Previous Page Next Page 
రాగహేల పేజి 5

    "అంకుల్!" మహతి కంఠంలో కలవరం. "మహతీ, నీఆలోచనలు అలా ఉన్నాయని నేను అనడంలేదు. ఈ విషయంలో నీకు పూర్తి అవగాహన కలిగించాలనే ఇదంతా చెప్తున్నాను. ఒకవేళ ఈ ప్రయత్నంలో నేను సఫలం అయితే నువు క్రుంగిపోకూడదు. నీకు ధైర్యం కలిగించాలనే నా ఉద్దేశ్యం". "థాంక్యూ అంకుల్!" ఓ క్షణం ఆగి "రేపే అతన్ని తీసుకొస్తాను" అంది మహతి. "ఒక్క నిముషం" అంటూ పరశురాం అపాయింట్ మెంట్స్ డైరీ తెరిచి చూశాడు. "రేపు సాయంకాలం ఏడున్నరా ఎనిమిది మధ్య!" "ఓ.కే. అంకుల్!" మహతి లేచి నిలబడింది--డోర్ దాకా వెళ్ళి ఆగింది.
    "ఏమిటి సందేహం?" ప్రొఫెసర్ లాలనగా అడిగాడు. "ముందెవర్ని తీసుకురమ్మంటారు?" ప్రొఫెసర్ ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. "చెప్పండి అంకుల్! రవినా? కిరణ్ నా?" "నీ ఇష్టం!" మెల్లగా నవ్వాడు పరశురాం. "రవినే ముందుగా తీసుకొస్తాను. అతనయితే చెప్పినట్టుంటాడు". "ఏం? కిరణ్ నీ మాటవినడా?" "వినడానికి కాదు. అతనిఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యడు. ఎన్నో ప్రశ్నలు వేస్తాడు? ఎంతసేపూ నన్ను తనదారిలోకి లాక్కెళ్ళాలనే చూస్తాడు. అవకాశం చూసి అతన్ని తరువాత తీసుకొస్తాను". "రవి?" "ఎక్కడికని కూడా అడక్కుండానే వచ్చేస్తాడు" "సో?" "మరో ప్రశ్న అడక్కుండా నేను రమ్మన్నచోటికి వస్తాడు. అందుకే" "కిరణ్ నీ దారిలోకి వస్తే రవిని వదులుకో గలవా?" ఎక్కడో చూస్తూ అడిగాడు పరశురాం. "వదులుకోలేనేమో" అప్రయత్నంగానే అనేసింది మహతి. ఆమె కళ్ళల్లోకి చోసోతూ తనలో తనే నవ్వుకున్నాడు ప్రొఫెసర్. "పోనీ! నిన్నంటిపెట్టుకొని నువు చెప్పినట్లుంటూ, నీ దారిలోనే నడిచే రవితోనే...." "అంకుల్! అది నేను సహించలేను. అలాంటి మనుషులంటేనాకు సానుభూతి తప్ప గౌరవం ఉండదు".    
    "సో! కిరణ్ అంటేనే నీకు ఇష్టం అన్నమాట". "నో!నో! అతడ్ని భరించలేను. ఆ ఎగ్రసివ్ పర్సనాలిటీ నా వ్యక్తిత్వాన్ని బతకనివ్వదు". మహతి గొంతుపూడిపోయింది. ముఖంచెమట్లు పట్టింది. అరచేతులు చల్లబడ్డాయి. ప్రొఫెసర్ లేచి మహతిదగ్గిరకు వచ్చాడు. "ఓ.కే. బేబీ! డోంట్ వర్రీ!" భుజం తడుతూ అన్నాడు. మహతి మౌనంగా నిల్చుంది. "రేపు సాయంత్రం ఏడున్నరా-ఎనిమిది మధ్య-గుర్తుందా?" "అలాగే అంకుల్ తప్పకుండా రవిని తీసుకొస్తాను" వెళ్ళిపోతున్న మహతిని వెనకనించి చూస్తూ అలాగే మెట్ల మీద నిలబడి ఉన్న ప్రొఫెసర్ కు జుట్టు విరబోసుకొని ఇద్దరి మనుషులమధ్య నడిచివస్తున్న నర్సమ్మ కోడలు నాంచారమ్మ కనిపించింది.  
   ఉదయం నుంచి కుండపోతగాకురిసిన వర్షం తెరిపిచ్చింది. అప్పుడే వెలిగింది దీపాల కాంతి ఇంకా రోడ్ల మీద ప్రవహిస్తున్న నీటి మీద ప్రతిఫలిస్తోంది. ప్రొఫెసర్ పరశురాంగారి ఇంటిముందు నీలిరంగు ఫియట్ కారు వచ్చి ఆగింది. ఆమె ముందు దిగింది. అతనికోసం నిలబడింది. అతను దిగి తలుపుల అద్దాలు పై కెత్తి లాక్ చేశాడు. తలపై కెత్తి పక్కగా గోడకు తగిలించి ఉన్న బోర్డు కేసి చూశాడు. "ప్రొఫెసర్ పరశురాం సైకియాట్రిస్టు" గిర్రున తలతిప్పి ఆమెను చూశాడు. "ఈయనేనా మీ అంకుల్?" "అవును! నీకు తెలుసా?" "ఎవరూ?" అతని కనుబొమలు దగ్గరైనాయి. "ప్రొఫెసర్ పరశురాం!" "ఫేమస్ సైకియాట్రిస్టు" ఆమె మాటను మధ్యలోనే అందుకొని అతను అన్నాడు. "తెలుసా?" సాలోచనగా అడిగింది ఆమె. "బాగా!" ఒరలోనుంచి సర్రున కత్తి దూసినచప్పుడు వినిపించింది ఆమెకు. తడబడుతున్న ఆమె పాదాలు ముందుకు సాగినై. ఆమె వెనకే అతను. ఆజానుబాహువు, స్ఫురద్రూపి, హీరోకయినా విలన్ కయినా పనికి వచ్చే అంగసౌష్టవం. "ఇంతకు ముందిక్కడకు...." ఆమె గొంతు ఎవరో పిసుకుతున్నట్లు ఆగిపోయింది. "రాలేదు" ఆమె మెడకు చుట్టుకొన్న తాడు పుటుక్కున తెగిపోయింది. గుండెనిండా గాలి పీల్చుకుంది. "మరెలా తెలుసు?" పొడి పొడిగా ఉంది ఆమె గొంతు.  
    "నీకు హిట్లర్ తెలుసా!" ప్రశ్నకు ప్రశ్న సమాధానమా? అయినా ఏమిటీ ప్రశ్న? ప్రశ్నగానే మిగిలిపోయిన ఆ ప్రశ్నతో ఆమె ఒక ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. అతడి కళ్ళలోకి చూసింది. "తెలుసా?" ఎక్కడ్నుంచో ఘంటానాదం విన్పించింది. "తెలుసు?" "ఎలా?" ఆమె భాష మర్చిపోయింది. "హిట్లర్ని నువు చూశావా?" "లేదు" నిట్టూర్చింది. ఆమె గుండె బరువు తగినట్టుగా అన్పించింది. "అలాగే నేనూ ప్రొఫెసర్ పరశురాంగార్ని చూడలేదు. ఆయన్ను గురించి విన్నాను" అతను హాయిగా నవ్వాడు. "మా అంకుల్ని హిట్లర్ తో పోలుస్తున్నావా?" "లేదు" "మరెందుకు హిట్లర్ తెలుసా అని అడిగావ్?" "గాంధీగారు తెలుసా అంటే ఎలా ఉండేదంటావ్?" అతను పెద్దగా నవ్వాడు. "అవును! అదే ఆలోచిస్తున్నాను" "ఆ బోర్డు ముందున్న పేరుచూస్తే గాంధీగారు గుర్తొస్తారా?" ఆమె మొదటి మెట్టుమీదే ఆగి తలెత్తిపక్కకు చూసింది. "తల్లి మెడ తెగసరికిన వాడంటే నీకు గాంధీ గుర్తొస్తాడా?" కళపెళ ఉరుములధ్వనితో అతని కంఠస్వరం కలిసిపోయింది. "పరశురాముడంటే గాంధీ గుర్తుకు రాక పోవచ్చు కాని హిట్లరెందుకు గుర్తుకు రావాలి?" "వెరీ సింపుల్. పరశురాం అని మాత్రమే ఉంటే హిట్లర్ గుర్తుకు రావల్సిన పనిలేదు. తైమూర్, చంగీజ్ ఖాన్, మహమ్మద్ ఘోరీ మొదలైన ఎందరో గుర్తుకు రావచ్చు కాని ఆ పేరు పక్కన సైకియాట్రిస్టు అన్నది చదివాక గుర్తొచ్చేది హిట్లరేగా?" అన్నాడతను.

 Previous Page Next Page