"నాకు ఇద్దరూ కావాలి" మహతి గొంతులో అల్లరి లేదు. చిలిపితనం అంతకంటే లేదు. నిజాయితీ ఉంది. దృఢత్వం ఉంది. పట్టుదల ఉంది. "అదెలా సాధ్యం మహతీ?" "అందుకే మీ సహాయాన్ని అర్ధిస్తున్నాను అంకుల్. అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన ప్రొఫెసర్ పరశురాం సాధించనిధి ఏదీ లేదని నా విశ్వాసం". "ఓ మై గాడ్! మళ్ళీ సజెషన్. మహతీ! యూ ప్లీజ్ స్టాప్. అర్ధంకావటం లేదు!" ఆమె కనురెప్పలు టపటపలాడాయి. చూపులు వెలవెలపోయాయి. "అవును! ప్రతిసారీ నాకు సూచనలిచ్చి నా చేత కష్టమైన మాటలు చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నావ్. అవునా? ఊ! చెప్పు! అవును కదూ?"
ప్రొఫెసర్ కంఠం మంద్రస్థాయిలో గంభీరంగా ఉంది. "ఇప్పుడు మీరు చేస్తున్నపనేమిటి? అదేకదూ? అంకుల్! "మీ సజెషన్ నా మీద పని చెయ్యవు". "సూచనలు తీసుకోవటానికి సిద్దపడని వ్యక్తుల మీద హిప్నాటిజం ఏమి పని చెయ్యదని నీకు తెలుసునని నాకు తెలుసు" ప్రొఫెసర్ గట్టిగా గాలి పీల్చి నిట్టూర్పు విడిచాడు. "అంతే అంకుల్. నాకు ఇంకా తెలుసు" "ఇంకా తెలుసా? అయితేచెప్పు. అదేమిటో వింటాను" ఆశ్చర్యంగా అడిగాడు. "రివాలింగ్ చైర్లో వెనక్కు జారగిలబడి ఆమెకళ్ళల్లోకి తనచూపుల్ని నిలిపి చూశాడు పరశురాం. "నేనేదో సజెషన్స్ మీకిస్తున్నట్టూ, వాటితో మీరు హిప్నటైజ్ అవుతున్నట్టు నటిస్తూ, నన్ను హిప్నటైజ్ చెయ్యడానికి ప్రయత్నించారు. అవునా అంకుల్? యామ్ ఐ రైట్ సర్?" ప్రొఫెసర్ పరశురాంకు నెత్తిమీద జుట్టుంటేపీక్కునేవాడే. బట్టతల అయిపోవడం వల్ల బతికిపోయాడు.
స్ప్రింగ్ చైర్లో నుంచి ఒక్క ఊపున టేబుల్ మీదకు వంగాడు. "మహతీ, నేను నిన్ను హిప్నటైజ్ చెయ్యడానికి ప్రయత్నించడం లేదు. నీ సమస్యను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే! నువు రవిని ప్రేమిస్తున్నాఉ. కిరణ్ ను కూడా ప్రేమిస్తున్నావు. ఇద్దర్నీ ప్రేమించడంలో తప్పులేదు. కాని ఇద్దరితోనూ జీవితం గడపాలనుకోవటం వాంఛనీయం కాదు. అవాంఛనీయమే కాదు అసాధ్యం కూడా".
"ఇద్దర్నీ ప్రేమించడం ఏమిటండీ! మీకేమైనా మతిపోయిందా" ప్రొఫెసర్ అర్ధాంగి ట్రేలో కాఫీ, టిఫిన్లు పెట్టుకుని ప్రవేశించింది. "కరెక్ట్ ఆంటీ!" అని వసుంధర చేతిలోని ట్రే అందుకొంది మహతి. "ఏమిటి కరెక్ట్?" అయోమయంగా అన్నాడు ప్రొఫెసర్. "అదే! మీకు మతిపోవడం!" వసుంధర మూతి తిప్పుతూ భర్తకేసి చూసింది. "మధ్యలో నాకెందుకుమతిపోవడం? పోతే ఇద్దర్నీ ప్రేమించిన మహతికి పోవాలి. లేకపోతే...." "చూడు ఆంటీ! అంకుల్ నన్నెలా ఏడిపిస్తున్నారో?" గారంగా అంది మహతి.
"నువుండమ్మా, ఆయన సంగతేమిటో నేను తేలుస్తాను" అంటూ వసుంధర కుర్చీ లాక్కొని భర్త కెదురుగా కూర్చుంది, యుద్దానికి సిద్దమయి. ప్రొఫెసర్ టేబుల్ మీద ఉన్న పైప్ అందుకొన్నాడు. "ఆఁఇప్పుడు చెప్పండి. ఇద్దర్నీ ప్రేమించడం ఏమిటి? ముగ్గురితో కాపురం చెయ్యడం ఏమిటి? ఇవి మతి ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలేనా?" మహతి గాభరాగా పరశురాం ను చూసింది. పరశురాం పైపులో పొగాకు పొడి దట్టిస్తూ భార్య కేసి చూశాడు. "ఇప్పుడు మళ్ళీ పైపు వెలిగిస్తారెందుకండీ?" వసుంధర భర్త చేతిలోని పైపు లాక్కుని టిఫిన్ ప్లేట్ ముందుకు తోసింది. "అదిసరే! నర్సమ్మ ఏమైంది? ప్లేటు పట్టుకుని నువు తయారయ్యావ్?" ప్లేటు ముందుకు లాక్కుంటూ భార్యను అడిగాడు. "నర్సమ్మ కోడలికి ఏమీ బాగాలేదట. పొద్దుట్నుంచి గొడవ చేస్తోందని వెళ్ళిపోయింది".
"నర్సమ్మ కోడలికి ఏమైంది ఆంటీ?" అడిగింది మహతి. 'స' ఏమైందో? మీ అంకుల్నే అడుగు" పుల్ల విరుపుగా అంది వసుంధర. మహతి కుతూహలంగా ప్రొఫెసర్ కేసి చూసింది. "ఇటీజ్ ఎ కేస్ ఆఫ్ స్కిజో ఫ్రేనియా" "స్కిజో ఫ్రేనియా కాదూ, గిజో ఫ్రేనియా కాదు. మొగుడ్ని లొంగదీసుకోడానికి ఆడుతుంది నాటకం-" అంది వసుంధర. "అలా లేనిదాన్ని ఉన్నట్టు ఊహించుకోవడమేకదా అసలు జబ్బు? అంకుల్ చెప్తున్నది కూడా అదేగా?" మధ్యలో అందుకొని రాజీమార్గంగా అంది మహతి.
"అది కాదమ్మాయ్ అసలు సంగతి! నర్సమ్మ కొడుక్కి మరొకర్తితో సంబంధం ఉన్నమాట నిజం. పెళ్ళికాక ముందునుంచీ దానితో సంబంధం ఉందట" కొంచెంసేపు ఆగి మళ్ళీ అన్నది. "గట్టిగా నొక్కి అడిగితే నర్సమ్మే చెప్పింది. అసలు విషయం అదయితే, మీ అంకుల్ సత్తెమ్మకు లేనిపోనివి ఊహించుకొని బాధపడే జబ్బుందని సైకోథెరపీ మొదలుపెట్టారు. రాను రాను అది ముదురుతుందే గాని తగ్గడం లేదు. అసలు జబ్బుంటేగా తగ్గడానికి?".
"అదేమిటి ఆంటీఅలా అంటారు? మీరేగా అన్నారు నర్సమ్మ కోడలికి దాని మొగుడు ఎవర్తినో ఉంచుకొన్నాడని అనుమానం అని" మహతి ఎదురు ప్రశ్న వేసింది. వసుంధర ఓ క్షణం ఆలోచించి" అనుమానం నాయి నేనన్నానా?" అంది. "అవును మీరన్నారాంటీ! కదా అంకుల్?" మహతి ప్రొఫెసర్ కేసి చూసింది. ఆయనకు వాళ్ళ సంభాషణేమీ పట్టనట్టు ప్లేట్లో ఉన్న టిఫిన్ తినేసి పైపు వెలిగించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.
"అంకుల్ మిమ్మల్నే? ఆంటీ అన్నారా లేదా?" మహతి ప్రొఫెసర్ చెయ్యి పట్టుకుని కుదుపుతూ అడిగింది. "అవునవును, అంది" అన్నాడతడు. "ఏంటండీ అంది?" భర్తను రెట్టించింది భార్య. ప్రొఫెసర్ పరశురాం పైపు నోట్లోనుంచి తీసి, దాంతోనే తల గోక్కున్నాడు. "ఏమంది మహతీ?" మహాతిని చూస్తూ అడిగాడు. మహతి ఫక్కున నవ్వింది. "ఎందుకు నవ్వుతున్నారు?" తెల్లటి కనుబొమలు ఎగరేశాడు పరశురాం. సమాధానంగా ఈసారి ఇద్దరూ ఒకేసారి నవ్వేశారు. "అకారణంగా నవ్వేవాళ్ళ నేమంటారో తెలుసా?" ప్రొఫెసర్ పైపు తిప్పి యాష్ ట్రేలో కి వంచాడు. "మీరే చెప్పండి" వచ్చేనవ్వు ఆపుకొంటూ అందివసుంధర. "పిచ్చివాళ్ళుఅంటారు"