Previous Page Next Page 
చిలకలు పేజి 36


    జీపు లోపలకు వచ్చింది.
    జీపు శబ్దం విని సునంద బయటికి వచ్చింది.
    "విజయ్ ఇంకా  రాలేదా?" అని చెల్లెల్ని అడిగాడు నరేంద్ర.
    "రాలేదు"
    "ఇంకా ఆ గుండీ పట్టుకొనే తిరుగుతున్నట్టున్నాడు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "గుడ్ నైట్ ఇన్స్ స్పెక్టర్"
    "అంటే నన్ను ఇంట్లోకి రావద్దనేగా?"
    "ఇవ్వాళయినా  ఇంటికి వెళ్ళి భోజనం చేసి హాయిగా పడుకో రాత్రంతా నిద్రలేదాయె"
    "హంతకులు దొరికేదాకా నాకు నిద్ర ఎక్కడ?" అంటూ ఉండగానే అద్వయితానికి ఆవలింత వచ్చింది.
    "దేనితస్సాదియ్యా. నువ్వు అన్నావో లేదో ఆవలింత నీకు వంత పలికింది." అని మళ్ళీ  అవలించాడు.
    "వెళ్ళిపడుకో"
    "లేదు. ముందు పింగర్ ప్రింటు ఎక్స్ పర్టుకు ఈ సిగరెట్ పెట్టె ఇవ్వాలి"
    "అలాగే. గుడ్ నైట్!" అని నరేంద్ర మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా లోపలకు వెళ్ళిపోయాడు.
    "గుడ్ నైట్!" అని ఇన్స్ స్పెక్టర్ జీపు ఎక్కాడు.
    "అన్నయ్యా బావా ఇంకారాలేదేం?" సునంద అన్నను అడిగింది.
    "అదేనమ్మా నేనూ ఆలోచిస్తున్నాను" అన్నాడు నరేంద్ర.
    "అబ్బాయ్. భోజనానికి రారా?" తల్లికేక పెట్టింది.
    "విజయ్ ను రానివ్వమ్మా, ఇద్దరం ఒకేసారి భోజనం చేస్తాం" అన్నాడు  నరేంద్ర.
                                                               18
    రాత్రి పది గంటలు దాటింది.
    నరేంద్ర టేబుల్ మీద కాళ్ళు ఆనించి కుర్చీలో కూర్చుని టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని సిగరెట్  తాగుతూ ఆలోచిస్తున్నాడు.
    బయట ఉరుములు మెరుపులు
    సునంద అన్నకు కొంచెం ఎడంగా కూర్చుని తెలుగు నవల చదువుతోంది. నవలలో లీనం అయిపోయి చదువుతున్న సునంద పదిన్నర దాటిందని కూడా గుర్తించలేదు. తొమ్మిదిన్నరనుంచి ఏకబిగిన చదువుతోంది.
    "కలలు కనడం తప్పా? కాదు. కాని ఆ కలల్లోని బతుకుతూ  అదే వాస్తవం అని భ్రమపడటం తప్పు.
    కళ్ళు మూసుకుంటే గాని కలలు రావు.
    కళ్ళు తెరిస్తేగాని వాస్తవం కన్పించదు.
    "అంటే? తను జీవితం అంతా కళ్ళు మూసుకునే బ్రతికిందా.
    "నదీ తీరాలు సమానాంతరంగా ఉంటాయని యదార్థం చెబుతుంది. అవి రెండూ ఎప్పటికైనా కలుస్తాయని ఆదర్శం కలలు కంటుంది.
    ఆ కలల్లో ఉండే ఆనందం కలలు కనే వారికే తెలుస్తుంది.
    స్థూలంగా ఆలోచిస్తే  యదార్థం సత్యం అనిపిస్తుంది.
    "సూక్ష్మంగా ఆలోచిస్తే ఆదర్శమే  సత్యం అనే భావన  కలుగుతుంది.
    ఆదర్శం ఆకాశమంత విశాలమైంది.
    అది భూమిని తాకదు.
    కాని ఆదర్శం ఆకాశం క్షితిజంతో కలవడం చూస్తుంది. అది కేవలం భ్రమ అని భావించదు.
    యదార్థంతో పొట్టనిండుతుంది.
    ఆదర్శంతో ఆత్మ సంతృప్తి చెందుతుంది.
    యదార్థంతో జీవితానికి లభిస్తే, ఆదర్శంతో ఆత్మకు తుష్టి లభిస్తుంది.
    తను జీవితంలో పుష్టి కంటే తుష్టికే ప్రాధాన్యతను ఇచ్చింది.
    అందువల్ల తనకు  జీవితంలో లభించింది ఏమిటి?
    ఎందుకు కలల్లో బతికే వారిని ఏదో తపన సాగర గర్భంలోని ఘోష నిరంతరం వెంటాడుతూ ఉంటుంది?
    అయినా తను ఆ తపన నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు.
    తన దృష్టిలో ఇలాంటి అశాంతి వల్ల కలిగే మధుర అనుభూతే కళాసృష్టికి  మూలాధారం.
    ఈ తపన, ఈ ఆర్తి, మనిషిని మిగతా  ప్రాణుల నుంచి విడదీసింది.
    మధుర గానం విన్నప్పుడూ, సౌందర్యాన్ని చూసినప్పుడూ తన మనసులో ఏదో ఆజ్ఞేయమైన తపన తల ఎత్తుతుంది. ఆ తపనలో, ఆ తపనలో, ఆ ఆర్తిలో, ఏదో మధురానుభూతి.
    తమ తనకు  అతిప్రియమైన భాగమేదో తన నుంచి విడిపోయినట్టూ. అన్పిస్తుంది.
    జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న తనకు ఊహ తెలిసినప్పట్నుంచీ తనను నిలదీసింది.
    జీవితం, అనంతమూ,స్థిరమూ. జతమూ అయిన ఆ మహా మృత్యువు నుంచి విడిపడిన, క్షణికమూ. చంచలమూ అయిన ఒక మెరుపులాంటి చైతన్యం మాత్రమే అని తనకు ఇప్పుడు  అన్పిస్తోంది. ఆ చైత్యన్నాన్ని ఎప్పుడు ఎలా వస్తుందో కాని పిల్లిలా వచ్చి. ఆ మహా మృత్యువు తనలోకి తీసుకుంటుంది....."
    బయటగేటు తీస్తున్న చప్పుడు విన్పించి సునంద చదువుతున్న పుస్తకం కింద పడేసి తలుపులు తీసుకొని ఒక్క పరుగున బయటికి వెళ్ళింది.
    అంతలో పెద్దకేకా, సన్నగా మూలుగూ విన్పించింది.
    గేటు దగ్గరకు పరుగుతీసిన సునందకు కిందపడి ఉన్న విజయ్  కన్పించాడు.
    సృహ తప్పి పడి ఉన్న విజయ్  మీదకు వంగి ఒక వ్యక్తి ఏదో  వెతుకుతున్నాడు.
    సునంద కెవ్వున అరిచింది.
    విజయ్ మీదకు వంగి  ఉన్న వ్యక్తి రక్తసిక్తమై ఉన్న చేతిని సునందకు కన్పించేలా ఆడించి గిర్రున తిరిగి పరుగుతీశాడు.
    సునంద కేక విని నరేంద్ర  బయటికి వచ్చాడు.
    సునంద స్థాణువులా నిలబడి ఉంది.
    కింద గేటుకు అవతల విజయ్ కిందపడి ఉన్నాడు.
    అతడి తలకు బాగా గాయం తగలడంవల్ల రక్తం కారు తోంది.
    శాంతమ్మ కూడా బయటికి పరుగుతీసింది.
    విజయ్ ణు చూసి "అయ్యో! నా బిడ్డో!" అంటూ గొల్లుమన్నది.
    సునందకు పోయిన చైతన్యం వచ్చినట్టు అయింది.
    "బావా!" అంటూ కింద కూలబడింది.
    అప్పటికే విజయ పక్కన మోకాళ్ళమీద కూర్చుని ఉన్న నరేంద్ర "అమ్మా! ఇలారండి లోపలకు పట్టండి" అన్నాడు.
    ముగ్గురూ పట్టుకొని విజయ్ ను లోపలకు మోసుకొచ్చారు. మంచం మీద పడుకోబెట్టారు. 
    సునంద లోపలకు వెళ్ళి డాక్టర్ కు ఫోన్ చేసి వచ్చేసరికి నరేంద్ర ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. గాయం తుడిచి రక్తం పోకుండా కట్టుకట్టాడు.
    విజయ్ ముఖం సునంద తడి టవల్ తో తుడిచింది.
    విజయ్ కళ్ళు తెరిచాడు. బాధగా మూల్గాడు. రెండిళ్ళ అవతల వున్న డాక్టర్ వచ్చాడు.
    ఇన్స్ స్పెక్టర్ వచ్చాడు గాయం మరీ లోతుగా లేదని చెప్పాడు. భయపడాల్సిన పనేంలేదన్నాడు.
    విజయ్ కళ్ళు తెరిచాడు.
    "ఎలా ఉంది?" డాక్టర్ అడిగాడు.
    విజయ్ చిరునవ్వు నవ్వాడు.
    "వేడివేడిగా ఏదైనా తాగించండి" అన్నాడు డాక్టర్.
    సునంద ఐదు నిముషాల్లో హార్లిక్స్ కలిపి తెచ్చి విజయ్ చేత తాగించింది.
    డాక్టర్ కొన్ని  మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయాడు.
    "ఏమైంది నాకు?" అన్నాడు విజయ్.
    "నీకు ఏమీ  గుర్తు లేదా?"
    "గేటు తియ్యడం వరకు గుర్తుంది తలమీద  ఏదో బలంగా పడినట్టు గుర్తు అంతే!"
    నరేంద్ర విజయ్ షర్ట్ గుండెల  దగ్గర తిరిగి  ఉండటం చూశాడు. అతడికి అసలు విషయం అర్థం అయిపోయింది.
    "చూశావా? నేను హెచ్చరించినంత పని జరిగింది."
    "ఏం జరిగింది?" నీరసంగా అడిగాడు విజయ్.
    "నీ చొక్కాన  ఉన్న గుండీ కోసం హంతకుడు నిన్ను వెంబడిస్తాడని చెప్పానా? అన్నంత పనీ అయింది."
    "అని ఎలా చెప్పగలవు."
    "నీ గుండీ లాక్కెళ్ళాడు. షర్టు కూడా చిరిగింది."
    విజయ్  చొక్కా తడిమి చూసుకున్నాడు.
    "నీకు ఎవరైనా నిన్ను వెంబడిస్తున్నట్టు అన్పించలేదా?"
    "లేదు."
    "వాడ్ని చూసిన గుర్తులేదా?"
    "లేదు వెనకు నుంచి కొట్టాడు."
    "అన్నయ్యా! నేను వాడ్ని చూశాను."
    "వాడ్ని చూశావా? ఎలా ఉన్నాడు?" ఆతృతగా అడిగాడు నరేంద్ర.
    "బాగా పొడవుగా ఉన్నాడు. నేను వెళ్ళేసరికి బావమీద వంగి ఉన్నాడు నేను కేక వెయ్యగానే రక్తంతో తడిచి ఉన్న చేతిని నా ముఖం దగ్గరగా ఊపాడు గేటులో  ఉన్న  ట్యూబ్ లైట్ కాంతిలో ఆ చెయ్యి చూడగానే నా నోట  మాట రాలేదు. ఎంత భయంకరంగా ఉందను కన్నావ్ ఆ చెయ్యి?"
    "ముఖం చూశావా?"
    "లేదు ముఖం మీదకు టోపీ పెట్టుకుని ఉన్నాడు. ఆ టోపీ కనుబొమ్మలవరకు కప్పెస్తున్నట్టుగా ఉంది. భయంతో బిగుసుకు పోయిన  నా కళ్ళకు అతడి రూపం  అలుక్కుపోయినట్టు కన్పించింది. ఆ ! ఇటుకరాయి రంగు షర్టూ, తెల్లప్యాంటూ వేసుకున్నాడు" అన్నది సునంద.
    నరేంద్ర ఆలోచనలో పడ్డాడు.
    "ఆ! మర్చిపోయాను."
    "ఏమిటమ్మా?"
    'ఆ చేతికి ఆరేళ్ళున్నాయి. బోటన వ్రేళ్ళు రెండు. ఒకటి పొడువుగా వేలాడుతోంది. అది చూసే మరీ భయపడి పోయాను."
    "ఆరు వేళ్ళా?" విజయ్ విస్మయంగా అడిగాడు.
    "అవును బావా?"
    "నువ్వు బాగా చూశావా?" నరేంద్ర అడిగాడు.
    "ఆ చూశాను"
    "అంటే ఈ గుండీ శంక్రరావుదేనన్నమాట! నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను" అన్నాడు విజయ్.
    రమణరావుది ఎందుకు కాకూడదూ?
    "నరేంద్రా నువ్వు మేదావివి. ఒప్పుకుంటాను. ఎదుటి వాక్కలు కూడా కాస్త బుర్ర ఉంటుందని ఎందుకు అంగీకరించవూ?" కోపంగా అన్నాడు విజయ్.
    "ఛా! అదేమిటి విజయ్! నీకు తెలివిలేదని నేను అన్నానా? నరేంద్ర నొచ్చుకుంటూ అన్నాడు.
    "ఇటుకరాయి రంగు షర్టులు డార్క్ జ్రెన్ షర్టులూ వేసుకునేది శంకర్రవే. అప్పుడప్పుడు పిట్టల దొరలా టోపీ కూడా పెడ్తాడు. అతడి కుడి చేతికి ఆరేళ్ళు ఉన్నాయ్. ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి?" అన్నాడు విజయ్! బాదగా మూల్గాడు.
    "పడుకో విజయ్! రేపు చర్చించుకొందాం" అన్నాడు నరేంద్ర.
    సునంద డాక్టర్ ఇచ్చిన ఒక క్యాస్ స్కూల్ తో పాటు  వాలియం కూడా ఇచ్చింది విజయ్ కు.
    విజయ్ కళ్ళు మూసుకున్నాడు.
    సునంద కుర్చీ లాక్కుని విజయ్ మంచం పక్కగా కూర్చుంది.
    నువ్వెళ్ళిపడుకొమ్మా.నేనుంటాను" అన్నాడు నరేంద్ర.
    "మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. నేను కూర్చుంటాను" అని శాంతమ్మ కొడుకునూ కూతుర్నీ పంపించింది.
    నరేంద్ర పడుకున్నాడే కాని నిద్ర పట్టడంలేదు.
    ఈ హత్యాలన్నీ చేసింది రంగారావేనా? కాదు.
    భారతిని అతడు హత్య చెయ్యలేడు. రాధారాణి హహ్త్య చేసింది శంకర్రావేనా? కాని కావచ్చు. రాణిని హత్య చేసినవాడే రామకృష్ణనూ హత్య చేశాడు. వాడే వెనక వుండి మరొకరి చేత భారతిని హత్య చేయించాడు అంటే శంక్రరావే భారతిని హత్య చేయించాడా? కాని! అతడికి అందువల్ల వచ్చేదేమిటి? ఎక్కడో తన బతుకు తాను బతుకుతున్న మేనకోడల్ని పనికట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చాడంటే దీని వెనక ఏదో రహస్యం ఉంది.
    శంకర్రావు చెప్పినట్టు రమణరావూకూ భారతీకి సంబంధం ఉండి ఉండాలి. భారతి కొడుకు రమణరావుకు పుట్టినవాడే అయివుండాలి. అయితే? లావణ్య పెళ్ళి కృష్ణమూర్తితో ఆగిపోయింది. రమణరావుకు ఇవ్వడానికి కమలాంబ సిద్దంగా ఉంది.
    కమలాంబ లావణ్య ఒకర్తే కూతురు. ఆ పిల్లకు కృష్ణమూర్తి అంటే ఇష్టం . కమలాంబ ఇష్టపడే  కృష్ణమూర్తికి కూతుర్ని ఇవ్వడానికి నిర్ణయించుకొన్నది. శుభలేఖలు కూడా వేశారు.
    ఏదో బలమైన కారణం ఉండే కమలాంబ  ఆ పెళ్ళి ఆపెసింది. ఆ పని ఇష్టపూర్వకంగా చేసిఉండదు. దానివెనక బ్లాక్ మైలింగ్ లాంటిది ఏదో ఉండి ఉండాలి. రామకృష్ణ వీలునామా కారణం అయి ఉండాలి. అందుకే రమణరావుకు కూతుర్ని బలవంతంగా కట్టపెట్టడానికి సిద్దపడింది.
    శంకర్రావుకు భారతీ రమణరావుల మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసు. భారతిని మోసం చేశాడని కూడా తెలుసు.
    ఆ విషయం కమలాంబకు చెప్పి ఉంటాడు. తన  మేనకోడలికి అన్యాయం జరక్కూడదని పేచీపడి ఉంటాడు. పని కుర్రాడు చెప్పాడు. వాళ్ళిద్దరూ ఈమధ్య ఒకటే తగాదాలు పడ్తున్నారని.
    అందుకే భారతిని హైదరాబాద్ తీసుకొని వచ్చాడు. తను వచ్చేసరికే ఆమెను ఎవరైనా హత్యచేస్తారని ఊహించలేకపోయాడు శంకర్రావు. మేనకోడలు చిన్నప్పట్నుంచి తన దగ్గరే పెరిగిన పిల్ల. ఆ పిల్లను అతడు చంపడు. చంపలేడు.

 Previous Page Next Page