"చెప్పు" అన్నాడు రమణరావు విసుగ్గా.
"లేదు."
"ఏమిటి లేదు." అన్నాడు అద్వయితం.
"ఆరోజు నేను రోహిణీ స్టూడియో నుంచి తిన్నగా ఇంటికి రాలేదు, " అన్నాడు విక్రమ్ జంకుతూ.
"ఎక్కడి కెళ్ళారు?" నరేంద్రా అడిగాడు.
విక్రమ్ చెప్పడానికి సందేహించాడు.
"చెప్పు!" ఏదో అనుమానం వచ్చి ఇన్స్ స్పెక్టర్ గద్దించి అడిగాడు.
"స్టూడియో నుంచి మాతారను ఇంట్లో దింపుదామని ఆమె ఇంటికి వెళ్ళాను "వాళ్ళమ్మ ఇంతరాత్రిపూట ఏంవెళ్ళావ్ ఇక్కడే పడుకో" అని బలవంతం చేసింది." తలవంచుకొని బిడియపడుతూ చెప్పాడు విక్రమ్.
"అదా కథ!మంచి గ్రంథసాంగుడివేనన్న మాట?" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ కిసుక్కున నవ్వుతూ.
విక్రమ్ సిగ్గు పడిపోయాడు.
ఆ క్షణంలో అతిడి ముఖంలో అమాయకత్వం కనిపించింది నరేంద్రకు.
"శనివారం రాత్రి?"
"ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి రెండు గంటలదాకా సెట్టుమీదే ఉన్నాం."
"చెట్టుమీద లేవన్నమాట?" తనజోక్ కు తనేగొల్లున నవ్వాడు.
ఇంకెవరికీ నవ్వురాలేదు.
రమణరావు చిరాగ్గా చూశాడు.
"చిన్న బడ్జెట్ పిక్చెర్. నలుగురు కుర్రాళ్ళం కలిసి నిర్మిస్తున్నాం మొత్తం పిక్చెర్ మూసు షెడ్యూల్స్ లో పూర్తి చెయ్యాలని ప్రయత్నం."
"ఆ రోజు రాత్రికూడా మీ :వయ్యారిభామ"ను దించడానికి ఆమె ఇంటికి వెళ్ళావ్. వాళ్ళమ్మగారు నిన్ను ఇంటికి రానివ్వలేదు. అక్కడే ఉండి పోయవ్. ఆవునా?" ఇన్స్ స్పెక్టర్ సర్దాపడి పోతూ అన్నాడు.
నరేంద్రకు ఇన్స్ స్పెక్టర్ ధోరణి కలిగిస్తోంది.
"అవునండీ ఆరోజు కూడా ఇంటికి రాలేదు."
"సరి! సరి! రాత్రి సంగతి చెప్పు."
"నిన్న ఆఖరి షెడ్యూల్ పూర్తి అయింది. ఎనిమిది గంటల కల్లా ఇంటికి వచ్చేశాను."
రమణరావు గుండెల నిండాగాలి పీల్చుకున్నాడు.
"రాత్రి మీ అన్నయ్య మీద హత్యా ప్రయత్నం జరిగిందిటగదా?"
"అవునండీ. అన్నయ్య కేకలు విని నేను లేచి ఆ గదిలోకి వెళ్ళే సరికే వాడు పారిపోయేడు.
"అంతేగాని? నువ్వు ఎవర్నీ చూడలేదన్నమాట?"
"అన్నయ్య కేకలు వినగానే వాడు గేటుదూకి పారిపోయాడట.
"ఎవరు చెప్పారు?"
"పైడయ్య చెప్పాడు."
"సరే! ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ....చూడండి విక్రమ్! మా ఇన్స్ స్పెక్టర్ మహా ఉబలాటపడిపోతున్నాడు ఒక్కసారి మీ పర్థమాన తార ఇంటికి తీసుకెళ్ళండి" అన్నాడు నరేంద్ర.
"నా కలాంటి ఉబలాటాలేమీ లేవు. కుర్రాడివి ఉంటే నీకే ఉండాలి" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ నవ్వుతూ.
రమణరావూ, విక్రమ్ ఇద్దరూ పకపక నవ్వారు.
"ఇక వెళ్దామా?" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"ఒక్క క్షణం మా సన్యాసమ్మతో మాట్లాడాలి" అన్నాడు నరేంద్ర.
"అలాగే మాట్లాడంది. పైడయ్య! నీ భార్యను పిలుపు" అన్నాడు రమణరావు.
సన్యాసమ్మ వచ్చింది.
నరేంద్ర ఆమెను వరండాలోకి తీసుకెళ్ళి కొన్ని ప్రశ్నలు వేశాడు. సిగరెట్ పెట్టెను ఆమెకు పట్టుకోమని. ఇచ్చి, మళ్ళీ దాన్ని కర్చీపులో అందుకొని జేబులో పెట్టుకున్నాడు.
"ఇక మనం వెళ్లవచ్చు" నరేంద్ర హాల్లోకి వచ్చి ఇన్స్ స్పెక్టర్ తో అన్నాడు.
"థాంక్యూ విక్రమ్! నమస్కారం రమణరావుగారూ! వెళ్ళి వస్తాం" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"వెళ్ళండి. కాని మళ్ళీ రాకండి" అన్నాడు విక్రమ్.
ఇన్స్ స్పెక్టర్ ఏదో అనబోగా అడ్డొచ్చి "ఇదిమా పిక్చెర్ లోని డైలాగండి హీరో పోలీసు ఇన్స్ స్పెక్టర్ తో అంటాడు" అన్నాడు విక్రమ్.
"అయితే మీ పిక్చెర్ లో పోలీసులు కూడా ఉన్నారన్నమాట!"
"ఇవ్వాళ రేపు పోలీసులు లేకుండా పిక్చెర్లే లేవుగదండీ.
"అలాగా?" అని నరేంద్ర బయటకివెళ్ళిపోవడం చూసి అద్వయితం అతడ్ని అనుసరించాడు.
ఇన్స్ స్పెక్టర్ బయటకి వచ్చేసరికే నరేంద్ర జీప్ లో అసహనంగా కూర్చుని ఉన్నాడు.
ఇన్స్ స్పెక్టర్ ఎగిరి జీపు ఎక్కి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు.
జీప్ బయలుదేరింది.
"మిస్టర్ అద్వయితం నీ అనుమానితుల లిస్టులో నుంచి ఇద్దరు తగ్గిపోయారు."
"తగ్గిపోరూ మరి! రమణరావుకు పైడయ్య ఎలిబీ, విక్రమ్ కు వయ్యారి భామ అమ్మాగారి ఎలిబీ, థూత్!" ఇన్స్ స్పెక్టర్ ఖాండ్రించి ఊశాడు.
నరేంద్ర ముసిముసిగా నవ్వుకున్నాడు.
"సూర్యనారాయణకు నీ ఎలిబీ. శంకర్రావుకు విజయవాడ పార్టనర్ ఎలిబీ, నాకు మతిపోతుంది."
నరేంద్ర సమాధానం ఇవ్వవేదు
"ఈ కేసులు పట్టుకోగలిగితే ఆరు నెలల్లో డి.యస్-పి. ప్రమోషన్ ఖాయం.
"లేకపోతే డిమోషన్ వస్తుందా?" నరేంద్ర ఎగతాళిగా అడిగాడు.
'డిమోషన్ రావాలటయ్యా? ఇన్స్ స్పెక్టర్ గానే రిటైర్ అవుతాను. నా ముఖాన ఏం రాసి పెట్టి ఉందో?"
"ఏమిటి అద్వయితం వేదాంతంలో పడిపోయావ్?"
"వేదాంతమా పాడా! గుండెలోని గుబులు చెప్పకుంటున్నాను"
"దిగులుపడకు, హంతకులు తప్పక దొరుకుతారు. ఆరోజు ఎంతో దూరంలేదు." అన్నాడు నరేంద్ర.
"ఇన్స్ స్పెక్టర్ ముఖం మతాబాలా వెలిగిపోయింది.
"నీ పూర్తి సహాకారం ఉంటే హంతకుల్ని పట్టడం పెద్దకష్టం కాడని నాకు తెలుసు. నీ బుర్ర అమోఘం.
"అంటే ఇప్పుడు పూర్తి సహకారం ఇవ్వడం లేదని అనుమానంగా ఉందా?" అదోలా నవ్వుతూ అడిగాడు నరేంద్ర.
"అరెరే! నేను అలా అనలేదు. అపార్థం చేసుకోకు ప్లీజ్!" బాగా తగ్గిపోయి అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"శంకర్రావే రమణరావును హత్య చెయ్యాడానికి ప్రయత్నించి ఉంటాడు."
"ఒక చేతికి ఆరేళ్ళున్నయ్యాని చెప్పడం వల్లనా ఈ నిర్ణయానికి వచ్చావ్?"
"అవును. పైగా ఇటుకరాయి రంగు షర్టు వేసుకున్నాడట. శంకర్రావు ఎక్కువగా అదే కలర్ షర్టు వేస్తాడు.
"అవుననుకో"
"మరి అరెస్టు చెయ్యమంటారా?"
"తొందరేమి లేదు"
"ఇంకా ఎంతకాలం
"రేపు భారతి అంత్య క్రియలు జరిగాకా నీ ఇష్టం"
"అయితే శవం అటు మనవాడు ఇటూ" హుషారుగా అన్నాడు అద్వయితం.
నరేంద్ర జేబులో ఉన్న సిగరెట్ పెట్టెను తీసి అద్వయితానికి ఇస్తూ అన్నాడు- "దీన్ని పింగర్ ప్రింట్స్ ఎక్స్ పర్టుకు పంపించాను"
"కర్చీపు చుట్టి ఉన్న సిగరెట్ పెట్టె అందుకొంటూ ఎవరి పింగరీ ప్రింట్స్?" ఆశ్చర్యంగా అడిగాడు అద్వయితం.
"సన్యాసమ్మవి."
"సన్యాసమ్మవా?" విస్మయంగా చూశాడు ఇన్స్ స్పెక్టర్.
"అవును"
"అంటే రమణరావు సన్యాసమ్మ చేత ఒక మర్డర్ చేయించాడంటావా? మొదటి రెండు హత్యల్లోనూ శవాల మీద పింగర్ ప్రింట్స్ లేవు హంతకుడు చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు ఇకపోతే భారతి శరీరం మీదే పింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంటే సన్యాసమ్మ చేత భారతిని రమణరావు చంపించాడు. అమ్మ రమణరావూ నువ్వు అతడి మీద అనుమాన పడ్తున్న నాకు మాత్రం అతడి మీద ఇంతవరకూ అనుమానమే లేదు. నీకు సహకరించాలనే ఉద్దేశ్యంతో రమణరావుని ప్రశ్నించడం జరిగింది. అయితే ఒక హంతకుడు దొరికాడు. నీ బుర్ర ఆమోఘమయ్యా? ఎలా కనిపెట్టావ్?"
"అంత త్వరగా నిర్ణయాలకు రాకు. నా అనుమానం మాత్రమే"
"అసలు సన్యాసమ్మ మీద అనుమానం ఎందుకొచ్చింది."
"కాఫీ ఇస్తున్నప్పుడు ఆమె ముంజేతుల మీదా, మెడ మీదా, ముఖం మీద గోళ్ళ రక్కులు ఉన్నాయ్. చేతికి పచ్చ గాజులు ఉన్నాయి. పచ్చ గాజులు ముక్కలు భారతి పడిన ప్రదేశం నుంచి పైకి చూస్తే కన్పించే వరండాలో పడి ఉన్నాయి. భారతి శవం మీద కూడా అదే ముఖం మీదా, చేతుల మీదా రక్కులు ఉన్నాయ్. అంటే ఇద్దరు ఆడవాళ్ళ పెనుగులాట అన్నమాట."
"అర్థం అయింది. సన్యాసమ్మ పిటపిటలాడుతుంది. భారతి బక్క పల్చగా ఉంది. సన్యాసమే భారతిని పైనుంచి తోసేసి ఉంటుంది. ఆ వెనకే ఈ రాస్కెల్ గాడు నిలబడి ఉంటాడు."
నరేంద్ర మౌనంగా ఉండిపోయాడు.
"అంతేనంటావా నరేంద్ర?"
"నేను ముందుగానే ఫలానా వాడు హంతకుడని చెప్పనని నీకు తెలుసు ముందా పింగర్ ప్రింట్స్ చూపించు"
"సన్యాసమ్మ ఏం చెప్పింది?"
"మొగుడు తాగివచ్చి కొట్టాడని, రక్కాడనీ చెప్పింది"
"అంతకంటే ఏం చెబుతుందిలే"
రాత్రి ఎనిమిది గంటలు అయింది...... జీపువచ్చి పంచావితి గేటు ముందు ఆగింది. పని కుర్రాడు పరిగెత్తుకొచ్చి గేటు తీశాడు.