"అమ్మా! నువ్వు భయపడినంత ప్రమాదకరమైన వృత్తి కాదు. నువ్వు భయపడుతూ సునందను కూడా భయపెట్టకు ఇప్పుడేం జరిగిందని.....?"
"ఇంకా ఏం జరగాలిట? రాత్రి సునంద అంత త్వరగా బయటికి పరుగు తియ్యకపోతే. ఆ దుర్మార్గుడు విజయ్ ను చంపేసే వాడేగా?"
"వాడు విజయ్ ను చంపాలను కోలేదు. విజయ్ షర్టుకు ఉన్న గుండీ తీసుకోవడమే వాడికి కావాల్సింది."
"ఏదన్నా కానియ్, గాయం మరి కొంచెం లోతుగా తగిలితే బిడ్డ ఏమైపోయేవాడు?"
"అమ్మ! తిరిగి తిరిగి వచ్చాను. ఆకలేస్తుంది. అన్నం పెట్టు" అన్నాడు మాట మారుస్తూ.
"త్వరగా బట్టలు మార్చుకొనిరా! ఈ లోపల వడ్డిస్తాను" అంటూ నరేంద్ర తల్లి లోపలకు వెళ్ళిపోయింది.
"సునందా! అమ్మా నువ్వూ భయపడ్తున్నారా? విజయ్ ను ఈ వృత్తి మానుకోనుని చెప్పనా?" అన్నాడు సునంద తల నిమురుతూ ఆప్యాయంగా నరేంద్ర.
"నాకేం భయం లేదన్నాయ్యా విజయ్ కూడా నీ అంతటి డిటెక్టివ్ కావాలి. అంతే నా కోరిక."
నరేంద్ర చిరునవ్వు నవ్వాడు.
నరేంద్ర భోజనం చేసి పడుకొన్నాడు.
"హల్లో!" విసురుగా అన్నాడు.
"హల్లో! నరేంద్రా నేను అద్వాయితాన్ని."
"ఆ ఏమిటి?"
"ఉదయం నేను ఏదో పిచ్చి పిచ్చిగా వాగాను. తర్వాత చాలా బాధపడ్డాను."
"అది నీకు అలవాటేగా?"
"ఉదయం నుంచి చాలా సార్లు ఫోన్ చేశాను. విజయ్ చెప్పలేదా?"
"లేదు నేను వచ్చేసరికి విజయ్ నిద్రపోతున్నాడు. అసలు విషయం ఏమిటో చెప్పు!"
"శంకర్రావు పరారయ్యాడు."
"నరేంద్రకు నెత్తిమీద ఎవరో కొట్టినట్టు అయింది.
"శంకర్రావు పరారయ్యాడా?"
"అవును."
"ఎలా? నువ్వు క్రిమేషన్ దగ్గరకు వెళ్ళలేదా?"
"వెళ్ళాను. కాని అతడు లేదు. ఆ కార్యక్రమమంతా కృష్ణ మూర్తి, భారతి పినతల్లి దగ్గర ఉంది జరిపించారు. శంకర్ర్రావు రాత్రి కూడా ఇంటికి రాలేదట శవాన్ని ఆసుపత్రి నుంచే ఎలక్ట్రికల్ క్రిమేషన్ కు తీసుకెళ్ళారు. ఈ సంగతి నీకు తెలియదా?"
"ఏమిటినీ ఉద్దేశ్యం?"
"విజయ్ చెప్పలేదా అని...."
"విజయ్ నేను వచ్చేసరికి నిద్రపోతున్నాడన్నానుగా నమ్మకం లేదా?"
"పగలంతా నువ్వు ఎక్కడి కెళ్లావ్?"
"పోలీస్ ఇన్స్ స్పెక్టర్ గా అడుగుతున్నావా?"
"కాదులే చెప్పు."
"చెప్పకపోతే"
"స్టేషన్ కు వచ్చి యస్.ఐ. తో చెప్పి సూర్యనారాయణతో మాట్లాడావట?"
"నేను లేకుండా మాట్లాడాల్సిన రహస్యమా అది?"
"నువ్వున్నా మాట్లాడతాను. నువ్వు లేవని కూడా నేను అనుకోలేదు. తీరా వచ్చాక నువ్వు ఉదయం నుంచే స్టేషన్ కు రాలేదని తెలిసింది."
"ఏం మాట్లాడావు?"
"అది అతడినే అడుగు."
"అడుగుతాను. మక్కెలు విరగదన్ని మరీ అడుగుతాను."
అద్వయితం చెప్తున్నాను విను. సూర్యనారాయణ వంటిమీద చిన్నగాయం ఉన్నా నేను వదలను."
"అంతవరకూ వచ్చిందన్నమాట! రామకృష్ణ హత్య జరిగిన రాత్రి నువ్వు జూబ్లీ హిల్స్ లోని వెంకటరమణ ప్యాలెస్ కు వెళ్లావని రుజువు చెయ్యగలను" గుర్రుమన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"నువ్వు రుజువు చేసేదేమిటి? నేను వెళ్ళినమాట నిజమే. ఆ విషయం నేను కోర్టులో చెప్పడానికి సిద్దంగానే ఉన్నాను. అయితే నువ్వు కొంచెం గొంతు తగ్గించి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది" కటువుగా అన్నాడు నరేంద్ర.
నరేంద్ర అంత కటువుగా మాట్లాడం ఎప్పుడూ వినని అద్వయితం గతుక్కుమన్నాడు.
"నీకు కన్పించిన ప్రతివాడ్ని హంతకుడేనని గూళ్ళు ఎగరెయ్యడం మంచిది కాదు" నరేంద్ర ఓ క్షణం ఆగి అన్నాడు.
"అయితే శంకర్రావు ఎక్కడ ఉందీ నీకు తెలియదంటావ్?"
"ఆ సంగతి తెలుసుకోవాల్సింది నువ్వు."
"తెలుసుకుంటా. 24 గంటల్లో వాడ్ని వాడితో షరీకైన వాళ్ళనూ కటకటాల వెనక్కు పంపిస్తాను."
"ఓ.కె. విష్ యూ గుడ్ లక్ ! అని ఫోన్ పెట్టేశాడు నరేంద్ర.
"స్టుపిడ్!" మనసులోనే అనుకొన్నాడు నరేంద్ర.
21
నరేంద్ర చెప్పిన ప్లాను విన్నది అనసూయ.
ఆమె వళ్ళంతా భయంతో బిగుసుకు పోయింది. ముఖం వడగాడ్సు తగిలినట్టుగా అయింది.
"భయపడకు. దైర్యం తెచ్చుకోవాలి"
"ఏమో నాకు భయంగా ఉంది" ఆమె కంఠం వణికింది.
"నీ కెలాంటి ప్రమాదమూ జరగదని హామీ ఇస్తున్నాను."
ఆమె మాట్లాడవేం?"
"మాట్లాడవేం?"
"నేను ఆ పని చెయ్యలేను. నాకంత దైర్యంలేదు నరేంద్ర గారూ" అన్నది అనసూయ.
"ఏం? నీ భర్తజైలు నుంచి బయటపడడం నీకు ఇష్టం లేదా?" ఆమెకేసి తీవ్రంగా చూస్తూ అన్నాడు నరేంద్ర.
"అదేమిటండీ అలా అంటారు?" అని ఏడ్వసాగింది.
"ఏడుపు ఆపండి ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తజైలు పాలుకాక తప్పదు మళ్ళీ మీది వంటరి బతుకే అవుతుంది. ఆస్తికోసం ఎవడో మిమ్మల్నీ హత్య చేస్తాడు."
నిండు కుండ బద్దలైనట్టు బోరుమన్నది.
"ప్లీజ్ ఏడవకండి, నేను ఇదంతా చేస్తున్నది నీ భర్తను రక్షించ దానికే."
టైం చూసుకున్నాడు నరేంద్ర.
11 గంటలైంది.
ఏడుస్తున్న అనసూయను చూస్తూ గదిలో పచార్లు చేస్తున్నాడు నరేంద్ర.
మరో ఐదు నిముషాల్లో ఫోన్ మోగింది.
ఒక్క ఉదుటున వెళ్ళి రిసీవర్ ఎత్తాడు.
"హల్లో బాస్! అతడు బయలు దేరాడు" అవతల నుంచి విజయ్ కంగారుగా చెప్పాడు.
"ఓ.కే. బయలు దేరుతున్నాను" అని రిసీవర్ పెట్టేశాడు.
"ఊత్వరగా బయలుదేరు. క్షణం ఆలస్యం అయినా మనప్లానంతా తల్లకిందులౌతుంది" అంటూ అనసూయ రెక్కపట్టుకుని లేవదీశాడు నరేంద్ర.
ఆమె అదురుతున్న గుండెలమీద చేతులు వేసుకొని వణికిపోతూ బయటికి నడిచింది.
ఇద్దరూ పోర్టికోలో ఉన్నకారు ఎక్కారు.
15నిముషాలు గడిచాయి.
మారుతి చుట్టూ పెద్ద ప్రహరీ ఉన్న ఇంటి ముందుకు వచ్చింది బయటికి పెద్ద పెద్ద చెట్లూ , తప్పులూ తప్ప ఇల్లు కన్పించదు. ఇల్లు చాలా చిన్నది. కారు తోటలో ప్రవేశించి ఆగింది.
అనసూయ- నరేంద్రకారు దిగి చెట్ల మధ్య నుంచి నడుస్తూ వంద గజాల దూరంలో ఉన్న ఆ చిన్న పాతకాలపు బంగళా దగ్గరకు వచ్చారు.
బంగళా గేటు ముందుకు రాగానే నరేంద్ర ఆగి కోటు జేబు లోంచి కాగితాల కట్టతీసి అనసూయ కిచ్చాడు. అనసూయ చేతులు వణికాయి.
"త్వరగా తీసుకో, నేను చెప్పింది గుర్తుందిగా?" అన్నాడు.
"నాకు కాళ్ళు వణికిపోతున్నాయి. గుండెలు దడదడలాడుతున్నాయి" అన్నది అనసూయ ఏడుపుగొంతుతో.
"ఉష్! మాట్లాడకు."
"నాకు భయంగా ఉంది."
"నీ భర్త ప్రాణం కోసం ఈ మాత్రం చెయ్యలేవా? నీ భర్త ఉరికంబం ఎక్కడం నీకు ఇష్టమా?"
"ప్లీజ్ అలా మాట్లాడకండి. నా భర్త నిర్దోషి."
"అందుకేగా నేను ఈ ప్లాను వేసింది. అతడ్ని నిర్దోషిగా నిరూపించడానికే ఇదంతా చేస్తున్నాను. నేను రిస్క్ తీసుకోవడంలేదూ? నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీలేదు. అన్ని ఏర్పాట్లూ వేశాను. నువ్వు ఈ కాగితాల కట్ట చెత్తో పట్టుకొని వెళ్ళి ప్రహరీగేటు పక్కగా కూర్చో. అతడు రావడం చూసి అతడికి నీ చేతిలోని కాగితాలు కన్పించేళా పట్టుకొని పరిగెత్తు మసక వెన్నెల్లో నీ చేతిలో ఉన్న కాగితాలు అతడికి బాగానే కన్పిస్తాయి. నేరుగా పరిగెత్తి నా కార్లో కూర్చో. నువ్వు క్షేమంగా ఇంటికి చేరతావు. నువ్వు కారు ఎక్కేసరికి డ్రైవర్ సీట్లో ఉంటాడు. భయపడకు ఓ.కే! నేను చెప్పినట్టు చెయ్యి" అని నరేంద్ర బంగళా కేసి వెళ్ళాడు.
అనసూయ ప్రహరీ గేటు పక్కన నక్కి కూర్చుంది.
ఒక్కొక్క క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది. ఇటు గేటు వైపుకూ అటు ఇంటివైపుకూ చూస్తూ, ఊపిరి బిగబట్టుకుని కూర్చుంది అనసూయ.
నరేంద్ర తలుపు తెరిచి లోపలకు వెళ్ళడం చూసింది అనసూయ.
మరుక్షణంలో ఇంట్లో లైటు వెలిగింది.
లోపలనుంచి సన్నగా కాంతి బయటికి ప్రసరిస్తోంది.
ఐదూ వదీ పదిహేను నిముషాలు గడిచాయి.