Previous Page Next Page 
ఖజురహో పేజి 34

   
    చాయ కందిన చెంపని ఓసారి నిమురుకుంది. ఆ తర్వాత దయామణికి తన హేండ్ కర్చీఫ్ ఇస్తూ- 'ఎస్ మేడమ్.....ఒప్పుకుంటాను. మీరు చెప్పినవన్నీ నిజమే! తల్లి గుండెల్లో వెచ్చగా దూరి నిదురించడం, గోరు ముద్దలు తిని ఏ కలతలూ లేకుండా నిదురపోవడం, ఆపదవస్తే ఆదుకోడానికి అమ్మా....నాన్నా.....చేతులు జాపి సిద్దంగా వుండడం.....ఇవన్నీ అదృష్టాలే! కానీ.....అవేమీ నేను పొందలేదు. మరో జీవి పొందుతూ వుంటే చూసి నేను భరించలేను. చివరికి.....చివరికి నా కడుపున పుట్టిన బిడ్డైనా సరే! నేను భరించలేను."
    
    చాయ కళ్ళల్లోని తీవ్రతకీ, ఆ మాటలవాడికీ దయామణికి వెన్నులోంచి జలదరింపు పుట్టుకొచ్చింది.
    
    వెళ్ళిపోతున్న చాయని ఆపాలన్నా భయం వేసినదానిలా, నిలువు గుడ్లేసుకుని అలా చూస్తుండిపోయింది.
    
                                                 * * *
    
    "తెలిసింది" అంది లూసీ.
    
    జయచంద్ర ఫైల్లోంచి తల ఎత్తి, కళ్ళు చిట్లించి "ఏం తెలిసింది?" అన్నాడు.
    
    "మధ్యాహ్నం జర్మన్స్ తో మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను. ఇష్ లీ బదూ.....అంటే జర్మనీలో..." అని చెప్పడం ఆపి అతనివైపు చూసింది.
    
    అతని కళ్ళల్లో ఉత్సుకత చోటు చేసుకుంది. "ఆ....అంటే?" ఆతృతగా అడిగాడు.
    
    లూసీ చెప్పలేదు. వెనక్కి తిరిగి గోడకి తగిలించి వున్న కేలండర్ దగ్గరకి నడిచి, అక్కడ వ్రాసున్న అక్షరాలని చేత్తో తాకి చూపిస్తూ.... "ఇది....దానర్ధం" అంది.
    
    జయచంద్ర నొసలు విడివడింది. అతని పెదవులమీద చిరునవ్వు పరుచుకుంది.
    
    కేలండర్లో ఓ పిల్లిపిల్ల ఇంకో పిల్లిపిల్లని ముద్దుపెట్టుకుంటోంది. ఆ బొమ్మక్రింద వ్రాసుంది "ఐ లవ్ యూ" అని.
    
    ఆ అక్షరాలనీ, అతన్నీ మార్చి, మార్చి చూసి ఆ గదిలోంచి వెళ్ళిపోయింది లూసీ.
    
                                              * * *
    
    "అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు వుండేవాడు. అతడు ఓ రోజు యాయవారం పూర్తిచేసుకుని వస్తూ వుండగా, దార్లో ఓ అందమైన పూసా కనపడిందట. ఆ పూస చూడగానే చాలా ఆకర్షణీయంగా, మనసుని దోచుకునేటట్లుగా కనిపించి, ముందూ, వెనుకా చూడకుండా చటుక్కున జేబులో వేసుకున్నాడట."
    
    కాంచన సంధ్యకి కథ చెపుతుండగా, జయచంద్ర అక్కడికి వచ్చాడు.
    
    సంధ్య తల్లి వడిలో తలపెట్టుకుని- "ఊ.....తర్వాత?" అని అడిగింది.
    
    కాంచన జయచంద్రని చూసి నవ్వి - "అతను ఇంటికి వచ్చి ఆ పూస గూట్లో పెట్టాడు. ఇంతలోనే ఓ అమ్మాయివచ్చి "నా పేరు పింగళారిపీకి అండీ! నేను మీ ఇంట్లో పనిచేస్తాను" అంది.
    
    జయచంద్ర అందుకుని- "ఆ పీకివల్ల వాళ్ళు నానా పాట్లూపడ్డారు. ఎందుకంటే అది మనిషి కాదు.....రాక్షసి! ఆ బ్రాహ్మణుడికి దారిలో దొరికిన పూసలో దాని ప్రాణం వుంది కాబట్టి వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిందన్న మాట! అదీ కథ" నవ్వుతూ చెప్పాడు.
    
    తండ్రిని చూసి సంధ్య లేచి కూర్చుని- "డాడీకి కూడా కథలు చెప్పడం వచ్చేసిందే" అంది.
    
    కాంచన భర్తని ఓరగా చూస్తూ-
    
    "అందుకే ఏది కనపడితే అది జేబులో వేసుకుని రాకూడదు....ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు....దేనిలో ఏం దాగుందో....ఎవరికి తెలుసు?" అంది.
    
    జయచంద్ర అప్రయత్నంగా జేబులు తడుముకున్నాడు.
    
    "డాడీ.....విన్నారుగా! జాగ్రత్త" నవ్వుతూ అంది సంధ్య.
    
    "అది కథ కాబట్టి....కంచికి చేరాలి కాబట్టి....దాని పూసిస్తే అది చక్కా పోయింది పాపం" అంది కాంచన.
    
    జయచంద్ర దొరికిపోయినట్లు మొహంపెట్టి కూతుర్నీ, భార్యనీ చూసాడు.
    
    ఇద్దరూ మామూలుగానే నవ్వుతున్నారు.
    
    "మమ్మీ! చాయ చెవిరింగులు పోయాయిట! వట్టి చెవులతో వుందనీ నా ఇయర్ టాప్స్ పెట్టి పంపించాను" అంది సంధ్య.
    
    చాయ రింగుల ప్రసక్తి రాగానే జయచంద్ర అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
    
    "అంత చిన్న విషయాలు నాకు చెప్పనక్కరలేదమ్మా!" అంది కాంచన.
    
    "థాంక్యూ" అంది ఆనందంగా సంధ్య.
    
    ఆ సంభాషణంతా వింటున్న రత్నం-"ఆ అమ్మాయి ఎక్కడుంటుందమ్మా?" అంది.
    
    "ఎందుకే నీకు?" అంది కాంచన.
    
    రత్నం మాట్లాడలేదు.
    
    పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఏం మాట్లాడితే ఏం తప్పోనని భయపడి ఆమె నోరు మెదపలేదు!

    లేకపోతే చాయ రాత్రిపూట లేచి అన్ని గదులూ తనిఖీ చేసినట్లు, తను చూడటం గూర్చి చెప్పాలనుకుంది.
    
    కానీ కాంచన అంటే ఎంత అభిమానముందో, అంత భయం-భక్తీ ఉండటం మూలాన తలవంచుకుంది.
    
    "నీకు నచ్చలేదా ఏం?" నవ్వుతూ అడిగింది కాంచన.
    
    "వాట్ ఏ జోక్?" పెద్దగా నవ్వింది సంధ్య.
    
    "విశ్వసుందరిగా ఎన్నికయిన అమ్మాయి ఎవరికయినా నచ్చకపోవడం అంటూ వుండవచ్చేమోకానీ, మా చాయ నచ్చకపోవడమంటూ వుండదు! అలా ఎవరయినా అంటే వాళ్ళు గుడ్డివాళ్ళన్నమాట" అంది సంధ్య.
    
    "నేను కాదమ్మా గుడ్డిదాన్ని" మనసులో అనుకుంది రత్నం.
    
    క్రింద జూలీ మొరగడం వినిపించింది.
    
    "ఏమైందే దానికీ?" ఆదుర్దాగా అడిగింది కాంచన.
    
    "ఏమోనమ్మా! నా గదిలోకొచ్చి అరుస్తోంది. నిన్నటినించీ అదే వరుస!" కాస్త విసుగ్గా అంది సంధ్య.
    
    "రత్నం ఎందుకో చూసిరా!" అంది కాంచన.
    
    రత్నం గబగబా క్రిందికి వెళ్ళింది.

 Previous Page Next Page