Previous Page Next Page 
ఖజురహో పేజి 33


    
    మంత్రసాని బొడ్డుకి బదులు పొట్టని కోస్తున్నా అమాయకంగా చూస్తున్న శిశువులా కనిపించాడు అతను.
    
    దయామణి కళ్ళజోడు తీసి తుడుచుకుని పెట్టుకుంటూ "ఇలా టైం కాని టైంలో అనుమతి లేకుండా లోనికి రాకూడదు. రూల్స్ అంటే రూల్సే పాటించాలి మరి" అంది.
    
    "అందుకే చాయ అలా అంది" అన్నాడు.
    
    "ఏం అందీ?"
    
    కిరణ్ చెప్పలేదు. నవ్వేసి "వస్తా సిస్టర్!" అని వెళ్ళిపోయాడు. ఆ హాస్టల్ గేటు దాటుతూ వుంటే అతనికి చాయ మాటలు అలా అర్ధవంతంగా అనిపించాయి. ఈ అడ్డంకులన్నీ వుండకూడదనే చాయ వెంటనే ప్లాట్ కొనమంది. తీసుకోవాలి. అందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి" అనుకున్నాడు.
    
    ప్రేమించినవాళ్ళు ఏం చేసినా అందులో గొప్ప సత్యాలూ, అర్దాలూ కనిపిస్తూనే వుంటాయి. పీకలోతు ప్రేమలో మునిగివుంటే అవతలవాళ్ళు ఏం చేసినా తప్పుగా అనిపించదు. పైపెచ్చు గొప్పగా వుంటుంది.
    
    ప్రేమంటే నిషాలాంటిది ఎక్కినకొద్దీ కిక్కిస్తుంది.
    
                                             * * *
    
    "జర్మనీ నుండి వచ్చిన డెలిగేట్స్ కి అప్సరా ఇంటర్నేషనల్ లో ఎకామిడేషన్ ఎరేంజ్ చేశాము. మధ్యాహ్నం మన కేటలాగుతోసహా వెళ్ళి మాట్లాడి వస్తాను" చెప్పాడు జి.యం.
    
    జే.సీ. అంగీకారంగా తల వూపాడు.

    జి.యం. వెళ్ళిపోతూ తలుపు దగ్గర ఓ నిముషం ఆగి- "ఈ రోజు నా పి.ఏ. రాలేదు మీకు అసౌకర్యం లేకపోతే లూసీని...." అని ఆగాడు.
    
    "వై నాట్! తీసుకెళ్ళండి. నేను ఆవిడతో మాట్లాడి పంపిస్తాను" అన్నాడు జే.సీ.
    
    "థాంక్యూ సర్" జి.యం. చారి వెళ్ళిపోయాడు.
    
    జయచంద్ర కుర్చీలో వెనక్కివాలి, ఇంటర్ కమ్ లో లూసీని లోపలికి పిలిచాడు.
    
    లూసీ లోపలికి వచ్చి ఎప్పటిలా చిరునవ్వుతో విష్ చేసింది.
    
    "లూసీ.....జి.యం.తో కలిసి మీరు అప్సరా ఇంటర్నేషనల్ కి వెళ్ళాలి" అన్నాడు.
    
    "ఓ.కె. సార్!" నమ్రతగా అంది లూసీ.
    
    "ఆ లూసీ ఇంకో సంగతి" తన జేబులోంచి కాగితం తీస్తూ అన్నాడు జయచంద్ర.
    
    "ఎస్ సర్!" చెప్పమన్నట్లు చూసింది లూసీ.
    
    జయచంద్ర ఆ కాగితాన్ని ఆమెకి అందించి, ఉద్వేగంగా చూశాడు ఆమె ముఖంలోని భావాలని.
    
    చదివి తలఎత్తిన ఆమె ముఖం మామూలుగానే వుంది. "ఇష్ లీ బదూ......అంటే?" అంది.
    
    జయచంద్ర భుజాలు ఎగరేసి "ఏమో! అది తెలుసుకుంటారనేగా మీకు ఇచ్చాను" అన్నాడు.
    
    "ఎవరు వ్రాశారు?" కనుబొమలు ప్రశ్నార్ధకంగా పెట్టి అడిగింది లూసీ.
    
    "నా రైటింగేగా?" జవాబిచ్చాడు జయచంద్ర.
    
    లూసీ అతన్ని విచిత్రంగా చూస్తోంది.
    
    ఎప్పుడూ డిగ్నిఫైడ్ గా, అతి గంభీరంగా వుండే జయచంద్ర పెన్ కాప్ పైకి ఎగరేసి పట్టుకోవడం, తల సర్దుకోవడం ఆమెకి వింతగా అనిపించింది.
    
    జయచంద్ర ఆ విషయం గమనించి, తన వుద్విగ్నతని కంట్రోల్ చేసుకుంటూ టేబుల్ మీద నుండి చేతులు తీసేసి జేబులో దూర్చేసుకున్నాడు.
    
    "తెలుసుకుని దాని మీనింగ్ ఏమిటో చెప్పండి. నౌ యుకెన్ గో" అన్నాడు.
    
    "ఎస్ సర్!" విస్మయంగా చూస్తూనే ఆమె గదిలో నుండి వెళ్ళిపోయింది.
    
    జయచంద్ర కర్చీఫ్ తీసి ముఖాన్ని తుడుచుకున్నాడు. "వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ హేపినింగ్ టు మీ?" అనుకున్నాడు.
    
    చాలా రెస్ట్ లెస్ గా ఫీలయ్యాడు. ఏ.సీ.లో కూడా వుక్కబోస్తోంది.
    
    "వై? ఎందుకిలా?" తల విదిలిస్తూ అనుకున్నాడు.
    
                                              * * *
    
    "పిచ్చి! కిరణ్ కి పిచ్చెక్కింది" హేళనగా నవ్వుతూ అంది చాయ.
    
    "కాదమ్మా.....ప్రేమ! దాన్ని ప్రేమంటారు" దయామణి ఆప్యాయంగా చాయ భుజం మీద చెయ్యివేస్తూ అంది.
    
    చాయ తల తిప్పి, నిర్లక్ష్యంగా, చిరాగ్గా చూసింది ఆమెవైపు.
    
    "చాయా.....కిరణ్ నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం. అతను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. అలాంటి పిల్లాడు ఈ రోజుల్లో అరుదు."
    
    "ఛట్! నేను అతనితో స్నేహం చెయ్యడం అతని అదృష్టం" గర్వంగా అంది చాయ.
    
    "సరే.....సరే! ఇద్దరూ అదృష్టవంతులే! పెద్దదాన్ని చెపుతున్నాను విను - కిరణ్ ని పెళ్ళి చేసుకో నీకంటూ ఓ ఇల్లు ఏర్పరుచుకో అతన్ని నొప్పించకు. అతని మనసు చాలా సున్నితం" అనునయంగా చెప్పింది దయామణి.
    
    "జీవితం అనే పుస్తకంలో పెళ్ళి అనేది ఆఖరి పేజీ! నాకు అప్పుడే నా జీవితాన్ని ముగించాలని లేదు మేడమ్!" వాడిగా అంది చాయ.
    
    "తప్పుడు అభిప్రాయంలో వున్నావు చాయా.....! పెళ్లి అనేది ప్రారంభం.....ఆ తర్వాత ఎంతో జీవితం నీ కోసం ఎదురుచూస్తుంటుంది. చిన్నారి పాపల్ని కనీ, పెంచీ, తీర్చిదిద్దీ, వాళ్ళ మురిపాల్లో పాలు పంచుకొంటూ."
    
    "అది మన జీవితం ఎందుకౌతుందీ? పిల్లల కోసం....ఆ తర్వాత వాళ్ళ పిల్లలకోసం.....ఇలా మన జీవితాన్ని కోల్పోతామన్నమాట.....! అందుకే నాకు పెళ్లి అంటే అసహ్యం! పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనను. దిక్కుమాలిన పిల్లలంటే నాకు మరీ అసహ్యం."
    
    చాయ మాట పూర్తికాకుండానే ఆమె చెంప అదిరిపోయింది.
    
    దయామణి ఆపకుండా ఇంకో రెండు దెబ్బలు కొట్టింది. "వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళుగా మారటానికి కారణం నీవంటి తల్లులేనే! మీకు ఆనందాలు కావాలి......సౌఖ్యాలు కావాలి. అవి తీరాకా మీ కడుపునపడ్డ పసిప్రాణాల్ని నిలువునా తియ్యడానికి కూడా మీరు వెనుకాడరు. అందుకే కుప్పతొట్టెల్లో చెత్తకి బదులు మీలాంటి దిక్కుమాలిన వాళ్ళు నిండుతున్నారు. మీ స్థితి ఇలా అయింది కాబట్టి మీరైనా బుద్ది తెచ్చుకుని, బాధ్యతగా ప్రవర్తిస్తారనుకుంటాము, కానీ మీ బుద్దులి లాగే వుంటాయి. చెత్త బుద్దులు ఎక్కడికిపోతాయి? మాతృత్వంలోని మమకారం మీకెలా తెలుస్తుందీ? అందని రొమ్ముకై అల్లల్లాడుతూ పసివాడుచేసే ఆక్రందనలోని వేదన మీకెలా తెలుస్తుందీ? ఏడుస్తున్న బిడ్డని గుండెలకి హత్తుకుని భారం తీర్చుకోవడంలోని స్వర్గసుఖం మీకు చెప్తే ఎలా అర్ధమవుతుందీ" వెక్కి వెక్కి ఏడ్చేసింది దయామణి.

 Previous Page Next Page