Previous Page Next Page 
ఎలమావితోట! పేజి 4


    "ఛీ! ఛీ!"
    "ఏంటీ తప్పేమిటి? దీనికీ దీని అమ్మగారిలాగే తన చెప్పుచేతల్లో వుండే మగదిక్కు__ఓ మొగుడు కావాలి! ఏం? మణి బావుండాడా? ఎంచక్కా పండిన తలతో, ఊడిన పళ్ళతో, యాభయ్ దాటినా ఎంతందంగా వుంటాడు? స్వప్నా! మగాళ్ళ అందం తలనెరిశాకే చూడాలే!"
    ఫక్కుమంది స్వప్న. మళ్ళీ గీత ఏదో చెప్పబోయింది. "షటప్! అతిగా వాక్క!" అంది కోపంగా.
    "భలే! అంతలో నవ్వు__అంతలో కోపం...."
    "గీతా___మీ యిల్లొచ్చింది దిగెయ్!" కసురుకుంది స్వప్న.
    "థాంక్స్" గీత దిగుతూ స్వప్న చెంపగిల్లి వెళ్ళిపోయింది.
    అందర్నీ దార్లోదించేసి యింటికి వచ్చేసింది. కారు గేట్లోకి రాగానే బొంయ్ మంటూ హారన్ కొట్టాడు మణి. అది సిగ్నల్ గా కారులోపలికి వెళ్ళేసరికల్లా అమ్మాయిగారి పుస్తకాలు అందుకునేందుకు పనిమనిషి చంద్రమ్మ, హాల్లోకి వెళ్ళేసరికి టీ కప్పుతో ఆయా, టీ తాగి నాలుగడుగులేసే సరికి అమ్మమ్మగారూ వచ్చేస్తారు.
    ఈరోజూ అలాగే జరిగింది.
    "స్వప్నా! పరీక్ష బాగారాశావా!"
    "అమ్మమ్మ భుజలని వేలాడుతూ "అమ్మమ్మా! పరీక్ష నేను రాయకపోతే యింకెవరు బాగా రాస్తారే! నీ మనవరాలు యూనివర్శిటీ ఫస్ట్ వస్తుంది తెలుసా?" అంది నవ్వుతూ.
    మనవరాలు బుగ్గలు పుణికింది అమ్మమ్మ.
    "స్వప్నా! ముఖం కడుక్కుని వస్తావా! ఈరోజు నీకో ప్రజంట్ తెచ్చాను!"
    స్వప్న ముఖం మతాబులా వెలిగిపోయింది ఆనందంతో "హాయ్! అమ్మమ్మా! యు ఆర్ గ్రేట్! ఏం తెచ్చావు? చెప్పవా?" అడిగింది గారాబంగా.
    "ఊహుఁ"
    "అమ్మమ్మా ప్లీజ్!"
    "ఊహూఁ నో అంటే నో! అంతే! నువ్వు నీ గదికి రావాలి....నీ కళ్ళారా చూడాలి! అంతే!" నవ్వుతూ అంది అమ్మమ్మగారు.
    "ఓకే! ఓకే!" కళ్ళు దబదబలాడిస్తూ బాత్ రూం వైపు నడిచింది స్వప్న! మరో పదిహేను నిమిషాల్లో డ్రస్ చేంజ్ చేసుకుని వచ్చింది. "అమ్మమ్మా! నా గదిలో ఏం లేదే!" అంది ఆత్రంగా.
    "పైకి పద! నీ బెడ్ రూం లో ఉంది ఆ కానుక!"
    గబగబా మెట్లెక్కి పరిగెత్తింది స్వప్న! మెల్లగా బరువుగా మెట్లెక్కివచ్చే అమ్మమ్మతోపాటు వెళ్ళి చూచేటంత సహనంలేదు ఆమెలో! ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలా అన్న ఆశతో పరిగెత్తింది.
    మరి కొంతసేపటికి మెట్లెక్కివెళ్ళింది అమ్మమ్మగారు ఆమెపైకి వెళ్ళేసరికి వాకిట్లో బుంగమూతితో నుంచుంది స్వప్న! ఆమెని చూడగానే ముఖం తిప్పేసుకుంది కోపంగా.
    "పిచ్చిపిల్ల! ఒకటే ఆత్రమా! నన్ను కాదని వెళదామనే!" అని స్వప్న ముక్కుసుతారంగా నులిమి కొంగున ఉన్న తాళం చెవితో గదితాళం తీసి తలుపులు తీసింది. వెంటనే బార్ నియాన్ లైట్స్ నాలుగు గోడలకి ఉన్నవన్నీ ఒక్కసారి వెలిగించింది. గది మధ్యన ఉన్న షాండిలిర్ కూడా వెలిగించింది. గదంతా నీలివెన్నెలతో నిండిపోయింది.
    స్వప్న కళ్ళు చెదిరేయి!
    వ్యత్య స్తపాదార విందంతో పల్లవీ పల్లవీలోలుడైన వేణు గోపాలస్వామివారి ప్రక్కన అందాలరాసి సత్యభామా దేవి చిరుదరహాస చంద్రికల్ని గదంతా వెదజల్లుతోంది.
    "అమ్మమ్మా!"
    ఆనందంతో గట్టిగా కౌగలించుకుంది స్వప్న.
    ఊపిరి ఆళ్ళేదు ఆమెకి. "వదలవే!" అంది ఆయాసంగా.
    "థాంక్స్! అమ్మమ్మా థాంక్స్! ఎంత చక్కని ప్రజంట్, ఎంత చక్కని జంట! మేడ్ ఫర్ యీచ్ అదర్ అన్నట్టుగా ఉన్నారు. ఇన్నాళ్ళూ యీ గదిలో ఒంటరిగా ఉన్నాడు స్వామి! భామ వెతుక్కుంటూ వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఎక్కడ తెచ్చావు అమ్మమ్మా!"
    "నేను తేవటమేమమ్మా? అమ్మవారే వెతుక్కుంటూ వచ్చింది. ఎన్నేళ్ళనాడో విడిపోయిన జంట మళ్ళీ కలిసింది!"

 Previous Page Next Page