మ నరేంద్రా! నువ్వేం తక్కువ వాడివికావు.
    "ఇన్స్ స్పెక్టర్ ఏమిటి ఆలోచిస్తున్నారు," నీ ఆలోచనలు న్నెఉ అర్థం చేసుకోగలనులే అన్నట్టు నవ్వాడు డిటెక్టివ్ నరేంద్ర.
    "నేను ఆనాడే చెప్పలేదూ?"
    "అదుగో! నువ్వు అనవసరంగా  ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నావ్. కాసేపు నోటికి తాళం వేసుకొని చెవులకు పని కల్పించు " అన్నాడు నరేంద్ర.
    ఇన్స్ స్పెక్టర్ ముఖం గంటుపెట్టుకొని" సరే, కానియ్! అన్నాడు
    "సోమసుందరంగారూ? మీకు మే ఆఫీసులో పనిచేసే ఆడపిల్లలకు వచ్చిన ఉత్తరాలు దొంగచాటుగా చదివే అలవాటు ఉందికదూ?" నరేంద్ర ప్రశ్నించాడు.
    సోమసుందరం బిత్తరపోయి చూశాడు.
    "చెప్పండి జాగ్రత్తగా విప్పి, మళ్లీ అంటించి గదూ?" మీరు చేసే  ఈ ఘనకార్యానిజి మేరీ  సహకరిస్తూ ఉంటుంది. ఆవునా మిస్ మేరీ?"
    మేరీ  తలవంచుకొన్నదీ.
    "ఫర్వాలేదు చెప్పమ్మా"
    "నాకేం తెలియదు." ఆమె కంఠంలో ఒణుకు.
    "తెలుసు, చెప్పు. నీ ఉద్యోగం  ఎక్కడికీపోదు. నేను హామీ  ఇస్తున్నాను."
    "సార్ నన్ను రక్షించండి. నన్ను వదిలెయ్యండి. నేను చాలా బీదదాన్ని. రోగిష్టి తల్లినీ, ఇద్దరు తమ్ముళ్ళనూ పోషించాలి. తమ్ముళ్లకు చదువులు చెప్పించాలి. నాకూ రాధారాణికి పట్టిన గతే వాళ్ళు అన్యాయం అయిపోతారు."
    "నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదమ్మా చెప్పు,"
    "అవునండీ సోమసుందరంగారికీ ఆ అలవాటు ఉంది." భయపడుతూనే చెప్పింది.
    "అంతా అబద్దం!" అరిచాడు సోమసుందరం.
    "నువ్వు మాట్లాడకు." గద్దించాడు నరేంద్ర.
    "రాధారాణి ఉత్తరం కూడా చదివాడు అది నీ ముందే చదివాడు. అవునా?"
    ఆమె తల ఊపింది.
    "తల ఊపడం కాదు. అవును. కాదు. స్పష్టంగా చెప్పాలి."
    "అవును" అన్నది తలవంచుకొని.
    "నువ్వూ చదివావు ఆ ఉత్తరం."
    "అవును సార్, తప్పయి పోయింది. మేనేజర్ గారు చెప్పినట్లు చెయ్యకపోతే...."
    "ఉద్యోగం పోతుందని భయం." అని నరేంద్ర సోమసుందరంకేసి చూశాడు.
    "అబద్దం సార్!"
    "సోమసుందరం! నిజం చెబితే నీకు శిక్షపడదు. లేకపోతే నువ్వూ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళవలసి ఉంటుంది. అది  జరిగాక నీకు ఉద్యోగం ఉండడు. అందుకే నిజం చెప్పమంటున్నాను. నీకొచ్చిన భయం ఏమీలేదు."
    "అవును సార్. ఆ బుద్ది నాకు చిన్నప్పట్నుంచీ  ఉంది. అదో జబ్బు."
    "రాధారాణి ఉత్తరం చదివావు."
    "అవును!"
    "దాని కాపీ మేరీ చేత రాయించావు."
    సోమసుందరం తలవంచుకొన్నాడు.
    నరేంద్ర కోటు జేబులోనుంచి ఒక ఉత్తరం తీసి మడతలు విప్పి మేరీకి  చూపిస్తూ అదీ నీ హండ్ రైటింగేగా?" అని అడిగాడు నరేంద్ర.
    "అవును సార్."
    "సోమసుందరం ఈ ఉత్తరం నువ్వు రమణరావు అందించావు. ఎందుకు? ఎందుకలా చేశావ్? ఆమెను చంపమనేనా?"
    "కాదు, కాదు." ఒణికి పోయాడు సోమసుందరం.
    "మరెందుకు?"
    "రమణరావుకు రాధారాణి అంటే ఇష్టం ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు అందుకు నా సహాయం కోరాడు. నేను ఆ పని చెయ్యాగలిగితే నా కొడుకుని అమెరికా పంపించి చదివించే ఏర్పాటు చేస్తానన్నాడు. ఖర్చంతా తానే  భారిస్తానన్నాడు. కాని రాధారాణి ఒక పట్టాన లొంగే  వ్యక్తిలా నాకు అనిపించలేదు. కాని ఆ మాట అతడితో అనలేదు. అతడి అండ నాకు కావాలి. అ పరిస్థితుల్లో రామానందస్వామి ఉత్తరం వచ్చింది. అది  రమణరావు ఇచ్చాను, ఇంతకంటే నేను చెయ్యగలిగింది లేదన్నాను."
    "రమణరావుకు ఆమెను వివాహం చేసుకొనే ఉద్దేశ్యం ఉందా?"
    "లేదు. దుర్మార్గుడు ఆడవాళ్ళను ముందు ఆశలు పెట్టి లొంగదీసుకొంటాడు. ఆ తర్వాత వాళ్ళ కర్మానికి వాళ్ళను వదిలేస్తాడు." ఆవేశంగా అన్నది మేరీ.
    "మీరూ ఆయన వలలో పడ్డారా?"
    మేరీ తలవంచుకొన్నది.
    "చెప్పమ్మా పర్వాలేదు."
    "అవునండీ. రాధారాణి రాకతో ఆమెతో పరిచయం లేనట్టే ప్రవర్తించ సాగాడు. రాధారాణి అంటే నాకు  తెలియకుండానే కసి  ఏర్పడింది పెద్ద ధనవంతుడు ఆమెను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని సంతోషించాను. మా ఇద్దరి మధ్యా ఉన్న అడ్డు తొలగిపోతుందనుకొన్నాను నేనే ఈ ఉత్తరం రమణరావుకు ఇవ్వమని  సోమసుందరం గార్ని ప్రోత్సాహించాను అంతే! అంతకంటే  నాకేం తెలియదండీ?" రెండు అరచేతులతో ముఖం కప్పుకొని  ఏడవ సాగింది మేరీ.
    "చూడమ్మా! పోలీసు స్టేషల్లో ఏడవ కూడదు."
    "పోలీసు స్టేషన్ లో ఏడుపువస్తే ఇంటికి వెళ్ళాక ఏడవమంటావా?" అని పబ్లిక్  ప్రాసిక్యూటర్ పకపకనవ్వాడు.
    కమలాంబ కిసుక్కున నవ్వింది.
    విజయ్ పకపక నవ్వాడు.
    ఇన్స్ స్పెక్టర్ పొట్ట ఎగిగెగిరి పడేలా నవ్వసాగాడు, మిగతా వాళ్లకు ఒకరికీ నవ్వురాలేదు.
    నరేంద్ర గంభీరంగా ముఖం పెట్టాడు.
    "మిస్ మేరీ! ఏడవకండీ." అనునయంగా అన్నాడు నరేంద్ర.
    "ఇప్పుడేమంటారు సోమసుందరంగారూ?"

 Previous Page Next Page