Previous Page Next Page 
ఎలమావితోట! పేజి 5


    "విడిపోయిన జంటా?"
    "అవునమ్మా! అవును. ఎవరు ఎంతచెప్పినా వినకుండా ఈ దివ్యదంపతుల్ని విడదీసి భాగం పంచుకెళ్ళాడు!"
    "ఎవరమ్మమ్మా?"
    "అదంతా చాలా చరిత్ర స్వప్నా! మళ్ళీ ఎప్పుడైనా చెపుతాను. నువ్వు తప్పకుండా వినాలి. తెలుసుకోవలసింది కూడా ఎంతోవుంది. నువ్వు యీ యింటికి యజమానురాలివై__నీకు తగిన వరుడిని తెచ్చుకుని, ఈ సంపదనంతా పాలించుకునే ముందు నువ్వు ఆవిషయం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో సౌందర్యం ఎంతవుందో, వికారం అంతవుంది. ప్రేమ ప్రక్కనే ద్వేషం ఉంది."
    కొంత ఆవేశంగా చెప్పింది కృష్ణవేణమ్మగారు.
    ఏనాడూ చూడని కొత్త అమ్మమ్మని విస్తుబోయి, నిలువు కళ్ళతో చూడసాగింది స్వప్న.
    
                                        3
    
    "మోహన్!" తాంబూలం నములుతూ పిలిచాడు వెంకట్రామయ్య. వెంకట్రామయ్యకి దాదాపు యాభయయ్యదు సంవత్సరాలుంటాయి, పదిహేనేళ్ళ క్రితం భార్య పోయింది. అంతదాకా సిగరెట్ తాగుతున్నవాడల్లా టి.బి వస్తుందని డాక్టర్ భయపెట్టడంతో సిగరెట్ ని వదిలేసి ఆకు వక్కా అలవాటు చేసుకున్నాడు. భార్యా వియోగం భరించలేక తోడు అలవాటు చేసుకున్నాడు.
    "నాకేం మొగవాడిని? ఎలా తిరిగినా ఫరవాలేదు. పారిజాతం నా ఎరికలో ఉందిగానీ నేను దాని ఎరికలో లేను కదా! సరైన మగాడికి ఎప్పుడూ ఓ తోడుండాలి. అది ధర్మం, న్యాయం, నీతి!" అంటూ తన నీతిరీతి చెపుతాడు. ఆయన ఏకైక పుత్రరత్నం మోహన్-బి ఎస్సీ తప్పి ఇంట్లో కూచున్నాడు.
    "ఏం డాడీ!" స్టెన్ కటింగ్ హెయిర్ స్టెయిల్ ని యింకాస్త ముచ్చటగా దిద్దుకుంటూ పలికాడు.
    "నా కర్మ! ఆ తల దువ్వుకోవటంలో శ్రద్ద మరికొంచం చదువుమీద చూపితే బాగుపడి పోతవుగా! ఆ పార్టు కాస్తా పూర్తి చేసుకుంటే ఏ బ్యాంక్ లోనయినా యిరికిస్తా!"
    "డాడీ! పార్టుదేమిటి  రేపు సెప్టెంబర్లో కాకపోతే మార్చిలో పూర్తిచేస్తా! కానీ నాకెందుకు డాడీ ఉద్యోగం? నువ్వు బేంక్ లో వేసిందానిపై వడ్డీ తింటూ కూర్చున్నా దిగులుండదు ఏడాదికి నాలుగు తులలు కరిగేసినా బంగారం తరిగిపోదు.....తిండికోసం గింజలు ఎలాగూ వస్తాయి...." తాపీగా బటన్ తిప్పుతూ స్టయిల్ గా అన్నాడు మోహన్.
    కంగారుపడ్డాడు వెంకట్రామయ్య "ఒరే, ఒరే నోర్ముయ్యరా! వెధవా! ఇంటిగుట్టు అలా చెప్పేస్తావేంరా? ఎంత ఆస్తివున్నా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. నువ్వు ఆకాస్తా పూర్తిచేస్తే కానీ ఉద్యోగం దొరకదు. ఆఖరికి కృష్ణవేణమ్మ గారి దగ్గర నాలా గుమాస్తాగా చేరాలన్నా ఆవిడ డిగ్రీ పూర్తికానిలే అంటుంది. నా మాట విని అది కాస్త పూర్తిచెయ్. చదువులాంటి ఉత్తమమైంది మరొకటి లేదు!"
    "డాడీ! నన్నా పులి దగ్గర వదుల్తారా? మైగాడ్! ఆవిడ నాగొంతు కొరికేస్తుంది!" గాబరాగా అన్నాడు మోహన్.
    "మోహన్! నేను నీపై ఆశలు పెంచుకుని ఆ ఆస్తి ఉచ్చులు బిగిస్తున్నాను. ముసలావిడ దేమిటిరా? బ్రతికినన్నాళ్ళు బ్రతకదు. స్వప్నని వల్లో వేసుకున్నావా ఆస్తంతా నీదే!"
    "స్వప్ననా? మీకు తెలీదు డాడీ! ఆమెకి గీర ఎక్కువ!"
    "బోడి ప్రశ్నలూ నువ్వూనూ!" కస్సుమన్నాడాయన.
    "ఎక్స్ క్యూజ్ మీ డాడీ! నాకు సినిమాకి టైం అవుతోంది. ఫ్రెండ్స్ అంతా ఎదురుచూస్తూ ఉంటారు!" తుర్రుమన్నాడు రాబోయే తండ్రి తిట్లని తలుచుకుని వాటి బారి నుంచి తప్పుకోటానికి.
    ఉస్సురుమన్నాడు వెంకట్రామయ్య. "ఏం పిల్లలో ఏం కాలమో? ఖర్చుచెయ్యటం తప్ప మిగుల్చుకునే మార్గం తెలీదు. ఎంతశ్రమించాను? ఇంత వచ్చిందంటే ఊరకే వచ్చిందా?" పై కండవా వేసుకుని ఇంటికి తాళంవేసి బయలుదేరాడు.
    నేరుగా పారిజాతం యింటికి వెళ్ళేసరికి అక్కడ యిల్లురణరంగంలా ఉంది. పారిజాతం జుత్తంతా రేగి ఉంది. ముఖం ఎర్రబడింది. దగ్గర్లో ఏకైక పుత్రిక అమ్మాజీ ఏడుస్తోంది అమ్మాజీ వయస్సు దాదాపు పదహారు, టెన్త్ క్లాసు చదువుతోంది కాన్వెంట్ స్కూల్లో.  డాన్స్ నేర్చుకుంటోంది. సంగీతం పాఠశాలల్లో వీణనేర్చుకుంటోంది. చదువులో ఎలాగూ ఫస్ట్ గా ఉంటుంది. కూతురి విషయంలో ఆమెకేం దిగుల్లేదు యింతదాకా.

 Previous Page Next Page