Previous Page Next Page 
ఖజురహో పేజి 32


    "మళ్ళీ ఎప్పుడైనా రామ్మా" ఆప్యాయంగా అంది కాంచన.
    
    చాయ ఆమె ముఖంలోని అలసటనీ, రాత్రంతా అనుభవించిన వేదననీ గుర్తించింది.
    
    "ఏమిటి సుస్తీ?" అడిగింది చాయ.
    
    సంధ్య చెప్పలేనట్లు చూసి "హార్ట్ ప్రాబ్లమ్ త్వరగా పద. డాడీ వెయిట్ చేస్తున్నారు" అంది.
    
    "రత్నం" పిలిచింది కాంచన.
    
    రత్నం పళ్ళెంలో చీరా, బ్లౌజు పీసు తీసుకొచ్చి కాంచన చేతికి అందించింది.
    
    "తీసుకోమ్మా!" కాంచన అందిస్తూ అంది.
    
    "వద్దు" అంది చాయ.
    
    "పర్లేదు ఇది నీ ఇల్లే అనుకో" అంది కాంచన.
    
    ఆ మాటకి చాయ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసింది.
    
    అవి ప్రశాంతమైన తటాకాల్లా నిశ్చలంగా వున్నాయి.
    
    చాయ ముందుకు వెళ్లి చీర అందుకుంది.
    
    కారు హారన్ ఆగకుండా మోగుతూనే వుంది.
    
    "పద.....పద" సంధ్య తొందరపెట్టి బయటికి లాక్కొచ్చేసింది.
    
    కార్లో ఎక్కుతూ వెనక్కి తిరిగి ఇంటికేసి చూసింది చాయ.
    
    జూలీ గట్టిగా మొరగడం మొదలెట్టింది. కారు గేట్లోంచి బయటకి వెళ్లి సందు మలుపు తిరిగేదాకా అది మొరుగుతూనే వుంది.
        
    కాంచన దాన్ని దగ్గరికి పిలిచి వీపు నిమురుతూ "ఏమైందే నీకు?" అని కోప్పడింది.
    
    జాలిగా చూసింది యజమానురాలివైపు జూలీ.
    
                                               * * *
    
    "చాయా ప్లీజ్! నన్ను అర్ధం చేసుకో! నిన్ను కలుసుకోకుండా చూడకుండా వుండడం నాకు నరకంలా వుంటుంది. నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళకు" ఆర్తిగా అన్నాడు కిరణ్.
    
    చాయ పెదవిని మునిపంట బిగబట్టి అసహనంగా చూసింది.
    
    హాస్టల్ లో అమ్మాయిలు వరండాలో నిలబడి ఈర్ష్యగా చూస్తున్నారు చాయ వంక.
    
    ఒకప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా ఆనందంగా వుండేవి చాయకు. ఇప్పుడు మాత్రం విసుగ్గా అనిపించింది.
    
    "సంధ్య స్పృహ తప్పి పడిపోతే వాళ్ళింటికీ తీసుకెళ్ళాను. ఆమె కోరితే రాత్రి అక్కడే వుండిపోయాను" అంది.
    
    "నేను నీకోసం ఎదురుచూసి....ఎదురుచూసి.....ఎంత బాధపడ్డానో తెలుసా?" కిరణ్ ఉక్రోషంగా అడిగాడు.
    
    "నీకు ఆ బాధ తప్పే మార్గం చెప్తాను, వింటావా?" అడిగింది చాయ.
    
    "చెప్పు!" ఆత్రంగా అన్నాడు.
    
    "నా కోసం సిటీ సెంటర్ లో ఓ ప్లాట్ కొను అప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు వుండచ్చు ఏవంటావ్? నువ్వు ఎప్పుడొచ్చినా అడిగే వాళ్ళుండరు."
    
    కిరణ్ మాట్లాడలేదు. అదోరకంగా చూసాడు.
    
    "ఏం కామ్ అయిపోయావు? ప్రేమించడం అంటే డబ్బు ఖర్చులేని పని కాబట్టి ప్రేమించేద్దాం.....అనుకున్నావా?" వ్యంగ్యంగా అడిగింది చాయ.
    
    "చాయా.....డబ్బు గురించి కాదు.....నీ మాట తీరు చూసి బాధపడుతున్నాను" అన్నాడు కిరణ్.
    
    "ఏవన్నాననీ?" కళ్ళు చిట్లిస్తూ అడిగింది.
    
    "నా కోసం ఓ ప్లాట్ కొను......అనేకన్నా.....మనకోసం అనకూడదా? మనం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం కాదా?" అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో తడి తెర పరుచుకుంది.
    
    "ఏమైతేనేం? ముందు ప్లాట్ కొనడం ముఖ్యం. అప్పుడు ఆలోచిద్దాం తర్వాత సంగతి" తేలిగ్గా చెప్పేసింది చాయ.
    
    "సరే.....కానీ ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళకు" అన్నాడు.
    
    "ఎందుకు?"
    
    "నాకు చాల బెంగగా వుంది. ఈ రోజంతా నీతో గడపాలి" దీనంగా అన్నాడు. మనసులో మాత్రం అధికారికంగా అడగాలనే అనుకున్నాడు పాపం!
    
    "కిరణ్ తప్పకుండా నీతో గడుపుతాను. ముందు ప్లాట్ కి ఎద్వాన్స్ ఇచ్చిరా! కొత్త ప్లాట్ లో ఓ రోజేం ఖర్మ బోలెడు రోజులు గడుపుదాం" అంది చాయ.
    
    "అంటే?!" అర్ధం కానట్టు వింతగా చూస్తూ అడిగాడు.
    
    "నీమీద నీకు కంట్రోల్ లేదు, పట్టుదలా, నమ్మకం లేవు నాతో కలిసి గడపాలి అన్న కోర్కె మాత్రం బలంగా వుంది కాబట్టి ఆ కోర్కె తీరకుండా వుంటే, కనీసం ఆ కోర్కె తీర్చుకోవడం కోసం అన్నా నేను చెప్పిన పనిచేస్తావు. అందుకే నువ్వు ఫ్లాట్ కొనేవరకూ నేను నీతో కలిసి ఎక్కడికీ రాను కనీసం మాట్లాడను" తెగేసి చెప్పింది.
    
    "నో!" అరిచాడు కిరణ్.
    
    ఆ అరుపునకు కొంతమంది అమ్మాయిలు ఉత్సుకతగా తలలు తిప్పి వాళ్ళవైపు చూశారు.
    
    "నేను ఒప్పుకోను....ఇది అన్యాయం" కోపంగా అన్నాడు కిరణ్.
    
    "కిరణ్....ఏమిటిది? అందరూ మననే చూస్తున్నారు. అదిగో..... వార్డెన్ కూడా ఇటే వస్తోంది. అయింది చాలు..... వెళ్ళిపో!" విసుగ్గా అంది చాయ.
    
    "చాయ....ఓసారి ఆలోచించు.....నిన్ను చూడకుండా నేను వుండగలనా?" జాలిగా ముఖం పెట్టి అడిగాడు.
    
    "ఎందుకు వుండలేవు?" నిర్లక్ష్యంగా అడిగింది.
    
    "ఐలవ్ యూ.....నేను నిన్ను...."
    
    "అందుకే.....నాకోసం ఆ మాత్రం కష్టపడితే ఏమీ అయిపోవు" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది చాయ.
    
    కిరణ్ కి మసక....మసగ్గా ఓ ఆకారం ఎదురుగా కనిపించింది. ఓసారి కళ్ళు తుడుచుకున్నాక ఆ రూపం దయామణిది అని అర్ధమయింది.
    
    ఆమె కళ్ళలలో అపారమైన దయ తారట్లాడుతోంది. "సిన్సియారిటీ ప్రేమకి పునాదిలాంటిది బాబూ! అది లేనిచోట ఆశల హర్మ్యాలు నిర్మించకు. పునాదులు లేకపోతే కూలిపోతాయి" అంది.
    
    "ఈ ఒంట్లోని రక్తం కరిగించయినా పునాది వేస్తాను. నా ప్రేమ దేవత కోసం ఆశల హర్మ్యాలు నిర్మిస్తారు. అందుకు ఏమైనా చేస్తాను" ఉద్రేకమో, ఉన్మాదమో తెలీని స్థితిలో వున్నాడు అతను. బహుశా ప్రేమలో పడినవారు అందరూ అంతేనేమో!

 Previous Page Next Page