Previous Page Next Page 
చిలకలు పేజి 41


    "అంత దూరం రాలేదులే. నిజం చెప్పకపోతే, మేం నిజాన్ని ఎలా కక్కిస్తామో వర్ణించి చెప్పాను. గజగజ వణికిపోయాడు. వెంటనే నిజం కక్కేశాడు" గర్వంగా చెప్పాడు.
    "ఒక్క విషయం మర్చిపోయినట్టున్నావ్?"
    "ఏమిటది?"
    "పోచయ్య వేలిముద్ర భారతి శరీరంమీద  వేలిముద్రలతో కలవలేదనే రిపోర్టు విషయం..."నవ్వుతూ చూశాడు నరేంద్ర.
    అద్వయితం నరేంద్ర ముఖంలోకి పిచ్చి చూపులు చూశాడు. అతడికి జుట్టు పీక్కోవాలనిపించింది.
    "అవును, ఆ సంగతి  నాకు  గుర్తే లేదు. ఆ పోచయ్య మరొక కిరాయి  గూండాను ఎంగేజ్ చేసి ఉండొచ్చుగా? వాడికి నాలుగు తగిలిస్తేగాని అసలు విషయం  కక్కడు" అన్నాడు అద్వయితం.
    నరేంద్ర గట్టిగా సిగరెట్  దమ్ములాగి పొగముక్కు నుంచి వదిలాడు.
    "మరో విషయంకూడా అంగీకరించాడు ఆ ఆరేళ్ళవాడు"
    నరేంద్ర ప్రశ్నార్ధకంగా చూశాడు.
    రమణరావు మీద హత్య ప్రయత్నం చేసింది తనేనని అంగీకరించాడు. మన విజయ్ మీద అగాయిత్యం చేసింది కూడా తానేనని ఒప్పుకొన్నాడు."
    "శంకర్రావు చాలా తెలివైనవాడు మీ చిత్రహింసలను తప్పించుకున్నాడు" అన్నాడు నరేంద్ర.
    "నిజం చెబితే  మేము  మాత్రం చిత్రహింసలెందుకు పెడ్తాం?" చిరాగ్గా అన్నాడు అద్వయితం.
    "అదీ నిజమేలే!"
    "మొదటి నుంచి విజయ్ కు కూడా అతడిమీదే అనుమానం ఉంది."
    నరేంద్ర ఆలోచిస్తూ ఉండిపోయాడు.
    "ఇవ్వాళ సాయంకాలం హతకుడెవరోచెప్పేస్తానన్నావ్ గా?"
    "హంతకుడు కాదు హంతకులు....."నొక్కి అన్నాడు డిటెక్టివ్ నరేంద్ర.
    "అదేలే! రమణరావు  హత్యా ప్రయత్నం చేశాడు. మిగతా మూడు  హత్యలూ చేసింది. శంకర్రావే అని నువ్వు ప్రూవ్ చెయ్యబోతూన్నావ్. ఆవునా?"
    "రాధారాణినీ, రామకృష్ణనూ తనే హత్యచేశానని కూడా ఒప్పుకొన్నాడా శంకర్రావ్?" నవ్వుతూ అడిగాడు నరేంద్ర.
    "ఆ ఒప్పుకొన్నాడు" గర్వంగా అని "ఇంకా నువ్వు ప్రూవ్ చేసేదేమిటి? న్నే హంతకుడ్ని పట్టుకొన్నాను" అన్నట్టుగా చూశాడు నరేంద్ర ముఖంలోకి.
    "రాధారాణిని ఎందుకు హత్య చేశాడట?"
    "అన్ని  వివరాలు ఇంకా అడగలేదు."
    "రేపు కోర్టులో నాకేం తెలియదు అని ఎదురు తిరుగుతాడు. మీ చిత్రహింసలు భరించలేక, అన్ని హత్యలూ తనే చేసినట్టు ఒప్పుకున్నానంటాడు. మరి అతడే హంతకుడని ప్రూవ్ చెయ్యడానికి నీ దగ్గర  ఉన్న ఆధారాలు ఏమిటి?"
    అద్వయితం  తలగోక్కున్నాడు.
    "అంతా అయిపోయిందనే అనుకున్నాను. ఒడ్డుకు చేరాను అనుకొన్నాను.  మళ్లీ సుడిగుండంలోకి తోసేశావ్" నీరు కారిపోతూ అన్నాడు అద్వయితం.
    "నరేంద్ర చెయ్యిపట్టుకోకుండా ఎప్పుడైనా నువ్వు ఒడ్డుకు చేరావా?" విజయ్ వ్యంగ్యంగా అన్నాడు.
    "నువ్వూరుకో విజయ్. అసలే నాకు పిచ్చెక్కిపోతోంది. ప్రతి కేసూ అరిచేతిలో చిక్కినట్టే  చిక్కి జారిపోతున్నది. నరేంద్రా? శంకర్రావు నిరపరాధి అంటావా?"
    "నేను అనలేదే."
    "మరి?"
    "నాకు టైం అయింది బయటికి వెళ్ళాలి. నాలుగ్గంటలకు స్టేషన్ కు వస్తాను. ఎవరెవర్ని పిలిపించాలో గుర్తుందా?"
    "ఆ సోమసుందరం, రమణరావు నౌకరు పైడయ్య, ఇంకా? సూర్యనారాయణ, అతడి భార్య అనసూయ- వీళ్ళందర్నీ స్టేషన్ కు తీసుకొచ్చే ఏర్పాటు చేశాలే."
    నరేంద్ర లేచి నిల్చున్నాడు.
    "అద్వయితం ఢీలాపడిపోయాడు."
    "ఎందుకలా  ఢీలా పడిపోయావ్? హంతకుల్ని పట్టిస్తాలే. ఆ మర్చిపోయాను. కమలాంబను కూడా పిలిపించు.
    "అలాగే"
    "పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా రమ్మని చెప్పు.
    "ఉదయం ఫోన్ లో  చెప్పాను. వస్తానన్నాడు"
    "గుడ్!"
    "నువ్వెక్కడికి వెళ్తున్నావ్?" అనుమానంగా అడిగాడు అద్వయితము.
    "నాకు వేరే పని ఉంది. త్వరగా వెళ్ళాలి. ఆ విజయ్! కారు బయటికి తియ్యి" అంటూ నరేంద్ర బయటికి నడిచాడు.
    అద్వయితం కూడా బయటికి వచ్చాడు తలవేడేసుకొని.
    విజయ్ కారు తెచ్చి పోర్టికోలో ఆపాడు.
    "ఎన్నిగంటల కొస్తారు?"
    "సరిగ్గా నాలుగ్గంటలకు వస్తాం."
    "ఎదురు చూస్తుంటాను" అని జీపు ఎక్కాడు. జీపు కదిలిపోయాక నరేంద్ర లోపలకు వెళ్ళి కర్చీపుతో చుట్టివున్న అగ్గి పెట్టె పట్టుకొచ్చాడు.
    "ఏమిటది?"
    "చెప్తాను పద!" అని కారెక్కి కూర్చున్నాడు నరేంద్ర. విజయ్ డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. కారు బయలుదేరింది.
                                                                24
    క్రైం బ్రాంచ్ స్టేషన్ ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ తుపాకులు పట్టుకొని కాపలా ఉన్నారు.
    లోపల హల్లో ఒక బల్లమీద సోమసుందరం, అతడి స్టెనో మేరీ, సూర్యనారాయణ, అనసూయ కూర్చుని ఉన్నారు.
    అందరూ తలలు దించుకొని కూర్చుని ఉన్నారు.
    వాళ్ళకు పక్కన  మరో బల్లమీద  పైడయ్య, నయ్యారిభాను మేకప్ మాన్ కూర్చుని ఉన్నారు. మేకప్ మాన్ రమేష్ చిరాగ్గా ఉన్నాడు.
    నిశ్శబ్దం గూడు కట్టుకొని ఉంది. అందరూ నరాలు బిగబట్టుకొని కూర్చుని ఉన్నారు.
    ఇన్స్ స్పెక్టర్ రిసీవర్  ఎత్తాడు.
    "హల్లో ఇన్స్ స్పెక్టర్ ! నేను రాజారావును."
    "ఆ ఏమిటి విశేషం?"
    "మధ్యాహ్నం ఇచ్చిన అగ్గిపెట్టె మీద ఉన్న ఫింగర్ ప్రింట్సూ, భారతి శరీరంమీద ఉన్న ఫింగర్ ప్రింట్సూఒక్కరివే.
    ఆ ఎగిరి గంతేసినంత పని చేశాడు అద్వయితం అంతలోనే జారిపోతూ "అగ్గిపెట్టా? నేను ఇవ్వలేదే? ఎవరిచ్చారు? అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "మధ్యాహ్నం నరేంద్ర వచ్చి ఇచ్చి వెళ్ళాడు. రిపోర్టు మీకు పంపించమని."
    "అలాగే!"
    "యాదగిరీ! నువెళ్ళి రాజారావుగారు రిపోర్టు ఇస్తారు పట్టుకురా" ఒక కానిస్టేబుల్  ఆర్డరు జారీ చేశాడు అద్వయితం.
    నరేంద్ర గట్టివాడే. మొత్తంమీద హంతకుడి  వేలిముద్రలు సంపాదించాడు. ఉదయం తనలో  మాటమాత్రం అనలేదు. ఏదయితేనేంలే! హంతకుడ్ని పట్టిస్తానన్నాడుగా! ఒక్కడుకాడు హంతకులు అన్నాడు. అంటే ముగ్గురు హంతకులు అన్నమాట?
    అతడి ధోరణి తన కేమీ అర్థం కావడంలేదు. సూర్యనారాయణ హంతకుడు కాడంటాడు. శివరావు మీద కూడా అతడికి అనుమానంలేదు. మరి ముగ్గురు హంతకులెవరో? అదీ స్పష్టంగా చెప్పడు.
    అదేమంటే వాళ్ళు హంతకులు కారని నేను అన్నానా అని అంటాడు ఏది ఏమైనా భారతిని చంపినవాడు దొరికినట్టే. అనసూయను చంపబోయిన రమణరావు గురించి ప్రత్యేకంగా  తెలుసుకొనేది ఏమీలేదు.
    రాధారాణిని ఎవరు చంపారని రుజువు చేస్తాడా? రామకృష్ణ  హంతకుడు ర్వరో? ఎలా ప్రూవ్ చేస్తాడో చూడాలి.
    ఏమో తనకు మాత్రం అనుమానంగానే ఉంది. చివరకు శంకర్రావునే హంతకుడిగా ప్రూవ్ చేస్తాడు. అతడు హంతకుడు కాదనలేదు. హంతకుడిగా ఎలా ప్రూవ్ చేస్తావని  తనను ప్రశ్నించాడు. అంటే ఆ రుజువులు ఏవో అతడి దగ్గర ఉన్నాయనేగా అర్థం?
    నరేంద్ర ప్రూవ్ లేకుండా ఇలా సమావేశం ఏర్పాటు చెయ్యడు. తను ఒడ్డు చేరినట్టే. నరేంద్ర సహాయం లేకపోతే తను ఒడ్డున పడేవాడా. నరేంద్ర జీనియస్ అతడ్ని అనవసరంగా అనుమానించాడు తను.
    కాని.....కాని.....రామకృష్ణ హత్యరోజు అతడు హొటల్  ప్యాలెస్ ఎందుకెళ్ళినట్టు?
    అన్నీతేల్తాయిగా! తొందరెందుకు?
    "కమలాంబ ఇంకా రాలేదే పాపం! పెద్దకుటుంబానికి చెందిన స్త్రీ, లేడీస్ క్లబ్సు ప్రెసిడెంటు. అనవసరంగా  ఆమెను  స్టేషన్ కు రప్పించమన్నాడు నరేంద్ర. ఏదన్నా ఇన్ ఫర్ మేషన్ కాపీలంటే ఇంటికెళ్ళీ అడగొచ్చుగా? తను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని చెప్పాడు. ఆవిడ చాలా  నొచ్చుకుంది. తను మాత్రం ఏంచెయ్యగలడు?
    ఒక్క కేసుకూ తలాతోకా దొరక్కుండా ఉందాయె
    దొరికినట్టే దొరికి  జారిపోతున్నది తన చేతికి దొరికి ప్రతిక్లూ ఇంత ఘోరమైన కేసులు ఎప్పుడూ రాలేదు. ఎలాగోలా ఒడ్డునపడితే అంతేచాలు.
    టెలిఫోన్ మోగింది. అద్వయితం ఆలోచనలకు ఏదో అడ్డం పడ్డట్టుగా అయింది. తృళ్ళిపడి ఫోన్ రిసీవర్ ఎత్తాడు.
    "హల్లో! నరేంద్రా ! నీకోసమే చూస్తున్నాను."
    "అందరూ వచ్చారా?"
    "ఆ ఒక్క కమలాంబ తప్ప. నువ్వొచ్చేసరికి ఆమె కూడా రావచ్చు. త్వరగా వచ్చెయ్. ఫోన్ రిసీవర్ పెట్టి గుండెలనిండా పీల్చుకున్నాడు అద్వయితం.

 Previous Page Next Page