Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 35


    
    డబ్బు బట్టలు, మందులు, ఆహారం, పాతసామాగ్రి, నగలు ఏమయినా సరే! రేపు సాయంత్రం మనం బయలుదేరుతున్నాం. ఈలోగా ముఖ్యమైన మిత్రులందరికీ నా పిలుపుని తెలియచేయండి" అని రాఘవరావు వేపు తిరిగి "మనం వెళ్ళడానికి ప్రత్యేకంగా ఓ బస్సు ఏర్పాటు చేయించండి" అన్నాడు.


    అతని భుజంపైన తట్టాడు రాఘవరావు.


    "నీ సంగతి నాకు తెలుసయ్యా! నువ్వు కార్యక్రమానికి నాంది పలికితే చాలు. ఇక్కడే మన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను" అని జేబులోంచి పదివేల రూపాయలకట్టని తీసి అతని ముందుపెట్టి "పదివేలు" అన్నాడు.


    రాఘవరావుతో వచ్చిన నలుగురు ఒకరు మెళ్ళో బంగారు గొలుసుని తీసి యిచ్చాడు. ఇంకొకరు చేతి ఉంగరం, మరో యిద్దరు డబ్బు యిచ్చారు.


    అభీ కళ్ళు మెరిశాయి.


    "సారీ సర్! ఈ గదిలో ఉండిపోయి ఈ విషయాన్ని ఇంతవరకూ విస్మరించాను రియల్లీ ఐయాం సారీ!"


    బయట గాలివానని లక్ష్యం చెయ్యకుండా వాళ్ళు లేచి నడుంకట్టడం చూశాక రాఘవరావు హృదయం ఆనందంతో పొంగిపోయింది.


    "నో! నేను తీసుకున్న నిర్ణయం తప్పుకాదు. సమంజసమైనదేనని మీరు నిరూపించారు" అన్నాడు.


    "మేం మనుషులం సార్! మీ పనులు మీరు చూడండి. మా పనిలో మేం వుంటాం" చెప్పాడతను.


    "నో! మీ ఉత్సాహం చూస్తూంటే నాకు కుర్రతనమొచ్చేస్తోంది పదండి! నేను కూడా మీతో వస్తాను" అన్నాడు రాఘవరావు.


    "అంతకంటే కావాల్సింది ఏముంది? అలాగే కానీండి...." అన్నాడు పూర్ణ.


    రాఘవరావు అప్పటికప్పుడు వానకోట్లు, గొడుగులు ఏర్పాటు చేయించాడు.


    అతని పిలుపునందుకొని కాలేజీ కారిడార్ దగ్గర పోగయ్యారు విద్యార్ధినీ విద్యార్ధులు చాలామంది.


    అందరిలోనూ సమధికోత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. ఆడా మగా అన్న తేడాలేదు వాళ్ళలో.


    బ్యాచెస్ గా విడిపోయి గోనెసంచుల్ని పట్టుకొని బయలుదేరారు.


    వాళ్ళకు సహకరించాలనేమో వాన తెరిపిచ్చింది.


    ఇంటింటికీ వెళ్ళి విషయాన్ని వివరించి వాళ్ళు అందించినవి సంచులలో నింపుతున్నారు.


    బట్టలు, పాత్రలు, మందులు, డబ్బు, నగలు ఎవరికి తోచినవి వాళ్ళు ఇస్తున్నాం.


    మూడు రోజులు వానకే వేసారిన ఆ ఊరి ప్రజలకి వరదల్లో చిక్కుకుపోయిన వారి బాధ కళ్ళకి కట్టినట్టయి ఉదారంగా వ్యవహరిస్తున్నారు.


    అదొక మహాయజ్ఞం.


    ఆ యజ్ఞాన్ని పూర్తిచేయడానికి ప్రవాహంలా కదులుతోన్న యువరక్తం.


    ప్రజలు అందిస్తోన్న సహకారానికి, ప్రోత్సాహానికి వాళ్ళు మరింత చైతన్యవంతులవుతున్నారు.


    ఉత్యాహమే తప్ప అలసట వారిలో కానరావడం లేదు.


    నిండుతున్న సంచులని రిక్షాల్లో వేసి రాఘవరావు ఇంటికి తరలిస్తున్నారు.


    అంతవరకూ మరచిన ఆ నియోజకవర్గం ప్రజా ప్రతినిధి బాపినీడు ఇంటిముందు నిలిచారు అభినయ్ బృందం.


    "మనం ముందే వచ్చి ఈయన్ని సంప్రదిస్తే బాగుండేది!" అన్నాడు ఓ విద్యార్ధి.


    "ప్రయోజనం వుండదు బాబూ! మన బాధ్యత ఒకసారి కలుసుకోవడం వరకే. బాపినీడు మన ప్రయత్నంలో భాగస్వామి కాడు. కాలేడు" అన్నాడు రాఘవరావు.


    అప్పటికే వాళ్ళు చాలావరకూ తడిసి ముద్దయిపోయారు.


    హాల్లో దర్జాగా తన అనుచరులతో కూర్చొని ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్న బాపినీడు అభినయ్ బృందాన్ని, రాఘవరావుని చూడగానే మొహం మాడ్చుకున్నాడు.


    "ఏమిటిలా దయచేశారు పెద్దలు!" అన్నాడు వ్యంగ్యంగా. అప్పటికే బాపినీడుకి మొత్తం సమాచారం అందింది.


    తనని సంప్రదించకుండా రాఘవరావు ఏదో ఎత్తుతోనే ఈ పని చేస్తున్నాడని కడుపు దహించుకొని పోతుంది ఆయనకి.


    బాపినీడు ఎదురుగానూ, పక్కనకూడా సోఫాలు ఖాళీగానే వున్నాయి.


    మర్యాదకోసం కూడా రాఘవరావుని కూర్చోమని అనలేదు బాపినీడు. అది గమనించిన అభినయ్ కి అరికాలి మంట నెత్తికెక్కింది.


    "కూర్చోండి రాఘవరావుగారూ!" అని మిత్రులకి సైగచేసి తను సోఫాలో కూర్చున్నాడు అభినయ్.


    రాఘవరావు నవ్వుతూ కూర్చున్నాడు. తడి బట్టలతో ఖరీదయిన సోఫాల్లోనూ, సోఫా హాండ్స్ మీద బిల బిలమని విద్యార్ధులు కూర్చునేసరికి బాపినీడుకి కంపరం కలిగింది. అనుకోని పరిస్థితికి తోచలేదు. ఎంత వాళ్ళని అవమాన పరిచి అవహేళన చేద్దామన్నా కూడా సభ్యత అడ్డువచ్చి నోరు నొక్కుకున్నాడు బాపినీడు. కొర కొరలాడుతూ వాళ్ళందర్నీ అసహనంగా చూశాడు.


    "ఇంతకీ వచ్చిన పని?" అడిగాడు.


    "ఈ పాటికి మీకు తెలిసే వుంటుంది......" రాఘవరావు మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ....


    "అంటే మీరేం చేస్తున్నారో తెలుసుకోవడమేనా నా పని!" అన్నాడు చిరాగ్గా బాపినీడు రాఘవరావు అతని ప్రవర్తనని అస్సలు పట్టించుకోవడంలేదు. అతను మాత్రం చాలా సౌమ్యంగానే విషయాన్ని వివరించాడు.


    బాపినీడు పకపకమని నవ్వాడు.


    "నిన్ను చూస్తుంటే జాలిగా వుందయ్యా! తల్లికి పెట్టనివాడు పినతల్లికి గాజులు చేయించాడట అలా వుంది. మన ఊరు మాట వదిలి ఎక్కడో ఏదో ఊరు కొట్టుకుపోతుందని. నీ ఆవేదన చూస్తుంటే పాపం నీకు చీఫ్ మినిష్టర్ కావాలన్న ఆశ కనిపిస్తోంది."


    బాపినీడు వెటకారానికి రాఘవరావు నవ్వాడు.


    "నువ్వెలా అనుకున్నా పర్వాలేదు కానీ నేను మానవతావాదంతోనే ఈ పనికి దిగాను."


    "నా నియోజకవర్గం నాకు ముఖ్యం. నేను ఇక్కడ ప్రజాప్రతినిధిని. నా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి నాకెప్పుడూ ఏ సమస్యా అడ్డుకాదు"


    "ప్రజాప్రతినిధి అంటే మీరన్నట్టు మీ నియోజక వర్దం ప్రజలకే సేవ చేయాలన్న రూలు ఏమీలేదు. ప్రజలందరూ ఒకటే బాధ్యతెరిగిన రాజకీయ నాయకుడికి ప్రజలంతా తన బిడ్డలే అవుతారు" అన్నాడు రాఘవరావు.


    "ఓహ్ బ్రహ్మాండం రాఘవరావు. అంచెలంచెలుగా ఎగబాకి ఉన్నత పదవిని పొందాలన్న నీ లౌక్యానికి తగ్గట్టుగా లెక్చరిస్తున్నావు. నిన్ను నేను అభినందిస్తున్నాను" అన్నాడు బాపినీడు.


    వాళ్ళ వాదనని నిశితంగా గమనిస్తున్నారు అభినయ్, అతని బృందం.


    "నేను వాదనకి రాలేదు బాపినీడూ, సాటి ప్రజలకోసం సాయం అర్ధించటానికి మాత్రమే వచ్చాను" ఖచ్చితంగా, గంభీరంగా పలికాడు రాఘవరావు.


    "ఛైర్మన్ గారూ! ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం పదండి" అన్నాడు అభినయ్.


    "పిల్లకాకి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?" గద్దించాడు బాపినీడు.


    అభినయ్ నవ్వేశాడు.

 Previous Page Next Page