Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 36


    
    "నాకు తెలీకపోవడం ఏమిటి సర్! మహా ఘనత వహించిన సాక్షాత్తు ప్రజా ప్రతినిధి అయిన బాపినీడుని సహేతుకంగా ఎలాంటి వ్యక్తో నిరూపించగలవాడిని.


    మిమ్మల్ని సాయం చేయమని నిర్భంధించటం లేదు అది మీ యిష్టం.


    కానీ కష్టంలో వున్న మనిషిని కాపాడ్డానికి కూడా 'వీడు మనకి ఓటు వేశాడా లేదా' అని ఆలోచించే ప్రజా ప్రతినిధికి సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెపుతారు."


    "షటప్ అండ్ గెటవుట్!" అరిచాడు బాపినీడు. అతని గొంతు తీవ్రతకి హాలు ప్రతిధ్నించింది.


    అదే సమయంలో మేడమెట్లు దిగివస్తూ 'డాడీ!' అని పిలిచింది జయశ్రీ.


    తల తిప్పి చూశాడు బాపినీడు.


    జయశ్రీని చూడగానే అభినయ్ కళ్లు మెరిశాయి.


    భుజానికి ఎయిర్ బ్యాగ్ తగిలించుకొని ఒక్కొక్క మెట్టే దిగి వస్తోంది జయశ్రీ. అందరి దృష్టి ఇప్పుడు జయశ్రీ మీదికి మళ్ళింది.


    "ఈ వర్షంలో ఎక్కడికి బయలుదేరావమ్మా!" అప్పటివరకూ కరుకుతనం నిండిన బాపినీడు గొంతులో ఆప్యాయత, వాత్సల్యం కదలాడాయి.


    "నేను రాజమండ్రి వెళ్లుతున్నాను!" అంది స్థిరంగా.


    బాపినీడు ఆశ్చర్యంగా చూశాడు.


    అభినయ్ పెదవుల మీద చెరగని చిరునవ్వు అలాగే వుంది.


    "ఎందుకమ్మా!" ఆందోళనగా అడిగాడు.


    "ఇప్పటివరకూ మీ మాటలన్నీ విన్నాను డాడీ!


    మీరు మరచిన బాధ్యతని గుర్తుచేయడానికి కాకపోయినా మీ వంతుగా నాకు తోచిన సేవని వరద బాధితులకి అందివ్వడానికి వెళుతున్నాను."


    "నీకేమన్నా మతిపోయిందా?" ఆయన గొంతులో కోపం ధ్వనించిందీసారి.


    "మతిపోయికాదు, మతి వుండబట్టే ఈ నిర్ణయానికి వచ్చాను."


    కూతురు అందరి ఎదుటా ఎదురు సమాధానం చెపుతుంటే బాపినీడు రోషంగా చూశాడు.


    "నాన్సెన్స్. నువ్వు నా కూతురివి. అలగా జనంలాగా రోడ్లమీద, బురదలోనూ తిరిగే ఖర్మ నా కూతురికి కలగడానికి వీల్లేదు. నోరు మూసుకొని లోపలికి నడువు" అరిచాడు బాపినీడు.


    జయశ్రీ తండ్రి బెదిరింపుని లెక్కచేయలేదు.


    "డాడీ! అలగాజనం అన్న మాటని మీరు ఉపసంహరించుకోండి.


    అలగాజనం బురదతో కట్టిన భవనంలోనే మీరు నివసిస్తున్నారు.


    వాళ్ళు కష్టపడి పనిచేసి పండించిన పంటనే మనం వెండి పళ్ళాలలో పెట్టుకొని తింటున్నాం. మీలాంటి పెద్దలు బాధ్యతని విస్మరిస్తే ఆ బాధ్యతని మాలాంటి విద్యార్ధుల నెత్తిన వేసుకుంటున్నారు. దానికి మీరు సిగ్గుపడాలి."


    "నోర్మూయ్!" ఆవేశంతో ఊగిపోయాడు బాపినీడు.


    "సారీ డాడీ! మీకు ఎదురు చెప్పాలన్నది నా ధ్యేయం కాదు. నీకు తెలీని విషయాన్ని చెప్పడం ఒక్కటే నా లక్ష్యం.


    మేం విద్యార్ధులం అంటే చదువు ఒక్కటే కాదు మా ధ్యేయం. ప్రతి సంవత్సరం పరీక్షలు పెడతారు. ఎందుకో తెలుసా?


    ఆ పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి ప్రతి విద్యార్ధీ విద్యార్ధినీ కూడా ఒక దీక్షతో, పట్టుదలతో, ఏకాగ్రతతో కష్టపెడతారు.


    అది నీకు తెలీదు.


    ఎందుకంటే నువ్వు అంత చదువుకోలేదు. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురవుతాయని మరి వాటిని ఎదుర్కొని సాధించగల నేర్పుని కలిగించడానికే ఈ పరీక్షలు.


    ఈ పరీక్షల్లో నెగ్గాలన్నదే నా పట్టుదల.


    మీకు ఎల్లలు వుండవచ్చు. నీ నియోజకవర్గం వరకూ మాత్రమేగల కొద్దిమంది ప్రజలు నీ వాళ్ళు కావచ్చు.


    కానీ ఈ దేశమంతా మాదే!


    ఈ దేశంలోని ప్రజలందరూ మావాళ్ళే. ఎప్పుడు ఏ రాష్ట్రంలోగానీ, జిల్లాలోగానీ, ఊరులోగానీ అవసరాన్ని బట్టి మా విద్యార్ధులు రంగంలో దూకుతారు దూకాలి కూడా!


    అందుకనే నువ్వు వద్దన్నా నేను వెళ్ళక తప్పదు" అంది జయశ్రీ స్థిరంగా.


    బాపినీడు రెచ్చిపోయాడు ఆమె మాటలకి.


    బయట జనం ముందు తన కన్నకూతురే ఎదురు తిరిగి మాట్లాడ్డంవల్ల జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడు.


    కోపంతో ఊగిపోతూ జయశ్రీ చెంపమీద ఛెళ్ మని కొట్టాడు.


    జయశ్రీ కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. ఆమె గుండెలు ఉద్వేగంతో ఎగిరి పడుతున్నాయి.


    కైరవి జయశ్రీ దగ్గరగా నడిచి ఆమె కంటినుంచి జారుతోన్న కన్నీటిని తుడిచింది.


    అభినయ్ ఆమె మాట్లాడిన ప్రతిమాటనీ మననం చేసుకుంటున్నాడు. జయశ్రీ వ్యక్తిత్వం ఓ మహోన్నత శిఖరంగా పెరిగిపోయింది అతని మనసులో.


    రాఘవరావు జయశ్రీ దగ్గరగా నడిచాడు.


    "వద్దులేమ్మా! ఇంతమందిమి మేం వెళుతున్నాం కద! నీ మంచి మనసుని అర్ధం చేసుకున్నాను. ఇంట్లోకి వెళ్ళమ్మా" అన్నాడు రాఘవరావు జయశ్రీతో.


    జయశ్రీ కన్నీళ్ళతో ఆయన వంక చూసింది.


    "అభీ!" అని పిలిచింది. ఆమె గొంతు బొంగురుపోయింది.


    అభినయ్ ఒకసారి బాపినీడు మొహంలోకి చూసి మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు.


    "సారీ.... సో సారీ అభీ! నేను నీతో రావాలనుకున్నాను. రాలేకపోతున్నందుకు క్షమించు" అంటూనే మెడలోని బంగారు గొలుసునీ, చేతులకి వున్న నాలుగు గాజులనీ తీసి అభినయ్ చేతిలో వున్న సంచిలో వేసింది జయశ్రీ.


    "యూ!" అరిచాడు బాపినీడు రెచ్చిపోతూ. అభినయ్ బృందం, రాఘవరావు వెళ్ళిపోతుంటే రోషంతో కూతురివైపు తిరిగాడు బాపినీడు. అప్పటికే జయశ్రీ మేడ మెట్లమీదకి పరుగు తీసింది. హాలులో విసురుగా పచార్లు చేయడం మొదలు పెట్టాడు బాపినీడు. అతని అనుచరులు అతన్ని రెచ్చగొట్టడానికి గళం విప్పారు.


    బయట తిరిగి వాన ప్రారంభమయింది. గాలి హోరు ఎక్కువ కాసాగింది.

 Previous Page Next Page