కింద చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు.
అమె కెందుకో నవ్వొచ్చింది.
"ఏమిటా నడక!" అంది.
"మీరు వేసిన ప్రతి అడుగులోనూ ఆడుగు వేస్తూ వస్తున్నాను" అన్నాడు అభినయ్.
"ఇట్స్ టూ మచ్" నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?" అంది చిరుకోపం నటిస్తూ.
అతనికంటే తను వయసులో పెద్దది. కానీ చూపుల గారడీతో చంపేస్తున్నాడు.
అతని కెక్కడినుంచి వచ్చిందీ ఆకర్షణశక్తి.
అమె "వద్దు" అనుకుంటూనే అతన్ని దగ్గరగా వూహించుకుంటూ వుంది.
అమెలోని బిగువు మరింత బిగువెక్కిపోతోంది.
తిమ్మిరెక్కిస్తూ వేడి సెగలు గుండెల్లోంచి తన్నుకొస్తున్నాయి.
" త్రీమచ్ అంటారనుకున్నాను" నవ్వాడతను.
"అదుగో ఆ నవ్వే వద్దు"
అతను మళ్ళీ నవ్వాడు.
"లాభం లేదు అభినయ్. నిన్ను చంపేస్తాను"
"ఎప్పుడు?" అడిగాడు.
"నిన్ను...నిన్ను...."
"సాయంత్రం ఇంటికొస్తున్నాను" చెప్పాడతను.
"నీకు పొగరెక్కువయిపోయింది!"
లాభం లేదు. విడిచిపెట్టడు అనుకుంది. విడిచిపెట్టకూడదనే అమె మనసులో మరోమూల కోరుకుంటోంది.
ఏం సమాధానం చెప్పాలి?
ఎలా చెబితే వూరుకుంటాడు?
"రానా" అడిగాడు గుసగుసగా.
"నేనుండను"
"నేను వచ్చినా కూడా"
"అబ్బ! ఎలా రెచ్చగొడుతున్నాడు."
"మీరెక్కడికెళ్ళినా, మీరొచ్చేవరకూ మీ గుమ్మంలో ఎదురు చూస్తూ కూర్చునే వుంటాను" అన్నాడు.
అతని మాటలు అమెకి మరింత మైకాన్ని కలిగిస్తున్నాయి.
అతనింతవరకూ రావడానికి తన ప్రవర్తనే కారణమా?
"ప్లీజ్ వుండకూడదు" అడిగాడు.
"ఎందుకుండాలి?" కాస్త కోపంగా అడిగింది.
"పాఠం కోసం" అని చకచకా నడుస్తూ వెళ్ళిపోయాడు.
అతను వెళ్లిపోతున్న వేపు చూస్తూ నిలబడిపోయిన రమాదేవికి అతనన్న మాట అర్ధం కాలేదు.
"పాఠం కోసం" అన్నాడు.
తను క్లాసుకి లేటుగా రావడంవల్ల మిస్ అయిన పాఠం చెప్పించుకోడానికా?
లేక తనకి పాఠం చెప్పడానికా?
అర్ధంకాలేదామెకి.
కాని ఆ పాఠం ఏమిటో తెలుసుకోవాలని మాత్రం నిశ్చయించుకోడానికా?
అంతే!
సాయంత్రం ఎప్పుడవుతుందా అని అమె ఎదురుచూడసాగింది. 3
అభినయ్ కాంటీన్లోకి నడిచాడు.
అతను లెక్చరర్ రమాదేవి వెనుక సీట్లో వెళ్లి ఏదో మాట్లాడి కాంటీన్ లోకి వెళ్ళడం చూసి సిద్దార్థ , కమల్, దాసు, పూర్ణా అక్కడికి హుటాహుటిన పరుగెత్తుకొచ్చారు.
"ఏమిటిరా ఇదీ, వాట్ హాపెండ్? ఈ బ్యాండేజీ ఏమిటి? ఎలా తగిలింది!" సిద్ధార్ధ అందోళనగా అడిగాడు.
అభినయ్ వెంటనే మాట్లాడలేదు కుర్చీలో కూలబడి.
"ఒరే, దాసూ, ముందు కాపీ తీసుకురారా" అన్నాడు దాసు వెంటనే దగ్గరికి నడిచాడు.
అభినయ్ స్నేహితుల మొహంలోకి చూశాడు. వాళ్ళ మొహంలో కనబడుతోన్న అదుర్దా బాధ, అందోళన చూసిన అభినయ్ కళ్ళు చమర్చాయి.
"ఏమీలేదు. పెద్ద కంగారు పడవలసిన విషయం కాదురా" అన్నాడు.
పిచ్చివాడ్ని చూసినట్టు చూశారు అభినయ్ కేసి వాళ్ళు. దాసు కాఫీ గ్లాసులు తీసుకొచ్చాడు.
అభినయ్ చుట్టూ మూగి కూర్చున్నారు మిత్రబృందం.
"ప్లీజ్ చెప్పరా! చేతికి అంతగాయం కాకపోతే బ్యాండేజి ఎవరయినా కట్టుకొంటారా" ప్రాధేయపడుతున్న రీతిలో అడిగాడు కమల్.
"చిన్న ఏక్సిడెంట్?"
"ఏక్సిడెంటా?"
ఆశ్చర్యంగా అడిగాడు ఒకేసారి అతను.
"అవును. నమ్మలేకపోతున్నారు కదూ!" అడిగాడు అభినయ్.
"నమ్మలేం అభినయ్. కానీ దానికి కారణం అంటూ ఏదో వుంటుందన్న మా నమ్మకాన్ని కూడా నువ్వు కాదనలేవు" పూర్ణ అన్నాడు.
"జరిగింది తెలుసుకోవడం చాలా మంచిది పూర్ణా . కొన్ని సున్నితమయిన విషయాలు ఎవరికి తెలీకుండానే వుండాలి"
"అయితే పెద్ద కథే అయివుండాలి" ఎవరికోసం?"
" అదే చెప్పలేను"
"కారణం?"
" అభినయ్ చిన్నగా నవ్వాడు.
"అదో ఆడపిల్లకి సంబంధించిన కథ బ్రదర్స్ అది బయటికి తెలిస్తే ఆ పిల్ల అల్లరైపోతుంది"
"ఆ పిల్ల జీవితం నాశనం కాకూడదంటే నేను నోరువిప్పకూడదు"
"కబుర్లు చెప్పకురా అభినయ్, నీ జీవితం మీద నీకే శ్రద్దలేని వాడివి. పూల్ వి. ఇతరుల గురించి నీకెందుకురా ఇలా రిస్క్ చేస్తావ్?" దాసు కోపంగా అన్నాడు.