అవునండీ. బుద్ది తక్కువ పని చేశాను. ఆ దుర్మార్గుడు అంత పసిచేస్తాడనుకోలేదు."
"మరి ఏమనుకొన్నారు? మనసు మార్చుకుంటాడనుకొన్నారా?"
"లేదు. అతడు పైకి ఎంత మెత్తగా కన్పిస్తాడో అంతకు వెయ్యి రెట్లు కూరుడని నాకు తెలుసు."
"అంటే రాధారాణిని హత్య చేస్తాడని తెలుసన్నమాటేగా?"
"లేదు."
"మరి ఏం చేస్తాడను కొన్నావ్?"
"ఆ పిల్లను కిడ్నాప్ చేసి ఎక్కడైనా బందిస్తాడనుకొన్నాను. తన కోరిక తీరాక వదిలేస్తాడని భావించాను.
"అంటే అతడు ఘోరంగా చేస్తాడని తెలిసే ఆ ఉత్తరం ఇచ్చావ్. ఆమె కంటే ముందే వెళ్ళి ఆమె ఎయిర్ పోర్టుకు వెళ్తోందని చెప్పావ్."
"అవును సార్ ! నా వల్లనే ఆ హత్య జరిగింది. ఒక ఆడపిల్ల హత్యలో నాకూ భాగం ఉంది నన్ను శిక్షంచండి. నన్ను వొదలవద్దు. నాకూ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అయినా పరాయి ఆడపిల్లల్ని ఆటబొమ్మలుగా చూశాను. నన్ను క్షమించకండి. ఇస్టీరియా పేషెంటులా ఏడుస్తూ చెప్పాడు.
"అంతా అబద్దం! మీరే వాళ్ళ చేత అబద్దపు సాక్ష్యం చెప్పిస్తున్నారు. నేను రాధారాణి హత్య చెయ్యలేదు, ఆ ఉత్తరం నాదికాదు నువ్వే కాపీ చేయించావ్?" రమణరావు అరిచాడు.
"ఈ ఉత్తరం నీ షర్ట్ జేబులో దొరికింది. ఆ షర్టు కూడా తెచ్చాను. ముందు వేలుముద్రల నిపుణుడికి ఇచ్చాకే దీన్ని చేత్తో పట్టుపట్టుకొన్నాను."
"అమ్మ! రమణరావూ! నువ్వా రాధారాణిని చంపింది" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"లేదు. ఇన్స్ స్పెక్టర్ నేను చంపలేదు." కీచుచున్నది రమణరావు కంఠం.
"దుర్మార్గుడా? ఆడపిల్లను చంపావా? పైగా నాకూతుర్ని పెళ్ళి చేసుకోవాలని ప్లాను వేశావా?" కమలాంబ చిరుత పులిలా లేచి నిల్చుంది. "కమలాంబగారూ కూర్చొండి." అన్నాడు నరేంద్ర.
"విజయ్ ఏది ఆ గుండి?"
విజయ్ గుండి తీసి ఇచ్చాడు.
గుండి తీసుకొని రమణరావు దగ్గర కేళ్ళి అతడికి "ఇచ్చి ఇది చూడు. నీదేకదూ?"
"కాదు."
"విజయ్. భాద్రాచారి బయట ఉన్నాడు పిలువు." అన్నాడు.
విజయ్ బయటికి వెళ్ళి భద్రాచారిని వెంట బెట్టుకొని వచ్చాడు.
"ఈ గుండీ నువ్వు చేసిందేనా?"
"అవును బాబూ!"
"బాగా చూడు."
"నా పనితనం నాకు తెలుసు. ఇది రమణరావుగారిది."
"నీ దుకాణం ఎక్కడ ఉంది?"
"బేగం బజారులో."
"మరో గుండీ చేయించుకొన్నాడా?"
"అవును. ఒకటి ఎక్కడో పోయిందనీ. అచ్చంగా అలాటిదే చెయ మన్నాడు. పెళ్ళిళ్ల సీజను తర్వాత చేసి ఇస్తామన్నాను. కాదు. తెల్లవారేసరికి చేసి ఇవ్వాలన్నాడు."
"ఎప్పుడు వచ్చాడు నీ దగ్గరకు?"
"పోయిన సోమవారంనాడు"
"సరే ఇక నువెళ్ళిపో" అన్నాడు నరేంద్ర.
భద్రాచారి నరేంద్రకూ, ఇన్స్ స్పెక్టర్ కూ నమస్కరించి వెళ్ళి పోయాడు.
"గుండీ ఏమిటి?" పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగాడు.
"రాధారాణి హత్య జరిగిన ప్రదేశంలో ఇది విజయ్ కు దొరికింది."
"మరి శంకర్రావు విజయ్ ను కొట్టి గుండీ లాక్కెళ్ళాడుగా?"
"కొట్టింది శంకర్రావు కాదు. రమణరావే?"
"అదేమిటి చేతికి ఆరేళ్ళు ఉన్నాయ్ అని సునంద చెప్పిందిగా?" ఇన్స్ స్పెక్టర్ అడిగాడు.
"అవును! ఆ చెయ్యి సునంద చూసేలా ఊపాడట. శంకర్రావు అయితే ఎందుకు అలా చేస్తాడు? ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా?"
"అవుననుకో. కాని రమణరావుకు ఆరేళ్ళు లేవుగా?"
"ఉన్నాయ్!"
"అబద్దం! ఇన్స్ స్పెక్టర్ నా చేతులకు ఆరేళ్ళు ఉన్నాయా చూడండి," అంటూ రెండు చేతులూ ముందుకు చాచాడు.
ఇన్స్ స్పెక్టర్ నరేంద్ర ముఖంలోకి చూశాడు నరేంద్ర విజయ్ ముఖంలోకి చూశాడు. విజయ్ లేచి బయటికి వెళ్ళాడు.
"మరి ఆరోజు విజయ్ ను కొట్టిన వాడు గుండి లాక్కెళ్ళాడుగా. ఇది మళ్ళీ ఎలా దొరికింది నీకు?"
"విజయ్ పెట్టుకొని తిరిగింది నకిలీ గుండీ. ఆ గుండీ కోసం హంతకుడు అతడ్ని ఫాలో అవుతాడని మాకు తెలుసు."
"మరి విజయ్ అది శంకర్రావు గుండీ అన్నాడు?"
"నీలాగే విజయ్ కూడా ఆలోచించాడు. దానికి నేనేం చెప్పగలను!"
"అంతలో ఒక తుప్పు పట్టిన ట్రంకు పెట్టె పట్టుకుని లోపలకు వచ్చాడు విజయ్.
"పైడయ్యా ఇలారా?" అని పిల్చాడు నరేంద్ర.
పైడయ్య వణుకుతూ వచ్చి నిలబడ్డాడు.
"ఈ పెట్టె తెరిచి ఎవరిది?"
"నాదే బాబూ!"
"పెట్టె తెరిచి అందులో ఉన్న వస్తువులు బయటికి తియ్యి."
ఒక్కొక్క వస్తువు తీసి పెడ్తూంటే ఇన్స్ స్పెక్టర్ ఆశ్చర్యంగా నోరు తెరిచేశాడు.
ఇటుక రాయి రంగు షర్టు.....అచ్చం అది శంకర్రావు షర్టులాగే ఉంది. హాట్. టోపీని కొంచెం ముఖం మీదుకు లాక్కుంటే ముక్కు చివరి భాగం నుంచి మాత్రమే ముఖం కన్పిస్తుంది.
"ఇదీ చివరి వస్తువు" అని నరేంద్ర చేతిలోకి తీసుకొని దాన్ని అందరికీ కన్పించేలా పట్టుకున్నాడు.
"అరేగ్లౌస్!" రెండో బొటన వేలు బరువుగా వేలాడుతోంది. గ్లౌసులో నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వేలు___గ్లౌస్ తొడుకున్నప్పుడు ఆ వేలు ప్రముఖంగా వేలాడుతూ కన్పిస్తుంది. నరేంద్ర చేతికి గ్లౌసు తొడుక్కొని చూపించాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. మేకప్ మాన్ ను చూస్తూ "ఇది నువ్వే తయారుచేశావా?"
"లేదండీ. మా ఆర్టిస్టు చేత తయారుచేశావా?"
"అది కావాలని అడిగింది ఎవరు?"
"రమణరావుగారు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు."
"ఆ సంగతి ఆయన తమ్ముడికి తెలుసా?"
"తెలియదు."
"నువ్వు చెప్పలేదా?"
"లేదు."
"ఎందుకని?"
"రమణరావుగారు చెప్పవద్దన్నారు. మూడో మనిషికి ఆవిషయం తెలిస్తే నన్ను చంపేస్తానని బెదిరించారు."
"సరే! ఇక మీరెళ్ళోచ్చు."
మేకప్ మాన్ ఇన్స్ స్పెక్టర్ కు నమస్కరించి వెళ్ళాడు.
"అందర్నీ పంపిస్తున్నారు. నన్ను స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఆ అడిగేదేదో త్వరగా అడగండి. నేను వెళ్ళిపోవాలి." అన్నది కమలాంబ విసుగ్గా.
"అవును, నరేంద్రా! ఆమెను కూడా పంపించెయ్యొచ్చుగా?" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"నేను పూర్తిచేసేంత వరకూ నువ్వు సలహాలు ఇవ్వకు. నేను చెప్పడం పూర్తి అయ్యాక నీ ఇష్ట ప్రకారం చెయ్యి అంతేగాని మధ్యలో కల్పించుకోకు" విసుగ్గా అన్నాడు నరేంద్ర.
"సారీ!" అన్నాడు ఇన్స్ స్పెక్టర్
"నాలుగున్నరకు వచ్చాను. ఆరు కావస్తోంది. ఇంతమందిలో ఆడదాన్ని. వంటరిగా పోలీసు స్టేషన్ కూర్చుంటే ఎవరైనా చూస్తే ఏమనుకొంటారు?"
నరేంద్ర ఇన్స్ స్పెక్టర్ వైపు తిరిగి "లేడీ కానిస్టేబుల్ లేదా?" అని అడిగాడు.
"అంజమ్మ ఇవ్వాళ రాలేదు. అన్నమ్మ వచ్చే టైం అయింది."
"అదుగో వస్తున్నది. లేడీ హొమ్ గార్డు కూడా వస్తోంది" అన్నాడు కానిస్టేబుల్ యాదగిరి.
"వెరీ గుడ్! కమలాంబగారూ! భయపడకండి. మీకు తొడు ఇద్దరు ఆడవాళ్ళు వస్తున్నారు," అన్నాడు నరేంద్ర.
"ఏమిటి మీ ఉద్దేశ్యం?" కొరకొర చూసింది కమలాంబ.
"కోపగించుకోకండి, మీ తమ్ముడి హత్య గురించి కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి" అన్నాడు నరేంద్ర.
"రెండుసార్లు ఇంటికి వచ్చి ప్రశ్నించారు. ఇంకా ఏం ప్రశ్నిస్తారు?"
"హంతకుడి ముందు ప్రశ్నించాలి"
"రామకృష్ణ హంతకుడు కూడా ఇక్కడే ఉన్నాడా!" ఆశ్చర్యంగా అడిగింది.
"ఎందుకంత ఆశ్చర్యం? రామకృష్ణ హంతకుడెవరో మీకు తెలియదా?"
"నాకేం తెలుసు? ఇక్కడే ఉన్నాడన్నారు కనుక నా అనుమానం నిజమే అనిపిస్తుంది. ముందు నుంచీ ఆ దుర్మర్గుడే ఈ పని చేశాడనే నా అనుమానం. వాడ్ని ఉరికంబం ఎక్కిస్తేగాని మనసు శాంతించదు. నా తమ్ముడ్ని పొట్టన పెట్టుకొన్నవాడు తప్పించుకాకూడదు. ఉంటాను. ఎంతసేపైనా ఉంటాను" అన్నది కమలాంబ ఏడుపు గొంతుతో, పైట చెంగుతో కళ్ళు వత్తుకుంది.
"మీ అనుమానం ఎవరి మీద!" సూటిగా చూస్తూ ప్రశ్నించాడు నరేంద్ర.
"ఇంకెవరు? ఆ దుర్మర్గుడే!"
"పేరు చెప్పండి."
"శంకర్రావు, ఇంట్లో చేరి ఇంత మోసం చేస్తాడనుకోలేదు. మీరు ఆనాడు లావణ్య పెళ్ళి ఎందుకు ఆపారని అడిగారు గుర్తుందా: వాడు నా తమ్ముడ్ని పొట్టన పెట్టుకున్నాడనే అనుమానం నాకు కలిగిందె అలాంటి వాడి మేనల్లుడికి నా కూతుర్ని ఎలా ఇస్తాను చెప్పండి డిటెక్టివ్ గారూ?"