"ఆయా!" కేకేసింది అమ్మమ్మగారు.
ఎక్కడో వంటింట్లో పనిపై వున్న ఆయా పరుగు పరుగున వచ్చింది అక్కడికి.
"వీళ్ళిద్దరినీ అవుట్ హవుస్ లో వుంచు. ఏమేం కావాలో చూడు.....మధ్యాహ్నం భోజనాలయ్యాక హాల్లోకి తీసుకుని రా.....వద్దు....హాల్లోకి వద్దు. ఆఫీసు గదికి తీసుకుని రా!" ఆజ్ఞాపించినట్టుగా అంది.
నెమ్మదిగా "అలాగే నండమ్మగారూ!" అని తలూపి కదిలింది ఆయా సైగతో యిద్దరూ కదిలేరు. రవికి అమ్మమ్మ గారికి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కూడా రాలేదు. స్వాతి తన అందమైన అమాయకమైన కళ్ళతో ఏదీ అర్ధంకాక అయోమయంగా చూడసాగింది.
వాళ్లటు వెళ్ళగానే అమ్మమ్మగారు పూజామందిరం వైపు వెళ్ళేరు గబగబా!
2
పరీక్ష హాలు నుండి బయటికి వచ్చింది స్వప్న. ఆఖరు బెల్లు కొట్టేదాకా రాసింది రివిజన్ చేసుకుని పేపరు వాచరి కిచ్చివచ్చింది. కాలేజి గేటు దాటి బయటకిరాగానే ఫ్రెండ్స్ పలుకరించారు "హాయ్ స్వప్నా ఎలా రాశావే?" అంది గీత.
"గీతా! మన గీత బాగుండి మనం చదివిన ప్రశ్నలే చాలా వచ్చాయి కాబట్టి బతికిపోయాం! స్వప్న కేమే ఏదడిగినా ఎక్కడడిగినా దబాయించి రాసేస్తుంది. నైంటీ పర్సెంట్ కి తక్కువ స్కోర్ చేయదు!" నవ్వుతూ అంది కిరణ్.
"పోవే!" మృదువుగా నవ్వేసింది స్వప్న వాళ్ళతో పాటు నడిచింది.
"కారు రాదా?" అడిగింది వినయ.
"ఒసే అమ్మమ్మ కబుర్లు చెప్పకు. స్వప్న కాలేజి హాలు నుండి గేటుదాకా నడిస్తేనే పాదాలరిగి పోతాయంటుంది వాళ్ళ అమ్మమ్మ.....మణి అవసరమైతే వెల్వెట్ కార్పెట్ పరిపించెయ్య మంటాడు. అదిగో! చూడు చెట్టు క్రింది నుంచి కారు జెర్రిపాములా ఎలా వస్తూందో!" అంది కోమలి.
"ఇంత సుకుమారికి కాబోయే శ్రీవారెక్కడో!" ప్రశ్నార్ధకంగా చూస్తూ అంది విజయ.
"ఒసే విజయా! నీ కెప్పుడూ పెళ్లి రంధేనా?" కోపంగా అడిగింది గీత.
"అవునమ్మా! అవును! అందులో తప్పేమిటి? మన మెంత చేదివినా ఏం ఉద్యోగం చేసినా ఆఖరి గోల్ పెళ్ళి - పిల్లలు. అంతే! కాదంటావా ఏం? గీతా! నువ్వు పెళ్లి చేసుకోవా?" కొంటెగా అడిగింది విజయ.
"పెళ్ళా! ఈ మగాళ్ళనా?" యీసడింపుగా అంది గీత.
"మగాళ్ళని కాక ఆడవాళ్ళని చేసుకుంటారా?" కుతూహలంగా కొంటెగా అడిగింది సౌందర్య.
"పిచ్చిమొగమా? ఎందుకు చేసుకోరు?" నవ్వుతూ అంది గీత.
"ఎవరు చేసుకున్నారే!"
"మీ నాన్న చేసుకోలా?" గలగల నవ్వింది గీత.
సౌందర్య ముఖం చిన్నబోయింది. సౌందర్య వాళ్ళ నాన్న యిల్లరికం వచ్చాడు. అందునా కొంత ఆడంగి తనం వుంది. అందుకే ఆ యింట్లో వాళ్ళమ్మదే పైచేయి.
పెళ్ళి కబుర్లతో స్వప్న చెంపలు కెంపులయ్యాయి. వెచ్చని ఆవిర్లు కమ్ముతున్నట్టయింది. సూటిగా ఎవరినీ చూళ్లేకపోయింది. పెళ్ళంటే ఎందుకు తనలో యీ మధుర భావనలు? తనను చేసుకోబోయే ఆ సుందర పురుషుడు ఎక్కడున్నాడు? ఎలా వుంటాడు? ఏం చేస్తుంటాడు? ఏం చదివాడో! వలపుతలపుల్ని చిమ్మన గ్రోవితో చిన్నినట్టయింది. తల మెల్లగా వంగిపోయింది.
అంతలో కారు వచ్చేసింది. మణి దిగి డోర్ తీశాడు. స్వప్న వెనుకసీట్లో ఎక్కింది. అంతా వెనుకసీట్లో, ముందు సీట్లో సర్దుకున్నారు. సౌందర్య మణి ప్రక్కన కూర్చుంది. కారు కదిలింది.
"స్వప్నా! సౌందర్యకి మణికి జోడు కుదురుతుంది కదూ?" నవ్వుతూ కొంటెగా అంది గీత.