Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 40

   
    విచ్చుకున్న విరజాజే కాదు గుచ్చుకునే మొగలిరేకుకూడా! ఏదైనా పరిమళభరితమే!
    
    "మాధవ్ మన పెళ్ళికి మీవాళ్ళు ఒప్పుకోలేదా?" అతని గుండెలమీద ముఖాన్ని ఒత్తిపెడుతూ అడిగింది.
    
    "ఒప్పుకున్నారు మీ నాన్నే ఒప్పుకోలేదు!"
    
    "ఎందుకు?" ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం.
    
    మాధవ్ ఆమె తలను ఇంకా గట్టిగా గుండెకేసి అదుముకుంటూ చెప్పాడు "ఉమ్మడి కుటుంబం అంటే తేనెతుట్టలాంటిదట! గిజిగాడి గూడులాంటి చిన్న కాపురం పెడతానంటే నిన్ను ఇచ్చి పెళ్ళి చేస్తానన్నాడు!"
    
    రాధ అతని గుండె చప్పుళ్ళతోబాటు, అతను గుండెలోంచి పలికే ముచ్చట్లు వింటూ ఉండిపోయింది.
    
    మాధవ్ తన ఉద్దేశాలూ, నిర్ణయాలూ, అభిప్రాయాలూ ఆమెకి పూసగుచ్చినట్లు వివరించాడు.
    
    "రాధా! నీది మీనాన్న అభిప్రాయమేనా?" అడిగాడు.
    
    "ఎవరుంటేనేం? ఎందరుంటేనేం? ఎక్కడుంటేనేం? నువ్వు కావాలి... అంతే!" స్థిరంగా చెప్పింది మనసారా పలికింది!        
    
    "లోపల పెద్దనాన్న పడుకున్నాడు. కాస్త నలతగా ఉందన్నాడు. లేస్తే బాగుండదు వెళ్ళిపో! ఇంటిదాకా తోడు రానా?"
    
    "వద్దు."
    
    "భయం లేదా? వెళ్ళిపోగలవా?"
    
    "భయం లేదు, ఉండిపోతాను!"
    
    "ఆఁ!!"
    
    "అవును, ఈ రాత్రి నీతో ఉండిపోతాను, నన్ను పంపించకు!" ఆమె అతన్ని హత్తుకుపోతూ అంది.
    
    మాధవ్ ఆమె స్పర్శలో తేడాను గమనించాడు. ఇందాకటిలా గోరువెచ్చగా కాంక్ష కలగలిపి లేదు. మంచుముక్కలా చల్లగా భయాన్ని ప్రకటిస్తోంది.
    
    ఏ పదఘట్టన కింద నలిగిపోతానో అని భయపడే గడ్డిపూవులా వణికి పోతోంది.
    
    "ఎందుకూ?" ఆమె తలని లాలనగా స్పృశిస్తూ అడిగాడు.
    
    రాధకి ఇందాకటినుండి పళ్ళబిగువున ఆపిన దుఃఖం ఎగదన్నుకొచ్చింది. ఒక్కసారిగా కడవ గుమ్మరించినట్లు ఏడుస్తూ తనకి తండ్రి చూసిన సంబంధం వివరాలు చెప్పింది.
    
    మాధవ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. సుబ్బారాయుడి హృదయం కోనసీమ కొబ్బరికాయలాంటిది. పైకి ఎంత కఠినంగా కనిపించినా లోన వెన్న! ఆ పైనున్న పెంకుని ఎలా పగలదీయాలా అని ఆలోచనలో పడ్డాడు.
    
    "అందుకే నే చెప్పేది విను!" ఏదో నిశ్చయానికొచ్చినట్లు రాధ గంభీరంగా ముఖం పెట్టింది.
    
    "ఒక రాత్రంతా ఓ కన్నెపిల్ల ఒక అబ్బాయితో  ఉంటే అతను పెళ్ళి చేసుకోవలసిందేనని మా నాన్న నిన్న తీర్పు చెప్పాడుగా! ఇప్పుడు మనము అదే చేద్దాం. రేపు రచ్చబండ దగ్గర ఏం చెప్తాడో విందాం!" ఆమె ముఖం ఎర్రగా మెరుస్తూ సూర్యరశ్మి సోకినా మిరపచేనుని తలపిస్తోంది.
    
    మాధవ్ ఆమెకి దగ్గరగా జరిగి "మరి..... మరి..... నేను ఈ రాత్రి బుద్దిగా ఉంటాననుకున్నావా? ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని చేతులు ముడుచుకు కూర్చోలేనుగా!'
    
    ఆమె అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది.
    
    "మనసు తీరాక నా దారి నే చూసుకుని పోతేనో... అలాంటి ఆలోచన రాలేదా?" అన్నాడు అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి.
    
    రాధ మోహంలో భావాలు కనిపించకుండా తల వంచుకుంది.
    
    "ఏయ్, పల్లెటూరి పిల్లా .... జవాబు చెప్పు!" అన్నాడు.
    
    "ఆ ఒక్క కలయిక వల్లా నాకు నీలాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటాను!" ఆమె గొంతు మంద్రంగా సితారు తీగలా పలికింది.
    
    మాధవ్ ఒక్కక్షణం సన్నగా కంపించాడు.
        
    అమెరికాలో లిజీ తనతో డేట్ చేయమని అడుగుతూ, "సేఫ్టీ పిరియడే నాకు.... ఫర్వాలేదు, మధూ!" అంది. అంటే.... తనంటే ఎంత ఇష్టం ఉన్నా అనవసరమైన బర్డెన్స్ ఆమె తీసుకోదలచుకోలేదు. కానీ పెద్దగా చదువుకోని ఓ పల్లెటూరి అమ్మాయి... ఇంకా తల్లి రెక్కలకింద నుండి తప్ప వెలుగు చూడని    అమాయకపు పిట్ట ఎంత ధైర్యంగా అనేసిందీ? ఎవరంటారు ఆ అమ్మాయికి లోకం తెలియదని!

    ఆమెకు లోకాలన్నీ తెలుసు! ఒక విశ్వరహస్యాన్ని ఆమె అతిసునాయాసంగా కనుక్కుంది. కన్యత్వాన్ని తాంబూలంలో చుట్టిస్తూ... కడుపు పండించమని అడిగే కన్నెపిల్లని ఎవడూ వదులుకోలేడు.    
    
    సూర్యుడికైనా తప్పలేదు కడుపుతీపి తిప్పలు. కవచకుండలాలు దానం చెయ్యొద్దురా అని కొడుకుని బతిమాలుకోవడానికి దిగివచ్చాడు. అతనే చేరాడో, ఆమే చేరిందో తెలియదు గానీ... ఆమె అతని ఎద మీద వాలి ఎవరికీ దొరకని మోక్షద్వారమేదో తన కొక్కదానికే దొరికినట్లు పరవశించింది.        
    
    "అక్షింతలూ, ఆశీర్వచనాలూ అందుకుని అరుంధతికి మొక్కి అప్పగింతలు పెట్టించుకుని అప్పుడు జాగ్రత్తగా నీ కొంగున ముడేసుకొచ్చిన తాయిళాన్ని ముడివిప్పి తీసుకుంటాను..... అందాకా పదిలం!"
    
    కళ్ళు మూసుకున్న రాధ మనసులో అనుకుంది. "నీలాంబరి రాగాన్నీ, నీటిలో పారిజాతాన్నీ చూసి ఆనందించగలిగే నువ్వు, పెద్ద నాన్నకు చేతికర్రవై, చిన్నాన్నకు దీపస్తంభానివై దారి చూపే నువ్వు.... అత్త ఒడిలో పడుకుని లాలిపాట వింటూ అమ్మచేత గోరుముద్దలు పెట్టించుకునే నువ్వు, మేకపిల్లకు ముల్లు గుచ్చుకున్నా విలవిలలాడుతూ చొక్కా చింపి కట్టుకట్టే నువ్వు..... కోరినా కట్టు దాటవని నాకు తెలుసులే, పట్నం నుండొచ్చిన వెర్రి కుర్రాడా!"
    
    "పద, రాధా! ఇంట్లో అంతా కంగారు పడుతూంటారు!" అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని.
    
    "నేను చెప్పినదంతా విని మళ్ళీ...." ఆమె చిరుకోపంగా చూసింది.
    
    "నీ ధైర్యానికి నా జోహార్లు కానీ, వీరనారీ! .... అది పద్దతి కాదు."
    
    "నీదంతా పాత చింతకాయ పచ్చడి చాదస్తం!" బుంగమూతి పెట్టింది.
    
    "అయితే వదిలేస్తావా?" కవ్విస్తూ అడిగాడు.
    
    "ఊహుఁ, పాత చింతకాయ పచ్చడి చచ్చిన జిహ్వని బతికించేటంత రుచిగా ఉంటుంది!" అని నవ్వింది.
    
    "అయితే నే చెప్పినట్లు విను.....!"
    
    "కానీ నాన్న...." భయంగా చెప్పబోయింది.

 Previous Page Next Page