Previous Page Next Page 
చిలకలు పేజి 40


    గెట్టు మీద రామచిలుక రాబందు రెక్కల మధ్య  నలిగిపోతుంది.
    దాని మెడ మీద రామచిలుక రాబందు రంపాల ముక్కు.....
    ఆ కబంధుడి కౌగిలిలో ఆమె శరీరం నలిగి పోతున్నది.
    కఠినమైన అతడి చేతులు, మృదువైన ఆమె కంఠం చుట్టూ పాకాయి. ఆమె పెనుగులాడుతోంది.
    "శంకర్రావ్ ఆగు!" కొండల్లో ఇన్స్ స్పెక్టర్ కంఠం సింహంళా గర్జించింది.
    అతడి చేతిలోని రివాల్వర్ గాలిలోకి పేలింది.
    చెట్టుమీద రాబందు గుండు దెబ్బకు అరుస్తూ కిందపడింది.
    హంతకుడు దెబ్బతిన్న పులిలా, అనసూయను వదిలి వెనక్కు తిరిగి రివాల్వర్ పేల్చాడు.
    నరేంద్ర భుజం మీదగా గుండు దూసుకుపోయింది.
    వెంటనే అద్వయితం చేతిలోకి రివాల్వర్ రెండుసార్లు  పేలింది.
    పరిగెత్తుతున్న అతడి మోకాలుకు గుండు దెబ్బ తగిలి బోర్లా పడ్డాడు.
    ఇద్దరు కానిస్టేబుల్స్  అతడ్ని లేవడేసి చెరొక రెక్కా పట్టుకొన్నారు.
    అద్వయితం అతడి దగ్గరకు వెళ్ళిచూశాడు. నోటమాట రాలేదు.
    "నువ్వా? రమణరావ్!" అని నోరు తెరిచాడు అద్వయితం ఆశ్చర్యంగా.
    "లాక్కెళ్ళి జీప్ లో పడెయ్యండి" అన్నాడు అద్వయితం.
    ఇద్దరు కానిస్టేబుల్స్ లాయర్ రమణరావును లాక్కెళ్ళి జీప్ లో పడేశారు.
    ఎండుటాకుల్లో స్పృహ లేకుండా పడివున్న అనసూయను నరేంద్ర  ఎత్తుకొన్ని కార్లో పడుకోబెట్టాడు.
    అద్వయితం, విజయ్, నరేంద్ర పక్కన ముందు సీట్లో కూర్చున్నారు.
    అద్వాయితానికి నరేంద్రతో మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది.
    "ఇన్స్ స్పెక్టర్ ! ఏమిటలా కూర్చున్నావ్ మాటపలుకూలేకుండా హంతకుడు దొరికాడుగా  ఇక నీకు ప్రొమోషన్  ఖాయం."
    "ప్రొమోషన్ సంగతి వదిలేయ్. నేను పొరపాటుగా  ప్రవర్తించాను. నిన్ను అనుమానించాను. ఏదేదో వాగాను. నన్ను క్షమించు", అద్వయితం బాధగా అన్నాడు.
    "మనలో మనకు క్షమాపణ లేమిటి? నీగురించి నాకు తేలియదా ఏమిటి?" అన్నాడు  నరేంద్ర.
    "అది సరే! రమణరావు హంతకుడని ఎలా తెలుసుకొన్నావో చెప్పు."
    "ఇప్పుడు కాదు. రేపు మీ స్టేషన్ లో  చెపుతాను."
    "ఈ రాత్రంతా నాకు నిద్రపట్టదు"
    "ఎందుకూ? హంతకుడు దొరికాడుగా?" అన్నాడు విజయ్.
    "పోనియ్ ఇది చెప్పు. మూడు హత్యలూ ఇతడే చేశాడా?"
    "రెండు చేశాడు"
    "మూడోది?"
    "రేపు చెపుతాను." ఆ మర్చిపోయాను. రేపు నేను వచ్చేసరికి సోమసుందరాన్ని, కమలాంబనూ, శంకర్రావునూ స్టేషన్ కు పిలిపించు" అన్నాడు నరేంద్ర.
    "శంకర్రావు పరారీలో ఉన్నాడుగా?"
    "రమణరావు అరెస్టు గురించి ఈ రాత్రికే పేపర్లకివ్వు. తెల్లారే  సరికి వార్తా వస్తుంది. అది చూసుకొని శంకర్రావే స్టేషన్ కు వస్తాడు." 
    కారు అద్దాలు దించడంతో చల్లటి గాలి వీచింది.
    అనసూయ కళ్ళు తెరిచింది.
    చివ్వున లేచి కూర్చుంది.
    నరేంద్ర వెనక్కు తిరిగి చూశాడు నవ్వుతూ.
    "నేను ఎక్కడ ఉన్నానూ?" నీరసంగా అడిగింది అనసూయ.
    "నా కారులో"
    "ఎక్కడి కెళ్తున్నాం?"
    "మీ ఆయన దగ్గిరకు."
    అనసూయ కళ్ళల్లోకి జేవం వచ్చింది.
    "నిజంగా మా ఆయన్ను వదిలేస్తారా ఇన్స్ స్పెక్టర్"
    "అవునమ్మా. నిన్ను తిన్నగా స్టేషన్ కు తీసుకెళుతున్నాం. అక్కడ్నుంచి నువ్వు మీ ఆయనతో కలిసి ఇంటికి వెళ్తావ్" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
                                                                       *    *    *
    ఉదయం ఎనిమిది గంటలు అయింది.
    డిటెక్టివ్ ఆనాటి వార్తాపత్రికలు తిరగేస్తున్నాడు.
    క్రితం రాత్రి అనసూయ మీద జరిగిన హత్యాప్రయత్నం గురించిన వార్త దాదాపు అన్ని పేపర్లూ బాక్స్  కట్టివేశాయి.
    సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇన్స్ స్పెక్టర్ అద్వయితం ఒక స్త్రీని రక్షించాడని, హంతకుడ్ని అదుపులోకి తీసున్నాడని పత్రికలు రాశాయి పన్నెండు రోజుల క్రితం ఒక స్త్రీ  హత్య జరిగిందనీ , జూబ్లీ  హిల్స్ లో నారాసంచారానికి చాలాదూరంగా ఉన్న  ఓ మర్రిచెట్టుకింద ఆ హత్య జరిగిందనీ, మళ్ళీ  ఆ చెట్టుకిందే సమయానికి ఇన్స్ స్పెక్టర్ తన  సిబ్బందితో అక్కడకు చేరుకొని ఉండకపోతే మరో స్త్రీ హత్య జరిగి  ఉండేదని రాశారు. చివరిలో ఒక వాక్యం___ఆ సమయంలో ప్రఖ్యాత డిటెక్టివ్ నరేంద్రకూడా  ఇన్స్ స్పెక్టర్ తో ఉన్నాడని  రాయడం జరిగింది.
    కోపంగా విజయ్ గదిలో పచార్లు చేస్తున్నాడు.
    చదువుతోన్న పేపర్ పైగాతలెత్తి విజయ్ ను చూశాడు నరేంద్ర. విజయ్ కోపానికి కారణం తెలిసన నరేంద్ర  తనలో తానే నవ్వుకున్నాడు. అంతలో వరండాలో బూట్లకాళ్ల శబ్దం విన్పించింది. ఆ వెంటనే కాలింగ్ బెల్ మోగింది.
    వచ్చిందెవరో ఊహించిన విజయ్  విసురుగా తలుపు తెరిచి వాకిలికి అడ్డంగా  నిలబడ్డాడు.
    "ఏమిటలా నిలబడ్డావ్? లోపలకు రానివ్వవా?" అన్నాడు అద్వయితం నవ్వుతూ.
    తెల్లవారేసరికి ఊడిపడ్డావ్. నీకు పనిలేకపోతే మాకు కూడా ఉండదనుకుంటున్నావా?" విజయ్ దురుసుగా అన్నాడు.
    "విజయ్ ఏమిటా మాటలు?" రా ఇన్స్ స్పెక్టర్ ! ఏమిటి విశేషం?"
    "విజయ్! ఎందుకంత కోపంగా  ఉన్నాడు! నేనేం చేశాను?" నీరుకారిపోతూ అడిగాడు అద్వయితం.
    "ఏదో కోపం మీద ఉన్నాడులే ఆ కోపం నా మీద చూపించలేక నీ మీద  చూపిస్తున్నాడు.
    "అట్లా చెప్పు! ఆ కొపమంతా నామీదే అనుకొన్నాను" అంటూ కుర్చీలో కూర్చున్నాడు.
    "నాకోపం నీ మీదే" కోపంగా అన్నాడు విజయ్.
    "నామీదా? నేనేం చేశానూ? రాత్రి బాగానే  ఉన్నావుగా? తెల్లవారేఅరికి నేను చేసిన అపరాధం ఏమిటి?"
    "న్యూస్ చూళ్ళేదా?"
    "నేను చూడలేదు. తెల్లవారుఝామున ఐదు గంటలకే బయలుదేరాను శంకర్రావు వేటలో"
    విజయ్ ఒక తెలుగు పేపరు అద్వయితం ముందు పడేశాడు. న్యూస్ చదివి  అద్వయితం మౌనంగా ఉండిపోయాడు.
    "నేను అలా చెప్పలేదు. ఇద్దరం కలిపి పట్టుకొన్నాం అని చెప్పాను" నీళ్లు నములుతూ అన్నాడు అద్వయితం.
    "మీ పోలీసువాళ్ళూ....."
    "విజయ్!" ఏదో అనబోతున్న విజయ్ ను  వారించాడు నరేంద్ర.
    "సారీ! అర్థరాత్రి  హడావిడిగా ఏదో చెప్పాను. పూర్తికేసు ఇస్తాంగా? అప్పుడు...."
    "నువ్వు వచ్చి పనేమిటో చెప్పు!"
    "శంకర్రావు  దొరికాడు" అని నరేంద్ర ముఖంలోకి చూశాడు. ఆశించిన మార్పు  నరేంద్ర  ముఖంలో కన్పించలేదు ఇన్స్ స్పెక్టర్ కు.
    "తెల్లవారుజామున ఐదు  గంటలకు  కమలాంబ ఇల్లు సోదాకు వెళ్ళాను. అక్కడ తప్పక దొరుకుతాడని భావించాను. అలాగే దొరికాడు  నేను వెళ్ళేసరికి ఇద్దరూ అరుచుకొంటున్నారు.
    "గుడ్!" ఏదో ఆలోచిస్తూ లంఛనప్రాయంగా అన్నాడు నరేంద్ర.
    "శంకర్రావు ఒప్పుకున్నాడు."
    "ఏం ఒప్పుకొన్నాడు?" డిటెక్టివ్ నరేంద్ర విస్మయంగా అడిగాడు.
    "తనే భారతిని  చంపిచానని."
    "ఎవరిచేత చంపించాడటా?"
    "పోచయ్య. వాడ్ని చూడగానే నేను అనుకొన్నలే. నువ్వే కాదన్నావుగాని...."
    "ఎందుకు చేశాడట ఆ పని?"
    "రమణరావు మీద ప్రతీకారం తీర్చుకోడానికి."
    "ప్రతీకారమా? అతడు శంకర్రావుకు చేసిన అపకారం ఏమిటి?"
    "అతడి మేనకోడల్ని మోసం చేశాడు. ఇప్పుడు  మేనల్లుడి  పెళ్ళి  ఆపు చేశాడు. అతడి ప్రియురాలైన కమలాంబకు  దూరం చేస్తున్నాడు"
    "కమలాంబ దూరం చెయ్యడమా! అదిఎలా?"
    "ఎలా ఏముంది? రమణరావు కమలాంబ అల్లుడు  కాబోతున్నాడు. ఇక ఆ ఇంట్లో  శంకర్రావుకు స్థానం ఉండడు. వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ  రమణరావు అధీనంలోకి వచ్చేస్తాయి."
    "తన మేనకోడల్ని మోసం చేసిన  వాడిమీద కసితీర్చుకోవడానికి ఆమెను హత్య చేయించాడా మేనమామ? ట్రాష్!" అన్నాడు విజయ్ నిర్లక్ష్యంగా.
    "విజయ్  నువ్వు  మాట్లాడకు" విసుక్కున్నాడు నరేంద్ర.
    "అందుకని శంకర్రావు  పోచయ్య చేత తన మేనకోడల్ని హత్యచేయించాడంటావ్?" గంభీరంగా పలికింది డిటెక్టివ్ నరేంద్ర కంఠ స్వరం.
    "నేను అనడం లేదు. అతడే అన్నాడు తన అపరాధం ఒప్పుకున్నాడు."
    "రెండూ ఒకటే." నిర్లక్ష్యంగా అన్నాడు అద్వయితం.
    "రెండూ ఒకటి కాదు. ఆ రెంటిలో ఉన్నభేదం మీ పోలీసు వాళ్ళకు తెలియదులే" వ్యంగ్యంగా అన్నాడు నరేంద్ర.
    "ఏమిటా భేదం?"
    "నీకు చెప్పినా అర్థం కాదు కాని  ముందిది చెప్పు! శంకర్రావు మీద చెయ్యి  చేసుకొన్నారా?"

 Previous Page Next Page