Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 34

   

    నీతో గడిపిన ఈ క్షణాలని ఓ మధుర స్మృతిగా నా గుండెల్లో చనిపోయేవరకూ దాచుకుంటాను అభీ!


    ఏడడుగులు నడిస్తే చాలంటారు. కానీ నేను నీతో ఎన్నో అడుగులు వేసి వచ్చాను.


    కానీ నీ చేయి అందుకుని జీవితమంతా నీదానిగా వుండే అవకాశం నాకు లేదు.


    నా పెళ్ళి బావతో జరుగుతుంది.


    అందుకే అడుగుతున్నాను.


    "నువ్వు నన్ను గుర్తుంచుకుంటావా అభీ!"


    ఆమె కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది.


    ఇద్దరూ వానలో తడిసిపోతున్నారు.


    వాన కురుస్తున్నదన్న ధ్యాస కూడా ఇద్దరిలోనూ లేదు.


    "నాలో 'ఊపిరి' ఉన్నంతకాలం నిన్ను మరిచిపోను గీతా!" అన్నాడతను.


    "చాలు అభీ! నా జన్మకి వరం చాలు!" అంది వెక్కి వెక్కి ఏడిస్తూ గీత.


    ఆమెని ఓదార్చాలా?


    ఏడవనివ్వాలా? తెలీలేదు అతనికి జరిగింది కలో, నిజమే తెలీని స్థితిలో వున్నాడతను.


    ఎక్కడి గీత!


    ఎక్కడతను!


    ఆమెని మెల్లగా లేవదీశాడు.


    వానలో తడస్తూ, చలికి వణుకుతూ బ్రా హుక్ పెట్టుకుని వెనక్కి తిరిగి నించుంది.


    అతను బ్లౌజ్ హుక్ ఒక్కొక్కటి పెట్టేశాడు.


    ఆమెను పొదివిపట్టుకొని వానలో తడుస్తూ కారు దగ్గరికి నడిపించసాగాడు అతను.


                                    19


    గాలి వేగంగా వీస్తోంది. మూడు రోజులుగా వాన విడవకుండా కురుస్తూనే వుంది.


    రోడ్ల మీద వాన నీరు నదిపాయల్లా పారుతోంది.


    అభినయ్, పూర్ణ, కమల్, దాసు కూడా మూడు రోజులుదా సిద్ధార్ధ గదిలోనే వుండిపోయారు.


    పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అయినాయి.


    మిత్రబృందం గదిలో కూర్చుని పేకాట ఆడుకుంటున్నారు.


    సముద్రపు హోరు ఊళ్ళోకి వినబడుతోంది.


    "ఈ వాన ఈ రోజన్నాతగ్గితే బాగుండును" అన్నాడు సిద్ధార్ధ.


    "నా కిలాగే బాగుందిరా! రెండు పెగ్గులు కొట్టి, నాలుగు ముక్కలు నమిలి, కార్డ్సు ఆడుకొంటుంటే హాయిగా వుంటుంది" అన్నాడు పూర్ణ.


    "ఏడ్చినట్టే ఉంది నీ ఆనందం! ఎవడో ఇల్లుకాలి ఏడుస్తుంటే ఇంకేడేదో కాల్చి ఏడ్చాడట. అలా వుంది" అన్నాడు కమల్.


    "ఇప్పుడు నష్టం ఏంటిరా?" అడిగాడు పూర్ణ.


    "నీకూ నాకూ బాగానే వుంటుందిరా! అవతల జనం అల్లాడిపోతున్నారు" చెప్పాడు దాసు.


    అభినయ్ మాట్లాడకుండా గ్లాసులో విస్కీని సిప్ చేస్తూ చేతిలో పేక ముక్కల్ని సర్దుకుంటున్నాడు.


    ఇంతలో ఆ గది ముందు ఓ కారు ఆగింది.


    అందులోంచి ఛైర్మన్ రాఘవరావు దిగాడు. ఆయనతోపాటుగా వచ్చిన నలుగురు అనుయాయులు రాఘవరావు వెంట వానలో తడుస్తూ గబగబా గుమ్మం ఎక్కి తలుపు తట్టారు.


    దాసు తలుపు తీశాడు.


    రాఘవరావు లోపలకొచ్చాడు.


    ఆయన్ని చూడగానే అందరూ ఒకేసారి "నమస్కారం సార్!" అన్నారు.


    "హమ్మయ్య! అందరూ ఒకేచోట వున్నారన్నమాట" ఊపిరి పీల్చుకున్నాడు రాఘవరావు.


    "ఏం సార్! ఇంత హడావుడిగా వచ్చారేమిటి....?" అడిగాడు అభినయ్.


    "నీ కోసమేనయ్యా మహానుభావా! ఎన్ని చోట్లకి కబురు చేసినా నీ అడ్రస్ దొరికితే కదా! సాహసివి కదా! అందుకని ఆఖరికి పోలీస్ స్టేషన్ కి కూడా ఫోన్ చేశాను" నవ్వాడాయన.


    అతను ఆయన నవ్వుతో శృతికలిపి అన్నాడు-


    "నాకు మరేం పని లేదనుకున్నారా ఎప్పుడుపడితే అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి దెబ్బలు తినటానికి?"


    "పోలీసులు తీసుకెళ్ళడానికి, కొట్టడానికి తప్పు చెయ్యాలటయ్యా! ఇంతకీ అసలు విషయంలోకి వస్తాను రాజమండ్రి, ఆ చుట్టు ప్రక్కల గ్రామాలు వరదలకు గురి అయ్యాయి అభినయ్!"


    "పేపర్లో చదివాను"


    "చదివితే లాభం ఏమిటి? మనం ఏదో ఒకటి చెయ్యాలికదా....!" అన్నాడు రాఘవరావు.


    "అక్కడ వరదలొస్తే మనం ఏం చేస్తాం? ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది కదా?" అన్నాడు సిద్ధార్ధ.


    "వరదలకు ఊళ్లు కొట్టుకుపోతున్నప్పుడు, ప్రజలు నిస్సహాయులైనప్పుడు ప్రభుత్వం ఎంతచేసినా ఆ లోటు భర్తీ కాదు. ఏదో ఉడతసాయంలా మానవతావాదంతో ప్రతివాడూ నడుంకడితేనే ప్రజలు కొంతైనా తేరుకుంటారు"


    ఆయన మొహంలోకి చూస్తూ అభినయ్ సిగరెట్ వెలిగించాడు.


    "అయితే ఇప్పుడేం చెయ్యాలని?" అడిగాడు.


    "గుడ్! అలా అడిగావు. చెప్తాను విను అది మన ఊరు కాకపోయినా, మన జిల్లా కాకపోయినా, అక్కడ వున్నదీ మన ప్రజలే. తోటి మనుషులు, పెద్దా చిన్నా, ఆడా మగా, నోరులేని పశువులు, కోట్ల ఆస్తి నష్టం.... జరుగుతుంటే చూస్తూ వూరుకోవడం నా మానవతా వాదానికి విరుద్ధమైన పని. అందుకే మనకు తోచిన సాయం మనం చెయ్యాలి...." రాఘవరావు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు.


    "దానికి మనమేం చెయ్యగలం? ఇంజనీర్లు వరదని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్లు వైద్యసదుపాయాలు సమకూరుస్తున్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం చూపించి ఆహారం సరఫరా చేస్తున్నది ప్రభుత్వం" అన్నాడు అభినయ్.


    "అది చాలదు అభీ! మీరంతా కుర్రాళ్ళు, విద్యార్ధులు, ఉడుకురక్తం గలవాళ్ళు. ఈ దేశానికి వెన్నెముక లాంటివారు విద్యార్ధులు. మీరు తలుచుకుంటే చేయలేని పని, సాధించలేని కార్యం వుండవని నమ్మే వ్యక్తిని నేను"


    పూర్ణ నవ్వి అన్నాడు--


    "మమ్మల్ని ములగచెట్టు ఎక్కించేస్తున్నారు ఛైర్మన్ గారు!"


    "నువ్వేమన్నా అను! కానీ అభి అన్నట్టు ప్రభుత్వం అన్ని సదుపాయాలూ కలిగించటానికి నిర్విరామంగా కృషిచేస్తున్న మాట వాస్తవమే కానీ ఆ సహాయం ప్రతి ఒక్కరికీ అందకపోవచ్చు అందుకని మనందరం నడుంకట్టి విరాళాలు పోగుచేసి అక్కడికి వెళ్ళి వరదబాధితులను ఆదుకోవాలి" అన్నాడు రాఘవరావు.


    కొన్ని క్షణాలు ఆ గదిలో వాళ్ళ మధ్య నిశ్శబ్ధం చోటుచేసుకోవడంతో బయట నిర్విరామంగా కురుస్తోన్న వర్షపుధారల వింత శబ్దం స్పష్టముగా వినిపించసాగింది. ఉన్నట్టుండి వీస్తున్న గాలి....


    "ఓ.కె. మనం రాజమండ్రి వెళ్తున్నాం" అన్నాడు అభీ.


    అతని మాట వేదవాక్కు అందరికీ.


    "ఓ కే!" అన్నారందరూ.


    రాఘవరావు మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టుగా కనబడింది.


    "ఈ గాలివానని లెక్కచెయ్యకుండా ఈ రోజే మనం కార్యక్రమాలను చేపట్టి ముందు ఈ ఊర్లో ప్రతి యింటికి తిరిగి చందాలు, విరాళాలూ పోగుచేద్దాం.

 Previous Page Next Page