వీరయ్య ఏదో అనబోయాడు.
"సుబ్బారాయుడుగారు చెప్పిందే న్యాయం!" అన్నాడు గంగరాజు చుట్టూ ఉన్న జనం కూడా చప్పట్లు కొట్టి తమ హర్షం వెలిబుచ్చారు.
తిలక రాధ భుజంమీద నొక్కి ఆనందంగా కళ్ళెగరేసింది. రాధ మౌనంగా వెనుతిరిగింది.
వీరయ్య చెయ్యి ఆమె చేతిలో వేయించి పెద్దల సమక్షంలో ప్రమాణం చేయించి ఆదివారం పెళ్ళి జరిగేటట్లు ఒప్పందం కుదిర్చారు. రంగయ్య కూతురికి ఏం అర్ధమైందో కానీ, నవ్వుతూ చూసింది.
వీరిగాడు తల వంచుకుని పెద్దల తీర్పుకి కట్టుబడ్డాడు.
ఊళ్ళో సుబ్బారాయుడి మాటంటే అంత గురి!
మొహం అంతా ఎరుపు చేసుకుని అలికినట్లుంది ఆకాశం. రాయబారాని కొచ్చినట్లున్న మబ్బులు ఒకదానితో ఒకటి చేరి గుసగుసలాడుతూ నిలబడ్డాయి.
కోనేట్లో కలువ పూలని చూస్తే గుండె బద్దలైనంత బాధగా ఉంది రాధకి. నాగమల్లి పూలు చెట్టుమీద నుండి రాలి టప్పు... టప్పున నీళ్ళల్లో పడుతున్నాయి. నీటి అల నుండి తిరిగినప్పుడల్లా ఆమె హృదయంలాగే కోనేరూ వ్యాకులమవుతోంది.
మృదువుగా ఎవరో "రాధా!" అని పిలిచినట్లు అనిపించింది.
ఆమె కళ్ళు రెండూ తుడుచుకుని చుట్టూ చూసింది.
అంతా ఆమె భ్రమ! ఎవరూ లేరు.
గడ్డం మోకాలిమీద ఆన్చి అశోకవనంలో సీతాదేవిలా కూర్చుంది.
"రాధా!" మళ్ళీ వినిపించింది దగ్గరగా.
ఆమె తల తిప్పి చూస్తే ఓ చిన్నపిల్లవాడు మల్లెపూల పొట్లం తీసుకొచ్చి "తీసుకో, రాధా!" అంటున్నాడు.
రాధ ఆశ్చర్యంగా "ఎవరిచ్చారు?" అంది.
"ఇచ్చి గబగబా వెళ్ళిపోయాడు!"
ఆమె గబుక్కున వాడి చేతిలోంచి పొట్లం లాక్కుంది. పొట్లం విప్పగానే అందులో ఉన్న అరిటాకులో రాసి ఉంది. "ఐ లవ్ యూ.... మాధవ్!" అని.
రాధకి ఏడుపు ఆగలేదు.
ఆ పిల్లాడ్ని దగ్గరగా తీసుకుని ఏడుస్తూ వాడి బుగ్గలమీద ముద్దులు పెట్టింది. అలనాడు సీతమ్మ, రాముడు పంపగా వచ్చిన హనుమయ్యని చూస్తే ఇలాంటి వాత్సల్యమే కలిగి ఉంటుంది.
"ఏడీ? ఎటెళ్ళాడు?" అని అడిగింది.
"ఏమో!" వాడు చేతులు తిప్పాడు.
రాధ వాడిని వదిలేసి పిచ్చిగా పరుగుపెట్టింది. గుడి అరుగుమీద.... బడి దగ్గర..... రచ్చబండ దగ్గర..... తురాయి చెట్టుదగ్గర.... కాలవ ఒడ్డుదగ్గర.....పరుగెత్తీ ఆమె అలసిపోయింది. అలాగే కాళ్ళీడ్చుకుంటూ వస్తుంటే ఆమెకి స్ఫురించింది సీతారామయ్య మావయ్య ఇంట్లోనేగా ఉంటాడూ....ఆమె కాళ్ళల్లో మళ్ళీ ఉత్సాహం ప్రవేశించింది రయ్యిన పరుగు అందుకుంది.
వసంతుడి ఆగమనం ముందుగా కోయిలకే తెలుస్తుంది. అలాగే ఆమె శరీరంలోని ప్రతి అణువూ ఆనందంతో ఎగసిపడసాగింది! ఆమె జడపాయలు విడిపోయి వీపంతా పరుచుకున్నాయి. కంటి కాటుక కారి బుగ్గలమీద చారికలు కట్టాయి. నుదుటిమీద పాకిన కుంకుమ కళ్యాణ తిలకంలా ఒంపు తిరిగింది. మల్లెపూల దండ మాత్రం గుండెకి దగ్గరగా ఉంది.
"నగుమోమూ కనలేనీ నా జాలీ తెలిసీ...." త్యాగరాజు ఆర్తి ఆ కంఠంలో పలికి ఆమె గుండెని తాకి ఆర్ద్రంగా మార్చింది.
"మాధవ్!" ఆమె ఆపుకోలేనంత ఉద్వేగంతో అరిచింది.
పాడుతున్న అతను గిరుక్కున వెనక్కి తిరిగాడు.
ద్వారబంధానికి అటూ ఇటూ చేతులు ఆన్చి ఎగసిపడుతున్న గుండెలతో రొప్పుతూ లేత రెక్కలు - వనదేవతలా కనిపించింది ఆమె.
ఒక్క అంగలో ముందుకెళ్ళి ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకుని అంతలోనే దూరంగా జరిపి మొహాన్ని రెండు చేతులమధ్యా తీసుకుని తనివితీరా చూసుకుని, మళ్ళీ గట్టిగా గుండెలకి హత్తుకుని అసలే చిక్కుపడిన జుట్టుని ఇంకా చిందరవందర చేస్తూ ఆమెని నలిపేస్తూ ముఖమంతా ముద్దులు పెడుతూ ....రాధా.... రాధా....!" అంటూ పదే పదే పలకసాగాడు.
ఆమెకి భయమే వెయ్యలేదు. తన స్వంత ఆస్తిని తాకినట్లు అతని ఛాతీని నిమిరింది. మెడమీద పెదవులతో రాసింది. కన్నీటితో అతని ఎదని అభిషేకించింది.
లిపి లేని భాషలో నడిలేని రహస్యాలెన్నో చెప్పింది!
"కొబ్బరాకుల మాటున చంద్రుడ్ని చూసినా, గర్భగుడిలో దేవుడ్ని చూసినా... నువ్వు కనిపించావు! నీ నవ్వే వినిపించింది. తెలుసా?"
"నువ్వు నాతో ఉన్నప్పుడు నన్నూ, నువ్వు నాతో లేనప్పుడు ప్రపంచాన్నీ మరిచిపోతున్నాను! ఎందుకు?"
ఒకసారి పోతే తిరిగి రానిది భయం! ఒకసారి వస్తే తిరిగి పోనిది ప్రేమ! ప్రేమికులకి ఇది అనుభవైకం.
"నేను గుర్తొచ్చానా?" ఆమె చెవిలో గుసగుసలాడాడు.
"మల్లె పరిమళాన్ని మరిచిపోతే అది మల్లె అవుతుందా?" గుప్పెట బిగించి అలకగా అతని గుండెలమీద కొట్టింది.
"కబురంపాను అందలేదా?"
"ఎవరితో?"
"చిరుగాలితో.'
"ఏమనీ?"
"www రేపల్లెలో రాధా. Com. నా హృదయాన్ని తాకట్టు పెట్టుకుని ఈ శరీరాన్ని మాత్రం పంపితే ఎలా? ప్లీజ్, తెచ్చివ్వు! అని...." అన్నాడు.
ఆమె 'ఇవ్వను' అన్నట్లు తల అడ్డంగా ఊపి అతన్ని హత్తుకుపోయింది.
వెన్నెల కాలవలో ఒలికితే పాలసముద్రంలా మెరుస్తుంది!
ఆమె అతన్ని పెనవేసుకుంటే అతని మనసు మహాసముద్రంలా ఎగసిపడింది! అదే ... తీరాన్ని చేరుకోవాలనే కడలి ఆరాటం అందాకా అలజడి!
ఆమె అధరాలు అతని అధరాలతో జతపడగానే జతి స్వరం పాడినట్లయింది. అతని వేళ్ళు ఆమె వీపువెనక సంగతులు మీటాయి! ఆమె ఒంటి విరుపులో ఎన్నెన్నో గమకాలు చూసింది. పాదాలు నాలుగూ తిల్లానా లాడాయి. ఉచ్చ్వాస నిశ్వాసాలు స్వరజతులు పాడాయి. అతని చేతులు అవరోహణ నేర్పాయి.
'మదిలోన మరిగింద మధురమైన ముద్దు! పెదవి అంచున మెరిసింది పరువంపు ముద్దు! ఎదపైన విరిసింది విరివంపు..... ఇన్ని ముద్దుల వద్దు నే చెప్పలేనంది అలసిపోయిన పొద్దు!'
రాధంటే ఏమిటో మాధవుడికి తెలిసింది.