Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 41


    "మీ నాన్నరోగం కుదర్చడానికి ఓ గుళిక తయారుచేశాగా, పద చెప్తాను!" అన్నాడు.
    
                                                                * * *
    
    గణపతి సైకిల్ దిగుతూ ఇంటిల్లిపాదీ వసారాలో నిలబడి ఉండటం గమనించాడు. అతడు చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి ఆ వేళల్లా ఐదారుగురుని రెండువేలూ, మూడువేలూ పెట్టుబడితో నిర్మాతలుగా మార్చాడు. కాళ్ళు లాగేస్తున్నా మొహం ఉత్సాహంగా మెరిసిపోతోంది. కానీ, అందరూ తనని అదోరకంగా చూస్తూండటంతో బెరుకుగా చూస్తూ లోపలికి వచ్చాడు.
    
    "రాజీవ్ గాంధీ హత్యకేసులో నిందితురాలికి క్షమాభిక్ష పెట్టమని సోనియా అభ్యర్ధన!" వాతల తాతయ్య చుట్టూ పిల్లలను కూర్చోపెట్టుకుని చదివి వినిపిస్తున్నాడు.
    
    "క్రికెట్ గురించి చదువు, తాతయ్యా!" ప్రకాశం పెద్దకొడుకు అడుగుతున్నాడు.
    
    తిలక నైటీ వేసుకుని కూర్చుని పుస్తకం చదువుతున్నదల్లా గణపతిని చూసి కళ్ళతోనే "వెళ్ళిన పని ఏమైంది?" అని అడిగింది.
    
    గణపతి హుషారుగా వేలెత్తి చూపించబోయి ప్రకాశం తనవైపు తిరిగేసరికి ఆ వేలు అలానే చూపిస్తూ, "అమ్మా!.... కాసిని మంచినీళ్ళియ్యి!" అన్నాడు.
    
    సూరమ్మ లేచి లోపలకు వెళ్ళింది.
    
    "టైం ఎంతయిందిరా?" సుబ్బారాయుడు పడక కుర్చీలోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ అడిగాడు.
    
    "తొమ్మిది దాటింది.....ఇంకోసారి గుడిదాకా వెళ్ళి రమ్మంటావా?" అడిగాడు ప్రకాశం.
    
    "చెరువులలో, బావుల్లో కూడా చూడండి. నాకు .... నాకు...." ఆపైన చెప్పుకోలేక కొంగు నోట్లో కుక్కుకుంది పార్వతమ్మ.
    
    "అక్కయ్యా! అశుభం పలకకు!" భయంతో వణికిపోతూ అంది శాంత.
    
    వాళ్ళ కంగారు తన గురించి కాదని గణపతికి అర్ధమైంది.
    
    "తిలకా! నువ్వు తోడు వెళ్ళలేదా?" అడిగాడు ప్రకాశం.
    
    "వెళ్ళాను నన్ను ఇంటికి వెళ్ళిపోమంది. కాసేపు గుడిలో ఒక్కత్తీ కూర్చుని వస్తానంది!" అంది తిలక.    
    
    పార్వతమ్మ ఏడుపు స్థాయి పెంచింది.
    
    "నువ్వు ఊరుకో...... నే వెళ్ళి చూస్తాను!" సుబ్బారాయుడు చెప్పులు తొడుక్కుంటూ అన్నాడు.
    
    "ఏడుకొండలవాడికి నూట పదహార్లు మనియార్డరు చేస్తానని మొక్కుకోరా, సుబ్బడూ!" తాయారమ్మ అరిచింది. ఆవిడ తలకింద మనియార్డరు ఫారాలు సిద్దంగా ఉంటాయి.
    
    "నువ్వుండు మావయ్యా..... నే వెళ్ళి చూసొస్తాను!" అన్నాడు గణపతి.
    
    "నేనూ వస్తాను పద!" అన్నాడు ప్రకాశం.
    
    "త్వరగా పదండి!" సన్యాసిరావు బయలుదేరాడు.
    
    "ఏడవకు అక్కయ్యా! వచ్చేస్తుంది!" శాంత కళ్ళు తుడుచుకుని పార్వతమ్మకు ధైర్యం చెప్పింది.
    
    "దానికి పాలకి, నీళ్ళకీ, చీకటికీ వెలుగుకి భేదం తెలియదు. నోరులేని పిల్ల!" సూరమ్మ కొడుక్కి మంచినీళ్ళు అందించి బాధగా అంది.
    
    "పోలీస్ రిపోర్టు ఇద్దామా?" అడిగాడు ప్రకాశం.
    
    సుబ్బారాయుడు ఠక్కున తలతిప్పి చూశాడు.
    
    అన్నగారి కళ్ళల్లో కనిపించిన భావానికి ప్రకాశం తల వంచుకున్నాడు. ఆ ఇంటి పరువు ఎలాంటిదో ఊళ్ళో గోచీపెట్టుకోవడం రాని పసివాడు కూడా చెప్తాడు. అటువంటి ఇంటి ఆడపిల్ల చీకటిపడ్డాక కనిపించకపోవడమూ! ఈ విషయం పెదవిదాటితే పృథ్వీ దాటుతుందని అతడికి తెలుసు. కానీ, ప్రేమ అన్నింటినీ అధిగమించి ఆ మాట అడిగించింది.
    
    "ఇదిగో, లాంతరు తీసుకెళ్ళండి!" సూరమ్మ తీసుకొచ్చి అందించింది.
    
    సన్యాసిరావు అందుకున్నాడు, అందరూ హడావుడిగా బయలుదేరుతుండగా.
    
    "ఎవరో వస్తున్నారు, తోడు!" అన్నాడు ప్రకాశం.
    
    టార్చ్ లైట్ వెలుగు వారి ఇంటిని సమీపించసాగింది.
    
    ఆ వెలుగుకి మొహానికి చెయ్యి అడ్డుపెట్టుకున్నాడు సుబ్బారాయుడు.
    
    ఆ ఆకారాలు దగ్గరకొచ్చాయి.
    
    "రాధ..... రాధ వచ్చింది!" ఆనందంగా కేకలు పెట్టాడు సన్యాసిరావు.
    
    "వచ్చిందా? నా తల్లీ..... బంగారూ!" పార్వతమ్మ పరుగెత్తు కొచ్చింది.
    
    మాధవ్ ఆమెవైపు లోపలకు వెళ్ళమన్నట్లుగా చూశాడు.
    
    "నువ్వా.....!?" సుబ్బారాయుడు కోపంగా అన్నాడు మాధవ్ ని గుర్తించి.
    
    "లోపలికి పదండి. మాట్లాడుకుందాం!" చిరునవ్వుతో అన్నాడు మాధవ్.
    
    పార్వతమ్మ కూతురి తల నిమురుతున్నదల్లా భయంగా భర్తవైపు చూసింది.
    
    "నీతో మాట్లాడాల్సిందేమీ నాకు లేదు. నువ్వంటే స్నేహితుడు కొడుకుగా నాకు అభిమానం ఉంది. దాన్ని ఇలా పోగొట్టుకుంటావనుకోలేదు! ఛీ.... ఎంత అప్రదిష్ట తెచ్చే పని చేశావు?" చీత్కారంగా అన్నాడు సుబ్బారాయుడు.
    
    రాధ తల్లి వెనకనుండే "అతన్నేం అనొద్దు! నేనే వెళ్ళాను!" అంది.
    
    అందరూ అవాక్కయిపోయి చూశారు.
    
    ఆకలేస్తే అన్నం పెట్టమనీ అడగడం కూడా తెలియని పిల్ల; ఇంకా తొక్కుడుబిళ్ళ ఆడుతూ, పొడుగు పరికిణీలు కాళ్ళల్లో పడుతున్నాయి..... అంటూ గొడవ చేసే పిల్ల... ఇలా ఆరిందలా మాట్లాడేసరికి ఖిన్నులైపోయారు.
    
    "నేనే సీతారామయ్య మావయ్య ఇంటికి వెళ్ళాను. అసలు అక్కడే ఉండిపోతా నన్నాను. తనే నచ్చచెప్పి తీసుకువచ్చాడు!" అంది.
    
    "పార్వతీ దాన్ని లోపలకు తీసుకువెళ్ళు!" గట్టిగా అన్నాడు సుబ్బారాయుడు.
    
    "రామ్మా....."! కూతుర్ని బలవంతంగా రెక్క పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ అంది పార్వతమ్మ.
    
    రాధ తల్లిని వదిలించుకుంటూ, "నాన్నా! మాధవ్ తప్పేమీ లేదు. అతన్ని ఏమీ అనడానికి నేను ఒప్పుకోను!" అంది.
    
    "లోపలికి పద....!" మాధవ్ తో అన్నాడు సుబ్బారాయుడు.
    
    మాధవ్ బుద్దిగా ఆయన వెనకాల నడిచాడు.
    
    లోపల చెక్క కుర్చీ చూపిస్తూ "కూర్చో!" అన్నాడు సుబ్బారాయుడు.
    
    అందరూ ఊపిరి బిగబట్టి చూస్తూ నిలబడ్డారు.
    
    సుబ్బారాయుడు గొంతు సవరించుకుని ఎదురుగా కూర్చొని మొదలుపెట్టాడు. "చూడు బాబూ! నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేసి మా పెద్దవాళ్ళ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని నేనెంతో ఆశపడ్డాను. తీరా ఆ పనిమీద వచ్చి మీతో మాట్లాడాక నాకు మీ అభిప్రాయాలు నచ్చక, నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి అదీ, అబ్బాయీ ఇద్దరే హాయిగా ఉండేలాంటి అమెరికా సంబంధం చూశాము. రేపో, ఎల్లుండో తాంబూలాలు కూడా పుచ్చుకోవాలనుకుంటున్నాను. అందుకని నువ్వు తెల్లారగానే ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోతే నీకూ, నాకూ....అందరికీ కూడా మంచిది!" అన్నాడు.

 Previous Page Next Page