Previous Page Next Page 
రాగహేల పేజి 4

    డింగ్ డాంగ్-డింగ్ డాంగ్ కాలింగ్ బెల్ మ్రోగుతోంది. ప్రొఫెసర్ పరశురాం లేచినిలబడ్డాడు. "ఇంకా నాలుగన్నా కాలేదు. అప్పుడే మొదలైంది. ఈ మనుషులేమిటో ఈ జబ్బు లేమిటో?" నిట్టూర్చింది వసుంధర.ఖాళీ ప్లేటు ట్రేలో సర్ది "రామ్మా మనం లోపలికెళ్దాం" అంది మహతితో. "ఆంటీ! మీరు వెళ్ళండి. నేను ఈ కేసేమిటో చూస్తాను" కుతూహలాన్ని వెలిబుచ్చింది మహతి. "ఆహా ఆయనగారి....." ఇంకా ఏదో అనబోయి అంతలోనే గుటకమింగి "నీకూ పట్టిందీ" అని అనేసి వసుంధర ట్రేతీసుకొని వెళ్ళిపోయింది.    
     పరశురాం తలుపు తెరిచాడో లేదో ఓ స్థూలకాయుడు హాల్లోకి దూసుకొచ్చాడు. "గాడిదకొడుకు ఎగ్గొట్టేశాడు. మీరు చెప్తే విన్నారా సార్. వాడొట్టి దగుల్భాజీముండాకొడుకని? మీ మాటనమ్మి వాడికి అప్పు ఇచ్చాను. ఇప్పుడు వాడేమంటున్నాడో తెలుసా సార్?". "ఏమంటున్నాడేమిటి?" అతడి భుజం మీద చెయ్యివేసి మహా ఆప్యాయంగా అడిగాడు పరశురాం. "ఇంకేమంటాడు సార్. అసలు ఇచ్చేస్తానంటున్నాడు" ఉద్రేకంగా అన్నాడు. "ఇచ్చేస్తే పుచ్చేసుకోపోయావా?" ఆ మాట అంటూనే, అతడు స్టడీ రూంలోకి వస్తున్నవాడల్లా నిగడతన్ని హాల్లోనే నిలబడ్డాడు. "అయితే వడ్డీ ఎవడిస్తాడంటారూ, "మీరిస్తారా?" కనుగుడ్ల మీద రెప్ప వాల్చకుండా ప్రొఫెసర్ని చూశాడు. "ఓ తప్పకుండా ఇస్తాను. నా బాధ్యత మీదనేకదా శేషయ్యా నువు అవతారానికి అప్పిచ్చావ్. అతడివకపోతే నేనే ఇస్తాను. నువేం ఖంగారు పడకు" పరశురాం అనునయిస్తూ అన్నాడు. అతడి భుజంతడుతూ "నీ వడ్డీ ఎక్కడికీ పోదులే ధైర్యంగా ఉండు" అన్నాడు మళ్ళీ ప్రొఫెసర్.    
    "మీరిస్తారా సార్!" అంతలోనే నీరుగారిపోయాడు. భగభగ మండే నిప్పుల్లో నీళ్ళు చల్లినట్టు అతడి ఉద్రేకం చల్లబడిపోయింది. ప్రొఫెసర్ అతడి చెయ్యిపుచ్చుకొని స్టడీరూంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మహతికంతా అయోమయంగా ఉంది. ఎవరో పేషెంట్, ఏ మతిచెలించినవాడోవస్తే చూడాలనికుతూహలంగా చూస్తున్న మహతికి నిరాశ ఎదురైంది. ఈ అప్పులోడేమిటి? ఈ ప్రొఫెసర్ ఏమిటీ? ఈయనగారికి నిజంగానే మతిపోయింది. ఛ.ఛ. ప్రొఫెసర్ పరశురాం కు మతిపోవడం ఏమిటి? మతి భ్రమించినవారి కెందరికో పునర్జన్మను ప్రసాదించిన సైకియాట్రిస్టు ప్రొఫెసర్ పరశురాం. మరి మధ్యలో తను ఉండి అప్పులిప్పించడం ఏమిటి? ఒకోసారి ఈయనచేసే పనులు చాలాసిల్లీగా ఉంటాయ్. పసివాడి మనస్తత్వం.    
    ఇదేంటి తనుఇలా ఆలోచిస్తోంది. ఫేమస్ సైకియాట్రిస్టు పరశురాం ను తను ఎనలైజ్ చెయ్యడమా? అబ్ సర్డ్. మహతికి బుర్రవేడెక్కినట్టయింది. లేచి నిలబడింది. స్టడీ రూం దగ్గరకొచ్చి నిలబడింది. లోపలనుంచి మెల్లగా మాటలువినబడుతున్నాయి. "సార్! మీరివడానికి వీల్లేదు. నే చచ్చినా మీ దగ్గిర తీసుకోను. ఆ అవతారంగాదె ఇవాలి. ఎవడికోసం ఇస్తాడు? గోళ్ళూడగొట్టి మరీ వసూలు చేస్తాను. శేషయ్యంటే ఏమనుకుంటున్నాడో?" "శేషయ్యా శాంతించు. అవతారం నీ బాకీ వడ్డీ అసలు ఫాయిదాలతో సహాతీర్చేట్టు చూస్తాగా నేను" "మధ్యలో మీకొచ్చిందీ బాధంతాను, మీ మొహంచూసి ఈ సారికి వదిలేస్తున్నాను. లేకపోతేనా ఆ అవతారంగాడ్ని". "అదుగో మళ్ళీ నువు ఉద్రేకపడుతున్నావు? ఆ బాకీ సంగతేదో నాకు వదిలెయ్ నేను చూసుకొంటాను". "పెద్దలు తమరుచెపుతున్నారు కాబట్టి ఈసారికి....." "వదిలెయ్ అదీ పెద్ద మనిషి తరహా" "సరే మళ్ళీ ఎప్పుడు కలవమంటారూ?"  
    "ఓ వారం రోజుల తర్వాత" "ఇవాళేవారం" "శుక్రవారం కదూ" "శుక్రవారమా? అప్పలకొండ, నర్సిమ్మయ్యా, బంగారమ్మ ఇవాళొచ్చి వడ్డీచెల్లించి పోతామన్నారు. ఈ పాటికి వచ్చే ఉండాలి. నేనెళ్ళొస్తాడాక్టరుగారూ!" మరుక్షణంలో తలుపుబార్లా తెరుచుకొంది. మహతి అటుచూసింది. నెమ్మదిగా ఆలోచిస్తూ అతడు అడుగులో అడుగువేసుకుంటూ బయటికొచ్చాడు. అతడ్ని చూస్తుంటే లోపలకు వెళ్ళినమనిషేనా ఈ బయటికివచ్చింది అన్నంత ఆశ్చర్యం వేసింది మహతికి. ఆ ఉద్రేకం లేదు. ఆ ఊపు లేదు. ఆ చూపులేదు. ప్రశాంతంగా ఉన్నాడు మనిషి. "వెళ్లొస్తాను డాక్టరు గారూ?" "మంచిది వెళ్ళిరండి"    
     పరశురాం పెదవులపై కదిలిన చిరునవ్వులో విషాదం దోబూచులాడింది. మహతి బాధపడింది. "ఎందుకు అంకుల్ ఇలా మధ్యలో అనవసరంగా ఇరుక్కుంటారు, వాళ్ళకీ వీళ్ళకీ అప్పు లిప్పించి?" "తప్పదమ్మా అదినా వృత్తిధర్మం" "అంకుల్ మీరేం మాట్లాడుతున్నారో---""అర్ధం కావడం లేదంటావ్. అంతేనా? ప్రతిమనిషీ తను మాట్లాడేదానికి అర్ధం తెలిసి మాట్లాడితే ఈ ప్రపంచం ఇట్లా ఉండదమ్మా సైకాలజీ, అబ్ నార్మల్ సైకాలజీ, పారా సైకాలజీ అధ్యయనం, పారనాయిడ్, స్కిజోఫ్రేనియా (పారనాయిడ్ స్కిజో ఫ్రేనియాకి ఒక రూపంమాత్రమే) మొదలైన మానసిక వ్యాధుల చికిత్సా బంధనాల అధ్యయనం సైకో ఎనాలిసిస్-- సైకియాట్రీఅవసరం లేదు. నాలాంటిసైకియాట్రిస్టుల అవసరం అంతకంటే లేదు. అర్ధం అయిందాబేబీ?" పరశురాం తిరిగి స్టడీ రూంలోకి వెళ్ళాడు. మహతి అతని వెనకే వెళ్ళింది.
    "ఓ.కే. అంకుల్. నా సమస్యను నేనె పరిష్కరించుకోలేకపోతున్నాను. వేరేసంగతులు నాకెందుకు? ఇంతకీ నన్నేం చెయ్యమంటారో చెప్పండి" మహతి కుర్చీ లాక్కుని ప్రొఫెసర్ పరశురాంకు ఎదురుగా కూర్చొంది. "నువ్వే తేల్చుకోవాలి" ప్రొఫెసర్ పైపు వెలిగించాడు. "మీరెంత చెప్పినా నేను మనసు మార్చుకోలేకపోతున్నాను. రవి, కిరణ్ నాకు ఇద్దరూ కావాలి. ఇద్దరి మూర్తి మత్తాలలోని బెస్ట్స్ నాకు కావాలి. ఇద్దరిలో పాజిటివ్స్ వున్నాయి. నెగెటివ్స్ వున్నాయి. నెగెటివ్స్ తొలగి పాజిటివ్స్ మాత్రమే ఉండాలని నా కోరిక. అలా అన్ని పాజిటివ్స్ ఉన్న సలక్షణ సమున్నతుడైన మూర్తి నాకు కావాలి. ఎలాసాధ్యం అని మీరు నన్ను ప్రశ్నించకండి. ఆ పనిమీరు చెయ్యగలరనే నమ్మకం నాకుంది అంకుల్!" "పరకాయ ప్రవేశం లాంటి విద్య లేవీ నా దగ్గర లేవు. రెండు మూర్తిమతాలలోని మంచినంతా ఒకచోట ప్రోదిచేసి ఒకే మూర్తిలో నింపడానికి ఇదేమీ జానపదగాధ కాదు. మంత్ర తంత్రాల కధ కాదు. ఇది వాస్తవం! జీవితం! ఇద్దరి వ్యక్తిత్వాలలోని చెడునంతా తీసి ఒక సీసాలో నింపి బిరడా పెట్టేయడానికి ఇదేమీ రసాయనశాస్త్రం కాదు. మనోవిజ్ఞానం. ఇంకా ఆ దశను చేరుకోలేదు. ఉన్న పరిధులకులోబడే మనం ఆలోచించాలి. ఆచరణకు పూనుకోవాలి. ఆచరణయోగ్యంకాని ఆలోచనాపరంపరలే మానవుడి పాలిట శాపాలు. మానసికవ్యాధులకు    బీజాలు".

 Previous Page Next Page