Previous Page Next Page 
చిలకలు పేజి 39


    నరేంద్ర ఇంకా బయటికి రాలేదు.
    రోడ్దు కేసి కన్నార్పకుండా, ఊపిరిబిగబట్టి చూడసాగింది అనసూయ.
    నరేంద్ర బయటకు రాలేదు.
    అతడు కూడా రాలేదు.
    అతడు వస్తాడోలేడో?
    అతడు వచ్చేంత వరకూ తను ఇలాగే కూర్చోవాలా? మరో గంట ఇలాగే  కూర్చుంటే తన గుండె ఆగిపోయి చచ్చిపోతుంది. అనసూయ ఆదురుతున్న గుండెను చెత్తో ఒత్తుకున్నది. దూరంగా రోడ్దుమీద మలుపు తిరుగుతున్న కారు  హెడ్ లైట్లు కాంతి హఠాత్తుగా అనసూయ ముఖం మీద పడింది.
    ఆమె కళ్ళు చెదిరిపోయినై
    అతడు వస్తున్నాడు.
    ఆమెకు ముచ్చెమటలు పోశాయి.
    కాళ్ళల్లోకి, నరాల్లోకి లేని సత్తువను తెచ్చుకొని లేచి నిల్చుంది.
    చేతిలోని కాగితాలు కన్పించేళా పట్టుకొని గేటుముందుకు వచ్చింది.
    హెడ్ లైట్స్ కాంతితోపాటు, కారుమోతకూడా విన్పించసాగింది.
    వెలుతురు దగ్గరౌతున్నకొద్దీ ఆమె గుండె వేగం పెరగసాగింది.
    కారు గేటుకు 20 గజాల దూరంలో ఆగింది.
    అనసూయ హెడ్ లైట్ల వెలుగులో కారుకు అడ్డంగా పరుగు తీసింది మళ్ళీ వెనక్కు  తిరిగి ప్రహరీ గేటులో నుంచి చెట్లమధ్య పరుగు తీసింది. ఆమె చేతిలోఉన్న కాగిహాలు గాలికి రెపరెపలాడాయి.
     అనసూయ చెట్లు మధ్యదూరంగా ఉన్నకారు దగ్గరకు పరుగు తీసింది. ఆ చెట్లమధ్య కారు గాభారాలో వెంటనే కన్పించలేదు.
    మళ్ళీ వెనక్కు తిరిగింది. కుడివైపుగా మామిడిచెట్టు కింద ఉన్న ఎర్రమారుతి కన్పించింది.
    పరుగు పరుగున వచ్చి వెనకడోర్ తెరిచి వెనకసీట్లో కూలబడింది ఆయాసపడుతూ.
    భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడ్డట్టు రెండు చేతులతో కళ్ళు మూసుకుంది.
    ఆమె కూర్చోగానే కారు బయలుదేరింది.
    అలసిపోయిన ఆమె శరీరం సీటు వెనక్కు వాలిపోయింది.
    ఆమెకు కొంత సేద తీరినట్టు అయింది.
    తేలిగ్గా గుండెల నిండా గాలిపీల్చుకుంది.
    కళ్ళు తెరిచి చూసింది.
    కారు తెరిచి చూసింది.
    కారు శరవేగంతో పోతుంది.
    రోడ్దుపక్కన కొండగుట్టలూ, చెట్టూ, పొదలూ వెనక్కుపోతున్నాయ్.
    తనెక్కడ ఉంది?
    కారు ఎటుపోతుంది?
    ఇంకా ఊళ్ళోకి రాలేదేం?
    కారు ఊరుదాటి పోతోంది. ఎక్కడకు?
    ముందు సీట్లో స్టీరింగ్ దగ్గర  కూర్చున్న వ్యక్తికేసి చూసింది.
    "ఏయ్! మిస్టర్ మనం ఎక్కడికి పోతున్నాం?" అన్నది అనసూయ.
    "స్వర్గానికి" ముఖం మీదకు వంగిఉన్న హాట్ ను ఎత్తకుండానే అన్నాడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి.
    "డిటెక్టివ్ నరేంద్ర నన్ను ఇంటికి పంపించే ఏర్పాటు చేశానన్నాడే? ఏమిటి నువ్వంటున్నది?
    "అవును చేశాడు ఏర్పాటు నిను శాశ్వితంగా ఇంటికి పంపించే ఏర్పాటే చేశాడు" అంటూ అతడు వికటంగా నవ్వాడు.
    "ఎవరు నువ్వు?"
    "యముడ్ని"
    "కారాపు!" వెర్రిగా అరిచింది.
    "నీ అరుపులు వినేవాళ్ళెవరూ ఇక్కడలేరు". మళ్ళీ వికటంగా  నవ్వాడు.
    అనసూయ కారు తలుపుతీసి దూకడానికి ప్రయత్నించింది.
    "కారు 80 మైళ్ళ వేగంతో పోతోంది కారులోనుంచి ఈ కొండరాళ్ళమీద పడితే ఏమౌతుందో తెలుసా? నీ తలకాయ కొబ్బరికాయలా పటుపటుకున్న పగులుతుంది" అని పకపక నవ్వాడు.
    అనసూయ తలుపుతీసి ప్రయత్నం ఠక్కున ఆపేసింది.
    ముందు సీట్లోకి వంగి, అతడి భుజాలు పట్టుకొని ఊపుతూ "ఏమిటి నీ ఉద్దేశ్యం? ఎక్కడికి తీసుకెళుతున్నావ్?"
    "చెప్పాగా స్వర్గానికని!" అని హఠాత్తుగా బ్రేకు వేశాడు.
    ఆమె నుదురు ముందు సీటుకు కొట్టుకున్నది.
    "అబ్బా!" అని మూలుగుతూ మళ్ళీ  వెనక  సీట్లోకి జారగిలపడి పోయింది.
                                     22
    బంగళాగేటు ముందు కారు ఆగింది.
    ఇన్స్ స్పెక్టర్ అద్వాయితమూ, నలుగురు కానిస్టేబుల్సూ కారులో నుంచి బయటికి దూకారు.
    "ఏయ్! హెడ్డూ! ఇప్పుడు కారుకు అడ్డంగా పరిగెత్తి మళ్ళీ  గేటులో నుంచి  తోటలోకి పరిగెత్తింది. ఆ అమ్మాయిని పట్టుకో ఓఒ త్వరగా పరుగెత్తండి. తోటంతా వెదికి పట్టుకో" అన్నాడు అద్వయితం హెడ్డూతో.
    మిగతా కానిస్టేబుల్స్ కేసి చూసి "మీరంతా బంగళా చుట్టూ కాపలా కాయండి. ఒక పిట్టకూడా బయటకి పోవడానికి వీల్లేదు" ఆజ్ఞాపించారు.
    "యాస్సార్!" అంటూ హెడ్ కానిస్టేబుల్ తోటలోకి పరుగు తీశాడు.
    మిగతావాళ్ళు బంగాళా ప్రహరీ చుట్టూ మూగారు.
    ఇన్ స్పెక్టర్ అద్వయితం, బెల్టులోనుంచి రివాల్వర్ తీసి, అడుగులో అడుగు వేసుకుంటూ, బంగళాపోర్టికోలో రావడమూ, లోపల్నుంచి డిటెక్టివ్ నరేంద్ర తలుపు నెట్టుకొని పోర్టికోలోకి రావడమూ ఒకేసారి జరిగాయి.
    రివాల్వర్ గురిపెట్టి "హాండ్స్ అప్" అంటూ ఇన్స్ స్పెక్టర్ నరేంద్రను చూసి నివ్వెరపోయాడు.
    నరేంద్ర అద్వయితాన్ని ఆ సమయంలో అక్కడచూసి ఆశ్చర్య పడ్డాడు.
    "నువ్వా?" అన్నాడు అద్వయితం.
    "అవును ఇన్స్ స్పెక్టర్ నువ్వు ఇలా ఊడిపద్దవేం?" ఆశ్చర్యం నుంచి పూర్తిగా బయటపడని నరేంద్ర అడిగాడు.
    "అది నా వృత్తిధర్మం!"
    "సరిగ్గా చెప్పు!"
    "నువ్వే చెప్పాల్సిన వాడివి. నువ్వు ఇంతరాత్రప్పుడు ఈఇంటి తాళం పగలగొట్టి, లోపల జొరబడి ఏం చేస్తున్నావ్? ఈ బంగ్లా తోటలోకి పరిగెత్తిన అమ్మాయి ఎవరు? నువ్వు  సరైన సమాధానం చెప్పక పోతే, ఈ పళాన నిన్ను అరెస్టుచేసే అధికారం నాకుంది. తెలుసుగా?"  అన్నాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయితం.
    "ఆ కారాణాలన్నీ అవసరమైనప్పుడు చెప్తాను."
    "ఇప్పుడే చెప్పాలి"
    "చెప్పను. నాపని పూర్తిఅయింది. ఇప్పుడు నువ్వు నన్ను అరెస్టు చేసిన నాకేమీ అభ్యతరం లేదు", అన్నాడు నరేంద్ర చిరునవ్వుతో.
    అద్వయితం అయోమయంగా నరేంద్ర ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు కొన్నిక్షణాలు.
    అంతలో ఓ కారువచ్చి పోర్టికోలో ఆగింది. కారులో నుంచి విజయ్  దిగాడు. విజయ్ గాభరాపడ్తూ ఏదో చెప్పబోయాడు.
    "అనసూయను ఎక్కడ ఉంచావ్? ఆమెను వంటరిగా  వదిలేసి  ఇక్కడి కెందుకొచ్చావ్? విజయ్ కేసి  కోపంగా చూస్తూ అన్నాడు నరేంద్ర .
    "అనసూయ? ఆమె నాకు కన్పించలేదే?" తోటలో నీ కారు  కూడా లేదు. నేను ఇప్పుడే వస్తున్నాను."
    "ఇంతసేపు ఎక్కడున్నావ్? ఏం చేశావ్?"
    "మనం అనుకొన్న టైంకు రాలేకపోయాను. నీకు టెలిఫోన్ చేసి టెలీఫోన్ బూత్ లో నుంచి బయటికి వచ్చేసరికి కారు టైరులో గాలిపోయి ఉంది. కారు బంక్ దాకా తోసుకెళ్ళి గాలికొట్టించేసరికి ఆలస్యము అయింది." ఒక్కగుక్కలో చెప్పాడు విజయ్.
    అద్వయితానికి వాళ్ళ సంభాషణ అర్థం కావడం లేదు.
    డిటెక్టివ్ నరేంద్రకు నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది.
    "నాకు భయంగా ఉంది. నా కాళ్ళు వణుకుతున్నాయి" అంటూ  దీనంగా పలికిన అనసూయ రూపం కళ్లల్లో మెదిలింది.
    "ఓమైగాడ్! ఎంత పని చేశావ్ విజయ్! మన ప్లానంతా తల్ల కిందులై పోయింది. హంతకుడే నీ కారు టైర్ లో మంచి గాలి తీసేసి  ఉంటాడు. అంటే మన ప్లానంతా అతడు పసికట్టాడన్న మాట, అనసూయ ఈ పాటికి మైగాడ్" ఆపైమాటలు నరేంద్ర కంఠంలో నుంచి బయటపడలేదు.
    "ప్లాన్? హంతకుడా? అనసూయ? ఏమిటి మీరంటున్నది?" అయోమయంగా కూస్తూ అడిగాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయితం.
    నరేంద్ర అద్వయితం మాటలు విన్పించుకోలేదు, ఒక్క దూకులోవెళ్ళి కార్లో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కారుస్టార్ట్ చేశాడు.
    "మిస్టర్ అద్వయితం, త్వరగా  ఎక్కు, గెటిన్!" అని అరిచాడు నరేంద్ర.
    అద్వయితం యాంత్రికంగా ఒక గంతులో కారెక్కి ముందు సీట్లో నరేంద్ర పక్కన కూర్చున్నాడు.
    కదులుతున్న కార్లోకి విజయ్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఎగిరి ఎక్కి వెనక సీట్లో కూర్చున్నారు.
    నరేంద్ర వళ్ళు తెలియని ఆవేశంతో  యాక్సిలేటర్ తొక్కసాగాడు.
    కారు వెనకే పోలీసు జీపు బయలుదేరింది.
    కారు 80 మైళ్ళ వేగంతో పోతోంది.
    బంజారాహిల్స్ దాటి జూబ్లీహిల్స్ లో ప్రవేశించింది.
    "మిస్టర్ నరేంద్రా ! ఇటు  ఎక్కడికి? కారు వెనక్కు తిప్పు; స్టేషన్ కు పోనియ్." ముందు సీట్లో చిరాగ్గా కదులుతూ అన్నాడు అద్వయితం.
    అదేమీ పట్టించుకోకుండా నరేంద్ర కారు వేగం  పెంచాడు. దీంతో అద్వయితానికి కోపం వచ్చింది.
    నరేంద్రను అరెస్టు చేసే అవకాశం ఇప్పుడు తనకు ఉంది. కాని అతడే తనను ఒక బందీని చేసి తీసుకెళ్తూన్నాడు. అసలు  ఎక్కడకు తీసుకెళుతున్నాడు? ఎందుకు తీసుకెళుతున్నాడు? తనను ఒక అర్పకుడిగా, ఆప్రయోజకుడిగా చూస్తున్నాడు నరేంద్ర.
    ఆలోచించికొద్దీ నరేంద్ర మీద కోపం పెరుగుతుంది. అతడి ఆత్మాభీమనం దెబ్బతిన్నది.
    "మిస్టర్ అద్వయితం!అనవసరంగా  ఉద్రేకపడకు, నీ చేతిలో రివాల్వర్ ఉంది. నీ వెనక ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. భయమెందుకు? నేను  నిన్నేం  చేస్తానని భయపడ్తున్నావ్?"
    "నాకా భయమా? ముందు  కారు వెనక్కు తిప్పుతావా లేదా?" అరిచినట్టే అన్నాడు అద్వయితం.
    "కారు వెనక్కు  తిప్పడానికి  నాకేమీ అభ్యంతరంలేదు. కాని నీమూలంగా ఒక స్త్రీ హత్యకు గురి కావడం ఇష్టంలేదు."
    గంభీరమైన కంఠంతో అన్నాడు నరేంద్ర.
    "మరో స్త్రీ  హత్యా?" అద్వయితానికి గుండె గొంతులోకి ఎగబాకినంత పనిఅయింది.
    "అవును మరో స్త్రీ శవం! కావాలా? ఆమె హత్యకు గురి అయితే  నీ ప్రమోషన్ సంగతేమోగాని, ఏ ఆదిలాబాద్ కో ట్రాన్స్ ఫర్ తప్పదు."
    "నరేంద్రా! నాకేమీ  అర్థం కాడవంలేదు నాకు మతిపోతోంది సంగతేమిటో చెప్పు."
    "చూడు అద్వయితం మనం త్వరగా వెళ్ళాలి. ఇలా  కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే. హంతకుడు పారిపోతాడు. నన్ను మాట్లాడించకు, ఆమెను రక్షించాలి."
    "పోనియ్! ఎక్కడకు పోతున్నాం?"
    రాధారాణి హత్య జరిగిన ప్రదేశానికే?"
    అద్వయితం తృళ్ళిపడ్డాడు.
    "వాడేనా  హంతకుడు?"
    చూస్తాంగా?" అని నరేంద్రకారు స్పీడు పెంచాడు.
    "ఆ శంక్రరావు గాడేగా?"
    "నరేంద్ర సమాధానం ఇవ్వలేదు.
                                                                              23
    అల్లంత దూరాన కొండలు.
    కొండల మధ్య పల్లంలో ఓ పెద్ద మర్రిచెట్టు.
    చెట్టుమీది నుంచి చందమాను మబ్బుల్లో నుండి వెలవెలబోతూ చూస్తోంది.
    రామచిలక ఒకటి "గీ" పెడ్తు చెట్టుమీద వాలింది.
    రాబందు రెక్కల చప్పుడుకు రామచిలుక తల్లడిల్లి పోయింది.
    అనసూయ కొండరాళ్ళ మీదగా  పరుగులు తీస్తోంది.
    అతడి బూట్ల నాడాలు కొండరాళ్ల మీద శబ్దం చేస్తూ ఆమెను తరుముతున్నాయి.
    ఆమె పిచ్చిగా చెట్టుకేసి పరుగులు తీస్తోంది.
    రాబందు రెక్కల విసురుకు చెట్టు కొమ్మలు ఊగాయి.
    ఆకుల మధ్య ఉన్న రామచిలుక వణికి పోతున్నది.
    ఆమె చెట్టు కిందకి  పరుగు తీసింది.
    ఆమె పాదం పైన అతడి  బూటు కాలు పడింది.
    అనసూయ "కెవ్వున" కేక పెట్టింది.
    దూరంగా వినిపిస్తున్న బూటు కాళ్ళ త్వనులు దగ్గర తున్నాయి.
    కింద జారిపోతున్న అనసూయ శరీరాన్ని అతడి బలమైన చేతులు పైకి  లాగాయి. 

 Previous Page Next Page